Mayurbhanj
-
ఒడిశా నుంచి జార్ఖండ్ మాజీ సీఎం సోదరి పోటీ!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒడిశాలోని మయూర్భంజ్ లోక్‌సభ స్థానం నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా మహిళా నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ సోదరి అంజనీ సోరెన్ ఎన్నికల బరిలోకి దిగారు. అంజనీ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కుమార్తె.మయూర్భంజ్ స్థానం నుంచి అంజనీ సోరెన్ పోటీలోకి దిగడంతో ఇక్కడ త్రిముఖ పొరు నెలకొంది. ఈ స్థానంలో బీజేపీ నాబా చరణ్ మాఝీని రంగంలోకి దింపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ విజయం సాధించింది. అయితే బీజేపీ నాడు విజయం సాధించిన బిశేశ్వర్ తుడు స్థానంలో నాబా చరణ్ మాఝీకి అవకాశం కల్పించింది.ఇదే స్థానం నుంచి సుదమ్ మరాండీ బీజేడీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. సుదామ్ మరాండి ఒకప్పుడు ఒడిశాలో జార్ఖండ్ ముక్తి మోర్చా అగ్రనేతగా ఉన్నారు. అయితే ఆ తరువాత అతను బీజేడీలో చేరారు. సుదామ్ మరాండీకి స్థానికంగా ప్రజల మద్దతు ఉందనే మాట వినిపిస్తుంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి జేఎంఎం తరపున అంజనీ సోరెన్ ఎన్నికల బరిలోకి దిగడంతో ఈ లోక్‌సభ స్థానంలో పోరు ఆసక్తికరంగా మారింది.మయూర్భంజ్ జార్ఖండ్‌లోని సింగ్భూమ్ జిల్లాతో సరిహద్దును పంచుకుంటుంది. 2019లో అంజనీ సోరెన్ ఈ స్థానం నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. మయూర్భంజ్ లోక్‌సభ స్థానంలో గిరిజనుల సంఖ్య అత్యధికం. ఇక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేశారు. జేఎంఎంతో పొత్తు కారణంగా ఇక్కడ కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టలేదు. -
రాణివాసం కన్నా... సమాజమే మిన్న...
భంజ్ యువరాణులు మృణాళిక, అక్షితలు రాజవంశంలో పుట్టినా సాధారణ యువతుల్లాగే భిన్న రంగాల్లో తమను తాము నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరిద్దరూ ఫిక్కీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే... మా ప్యాలెస్...టూరిస్ట్ ప్లేస్‌గా... మా జిల్లా గురించి గొప్పగా చెప్పుకోలేని పరిస్థితే మా ప్రాంతాన్ని తీర్చిదిద్దే వైపు మమ్మల్ని పురికొల్పింది. అందులో భాగంగా స్థానికుల్ని స్వయం ఉపాధి దిశగా నడిపించడం, స్థానిక హస్తకళలకు చేయూత అందించడం.. వంటివి చేశాం. మా హస్తకళల బ్రాండ్ హసా అటెలియర్ సబాయి గడ్డితో చేసిన సంచుల విక్రయాలకు పేరు. వీటిని తరచు డోక్రాతో (ఒడిశాలోని గిరిజనులు చేసే ఓ రకమైన మెటల్‌వర్క్) జత చేసి విక్రయిస్తాం. ఇలా స్థానికులకు ఉపాధితో పాటు స్థానిక కళలకు కూడా ఖ్యాతి దక్కుతోంది. అదే క్రమంలో 20 ఎకరాల్లో ఉన్న మా ప్యాలెస్‌ను 11 గదుల బోటిక్ హోటల్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాం. మా ఇంటిని టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దే క్రమంలో మా తండ్రిగారిని ఒప్పించి ఆయన సూచనలు, సహకారంతో ఒక్క ఇటుక కూడా కొత్తగా జోడించకుండా, చారిత్రక ఆనవాళ్లేమీ చెరిగిపోకుండానే ప్యాలెస్‌ను ఆ«ధునికంగా తీర్చిదిద్దాం. మేం దీనిని ప్రారంభించిన కొద్దికాలానికే కోవిడ్ వచ్చింది. అయితే కోవిడ్ అనంతరం ప్రారంభమైన రివెంజ్ ట్రావెల్... మాకు అనూహ్యమైన ప్రోత్సాహాన్నిచ్చింది. మా జిల్లాకు ఒక మారుమూల అటవీ ప్రాంతంగా కాకుండా ఓ మంచి పర్యాటక కేంద్రంగా గుర్తింపు వచ్చింది. అయితే ఈ పయనం మాకెన్నో మెలకువలు, పాఠాలూ నేర్పింది. హైదరాబాద్‌లో ఫలక్‌నుమా ప్యాలెస్ ఉంది, రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్ ప్యాలెస్ ఉంది... మరి మయూర్భంజ్లోని మా ప్యాలెస్‌కే ఎందుకు రావాలి.. అనే ప్రశ్నకు సమాధాన గా మేం మా చరిత్రను కథగా మలచి అతిథులకు పంచుతున్నాం. ప్రత్యేకంగా వికలాంగులకు అనుకూలమైన మరో రెండు గదులను ఇటీవలే జోడించాం. ప్రతి అడుగూ చరిత్రకు అద్దం పట్టేలా తీర్చిదిద్దాం’’ అంటూ తమ విజయగాథను పంచుకున్నారు.. ఇదేకాదు.. ఒకరు యోగా టీచర్‌గా రాణిస్తుంటే మరొకరు రచయిత్రిగా... ఇలా భిన్న రంగాల్లో తమను తాము నిరూపించుకుంటున్నారు ఈ యువరాణులు. మా ప్రాంతానికి ‘కళ’తేవాలని... మా కుటుంబానికి దాదాపు 1000 సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉంది. అయితే ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్న 200 ఏళ్ల నాటి పూర్వీకుల ఇల్లు బెల్గాడియా ప్యాలెస్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం దగ్గర నుంచి చేసిన ప్రతి పనీ మేం రాజకుటుంబ వారసత్వం అనే పరదాల నుంచి బయటకు వచ్చి చేసినవే. అంతర్జాతీయ కళాకారులను ఆహ్వానిస్తూ మయూర్భంజ్ ఆర్ట్స్ – కల్చర్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నాం. మా ప్యాలెస్‌ని ఆర్టిస్ట్ రెసిడెన్సీగా మార్చాం. –మృణాళిక, అక్షిత – సాక్షి హైదరాబాద్ సిటీ బ్యూరో ఫొటో: మోహనాచారి -
లగేజ్ సర్దేసుకుని లద్దాఖ్, మయూర్‌భంజ్‌కు ఛలో! ఆ రెండే ఎందుకంటారా?
న్యూఢిల్లీ: సమ్మర్ హాలీడేస్‌లో ఎక్కడికెవెళ్లాలి? పిల్లా పాపలతో కలిసి ఎక్కడికెళ్తే అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేస్తాం? పెద్దగా ఆలోచించకుండా లగేజ్ సర్దేసుకొని కశ్మీర్‌లోని లద్దాఖ్‌కో, ఒడిశాలో మయూర్‌భంజ్‌కు ప్రయాణమైపోవడమే! ఆ రెండే ఎందుకంటారా? ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత అద్భుతమైన ప్రాంతాల జాబితా–2023లో మన దేశం నుంచి చోటు దక్కించుకున్న ప్రాంతాలు అవే మరి! అరుదైన పులులు, పురాతన ఆలయాలు, సాహసంతో కూడిన ప్రయాణం, ఆహా అనిపించే ఆహారం. ఇవన్నీ లద్దాఖ్, మయూర్భంజ్లకు 50 పర్యాటక ప్రాంతాలతో టైమ్స్ రూపొందించిన ఈ జాబితాలో చోటు కల్పించాయి. లద్దాఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ అడుగు పెడితే స్వర్గమే తలవంచి భూమికి చేరిందా అనిపించక మానదు. ‘‘మంచుకొండలు, టిబెటన్ బౌద్ధ సంస్కృతి కనువిందు చేస్తాయి. అక్కడి వాతావరణాన్ని ఫీల్ అవడానికి పదేపదే లద్దాఖ్ వెళ్లాలి’’ అని టైమ్స్ కీర్తించింది. ‘‘ఇక మయూర్భంజ్ అంటే పచ్చదనం. సాంస్కృతిక వైభవం, పురాతన ఆలయాలు, కళాకృతులకు ఆలవాలం. ప్రపంచంలో నల్ల పులి సంచరించే ఏకైక ప్రాంతం’’ అంటూ కొనియాడింది. ఏటా ఏప్రిల్‌లో మయూర్‌భంజ్‌లో జరిగే ‘చౌ’ డ్యాన్స్ ఫెస్టివల్ అదనపు ఆకర్షణ. ఒడిశా సాంస్కృతిక వారసత్వంతో పాటు ఏకశిలా శాసనాలు గొప్పగా ఉంటాయని టైమ్స్ పేర్కొంది. జాబితాలో అత్యధిక శాతం అమెరికా ప్రాంతాలకే చోటు దక్కింది. టాంపా (ఫ్లోరిడా), విల్లామెట్ (ఓరెగాన్), టక్సాన్ (అరిజోనా), యోసెమైట్ నేషనల్ పార్క్ (కాలిఫోర్నియా) వంటివి వాటిలో ఉన్నాయి. -
వైరల్.. అమ్మ నీకు దండమే...
కొండలు పగిలేంత ఎండ కోరలు చాచి భయపెడుతుంది. రాక్షస దుమ్ము మేఘం ఒకటి ఊపిరిలోకి రావడానికి దూసుకొస్తుంది. అయినా తప్పదు...పని చేయాల్సిందే. ఈ ఎండలో బిడ్డను బయటికి తీసుకురావడం ఏమంత మంచిది కాదు. ఎండమ్మా కాస్త కరుణ చూపు... నా బిడ్డ ముఖం చూసైనా! కానీ ఎండ తగ్గేలా లేదు. అయినా తప్పదు... పని చేయాల్పిందే. పచ్చని చెట్టుకు కట్టిన ఉయ్యాలలో బిడ్డను పడుకోబెట్టి ఊపుతుంటే, ఆ కేరింతలను చూసి ఎన్ని సంవత్సరాలైనా సంతోషంగా బతకవచ్చు. కానీ బతుకుపోరు తనను బజార్‌కు తీసుకువచ్చింది. ఎండైనా, వానైనా పని తప్పదు. పనికి వెళుతున్నప్పుడు బిడ్డను ఇంట్లో వదిలి వెళ్లాలి కదా. ఇంట్లో ఎవరు ఉన్నారని! పెనిమిటి తనలాగే పనికి పోయాడు. పక్కింటివాళ్లకు అప్పగించాలనుకుంటే వారు ఇంట్లో ఉండరు. తనలాగే పనికోసం వెళ్తారు. అందుకే... పనికి వెళ్లక తప్పదు. వెళుతూ వెళుతూ బిడ్డను తీసుకువెళ్లక తప్పదు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో మున్సిపాలిటీ ఉద్యోగి ఒకరు బిడ్డను కొంగుకు కట్టుకొని రోడ్లు ఊడుస్తున్న వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఒక చిత్రం వంద పదాల పెట్టు అంటారు. ఇప్పుడు ఆ వరుసలో లఘుచిత్రాన్ని కూడా చేర్చవచ్చు. శ్రమైకజీవన సౌందర్యం నుంచి వర్కింగ్ వుమెన్ పర్సనల్ చాయిస్ వరకు నెటిజనులు ఈ వీడియో చిత్రం నేపథ్యంగా తమ మనసులోని భావాలను ప్రకటించుకున్నారు. ‘ఇదేనా మహిళా సంక్షేమం అంటే!’ అని ఒకరు వ్యంగ్యబాణం విసిరితే, ‘ఇలాంటి వృత్తి నిబద్ధత ఉన్న మహిళలు ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తారు. దేశం ముందడుగు వేయడానికి ఇలాంటి ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉంది’ అంటూ స్పందిస్తారు మరొకరు. ‘ఈ అమ్మలో మా అమ్మను చూసుకున్నాను’ అని ఒకరు కన్నీరు కార్చితే, మరొకరు ‘ఇది పట్టణ దృశ్యం. ఇక మాలాంటి పల్లెల్లో పొలం పనులకు బిడ్డతో వచ్చే తల్లులు ఉన్నారు. చెట్టుకు జోలె కట్టి బిడ్డను అందులో పడుకోబెట్టి పొలం పనులు చేస్తుంటారు. ఆ తల్లి మనసంతా బిడ్డ మీదే ఉంటుంది!’ అని జ్ఞాపకాల్లోకి వెళతారు ఒకరు. ‘మా ఊళ్లో ఒక అమ్మ తన బిడ్డను చెట్టు కింద కూర్చోబెట్టి కూలీపనులు చేసుకుంటుంది. నీళ్లు తాగడం కోసం పొలం దాటి బయటికి వచ్చిన ఆమె బిడ్డను చూసిపోదామని వచ్చేసరికి కాస్త దూరంలో పాము కనిపించి పెద్దగా అరిచి బిడ్డను అక్కడి నుంచి తీసుకొని పరుగెత్తింది. ఈ సంఘటన గురించి ఇప్పటికీ మా ఊళ్లో చెప్పుకుంటారు’ భావోద్వేగాల సంగతి సరే, మంచి సూచనలు ఇచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాటిలో ఒకటి... ‘పేదవాళ్లకు కేర్టేకర్లను ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థోమత ఉండదు. దేశంలో రకరకాల స్వచ్ఛందసంస్థల గురించి విని ఉన్నాం. పేద ఉద్యోగులు ఉద్యోగానికి లేదా పనికి వెళితే వారి పిల్లలను చూసుకునే స్వచ్ఛందసంస్థలు కూడా వస్తే మంచిది. ఈ దిశగా ఎవరైనా ఆలోచించాలి’. సామాజిక మాధ్యమాల్లో ‘వైరల్’ అనేది కొత్త కాదు. అయితే ఒక మంచి కారణంతో చర్చల్లో ఉండే వీడియోలు అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి. -
వీపున చంటిబిడ్డ.. వీధులు ఊడుస్తున్న ఓ తల్లి కథ ఇది
వీపున పసిబిడ్డను కట్టుకుని.. బ్రిటిష్ సైన్యంతో వీరోచిత పోరాటం చేసింది వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. ఇక్కడో లక్ష్మీ వీపున చంటిబిడ్డను కట్టుకుని ఎర్రటి ఎండలో చెమటలు చిందిస్తూ పని చేస్తోంది. సోషల్ మీడియాను విపరీతంగా ఆకట్టుకుంటున్న వీడియో, ఫొటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. లక్ష్మీముఖి.. ఒడిషా మయూర్భంజ్ బర్దిపాడా మున్సిపాలిటీలో పదేళ్లుగా స్వీపర్‌గా పని చేస్తోంది. అక్కడ పని చేస్తుండగానే ఓ దినసరి కూలీకి ఇచ్చి పెళ్లి చేసింది ఆమె కుటుంబం. భర్త పచ్చితాగుబోతు. ఒకరోజు బిడ్డను అమ్మేయాలని ప్రయత్నించాడు. అతని చాచికొట్టి.. బిడ్డతో సహా బయటకు వచ్చేసింది. స్థానికంగా ఓ ఇంట్లో ఒంటరిగానే ఉంటూ.. చంటి బిడ్డను చూసుకుంటోంది. ఇంటి దగ్గర బిడ్డను చూసుకునేవాళ్లు ఎవరూ లేకపోవడంతో బిడ్డను తనతో పాటే పనులను తెచ్చుకుంది. బిడ్డను వీపున కట్టుకోవడం తనకేం ఇబ్బందిగా అనిపించడం లేదని, తన డ్యూటీ తాను చేస్తున్నట్లు చెప్తోందామె. వ్యక్తిగత కారణాలతో ఆమె బిడ్డను తెచ్చుకుంటోందని, ఆమెకు అవసరమైన సాయం, ఇబ్బందులు ఎదురైతే సపోర్ట్ చేయాలని సిబ్బందికి సూచించినట్లు బర్దిపాడా మున్సిపాలిటీ చైర్మన్ బాదల్ మోహంతి చెప్తున్నారు. బిడ్డను వీపున కట్టుకుని వీధులు ఊడుస్తున్నా ఆ తల్లి కష్టానికి పలువురు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. అయినా కడుపున బిడ్డను నవమాసాలు మోసే తల్లికి.. వీపున మోయడం ఓ బరువా?.. అని అంటున్నారు మరికొందరు. #WATCH | Odisha: A lady sweeper, Laxmi cleans the road in Mayurbhanj district with her baby tied to her back. pic.twitter.com/g7rs3YMlFn — ANI (@ANI) May 29, 2022 వీడియో వైరల్: ఆ చిన్నారికి నాలుగు చేతులు, నాలుగు కాళ్లు!! -
నిండు గర్భిణిని 3 కి.మీ. నడిపించినందుకు..
భువనేశ్వర్/మయూర్భంజ్: నడిరోడ్డు మీద 8 నెలల నిండు గర్భిణిని నడిపించిన ఆరోపణ కింద స్టేషన్ ఆఫీసర్ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టరు రీణా బక్సల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కప్తిపడా స్టేషన్ ఆఫీసర్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ సంజయ్ ప్రధాన్‌కు ఈ స్టేషన్ బాధ్యతలు అదనంగా కేటాయిస్తూ మయూర్భంజ్ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. సస్పెన్షన్ వ్యవధిలో మయూర్భంజ్ స్టేషన్ అధికారుల పర్యవేక్షణలో రీణా బక్సల్ ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉత్తర్వుల తక్షణ అమలు కోసం ఆమె బాధ్యతలను స్టేషన్లో సహాయ సబ్ ఇన్స్పెక్టరు బి. డి. దాస్ మహాపాత్రోకు అప్పగించాలని పేర్కొన్నారు. మయూర్భంజ్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. శరత్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం హెల్మెట్ తనిఖీలు నిర్వహించారు. గర్భిణి గురుబారి బిరూలి, భర్త బిక్రమ్ బిరూలితో కలిసి ఆరోగ్య పరీక్షల కోసం వైద్యుని దగ్గరకు బైక్ మీద బయల్దేరింది. నోటా పంచాయతీ నుంచి ఉదొలా వెళ్తున్న మార్గంలో పోలీసులు తనిఖీ చేశారు. భర్త హెల్మెట్ ధరించినా భార్య ధరించనందున జరిమానా చెల్లించాలని అడ్డుకున్నారు. నగదు లేనందున ఆన్లైన్లో జరిమానా చెల్లించేందుకు బాధితులు అభ్యర్థించినప్పటికీ పోలీసులు పెడచెవిన పెట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్యుద్ధం జరిగింది. దీంతో గర్బిణి గురుబారి బిరూలిని నడి రోడ్డు మీద వదిలేసి భర్త బిక్రమ్ బిరూలిని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఘటనా స్థలం నుంచి 3 కిలో మీటర్ల దూరం దాదాపు 4 గంటల సేపు కష్టపడి గర్భిణి పోలీసు స్టేషన్‌కు చేరి తీవ్ర ఆవేదనకు గురైంది. ఈ మేరకు సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని బాధిత దంపతులు ఫిర్యాదు చేశారు. ఈ అమానుష సంఘటనపట్ల జిల్లా పోలీసు అధికార యంత్రాంగం స్పందించి సంబంధిత స్టేషన్ అధికారిపై సస్పెన్షన్ విధిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: పిల్లలకు విషమిచ్చి.. తానూ తాగి! -
కళ్ల ముందే కూలిపోయింది
-
ప్రకృతి ఆ ఇంటి మీద పగబట్టిందేమో
భువనేశ్వర్ : ఇల్లు కట్టాలంటే పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. ఈరోజుల్లో ఇళ్లు కట్టాలంటే మాత్రం స్థోమతకు మించిన పనిలా తయారైంది. మరీ అలాంటిది.. కష్టపడి కట్టుకున్న ఇళ్లు కళ్ల ముందే కూలిపోతే ఆ ఇంటి యజమాని బాధ వర్ణణాతీతం అని చెప్పొచ్చు. ఒడిశాలో గత కొన్ని రోజులగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల దాటికి వాగులు, వంగులు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా భారీ వర్షాల వల్ల ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా మధుబన్‌లో రెండు అంతస్తుల భవనం ఇంటి యజమాని ముందే కుప్పకూలింది. అయితే ఇక్కడ ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. భవనం కూలే సమయంలో ఇంటి సభ్యులందరూ బయటకు వచ్చేశారు కాబట్టి సరిపోయింది లేదంటే ఎవరు బయట పడేవారు కాదు. భవనం కదులుతుందని తెలియగానే హుటాహుటిన అందులో నివసిస్తున్న వాళ్లంతా బయటకు వచ్చేశారు. పాపం.. విలువైన వస్తువులను బయటకు తెచ్చుకునేంత సమయం కూడా ప్రకృతి వారికి ఇవ్వలేకపోయింది. ఆశ్చర్యం ఏంటంటే.. భవనం కూలిన పక్కనే ఉన్న మరో రెండస్తుల భవనం నుంచి చిన్న పెచ్చుకూడా ఊడి కిందపడలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రకృతి ఆ ఇంటి మీద పగబట్టిందేమో అని కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : అతని తిండిపై కన్నేసిన పక్షులు) -
ఎంత కష్టం: కావడిలో కన్నబిడ్డలను మోస్తూ
ఆనాడు శ్రవణుడు తల్లిదండ్రుల సంతోషం కోసం వారిని కావడిలో మోసుకుంటూ రాజ్యాలు తిరిగాడు. కానీ ఈనాడు వలస కార్మికుడు తన పిల్లలను దుఃఖం నుంచి తప్పించేందుకు వారిని కష్టాల కావడిలో మోసుకుంటూ మండుటెండలో, కాలినడకన స్వస్థలానికి పయనమయ్యాడు. ఈ విషాద ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని మయూర్‌భంజ్‌కు చెందిన రుపయ తుడు అనే గిరిజన కూలీ బతుకుదెరువును వెతుక్కుంటూ జైపూర్‌కు వెళ్లాడు. లాక్డౌన్ వల్ల అతను ఉండేచోట పని ఆగిపోగా అప్పటివరకు చేసిన శ్రమకు కూడా యజమాని చిల్లిగవ్వ చెల్లించలేదు. దీంతో నాటి నుంచి అక్కడే పని లేక పస్తులుంటున్నాడు. ఆకలితో ఊరు కాని ఊరులో చావడం ఇష్టం లేక స్వస్థలానికి పయనమయ్యాడు. తన భార్య మాత్రిక, ఆరేళ్ల కూతురు పుష్పాంజలి నడవగలరు. కానీ నాలుగు, రెండున్నరేళ్లు ఉన్న మరో ఇద్దరు పిల్లలు అంతదూరం ఎలా నడవగలరని ఆలోచనలో పడ్డాడు. దీంతో కావడిలో తన ఇద్దరు పిల్లలను ఓవైపు, సామన్లన్నీ మరోవైపు పెట్టుకుని దాన్ని భుజానికెత్తుకున్నాడు. అలా 160 కి.మీ. కాలినడకన ప్రయాణించి శుక్రవారం నాటికి ఇల్లు చేరుకున్నాడు. (ఉండలేము.. వెళ్లలేము!) ఈ విషయం గురించి రుపయ తుడు మాట్లాడుతూ... "నా దగ్గర తగినంతగా డబ్బు లేదు. అందువల్ల కాళ్లను నమ్ముకుని, నడుస్తూ ఇంటికెళ్లాం. ఏడు రోజులు నడక తర్వాత శుక్రవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నాం. కొన్నిసార్లు ఎంతో కష్టంగా అనిపించింది కానీ తప్పదు కదా!" అని చెప్పుకొచ్చాడు. ఒడిశా ప్రభుత్వం నిబంధనల ప్రకారం అతడు ముందుగా 21 రోజులపాటు క్వారంటైన్ కేంద్రంలో, తర్వాతి ఏడు రోజులు ఇంటి నిర్బంధంలో ఉండాలి. ప్రస్తుతం అతడితోపాటు, కుటుంబ సభ్యులను గ్రామంలోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. కానీ అక్కడ ఎలాంటి ఆహార సదుపాయం లేదు. ఈ విషయం దృష్టికి వచ్చిన బీజేపీ అధికారి దెబశీష్ మోహంతి వెంటనే సదరు క్వారంటైన్లో ఉన్న రుపయ తుడు కుటుంబ సభ్యులతో పాటు, మిగతా కూలీలకు ఆహారాన్ని అందించారు. (మమ్మల్ని పట్టించుకోవడం లేదు..) -
పసికూనపై పైశాచికం
భువనేశ్వర్ : వయసుతో నిమిత్తం లేకుండా పసికందు నుంచి పండు ముదుసలులపైనా కామాంధులు విరుచుకుపడుతున్న ఉదంతాలు కొనసాగుతున్నాయి. ఒడిషాలో 17 నెలల చిన్నారిపై స్వయంగా బంధువే లైంగిక దాడికి తెగబడిన ఘటన వెలుగుచూసింది. మయూర్భంజ్లోని కుంటా గ్రామంలో ఈనెల 5న ఈ ఘోరం చోటుచేసుకోగా చిన్నారని వైద్య పరీక్షకు తరలించారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డీఎస్పీ ఎస్ మహాపాత్ర తెలిపారు. -
విదారక ఘటన
భువనేశ్వర్: అధికారుల నిర్లక్ష్యం, గజరాజు భీభత్సం వెరసి ఓ నవజాత శిశువుకు రక్షణ లేకుండా పోయింది. పుట్టుకతోనే కష్టాలను పరిచయం చేశారు. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆ తల్లి అటు అసుపత్రికి పోలేక, ఇటు సొంత ఇల్లు లేక చివరికి ఓ చిన్న కాలువపై ఏర్పాటు చేసిన వంతెన కింద బిడ్డకి జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రమిల తిరియా అనే మహిళా ఇంటిపై ఆరు నెలల క్రితం ఏనుగు దాడి చేసి ఇంటిని నాశనం చేసింది. దీంతో ఇంటిని కోల్పొయిన ప్రమిల ప్రభుత్వ సాయం కోసం వేచి చూసింది. నష్టపరిహారం అందిస్తే ఇంటిని నిర్మింకుందామనుకుంది. కానీ అధికారులు ఆమెకు సాయం చేయలేదు. దీంతో అదే ఊర్లో చిన్న కాలువపై ఏర్పాటు చేసిన వంతెన కింద ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వంతెన కిందే కొద్ది రోజుల క్రితం ఓ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయంపై జిల్లా కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ.. ‘ప్రమిలకు ఆశా వర్కర్లనుంచి కూడా ఏ విధమైన సాయం అందలేదు. గర్భిణీల ఆరోగ్య సమస్యలను చూసుకోవాల్సిన బాధ్యత వారిది. ఆమెను ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రమిలకు న్యాయం జరిగేలా చూస్తామ’ని పేర్కొన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. ప్రమిల ఇంటిని ఏనుగు నాశనం చేసిన విషయాన్ని అటవీ శాఖ అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఏవిధమైన సాయం అందజేయలేదన్నారు. ఆరు నెలల నుంచి ఆమె వంతెన కిందే నివాసముంటుందని తెలిపారు. ప్రమిలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. -
కూలిన వాయుసేన హెలికాప్టర్
సాక్షి, భువనేశ్వర్ : ఒడిశా-జార్ఖండ్ సరిహద్దు ప్రాంతంలో మంగళవారం భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన శిక్షణ విమానం కుప్పకూలింది. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఎలాంటి ప్రాణ ణష్టం జరగలేదు. పైలట్‌తో పాటు మరొకరు గాయపడ్డగా...వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్‌లోని కలైకుందా వైమానిక స్థావరం నుంచి రోజు మాదిరిగానే శిక్షణ కోసం బయలుదేరిన విమానం వెనుక భాగం నుంచి పొగలు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు సమాచారం. కాగాప్రమాదానికి కారణం ఏమిటన్నదానిపై స్పష్టత రాలేదని, విచారణ చేపడుతన్నామని అధికారులు తెలిపారు. -
కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం
-
కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం
ఒడిశా: ఒడిశాలోని మయూర్ బంజ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన విమానం బుధవారం కూలిపోయింది. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని డీజీపీ తెలిపారు. మరోవైపు జార్ఖండ్ లోని బహరాగొరా ప్రాంతంలోనూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన మరో అత్యాధునిక నిఘూ యాద్ధవిమానం కూలిపోయింది. ఈసంఘటనలోనూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. బుధవారం జరిగిన రెండుప్రమాదాల్లోనూ పైలెట్ లు సురక్షితంగా బయటపడ్డారు.