రాంచీ: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంచీలో(జార్ఖండ్) శనివారం జరిగిన ఒక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మీడియాలో డిబేట్ల పేరిట జరుగుతున్న ‘అతి’ విచారణలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే.. న్యాయవ్యవస్థ పాత్ర, న్యాయమూర్తుల ముందున్న సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మీడియా తమ టీవీ డిబెట్లతో కంగారు కోర్టులుగా(సరైన ఆధారాలు.. వాదప్రతివాదనలు లేని అనధికార న్యాయస్థానాలు) వ్యవహరిస్తున్నాయని, సోషల్ మీడియా కూడా అదే రీతిలో వ్యవహరిస్తూ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్ల ప్రవర్తన పక్షపాతం, అవగాహనలేమితో కూడిన సమాచారం, ప్రత్యేకించి ఒక ఎజెండా-ఆధారితంగా ఉంటోంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా..
► సోషల్ మీడియాలో జడ్జిలకు వ్యతిరేకంగా క్యాంపెయిన్‌లు చేస్తున్నారు. జడ్జిలు వాటికి అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం లేదు. దయచేసి దీనిని బలహీనతనో లేదంటే నిస్సహాయత అని పొరబడకండి అని న్యాయమూర్తులకు జస్టిస్ రమణ సూచించారు.
► ఈరోజుల్లో మీడియా టూల్స్ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాయి. కానీ, వాస్తవం ఏదో, ఏది మంచో, ఏది సరైందో నిర్ధారించలేకపోతున్నాయి. మీడియా విచారణలు.. కేసుల్లో మార్గనిర్దేశం చేయలేవు. అలాగే మీడియా ఛానెళ్లు ‘కంగారు కోర్టు’లను నడిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో.. కొన్నిసార్లు అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా సమస్యలపై నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉంటోంది.
► న్యాయం పంపిణీకి సంబంధించిన సమస్యలపై.. అవగాహన లేని, అజెండాతో కూడిన నడిచే చర్చలు ప్రజాస్వామ్య ఆరోగ్యానికి హానికరం.
► మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న పక్షపాత అభిప్రాయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. వ్యవస్థకు హాని కలిగిస్తున్నాయి. ఈ ప్రక్రియలో.. న్యాయ పంపిణీ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది.
► మీ బాధ్యతను(మీడియాను ఉద్దేశించి..) అతిక్రమించడం ద్వారా మీరు మన ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి తీసుకెళ్తున్నారు
► ప్రింట్ మీడియాకు ఇప్పటికీ కొంత స్థాయిలో జవాబుదారీతనం పని చేస్తోంది.
► ఎలక్ట్రానిక్ మీడియాకు మాత్రం జవాబుదారీతనం శూన్యంగా ఉంటోంది. ఇక సోషల్ మీడియా చాలా అధ్వాన్నంగా ఉంటోంది.
► దీనికి పరిష్కారం.. మీడియా స్వీయ నియంత్రణ పాటించడమే. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేను కోరుతున్నా. ప్రజలకు అవగాహన కల్పించడానికి, దేశాన్ని ఉత్తేజపరిచేందుకు ఎలక్ట్రానిక్ మీడియా తమ గొంతుకను ఉపయోగించాలి
► జడ్జిల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ప్రజాప్రతి నిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు అధికారులు.. ఇలా రిటైర్‌మెంట్ తర్వాత సున్నిత అంశాలతో ముడిపడిన వ్యక్తులకు రక్షణ ఇస్తోంది మన దేశం. కానీ, న్యాయమూర్తుల విషయంలోనే అది జరగడం లేదు.
► కొన్ని దశాబ్దాల క్రితం వరకు.. న్యాయమూర్తి అంటే కోర్టుల ముందు పార్టీల మధ్య వివాదాల పరిష్కారానికి మాత్రమే పరిమితం అనే అంచనాలు జనాలకు ఉండేవి. ఇప్పుడు, సమాజంలో ఆలోచించదగిన ప్రతి సమస్య న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కరించబడుతుందని భావిస్తున్నారు.
► న్యాయం అమలు చేయడానికి, న్యాయమూర్తులు సామాజిక వాస్తవాల గురించి తెలుసుకోవాలి. సామాజిక ఏకాంతంగా పరిమితం కాకూడదు. నిష్పాక్షికత మరియు స్వతంత్రత అనేది మానసిక స్థితి అని మనం అర్థం చేసుకోవాలి.
► న్యాయమూర్తులంటే.. పది గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లిపోతారు. సెలవుల్ని ఆస్వాదిస్తారు.. వాళ్లు వాళ్ల వాళ్ల జీవితాల్లో కంఫర్ట్‌గా ఉన్నారు అనేది ఒక దురభిప్రాయం మాత్రమే. అదంతా వాస్తవం కాదు.
► ఈరోజుల్లో.. న్యాయం అందించడం అంత తేలికైన బాధ్యత కాదు. ఇది రోజురోజుకూ సవాలుగా మారుతోంది. కొన్నిసార్లు, మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏకీకృత ప్రచారాలు కూడా జరుగుతాయి
► సామాజిక వాస్తవాల విషయంలో న్యాయమూర్తులు.. చూసిచూడనట్లుగా, గుడ్డిగా వ్యవహరించకూడదు. వ్యవస్థను కాపాడటానికి నొక్కి చెప్పడానికి సిద్ధంగా ఉండాలి.
► ఈ క్రమంలో.. రాజకీయాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో చేరాలనుకున్నా. విధి వేరే దారి చూపించింది. న్యాయమూర్తి అయినందుకు బాధపడడం లేదని సీజే ఎన్వీ రమణ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment