ఒడిశా రాజకీయాలలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ నేత, 24 సంవత్సరాల క్రితం బీజేడీ నుంచి బహిష్కరణకు గురైన బిజోయ్ మహపాత్ర కుమారుడు అరబింద మహపాత్ర అదే బీజేడీలో చేరారు. ఆయన్ను బీజేడీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పార్టీలోకి స్వాగతించారు.
సీఎం నవీన్ పట్నాయక్ నివాసంలో అరబింద మహాపాత్ర పార్టీలో చేరారు. అరబిందను ఆత్మీయంగా పార్టీలోకిక ఆహ్వానించిన నవీన్ పట్నాయక్.. కేంద్రంపద జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. "మేము మిమ్మల్ని బీజేడీలోకి స్వాగతిస్తున్నాము. కేంద్రపద జిల్లా కోసం కష్టపడి పని చేయండి. మీకు నా ఆశీస్సులు ఉన్నాయి. అలాగే మీ తండ్రికి కూడా ధన్యవాదాలు" అని పట్నాయక్ అన్నారు.
ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్, బీజేపీ ఇటీవల విడివిడిగా సమావేశాలు నిర్వహించిన రెండు పార్టీల సీనియర్ నేతలతో పొత్తు ఖరారు చేసుకునే దశలో ఉన్నాయనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. 1980 నుంచి 2000 మధ్య కాలంలో పట్కురా నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బిజోయ్, ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రి, మాజీ సీఎం బిజూ పట్నాయక్‌కు నమ్మకస్తుడిగా పేరుగాంచారు.
1997 ఏప్రిల్ 17న బిజూ పట్నాయక్ మరణించిన తర్వాత బీజేడీ ఏర్పాటులో, బిజూ చిన్న కుమారుడు నవీన్ పట్నాయక్ నాయకత్వం వహించడంలో బిజోయ్ కీలకపాత్ర పోషించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి కూడా ఆయన నాయకత్వం వహించారు. అయితే ఆ తర్వాత నవీన్ పట్నాయక్ చాలా నిర్ణయాలను బిజోయ్ వ్యతిరేకించారు. ఇదే బీజేడీ నుంచి నిష్క్రమించడానికి కారణమని చాలా మంది నమ్ముతారు. తరువాత 2001లో బిజోయ్ ఒడిషా గణ పరిషత్‌ను స్థాపించారు. అది తరువాత ఎన్‌సీపీలో విలీనమైంది. ఆ తర్వాత బిజోయ్ మహపాత్ర బీజేపీలో చేరారు.
ఒడిశాలో 21 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీకి అత్యధిక సీట్లు వచ్చాయి. బీజేడీ 12, బీజేపీ 8, కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment