dynasty
-
రాణివాసం కన్నా... సమాజమే మిన్న...
భంజ్ యువరాణులు మృణాళిక, అక్షితలు రాజవంశంలో పుట్టినా సాధారణ యువతుల్లాగే భిన్న రంగాల్లో తమను తాము నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరిద్దరూ ఫిక్కీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే... మా ప్యాలెస్...టూరిస్ట్ ప్లేస్‌గా... మా జిల్లా గురించి గొప్పగా చెప్పుకోలేని పరిస్థితే మా ప్రాంతాన్ని తీర్చిదిద్దే వైపు మమ్మల్ని పురికొల్పింది. అందులో భాగంగా స్థానికుల్ని స్వయం ఉపాధి దిశగా నడిపించడం, స్థానిక హస్తకళలకు చేయూత అందించడం.. వంటివి చేశాం. మా హస్తకళల బ్రాండ్ హసా అటెలియర్ సబాయి గడ్డితో చేసిన సంచుల విక్రయాలకు పేరు. వీటిని తరచు డోక్రాతో (ఒడిశాలోని గిరిజనులు చేసే ఓ రకమైన మెటల్‌వర్క్) జత చేసి విక్రయిస్తాం. ఇలా స్థానికులకు ఉపాధితో పాటు స్థానిక కళలకు కూడా ఖ్యాతి దక్కుతోంది. అదే క్రమంలో 20 ఎకరాల్లో ఉన్న మా ప్యాలెస్‌ను 11 గదుల బోటిక్ హోటల్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాం. మా ఇంటిని టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దే క్రమంలో మా తండ్రిగారిని ఒప్పించి ఆయన సూచనలు, సహకారంతో ఒక్క ఇటుక కూడా కొత్తగా జోడించకుండా, చారిత్రక ఆనవాళ్లేమీ చెరిగిపోకుండానే ప్యాలెస్‌ను ఆ«ధునికంగా తీర్చిదిద్దాం. మేం దీనిని ప్రారంభించిన కొద్దికాలానికే కోవిడ్ వచ్చింది. అయితే కోవిడ్ అనంతరం ప్రారంభమైన రివెంజ్ ట్రావెల్... మాకు అనూహ్యమైన ప్రోత్సాహాన్నిచ్చింది. మా జిల్లాకు ఒక మారుమూల అటవీ ప్రాంతంగా కాకుండా ఓ మంచి పర్యాటక కేంద్రంగా గుర్తింపు వచ్చింది. అయితే ఈ పయనం మాకెన్నో మెలకువలు, పాఠాలూ నేర్పింది. హైదరాబాద్‌లో ఫలక్‌నుమా ప్యాలెస్ ఉంది, రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్ ప్యాలెస్ ఉంది... మరి మయూర్భంజ్లోని మా ప్యాలెస్‌కే ఎందుకు రావాలి.. అనే ప్రశ్నకు సమాధాన గా మేం మా చరిత్రను కథగా మలచి అతిథులకు పంచుతున్నాం. ప్రత్యేకంగా వికలాంగులకు అనుకూలమైన మరో రెండు గదులను ఇటీవలే జోడించాం. ప్రతి అడుగూ చరిత్రకు అద్దం పట్టేలా తీర్చిదిద్దాం’’ అంటూ తమ విజయగాథను పంచుకున్నారు.. ఇదేకాదు.. ఒకరు యోగా టీచర్‌గా రాణిస్తుంటే మరొకరు రచయిత్రిగా... ఇలా భిన్న రంగాల్లో తమను తాము నిరూపించుకుంటున్నారు ఈ యువరాణులు. మా ప్రాంతానికి ‘కళ’తేవాలని... మా కుటుంబానికి దాదాపు 1000 సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉంది. అయితే ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్న 200 ఏళ్ల నాటి పూర్వీకుల ఇల్లు బెల్గాడియా ప్యాలెస్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం దగ్గర నుంచి చేసిన ప్రతి పనీ మేం రాజకుటుంబ వారసత్వం అనే పరదాల నుంచి బయటకు వచ్చి చేసినవే. అంతర్జాతీయ కళాకారులను ఆహ్వానిస్తూ మయూర్భంజ్ ఆర్ట్స్ – కల్చర్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నాం. మా ప్యాలెస్‌ని ఆర్టిస్ట్ రెసిడెన్సీగా మార్చాం. –మృణాళిక, అక్షిత – సాక్షి హైదరాబాద్ సిటీ బ్యూరో ఫొటో: మోహనాచారి -
బ్రిటన్ మహారాణి కన్నుమూస్తే...!
లండన్: బ్రిటన్‌లో రాజ వంశంపై ప్రజలకు ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. రాజవంశానికి సంబంధించిన ఏవార్తైనా ప్రజల్లో ఆసక్తి రేకిత్తిస్తుంది. అలాంటిది ఏకంగా మహారాణి మరణానికి సంబంధించిన వార్తైతే దానికి ఉండే ప్రాముఖ్యమే వేరు! రాణిగారి అంతిమశ్వాస నుంచి అధికారికంగా సమాధి చేసేవరకు ఒకపెద్ద మహాయజ్ఞంలాగా నిర్వహిస్తారు. మహారాణి క్వీన్ ఎలిజబెత్–2 మరణించిన అనంతరం తీసుకొనే చర్యల వివరాలు శుక్రవారం లీకయ్యాయి. రాణి మరణించిన వెంటనే ఆరంభమయ్యే ఈ కార్యకలాపాలను ‘‘ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్’’గా పిలుస్తారని పొలిటికో వార్తా సంస్థ వెల్లడించింది. రాణి మరణించిన రోజును అధికారికంగా ‘డీ డే’గా పిలుస్తారని, ఆమె మరణించిన రోజును జాతి సంతాపదినంగా ప్రధాని ప్రకటిస్తారని, సెలవు కూడా ఇస్తారని తెలిపింది. (చదవండి: మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్) రికార్డు పాలన బ్రిటన్ చరిత్రలో సుదీర్ఘకాలం పరిపాలిస్తున్న రాణిగా ఎలిజబెత్2 రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమెకు 95 సంవత్సరాల వయసు. ఆమె తుది శ్వాస విడిచిన అనంతరం పదిరోజుల పాటు పారి్థవ కాయాన్ని అలాగే ఉంచుతారు. ఈ పదిరోజులు ఆమె వారసుడు ప్రిన్స్ ఛార్లెస్ బ్రిటన్ మొత్తం పర్యటించి రాణి మరణ వార్తను పౌరులకు వెల్లడిస్తారు. అనంతరం ఆమెను సమాధి చేసే కార్యక్రమం షురూ అవుతుంది. మరణానంతరం ఆమె భౌతిక కాయాన్ని మూడు రోజుల పాటు హౌస్ ఆఫ్ పార్లమెంట్లో సందర్శకుల కోసం ఉంచుతారు. ఆ సమయంలో వేలాది మంది ప్రజలు లండన్‌కు వస్తారని, దీంతో ట్రాఫిక్ జామ్‌లు, ఆహార కరువు ఏర్పడతాయన్న అంచనాలు లీకైన పత్రాల్లో ఉన్నాయి. సందర్శనార్ధం వచ్చేవారిని నియంత్రించేందుకు సెక్యూరిటీ ఏర్పాట్లను సైతం ఇందులో పొందుపరిచారు. ఈ లీకు పత్రాలపై స్పందించేందుకు బకింగ్‌హామ్ ప్యాలెస్ వర్గాలు నిరాకరించాయి. (చదవండి: TSRTC-Sajjanar: ఆర్టీసీ ఉద్యోగులకు 1నే జీతాలు!) -
త్రికళింగ చరిత్ర – సరికొత్త కోణం!
మానవ చరిత్ర ఎంత ప్రాచీనమో దాని మీద వ్యాఖ్యానం అంత నిత్యనూతనం. మరిన్ని ఆధారాలు బయటపడుతున్నకొద్దీ చరిత్ర కొత్త వెలుగులు సంతరించుకుంటూ ఉంటుంది. అయితే ఆధారాలు ఒక్కటే సరిపోవు. చరిత్రకారుల పరిమితులు, భావజాలాలు బద్దలైనప్పుడే ఇతిహాసపు చీకటి కోణాల్లో దాగిన కథనాలు బయటకు వస్తాయి; కనుమరుగైనవి తెరమీదికి తోసుకొస్తాయి. ఈ కోవలోకి వచ్చే రచన ‘త్రికళింగ దేశ చరిత్ర’. త్రికళింగం ఒకప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా సర్వస్వతంత్రంగా వర్ధిల్లింది. బౌద్ధానికి అవసరమైన ఆర్థిక, రాజకీయ మూలాధారాన్ని అందించింది. విదేశీ వాణిజ్యానికి, నౌకా వాణిజ్యానికి అనువుగా ఉన్న ఈ తూర్పుతీరం క్రీస్తుపూర్వమే ఎగుమతి, దిగుమతులతో వైభవాన్ని చాటింది. ఆర్యుల దాడిని సమర్థంగా ఎదుర్కొంది. ఇలాంటి ఎన్నో వ్యాఖ్యానాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఎప్పటికప్పుడు చరిత్రకు సర్వసమర్థనీయ వెలుగులు అద్దేవాళ్లే కావాలిప్పుడు! ‘‘ఇతిహాసపు చీకటి కోణం / అట్టడుగున పడి కాన్పించని / కథలన్నీ కావాలిప్పుడు! / దాచేస్తే దాగని సత్యం’’ ఆ మరుగున పడి ప్రజలకు కనుమరుగైపోయిన ఆ చీకటి కోణాలలో ఒకటి ‘త్రికళింగ దేశ చరిత్ర’! ఇంతవరకూ సాధికారికంగా ఆ ప్రజా చరిత్రకు న్యాయం జరగని ఘడియలలో– తెలుగు, దక్షిణ మధ్య ద్రావిడ ముండారి ప్రజల చరిత్రకు ఇంత కాలానికి వెలువడిన సామాజిక శాస్త్రాధ్యయన వ్యాఖ్యానం ఇది. రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్త, పరిశోధకుడు ప్రొఫెసర్ కె.ఎస్. చలం కలం నుంచి వెలువడిన గ్రంథ రాజం ఇది! ఆ మాటకొస్తే సింధూనదికి అవతలి నుండి వలస వచ్చిన ఆర్యులు, సింధుకు ఈవలనున్న ద్రావిడ జాతుల, మూలవాసుల జీవనాన్ని, జీవితాలను నాశనం చేస్తున్న దశలో ఆ శత్రువులను వీరో చితంగా ఎదుర్కొని నిలబడి వర్ధిల్లిన తెలుగు ప్రాంతం ‘త్రికళింగ’ దేశమే. దాచినా దాగని ఈ చారిత్రక సత్యాన్ని తిరుగులేని అనేక ఆధారాలతో, బహుశా ఈ కోణంలో త్రికళింగ దేశ చరిత్రను వెలార్చిన మొదటి చరిత్ర కారుడు – ఆచార్య చలం. ఎప్పుడైతే మహాకవులు గురజాడ, శ్రీశ్రీలు ప్రజాచరిత్రల నిరూ పణకు సిద్ధమయ్యారో ఆనాడే స్వార్థపూరిత చీకటి కోణాల అట్టడు గున పడిపోయి కనిపించని మానవ కథల ప్రాదుర్భావ పతనాలకు కారణాల్ని బయటకు లాగారు. జీవనదుల ఆధారంగా విలసిల్లిన నాగరికతలలో సామాన్యుడి జీవనం గురించి మనసుపెట్టి శోధించడం దాని ఫలితమే. ఇంతకూ తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల గురించి, ప్రభువులెక్కిన పల్లకీల గురించి కాదు... వాటిని మోసే బోయీల గురించి చారిత్రక కోణం నుంచి వాకబు చేసుకున్నారు! తల మున్కలుగా సాగిన ఈ తవ్వులాట నుంచే సామాజిక చరిత్రలకు చోద కాలు, చోదకులు ప్రభవిల్లుతూ వచ్చారు. అలా త్రికళింగ దేశ చరిత్రకు తిరుగులేని సాక్ష్యాలను ప్రొఫెసర్ చలం ఈ పుస్తకంలో బలంగా పొందుపరిచారు. ఇంతవరకూ ‘త్రికళింగం’ స్వతంత్రమైన ఉనికి, ఉచ్ఛ స్థితిగతులు పరిశోధకుల కంటికి కానరాకపోవడానికి లేదా కంటికి ఆనకపోవడా నికి గల లోతైన ఎన్నో కారణాలను చలం మొత్తం ఆంధ్రదేశం ఉనికి ఉచ్ఛస్థితులకు కారణాలతో సహా ‘త్రికళింగ దేశ చరిత్ర’లో బలంగా నిరూపించగలిగారు. ఆర్య సంప్రదాయ వాదులైన కొందరు చరిత్ర కారుల ముసుగులో ప్రతి అవశేషాన్నీ ఉత్తరాదికి, ఆర్య సంప్రదాయా నికి ముడి పెడుతూ రావడాన్ని ప్రొఫెసర్ చలం బలంగా ఖండిం చారు. భారతదేశంలో తొలి నివాసుల ఉనికి దక్షిణ భారత ప్రాంత జనావాసాలకు ఎలా చెందినదో ఇంతకు ముందు కొంతవరకు రాళ్ల బండి సుబ్బారావు అనే చరిత్రకారుడు నిరూపించారు. ఆ తర్వాత ‘త్రికళింగం’ ఆవిర్భావం, అది ఉనికిలోకి వచ్చిన తీరుతెన్నులు, క్రీస్తు పూర్వం 3–5 శతాబ్దాల నాటి బౌద్ధం, అంతకుముందే తూర్పు కను మలలో మానవ సంచారం ఉనికిలో రూఢ్యమయింది. ఈ ‘త్రికళింగం’ చరిత్ర ఎంత ప్రాచీనమైనదంటే, ఎంతగా ఆర్యుల సాంస్కృతిక దాడులకు కూడా అందనంత ఎత్తులో ఉందంటే– ‘మూడు కళింగల’ మాట క్రీ.పూ. 3వ శతాబ్దానికే, అంటే బౌద్ధయుగం నాటికే ప్రాచుర్యంలో ఉండటం చరిత్ర రచనకు ఎంత కీలకమైనదో చలం మరోసారి సిద్ధాంతీకరించారు ఈ గ్రం«థంలో! అసలు కళింగం అన్నమాటకు చాలా విస్తృతార్థం ఉన్నదని చలం భావన. ఎందుకంటే, ‘కళింగ’ శబ్దం క్రీ.పూ. 2వ శతాబ్ది శాసనాల్లో కూడా లభించడం. మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత (క్రీ.పూ. 322), క్షత్రియులు కాని శూద్రులు (అంతకుముందు అణగార్చబడిన జాతులు) పరిపాలకులుగా గ్రీకు రాజ్యాల సరిహద్దుల నుండి దక్షిణా దిన మైసూరు దాకా విస్తరించి ఉండటం భారతదేశంలో స్థానిక తెగల, జాతుల శక్తి, సామర్థ్యాల, పాలనా సత్తా వైశిష్ట్యాన్ని నిరూపించింది! చంద్రగుప్త మౌర్యుని కాలంలో ‘కళింగం’ స్వతంత్ర దేశంగా ఉన్నందున, అందునా తూర్పున సముద్ర తీరస్థ ప్రాంతంలో ఉన్నం దున– విదేశీ వాణిజ్యానికి, నౌకా వాణిజ్యానికి, తూర్పుతీరం అను వుగా ఉండేది. వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, ఉద్యాన, అటవీ సంపద, ఎగుమతి, దిగుమతి వాణిజ్యంలో ఆర్థికంగా, రాజకీయంగా సర్వస్వతంత్రంగా కళింగం వర్ధిల్లిందని మరచిపోరాదు! ఇంతకూ అసలు విశేషమేమంటే, ఈ వాణిజ్య కార్యక్రమాలకు బౌద్ధ, జైన ధర్మ ప్రచారకులు చేదోడు, వాదోడు కావటం! ఇలాంటి పరిణామం హేతువాద వ్యతిరేక వర్గాలకు, పురాణ కల్పిత గాథలకు బద్ధ విరుద్ధం. అశోకుడిని గురించి, జాతీయ చిహ్నంగా అశోకచక్రం గురించి మనం ఎంతగా మురిసిపోతున్నా శ్రీశ్రీ అన్నట్టు కళింగ యుద్ధానంతరమే (క్రీ.పూ. 260) అశోకుడు శాంతి ప్రవచనాలు వల్లిం చాల్సి వచ్చింది. అప్పటికిగాని, జాతి ప్రజలకు జరిగిన నష్టం అతనికి తెలిసి రాలేదు! ఆ మాటకొస్తే బౌద్ధానికి అవసరమైన ఆర్థిక, రాజకీయ మూలా ధారాన్ని అందించిందీ ‘త్రికళింగ’ దేశ చరిత్రేనని మనం మరచి పోరాదు! ఆనాటి త్రికళింగ గణరాజ్యాలు ఆ యుద్ధం తర్వాత చెట్టుకొకటి పుట్టకొకటిగా చీలిపోయాయి. కనుకనే మన రాజ్యాంగం మౌలిక సూత్రాలకు అసలు ఆధారం– అశోక చక్రమే కాదు, బుద్ధుని లౌకికతత్వం, ప్రజాస్వామ్య విలువలు అలా అలా నిలిచి ఉండటం కారణమని ప్రొఫెసర్ చలం వ్యక్తం చేశారు. ‘త్రికళింగం’ వ్యాప్తి ఒక్క ఆంధ్రదేశంతోనే సరిపెట్టుకున్నది కాదు. అది ‘మూడు కళింగులు’గా ఎలా విస్తృతి చెందిందో ఈ గ్రంథంలో వివరించారు. ఈ ‘త్రికళింగం’ అటు 1) మిడ్నపూర్ దాకా ‘దామోదర నది’ని ఆనుకొని ఉన్న ప్రాంతం నుంచి సువర్ణరేఖ వరకు, 2) మహానది కుడి కాల్వ నుంచి రిషికుల్య నది దాకా, 3) బరంపురం, గంజాం మొదలు కళింగపట్నం దాకా ఉన్నదే ‘త్రికళింగం’. సంస్కృతం నడమంత్రంగా చేరి ‘మూడు కళింగల’ మాటను ‘త్రికళింగం’గా మార్చింది. అంతేకాదు ద్రావిడ భాషల ఆవిర్భావ వృద్ధి దశల వివరణలో భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ ప్రజల సామాజిక అంశాల విపులీ కరణలో, విశదీకరణలో ప్రొఫెసర్ కె. వెంకటేశ్వర్లు (ఆంధ్ర యూని వర్సిటీ), రొమిలా థాపర్ల కృషి ప్రశంసనీయం. ద్రావిడ భాషా కుటుంబంలో పెద్ద దిక్కుగా ఉండి, పెద్ద పీట వేయించుకున్నది తెలుగేనని నిరూపించిన ఘనతతో పాటు, త్రికళింగ దేశ చరిత్రను నూతన కోణం నుంచి పరిశీలించి ఇతిహాసపు చీకటికోణానికి సర్వ సమర్థనీయమైన వెలుగులు దిద్దిన ప్రొఫెసర్ చలం సదా అభినంద నీయులు! ‘పరమాణువు సంకల్పంలో ప్రభవం పొందిన మానవుడి’కి ఈ గ్రంథమే ఒక అంకితం! ఎన్నదగు లింగములు మనకెన్నిలేవు? తత్కోటిలో మూడు లింగ ముల వలన లెక్కకుంతెచ్చి ఒకడు ‘త్రిలింగ’ శబ్ద సృష్టిగావించె, దంత పుష్టికొరకు!! – ‘తెనుగు లెంక’ తుమ్మల సీతారామమూర్తి వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు వివరణ: టంగుటూరి శ్రీరామ్ రచన ‘రాజకీయ క్షేత్రంలో ఒక కేసరి’ (ఆగస్టు 23 సంచిక)లో కొన్ని పొరపాట్లు దొర్లాయి. ఆ పొరపాట్లకు రచయిత ఇచ్చిన వివరణ... ప్రకాశం చేపట్టిన కార్యక్రమాలపై ‘కేసరులకే సాధ్యం’ అని బాపూజీ అన్న ఘటన స్వరాజ్యం వచ్చిన 1947 కన్నా ముందే ఉమ్మడి మద్రాసు ప్రభుత్వ కాలంలో జరిగింది. ఇక, 1953లో ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రానికి తొలి సీఎంగా ప్రకాశం ఉన్నప్పుడు చేసిన ఖైదీల విమోచన నాటికి గాంధీ మరణించారు. గమనించగలరు. – ఎడిటర్ -
పులులకు బెబ్బులి..వెంకటగిరి చివరిరాజు
సాక్షి, వెంకటగిరి(నెల్లూరు) : వెంకటగిరి రాజుల కీర్తి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తం అనడం అతిశయోక్తి కాదు. వెంకటగిరి రాజాలు అనగానే నేటితరం వారికి పెద్దరాజాగా కీర్తి గడించిన వెలుగోటి వెంకటశేష వరదరాజ గోపాలకృష్ణ యాచేంద్ర (వీవీఆర్కే యాచేంద్ర) వెంటనే గుర్తుకు వస్తారు. వెంకటగిరి సంస్థానం 31వ తరానికి చెందిన ఆయన క్రీడలు, వ్యాపార, రాజకీయ రంగాల్లో విశిష్టతను చాటారు. వేటాడడం అంటే ఆయనకు మహా సరదా. ఆయన హయాంలో పెద్దపులులు (బెంగాల్ టైగర్స్)ను వేటాడారు. వీవీఆర్కే యాచేంద్ర 2010 జూన్ 29వ తేదీన ఆయన హైదరాబాద్ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈయన వెంకటగిరి సంస్థానం చివరి పట్టాభిషిక్తుడిగా కీర్తి గడించారు. శనివారం ఆయన 9వ వర్ధంతి సందర్భంగా కైవల్యానది వద్ద ఉన్న ఆయన కాంస్య విగ్రహం వద్ద వీవీఆర్కే యాచేంద్ర వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వెంకటగిరి ప్రాంతంలోని వెలుగొండలతోపాటు తెలంగాణ రాష్ట్రంలో సత్తుపల్లి మొదలగు ప్రాంతాల్లో అడవుల్లో ఆయన వేట సాగించేవారని ఆనాటి తరం వారు చెబుతున్నారు. ఓ చేత్తో జీప్ నడుపుతూ గన్‌తో వేటాడడంలో ఆయన దిట్ట. ఇక 1954 –1960 మధ్య ప్రాంతంలో ఆంధ్రా రంజీ ట్రోఫీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి క్రీడాకారుడిగా గుర్తింపు పొందారు. రాజకీయ రంగంలో 1967 –1973 మధ్య ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1994లో వెంకటగిరి శాసనసభ్యుడిగా అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి విజయం సాధించి గుర్తింపు సాధించారు. ఇక వెంకటగిరి పాలకేంద్రం సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసే సమయంలో ఐదు ఎకరాలు, గోషాస్పత్రి ఏర్పాటు కోసస్పైదు ఎకరాలు, సత్యసాయి వరదరాజపురంగా పిలచే మందరిల్లు ప్రాంతంలో పేదలకు నివాసాల కోసం, ఉపాధ్యాయనగర్ సమీపంలో చేనేత కార్మికుల నివాసాల కోసం వీవర్స్‌కాలనీ, ఉపాధ్యాయనగర్ను నామమాత్రం ధరకు ఉపాధ్యాయుల నివాసాల కోసం అందించి వెంకటగిరి ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన కుమారులు రాంప్రసాద్ యాచేంద్ర, డాక్టర్ వీబీ సాయికృష్ణ యాచేంద్రతోపాలు మనవడు సర్వజ్ఞకుమార యాచేంద్ర ప్రస్తుతం వెంకటగిరి వైఎస్సార్సీపీలో కీలక నేతలుగా ఉంటూ మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి సన్నిహితులుగా మెలుగుతున్నారు. -
అప్పుడలా వచ్చావే... ఇప్పుడు రావేం తండ్రీ !
‘నీ నగుమోము కనలేని...’ అని త్యాగయ్య కీర్తన చేస్తూ రాముడిని ‘రఘువరా!’ అని సంబోధించారు. అలానే ఎందుకు సంబోధించాల్సి వచ్చింది. ఇక్ష్వాకు వంశ సంభూతా.. అని కూడా పిలవవచ్చు. అలా పిలవలేదు. ఇక్ష్వాకు వంశం రఘు మహారాజు పుట్టిన తరువాత అది రఘువంశమయి పోయింది. కాళిదాసు రఘువంశ కావ్యంలో...‘‘త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మిత భాషిణాం యశసే విజగీషూణాం ప్రజాయై గృహమేధినాం..’’ అంటారు.రఘుమహారాజు అపారమైన ఐశ్వర్యాన్ని సంపాదించారట. దాచుకోవడానికి కాదు.. త్యాగాయ సంభృతార్థానాం... మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టడానికి. నీరు నిలవ ఉంటే దుర్వాసన, సన్యాసి ఒకచోట ఉండిపోతే ప్రమాదం, సంచరిస్తూ ఉండాలి. ధనం ఒకచోట ఉండిపోతే దుర్గుణాలకు ఆలవాలం అవుతుంది. అందుకే అది కదులుతూ ఉండాలి. అందుకని అది దానం చేయడానికి సంపాదించాడు. ‘సత్యాయ మిత భాషిణాం’.. ఎక్కువ మాట్లాడితే అందులో అసత్యం ఉన్న వాక్కేదైనా దొర్లుతుందేమోనని తక్కువ మాట్లాడేవారట. యశసే విజగీషూణాం–అపారమైన దండయాత్రలు చేసి సామ్రాజ్య విస్తరణ చేసింది రక్తపాతం కోసం కాదు, క్షాత్రధర్మం కనుక రాజ్య విస్తరణ చేసి కీర్తిని సంపాదించడానికట. ప్రజాయై గృహమేధినాం–గృహస్థాశ్రమం వంశాన్ని నిలబెట్టడానికి కావలసిన సంతానం కోసమేనట. ఇటువంటి సుగుణాలు కలిగిన రఘు మహారాజు వంశంలో పుట్టిన నీవు రాఘవుడివై ఆ కీర్తిని మరింత వెలిగేటట్లు చేసావు.సత్యేన లోకాన్ జయతి దీనేన్ దానేన రాఘవ: గురూన్ శుశ్రూషయా వీరో ధనుషాయుధి శాత్రవాన్–నీ గుణాలేమిటో తెలుసా రామా! సత్యేన్ లోకాన్ జయతి.. సత్యంతో లోకాలన్నింటినీ గెలిచావు, సత్యమే రామచంద్రమూర్తి పౌరుషమంటారు వాల్మీకి. దానాలతో దీనులను గెలిచావు. గురువుకు కానుకలు ఇవ్వగలిగినవాడు లేడు కనుక నీవు నీ సేవలతో వారిని గెలిచావు. కోదండం పట్టుకున్నావా శత్రువనేవాడు లేకుండా చేయగలిగిన వీరత్వం నీది. అటువంటివాడివై రఘువంశంలో కీర్తి పెంచిన రామా! లోకాలను రక్షించడం కోసం కూర్మావతారమెత్తి అంతటి క్లేశాన్ని భరించావే, (మంధర పర్వతాన్ని వీపుమీద మోస్తూ), వరాలను పొందిన రావణుని దుష్ట ప్రవర్తన అణచడం కోసం దశరథమహారాజువారి యాగస్థలిలో ప్రత్యక్షమై ఆయనను తండ్రిగా ఎంచుకుని రాముడిగా జన్మనెత్తి ఎన్నెన్ని కష్టాలకోర్చావు, ఇంద్రుడి అహంకారాన్ని అణచడానికి శ్రీ కృష్ణుడిగా గోవర్థన పర్వతాన్ని ఏడురోజులు ఎత్తి పట్టుకుని గోవిందుడివై లోకాల్ని రక్షించావే....ఇన్ని చేసావు కదా... నేనవేవీ అడగలేదు కదా స్వామీ, నేనడిగినదేమిటి... నగుమోము కనలేని నాదుజాలీ తెలిసీ... ఒక్కసారి కనపడమని అడిగాను. కనపడితే నేనేమయినా అడుగుతాననుకుంటున్నావా... అలా అడిగేవాడిని కానే... అప్పుడు అన్నిసార్లు వచ్చిన వాడివి... ఇప్పుడు రాలేదంటే ఏమనుకోవాలి... నీ చుట్టూ ఉన్న వాళ్ళెవరయినా నా దగ్గరికి రాకుండా అడ్డుకుంటున్నారా... నీవారోజున గజేంద్రుడిని రక్షించడానికి ఆగమేఘాలమీద పరుగెడుతుంటే.. వారెవరూ నిన్ను ఆపలేదు కదా... అందువల్ల వారలా ఆపేవారు కూడా కాదు.. పైగా సంతోషంగా నీవెంట వచ్చేవాళ్ళే కదా... అయినా నా కోరికేమిటి? ఒక్కసారి ఆ సీతమ్మ తల్లితో కలిసి కోదండం చేతపట్టుకుని, లక్ష్మణుడు పక్కన నిలబడితే, హనుమ నీ పాదాల వద్ద కూర్చుని సేవిస్తుంటే... చిరునవ్వు నవ్వుతూ సంతోషంగా నావంక చూస్తే.. నీ దివ్యమంగళ స్వరూపాన్ని కన్నులతో తనివితీరా తాగేసి ఆ ఆనందం పట్టలేక నేను నువ్వయిపోయి నేను నీలో కలిసిపోవాలి. అందుకని నా ఆర్తిని గమనించి రావేం తండ్రీ... అని వేడుకుంటున్నాడు. గీతం, సంగీతం, ఆర్తి, భక్తి...అన్నీ కలిసిపోయిన దృశ్య ఆవిష్కరణ అది. -
రాహుల్‌పై స్మృతి ఇరానీ వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలను ఉద్దేశించి.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు నవభారత నిర్మాణానికి కృషి చేస్తోందని, ఈ నవభారతంలో వారసత్వం కన్నా ప్రతిభకే పెద్దపీట వేస్తామని, ప్రతిభా ఆధారంగానే ప్రతి ఒక్కరికీ అవకాశాలు లభిస్తాయని అన్నారు. 'ఇండియా టుడే మైండ్ రాక్స్-2017' కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 'ఢిల్లీలో తమ కుటుంబాల కోసం కష్టపడి పనిచేసేవారికి ఎప్పుడూ ఓ బెరుకు ఉంటుంది. ఎవరో ఒకరు వచ్చి 'మా నాన్న ఎవరో మీకు తెలుసు కదా' అని అడుగుతారని.. ప్రతిభ ఆధారంగా కాకుండా వారసత్వం ఆధారంగా అవకాశాలు తన్నుకుపోతారని భయం ఉంటుంది. కానీ, మోదీ నవభారతంలో ఇలా చెప్తే కుదరదు' అని స్మృతి ఇరానీ తెలిపారు. 'కలలు కనే సాహసం, ప్రతిభా ఆధారంగా వాటిని సాధించుకొనే తెగువ ఉన్నవారిదే ఈ నవభారతం' అని ఆమె వివరించారు. రాజకీయాల్లోకి రావాలన్న ఇష్టమున్న యువత ఎవరైనా ఈ రంగాన్ని ఎంచుకోవచ్చా? లేక రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నవారే రావాలా? అన్న వ్యాఖ్యాత ప్రశ్నకు ఆమె ఈ విధంగా బదులిచ్చారు.