భంజ్ యువరాణులు మృణాళిక, అక్షితలు రాజవంశంలో పుట్టినా సాధారణ యువతుల్లాగే భిన్న రంగాల్లో తమను తాము నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరిద్దరూ ఫిక్కీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే...
మా ప్యాలెస్...టూరిస్ట్ ప్లేస్‌గా...
మా జిల్లా గురించి గొప్పగా చెప్పుకోలేని పరిస్థితే మా ప్రాంతాన్ని తీర్చిదిద్దే వైపు మమ్మల్ని పురికొల్పింది. అందులో భాగంగా స్థానికుల్ని స్వయం ఉపాధి దిశగా నడిపించడం, స్థానిక హస్తకళలకు చేయూత అందించడం.. వంటివి చేశాం. మా హస్తకళల బ్రాండ్ హసా అటెలియర్ సబాయి గడ్డితో చేసిన సంచుల విక్రయాలకు పేరు. వీటిని తరచు డోక్రాతో (ఒడిశాలోని గిరిజనులు చేసే ఓ రకమైన మెటల్‌వర్క్) జత చేసి విక్రయిస్తాం. ఇలా స్థానికులకు ఉపాధితో పాటు స్థానిక కళలకు కూడా ఖ్యాతి దక్కుతోంది. అదే క్రమంలో 20 ఎకరాల్లో ఉన్న మా ప్యాలెస్‌ను 11 గదుల బోటిక్ హోటల్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాం.
మా ఇంటిని టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దే క్రమంలో మా తండ్రిగారిని ఒప్పించి ఆయన సూచనలు, సహకారంతో ఒక్క ఇటుక కూడా కొత్తగా జోడించకుండా, చారిత్రక ఆనవాళ్లేమీ చెరిగిపోకుండానే ప్యాలెస్‌ను ఆ«ధునికంగా తీర్చిదిద్దాం. మేం దీనిని ప్రారంభించిన కొద్దికాలానికే కోవిడ్ వచ్చింది. అయితే కోవిడ్ అనంతరం ప్రారంభమైన రివెంజ్ ట్రావెల్... మాకు అనూహ్యమైన ప్రోత్సాహాన్నిచ్చింది. మా జిల్లాకు ఒక మారుమూల అటవీ ప్రాంతంగా కాకుండా ఓ మంచి పర్యాటక కేంద్రంగా గుర్తింపు వచ్చింది. అయితే ఈ పయనం మాకెన్నో మెలకువలు, పాఠాలూ నేర్పింది.
హైదరాబాద్‌లో ఫలక్‌నుమా ప్యాలెస్ ఉంది, రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్ ప్యాలెస్ ఉంది... మరి మయూర్‌భంజ్‌లోని మా ప్యాలెస్‌కే ఎందుకు రావాలి.. అనే ప్రశ్నకు సమాధాన గా మేం మా చరిత్రను కథగా మలచి అతిథులకు పంచుతున్నాం. ప్రత్యేకంగా వికలాంగులకు అనుకూలమైన మరో రెండు గదులను ఇటీవలే జోడించాం. ప్రతి అడుగూ చరిత్రకు అద్దం పట్టేలా తీర్చిదిద్దాం’’ అంటూ తమ విజయగాథను పంచుకున్నారు.. ఇదేకాదు.. ఒకరు యోగా టీచర్‌గా రాణిస్తుంటే మరొకరు రచయిత్రిగా... ఇలా భిన్న రంగాల్లో తమను తాము నిరూపించుకుంటున్నారు ఈ యువరాణులు.
మా ప్రాంతానికి ‘కళ’తేవాలని...
మా కుటుంబానికి దాదాపు 1000 సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉంది. అయితే ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉన్న 200 ఏళ్ల నాటి పూర్వీకుల ఇల్లు బెల్గాడియా ప్యాలెస్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం దగ్గర నుంచి చేసిన ప్రతి పనీ మేం రాజకుటుంబ వారసత్వం అనే పరదాల నుంచి బయటకు వచ్చి చేసినవే. అంతర్జాతీయ కళాకారులను ఆహ్వానిస్తూ మయూర్‌భంజ్ ఆర్ట్స్ – కల్చర్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నాం. మా ప్యాలెస్‌ని ఆర్టిస్ట్ రెసిడెన్సీగా మార్చాం.
–మృణాళిక, అక్షిత
– సాక్షి హైదరాబాద్ సిటీ బ్యూరో
ఫొటో: మోహనాచారి
Comments
Please login to add a commentAdd a comment