ఆనాడు శ్రవణుడు తల్లిదండ్రుల సంతోషం కోసం వారిని కావడిలో మోసుకుంటూ రాజ్యాలు తిరిగాడు. కానీ ఈనాడు వలస కార్మికుడు తన పిల్లలను దుఃఖం నుంచి తప్పించేందుకు వారిని కష్టాల కావడిలో మోసుకుంటూ మండుటెండలో, కాలినడకన స్వస్థలానికి పయనమయ్యాడు. ఈ విషాద ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని మయూర్భంజ్‌కు చెందిన రుపయ తుడు అనే గిరిజన కూలీ బతుకుదెరువును వెతుక్కుంటూ జైపూర్‌కు వెళ్లాడు. లాక్‌డౌన్ వల్ల అతను ఉండేచోట పని ఆగిపోగా అప్పటివరకు చేసిన శ్రమకు కూడా యజమాని చిల్లిగవ్వ చెల్లించలేదు. దీంతో నాటి నుంచి అక్కడే పని లేక పస్తులుంటున్నాడు. ఆకలితో ఊరు కాని ఊరులో చావడం ఇష్టం లేక స్వస్థలానికి పయనమయ్యాడు. తన భార్య మాత్రిక, ఆరేళ్ల కూతురు పుష్పాంజలి నడవగలరు. కానీ నాలుగు, రెండున్నరేళ్లు ఉన్న మరో ఇద్దరు పిల్లలు అంతదూరం ఎలా నడవగలరని ఆలోచనలో పడ్డాడు. దీంతో కావడిలో తన ఇద్దరు పిల్లలను ఓవైపు, సామన్లన్నీ మరోవైపు పెట్టుకుని దాన్ని భుజానికెత్తుకున్నాడు. అలా 160 కి.మీ. కాలినడకన ప్రయాణించి శుక్రవారం నాటికి ఇల్లు చేరుకున్నాడు. (ఉండలేము.. వెళ్లలేము!)
ఈ విషయం గురించి రుపయ తుడు మాట్లాడుతూ... "నా దగ్గర తగినంతగా డబ్బు లేదు. అందువల్ల కాళ్లను నమ్ముకుని, నడుస్తూ ఇంటికెళ్లాం. ఏడు రోజులు నడక తర్వాత శుక్రవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నాం. కొన్నిసార్లు ఎంతో కష్టంగా అనిపించింది కానీ తప్పదు కదా!" అని చెప్పుకొచ్చాడు. ఒడిశా ప్రభుత్వం నిబంధనల ప్రకారం అతడు ముందుగా 21 రోజులపాటు క్వారంటైన్ కేంద్రంలో, తర్వాతి ఏడు రోజులు ఇంటి నిర్బంధంలో ఉండాలి. ప్రస్తుతం అతడితోపాటు, కుటుంబ సభ్యులను గ్రామంలోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. కానీ అక్కడ ఎలాంటి ఆహార సదుపాయం లేదు. ఈ విషయం దృష్టికి వచ్చిన బీజేపీ అధికారి దెబశీష్ మోహంతి వెంటనే సదరు క్వారంటైన్‌లో ఉన్న రుపయ తుడు కుటుంబ సభ్యులతో పాటు, మిగతా కూలీలకు ఆహారాన్ని అందించారు. (మమ్మల్ని పట్టించుకోవడం లేదు..)
Comments
Please login to add a commentAdd a comment