
భువనేశ్వర్ : ఇల్లు కట్టాలంటే పెద్ద ఖర్చుతో కూడుకున్న పని. ఈరోజుల్లో ఇళ్లు కట్టాలంటే మాత్రం స్థోమతకు మించిన పనిలా తయారైంది. మరీ అలాంటిది.. కష్టపడి కట్టుకున్న ఇళ్లు కళ్ల ముందే కూలిపోతే ఆ ఇంటి యజమాని బాధ వర్ణణాతీతం అని చెప్పొచ్చు. ఒడిశాలో గత కొన్ని రోజులగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల దాటికి వాగులు, వంగులు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా భారీ వర్షాల వల్ల ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా మధుబన్‌లో రెండు అంతస్తుల భవనం ఇంటి యజమాని ముందే కుప్పకూలింది.
అయితే ఇక్కడ ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రమాదంలో ఎవరు గాయపడలేదు. భవనం కూలే సమయంలో ఇంటి సభ్యులందరూ బయటకు వచ్చేశారు కాబట్టి సరిపోయింది లేదంటే ఎవరు బయట పడేవారు కాదు. భవనం కదులుతుందని తెలియగానే హుటాహుటిన అందులో నివసిస్తున్న వాళ్లంతా బయటకు వచ్చేశారు. పాపం.. విలువైన వస్తువులను బయటకు తెచ్చుకునేంత సమయం కూడా ప్రకృతి వారికి ఇవ్వలేకపోయింది. ఆశ్చర్యం ఏంటంటే.. భవనం కూలిన పక్కనే ఉన్న మరో రెండస్తుల భవనం నుంచి చిన్న పెచ్చుకూడా ఊడి కిందపడలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రకృతి ఆ ఇంటి మీద పగబట్టిందేమో అని కామెంట్లు పెడుతున్నారు.
(చదవండి : అతని తిండిపై కన్నేసిన పక్షులు)