దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒడిశాలోని మయూర్‌భంజ్ లోక్‌సభ స్థానం నుంచి జార్ఖండ్ ముక్తి మోర్చా మహిళా నేత, మాజీ సీఎం హేమంత్ సోరెన్ సోదరి అంజనీ సోరెన్ ఎన్నికల బరిలోకి దిగారు. అంజనీ సోరెన్ జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుడు శిబు సోరెన్ కుమార్తె.
మయూర్‌భంజ్ స్థానం నుంచి అంజనీ సోరెన్ పోటీలోకి దిగడంతో ఇక్కడ త్రిముఖ పొరు నెలకొంది. ఈ స్థానంలో బీజేపీ నాబా చరణ్ మాఝీని రంగంలోకి దింపింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీజేపీ విజయం సాధించింది. అయితే బీజేపీ నాడు విజయం సాధించిన బిశేశ్వర్ తుడు స్థానంలో నాబా చరణ్ మాఝీకి అవకాశం కల్పించింది.
ఇదే స్థానం నుంచి సుదమ్ మరాండీ బీజేడీ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. సుదామ్ మరాండి ఒకప్పుడు ఒడిశాలో జార్ఖండ్ ముక్తి మోర్చా అగ్రనేతగా ఉన్నారు. అయితే ఆ తరువాత అతను బీజేడీలో చేరారు. సుదామ్ మరాండీకి స్థానికంగా ప్రజల మద్దతు ఉందనే మాట వినిపిస్తుంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి జేఎంఎం తరపున అంజనీ సోరెన్ ఎన్నికల బరిలోకి దిగడంతో ఈ లోక్‌సభ స్థానంలో పోరు ఆసక్తికరంగా మారింది.
మయూర్‌భంజ్ జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లాతో సరిహద్దును పంచుకుంటుంది. 2019లో అంజనీ సోరెన్ ఈ స్థానం నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. మయూర్‌భంజ్ లోక్‌సభ స్థానంలో గిరిజనుల సంఖ్య అత్యధికం. ఇక్కడ ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరింటిని షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేశారు. జేఎంఎంతో పొత్తు కారణంగా ఇక్కడ కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టలేదు.
Comments
Please login to add a commentAdd a comment