Boardroom
-
రాణివాసం కన్నా... సమాజమే మిన్న...
భంజ్ యువరాణులు మృణాళిక, అక్షితలు రాజవంశంలో పుట్టినా సాధారణ యువతుల్లాగే భిన్న రంగాల్లో తమను తాము నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరిద్దరూ ఫిక్కీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే... మా ప్యాలెస్...టూరిస్ట్ ప్లేస్‌గా... మా జిల్లా గురించి గొప్పగా చెప్పుకోలేని పరిస్థితే మా ప్రాంతాన్ని తీర్చిదిద్దే వైపు మమ్మల్ని పురికొల్పింది. అందులో భాగంగా స్థానికుల్ని స్వయం ఉపాధి దిశగా నడిపించడం, స్థానిక హస్తకళలకు చేయూత అందించడం.. వంటివి చేశాం. మా హస్తకళల బ్రాండ్ హసా అటెలియర్ సబాయి గడ్డితో చేసిన సంచుల విక్రయాలకు పేరు. వీటిని తరచు డోక్రాతో (ఒడిశాలోని గిరిజనులు చేసే ఓ రకమైన మెటల్‌వర్క్) జత చేసి విక్రయిస్తాం. ఇలా స్థానికులకు ఉపాధితో పాటు స్థానిక కళలకు కూడా ఖ్యాతి దక్కుతోంది. అదే క్రమంలో 20 ఎకరాల్లో ఉన్న మా ప్యాలెస్‌ను 11 గదుల బోటిక్ హోటల్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాం. మా ఇంటిని టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దే క్రమంలో మా తండ్రిగారిని ఒప్పించి ఆయన సూచనలు, సహకారంతో ఒక్క ఇటుక కూడా కొత్తగా జోడించకుండా, చారిత్రక ఆనవాళ్లేమీ చెరిగిపోకుండానే ప్యాలెస్‌ను ఆ«ధునికంగా తీర్చిదిద్దాం. మేం దీనిని ప్రారంభించిన కొద్దికాలానికే కోవిడ్ వచ్చింది. అయితే కోవిడ్ అనంతరం ప్రారంభమైన రివెంజ్ ట్రావెల్... మాకు అనూహ్యమైన ప్రోత్సాహాన్నిచ్చింది. మా జిల్లాకు ఒక మారుమూల అటవీ ప్రాంతంగా కాకుండా ఓ మంచి పర్యాటక కేంద్రంగా గుర్తింపు వచ్చింది. అయితే ఈ పయనం మాకెన్నో మెలకువలు, పాఠాలూ నేర్పింది. హైదరాబాద్‌లో ఫలక్‌నుమా ప్యాలెస్ ఉంది, రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్ ప్యాలెస్ ఉంది... మరి మయూర్భంజ్లోని మా ప్యాలెస్‌కే ఎందుకు రావాలి.. అనే ప్రశ్నకు సమాధాన గా మేం మా చరిత్రను కథగా మలచి అతిథులకు పంచుతున్నాం. ప్రత్యేకంగా వికలాంగులకు అనుకూలమైన మరో రెండు గదులను ఇటీవలే జోడించాం. ప్రతి అడుగూ చరిత్రకు అద్దం పట్టేలా తీర్చిదిద్దాం’’ అంటూ తమ విజయగాథను పంచుకున్నారు.. ఇదేకాదు.. ఒకరు యోగా టీచర్‌గా రాణిస్తుంటే మరొకరు రచయిత్రిగా... ఇలా భిన్న రంగాల్లో తమను తాము నిరూపించుకుంటున్నారు ఈ యువరాణులు. మా ప్రాంతానికి ‘కళ’తేవాలని... మా కుటుంబానికి దాదాపు 1000 సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉంది. అయితే ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్న 200 ఏళ్ల నాటి పూర్వీకుల ఇల్లు బెల్గాడియా ప్యాలెస్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం దగ్గర నుంచి చేసిన ప్రతి పనీ మేం రాజకుటుంబ వారసత్వం అనే పరదాల నుంచి బయటకు వచ్చి చేసినవే. అంతర్జాతీయ కళాకారులను ఆహ్వానిస్తూ మయూర్భంజ్ ఆర్ట్స్ – కల్చర్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నాం. మా ప్యాలెస్‌ని ఆర్టిస్ట్ రెసిడెన్సీగా మార్చాం. –మృణాళిక, అక్షిత – సాక్షి హైదరాబాద్ సిటీ బ్యూరో ఫొటో: మోహనాచారి -
మిస్త్రీ తొలగింపు వెనుక షాకింగ్ మిస్టరీ!
బోర్డు సమావేశంలో తీవ్ర గందరగోళం చెప్పపెట్టకుండా తొలగించిన టాటా గ్రూప్ కారణమిదే అంటున్న ఇన్సైడర్లు దేశ కార్పొరేట్ రంగాన్ని ఒక కుదుపు కుదిపిన సంఘటన.. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి సైరస్ పల్లోంజీ మిస్త్రీని తొలగించడం.. వందల బిలియన్ డాలర్లకుపైగా విలువైన టాటా గ్రూప్‌నకు సారథిగా వచ్చిన మిస్త్రీని... నిండా నాలుగేళ్లు కూడా కొనసాగకముందే సాగనంపారు. దేశ పారిశ్రామిక వర్గాల్ని తీవ్ర షాక్‌కు గురిచేసిన ఈ ఘటనకు అసలు కారణం ఏమిటి? సైరస్ మిస్త్రీని ఉన్నపళంగా అర్ధంతరంగా, అత్యంత అగౌరవమైనరీతిలో ఎందుకు తొలగించారు. మిస్త్రీని తొలగించడానికి కారణమైన సోమవారం నాటి బోర్డ్ మీటింగ్‌లో ఏం జరిగింది? ఈ ఘటనకు సంబంధించి అత్యంత ఆసక్తికరమైన వివరాల్ని ఒక జాతీయ మీడియా చానెల్ తన ఎక్స్‌క్లూజివ్ కథనంలో వివరించింది. ఆ వివరాలివి.. సాధారణంగా టాటా సన్స్ బోర్డ్ సమావేశాలు ప్రశాంతంగా ఒకింత ఊహించేరీతిలోనే జరుగుతాయి. కానీ సోమవారం నాటి భేటీ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరిగింది. ఈ భేటీలోనే సైరస్ మిస్త్రీని ఉన్నపళంగా తొలగించాలన్న షాకింగ్ నిర్ణయాన్ని తీసుకొన్నారు. ఈ ఘటన గురించి విశ్వసనీయంగా తెలిసిన ఇద్దరు కంపెనీ ఇన్సైడర్లు (ఒకరు ఈ బోర్డు మీటింగ్‌లో పాల్గొన్నారు కూడా) అసలు ఏం జరిగిందో వివరించారు. మిస్త్రీ ఉద్వాసన నిర్ణయం ప్రకటించడంతో ఒక్కసారిగా బోర్డు మీటింగ్‌లో గందరగోళంతోపాటు అసాధారణ దృశ్యాలు కనిపించాయని వారు వివరించారు. కావాలనే బోర్డు ఎజెండాలో మిస్త్రీ ఉద్వాసన అంశాన్ని చేర్చలేదని తెలుస్తోంది. ఇతరత్రా కేటగిరీలో భాగంగా బోర్డు భేటీ ముందుకు వచ్చే అదనపు అంశంగా దీనిని చేపట్టినట్టు ఒక ఇన్సైడర్ తెలిపారు. (టాటా తదుపరి చైర్మన్ ఎవరు..?) తన తొలగింపు అంశం చర్చకు రావడంతో షాక్ తిన్న మిస్త్రీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇది అక్రమమని మండిపడ్డారు. టాటా నిబంధనల పుస్తకం ప్రకారం కనీసం 15రోజుల ముందైనా నోటీసు ఇచ్చిన తర్వాత బోర్డు ఎదుట దీనిపై చర్చించాలని, అప్పుడు తన వాదన వినిపించుకొనేందుకు అవకాశముంటుందని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. అయితే, తాము ముందే "న్యాయసలహా' తీసుకున్నట్టు బోర్డు ఆయనకు స్పష్టం చేసింది. ఆ న్యాయసలహా తనకు చూపించాల్సిందిగా మిస్త్రీ డిమాండ్ చేయగా.. ఇదేమీ కోర్టు హియరింగ్ కాదంటూ తోసిపుచ్చింది. బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేయాలని మిస్త్రీ నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నంలోపు ఆయన బొంబాయి హైకోర్టును ఆశ్రయించనున్నారు. టాటా సన్స్ బోర్డులో మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉండగా.. అందులో ఆరుగురు మిస్త్రీ ఉద్వాసనకు మద్దతు పలికారు. ఇద్దరు గైర్హాజరయ్యారు. తొమ్మిదో సభ్యుడైన మిస్త్రీ ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు నిరాకరించారు. అయితే, టాటా బోర్డు సభ్యుడిగా, డైరెక్టర్‌గా ఆయన కొనసాగనున్నారు. సైరస్ మిస్త్రీ ఉద్వాసనకు కారణం ఏమిటన్న దానిపైనా ఇన్సైడర్లు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. మిస్త్రీపై టాటా బోర్డుకు వ్యక్తిగత కోపం ఏమీ లేదని, కేవలం సీఈవోగా ఆయన పనితీరు నచ్చకపోవడం వల్లే ఇలా అర్థంతరంగా తొలగించారని చెప్తున్నారు. టాటా గ్రూప్‌లోని ఎన్నో కంపెనీలు ఉండగా మిస్త్రీ సారథ్యంలో కేవలం రెండు కంపెనీలు మాత్రమే లాభాల్లో ఉన్నాయని, మిగతా కంపెనీలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయని వారు తెలిపారు. టాటా గ్రూప్ సంప్రదాయ మర్యాదలు పాటించడం కంటే.. అంతర్జాతీయ పద్ధతి అయిన ఒక్కవేటుతో మిస్త్రీని తొలగించడానికి బోర్డు మొగ్గు చూపిందని మరో ఇన్సైడర్ వివరించారు.