బీజూ జనతా దళ్‌లో నవీన్ పట్నాయక్ తర్వాత ఎవరు? ఇదే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చలకు.. కొనసాగింపుగా వస్తున్న విమర్శలకు నవీన్ పట్నాయక్ పుల్‌స్టాప్ పెట్టారు. తన రాజకీయ వారసత్వంపై స్పష్టత ఇచ్చారు.
బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ రెండు దశాబ్ధాలకు పైగా సీఎంగా కొనసాగారు. ఇప్పటికే ఐదు సార్లు సీఎం పదవిని చేపట్టారు. తాజాగా ఎన్నికల్లో బీజేడీ గెలిచినట్లైతే మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ ఫలితం తారుమారు కావడంతో అధికార పీఠానికి దూరమయ్యారు.
ఈ తరుణంలో తన ముఖ్యమంత్రి పదవికి నవీన్ పట్నాయక్ రాజీనామా చేశారు. ఓటమి తర్వాత ఇవాళ తొలిసారి మీడియా ముందుకు వచ్చారాయన. ఎన్నికల ఫలితాలపై పట్నాయక్ మాట్లాడుతూ, ఇంతకాలం పార్టీ సాధించిన విజయాల పట్ల గర్వంగా ఉంది. ఒడిషాలో చాలా అద్భుతంగా పనిచేశాం. ప్రజాస్వామ్యంలో గెలుపుఓటముల్ని ప్రజలే నిర్ధేశిస్తారు. సుదీర్ఘ కాలం తర్వాత మేం ఓడిపోయాం. కాబట్టి, ఈ తీర్పును గౌరవిస్తున్నాం అని వ్యాఖ్యానించారు.
వీకే పాండ్యన్‌పై విమర్శలు.. దురదృష్టకరం
‘వీకే పాండియన్‌పై పలు విమర్శలున్నాయి ఇది దురదృష్టకరం. పాండ్యన్ రాష్ట్రంలో ఆరోగ్యం, విద్య, క్రీడలు, ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాల్లో కీలకంగా పనిచేశారు. బ్యూరోక్రాట్ నుంచి బీజేడీ పార్టీలో చేరారు. కానీ ఎలాంటి పదవులు ఆశించలేదు. ఇక నా వారసుడు ఎవరనే అంశంపై చర్చ జరుగుతోంది. ఆ చర్చను కొనసాగించడం ఇష్టం లేదు. పాండియన్ నా వారసుడు కాదు. ఒడిశా ప్రజలే నా వారసుడు ఎవరో నిర్ణయిస్తారని చెప్పారు.
పాండియన్ సేవల్ని మరువలేం
ఈ సందర్భంగా వీకే ప్యాండన్ ఐఏఎస్ అధికారిగా రాష్ట్రానికి చేసిన సేవల్ని మరోసారి గుర్తు చేశారు. అధికారిగా, అతను అద్భుతంగా పని చేశారు. రాష్ట్రంలో రెండు తుఫానులు,కోవిడ్-19 కష్టకాలంలో ఆయన చేసిన సేవల్ని మరువలేం. బ్యూరోక్రాట్‌గా పదవి విరమణ చేసి బీజేడీలో చేరారు. చిత్తశుద్ది, నిజాయితీ గల వ్యక్తి. ఆయన్ని మనం గౌరవించాలి అని నొక్కి చెప్పారు.
24ఏళ్ల తర్వాత ఓటమి
ఒడిశాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ 24 ఏళ్ల తర్వాత ఓటమి పాలయ్యారు. 147 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 78, బీజేడీ51, కాంగ్రెస్ 14, మూడు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో నవీన్ పట్నాయక్ తన పదవికి దూరం అయ్యారు.
వీకే పాండ్యన్ మిస్సింగ్
ఒడిశా ఎన్నికల ఫలితాలు విడుదలైన నాటి నుంచి వీకే పాండ్యన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎవరికీ అందుబాటులో లేకపోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సాధారణంగా పట్నాయక్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెన్నంటే ఉంటారనే పేరుంది. కానీ పట్నాయక్ ఒంటరిగా రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించడంతో వీకే పాండ్యన్ ఇక ఒడిషా రాజకీయ చిత్రం నుంచి తప్పుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment