తన బిడ్డతో ప్రమిల తిరియా
భువనేశ్వర్: అధికారుల నిర్లక్ష్యం, గజరాజు భీభత్సం వెరసి ఓ నవజాత శిశువుకు రక్షణ లేకుండా పోయింది. పుట్టుకతోనే కష్టాలను పరిచయం చేశారు. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆ తల్లి అటు అసుపత్రికి పోలేక, ఇటు సొంత ఇల్లు లేక చివరికి ఓ చిన్న కాలువపై ఏర్పాటు చేసిన వంతెన కింద బిడ్డకి జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ప్రమిల తిరియా అనే మహిళా ఇంటిపై ఆరు నెలల క్రితం ఏనుగు దాడి చేసి ఇంటిని నాశనం చేసింది. దీంతో ఇంటిని కోల్పొయిన ప్రమిల ప్రభుత్వ సాయం కోసం వేచి చూసింది.
నష్టపరిహారం అందిస్తే ఇంటిని నిర్మింకుందామనుకుంది. కానీ అధికారులు ఆమెకు సాయం చేయలేదు. దీంతో అదే ఊర్లో చిన్న కాలువపై ఏర్పాటు చేసిన వంతెన కింద ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వంతెన కిందే కొద్ది రోజుల క్రితం ఓ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయంపై జిల్లా కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ.. ‘ప్రమిలకు ఆశా వర్కర్లనుంచి కూడా ఏ విధమైన సాయం అందలేదు. గర్భిణీల ఆరోగ్య సమస్యలను చూసుకోవాల్సిన బాధ్యత వారిది. ఆమెను ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటాం. ప్రమిలకు న్యాయం జరిగేలా చూస్తామ’ని పేర్కొన్నారు.
గ్రామస్తులు మాట్లాడుతూ.. ప్రమిల ఇంటిని ఏనుగు నాశనం చేసిన విషయాన్ని అటవీ శాఖ అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఏవిధమైన సాయం అందజేయలేదన్నారు. ఆరు నెలల నుంచి ఆమె వంతెన కిందే నివాసముంటుందని తెలిపారు. ప్రమిలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment