కొండలు పగిలేంత ఎండ కోరలు చాచి భయపెడుతుంది. రాక్షస దుమ్ము మేఘం ఒకటి ఊపిరిలోకి రావడానికి దూసుకొస్తుంది. అయినా తప్పదు...పని చేయాల్సిందే. ఈ ఎండలో బిడ్డను బయటికి తీసుకురావడం ఏమంత మంచిది కాదు. ఎండమ్మా కాస్త కరుణ చూపు... నా బిడ్డ ముఖం చూసైనా! కానీ ఎండ తగ్గేలా లేదు. అయినా తప్పదు... పని చేయాల్పిందే.
పచ్చని చెట్టుకు కట్టిన ఉయ్యాలలో బిడ్డను పడుకోబెట్టి ఊపుతుంటే, ఆ కేరింతలను చూసి ఎన్ని సంవత్సరాలైనా సంతోషంగా బతకవచ్చు. కానీ బతుకుపోరు తనను బజార్‌కు తీసుకువచ్చింది. ఎండైనా, వానైనా పని తప్పదు.
పనికి వెళుతున్నప్పుడు బిడ్డను ఇంట్లో వదిలి వెళ్లాలి కదా.
ఇంట్లో ఎవరు ఉన్నారని!
పెనిమిటి తనలాగే పనికి పోయాడు. పక్కింటివాళ్లకు అప్పగించాలనుకుంటే వారు ఇంట్లో ఉండరు. తనలాగే పనికోసం వెళ్తారు. అందుకే... పనికి వెళ్లక తప్పదు. వెళుతూ వెళుతూ బిడ్డను తీసుకువెళ్లక తప్పదు.
ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో మున్సిపాలిటీ ఉద్యోగి ఒకరు బిడ్డను కొంగుకు కట్టుకొని రోడ్లు ఊడుస్తున్న వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
ఒక చిత్రం వంద పదాల పెట్టు అంటారు. ఇప్పుడు ఆ వరుసలో లఘుచిత్రాన్ని కూడా చేర్చవచ్చు. శ్రమైకజీవన సౌందర్యం నుంచి వర్కింగ్ వుమెన్ పర్సనల్ చాయిస్ వరకు నెటిజనులు ఈ
వీడియో చిత్రం నేపథ్యంగా తమ మనసులోని భావాలను ప్రకటించుకున్నారు.
‘ఇదేనా మహిళా సంక్షేమం అంటే!’ అని ఒకరు వ్యంగ్యబాణం విసిరితే, ‘ఇలాంటి వృత్తి నిబద్ధత ఉన్న మహిళలు ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తారు. దేశం ముందడుగు వేయడానికి ఇలాంటి ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉంది’ అంటూ స్పందిస్తారు మరొకరు.
‘ఈ అమ్మలో మా అమ్మను చూసుకున్నాను’ అని ఒకరు కన్నీరు కార్చితే, మరొకరు ‘ఇది పట్టణ దృశ్యం. ఇక మాలాంటి పల్లెల్లో పొలం పనులకు బిడ్డతో వచ్చే తల్లులు ఉన్నారు. చెట్టుకు జోలె కట్టి బిడ్డను అందులో పడుకోబెట్టి పొలం పనులు చేస్తుంటారు. ఆ తల్లి మనసంతా బిడ్డ మీదే ఉంటుంది!’ అని జ్ఞాపకాల్లోకి వెళతారు ఒకరు.
‘మా ఊళ్లో ఒక అమ్మ తన బిడ్డను చెట్టు కింద కూర్చోబెట్టి కూలీపనులు చేసుకుంటుంది. నీళ్లు తాగడం కోసం పొలం దాటి బయటికి వచ్చిన ఆమె బిడ్డను చూసిపోదామని వచ్చేసరికి కాస్త దూరంలో పాము కనిపించి పెద్దగా అరిచి బిడ్డను అక్కడి నుంచి తీసుకొని పరుగెత్తింది. ఈ సంఘటన గురించి ఇప్పటికీ మా ఊళ్లో చెప్పుకుంటారు’ భావోద్వేగాల సంగతి సరే, మంచి సూచనలు ఇచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాటిలో ఒకటి...
‘పేదవాళ్లకు కేర్‌టేకర్లను ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థోమత ఉండదు. దేశంలో రకరకాల స్వచ్ఛందసంస్థల గురించి విని ఉన్నాం. పేద ఉద్యోగులు ఉద్యోగానికి లేదా పనికి వెళితే వారి పిల్లలను చూసుకునే స్వచ్ఛందసంస్థలు కూడా వస్తే మంచిది. ఈ దిశగా ఎవరైనా ఆలోచించాలి’.
సామాజిక మాధ్యమాల్లో ‘వైరల్’ అనేది కొత్త కాదు. అయితే ఒక మంచి కారణంతో చర్చల్లో ఉండే వీడియోలు అరుదుగా ఉంటాయి. అలాంటి వాటిలో ఇది ఒకటి.
వైరల్.. అమ్మ నీకు దండమే...
Published Fri, Jun 3 2022 12:14 AM | Last Updated on Thu, Jul 28 2022 1:34 PM
Comments
Please login to add a commentAdd a comment