ప్రయాగ్‌రాజ్/న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ తన చావును ముందే ఊహించినట్లున్నాడు. అందుకే రెండు వారాల ముందే ఓ లేఖ రాసి సీల్డ్ కవర్‌లో భద్రంగా దాచిపెట్టాడు. తాను చనిపోతే దాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి(సీజేఐ), యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అందజేయాలని కోరాడు. ఈ విషయాన్ని అతీక్ న్యాయవాది విజయ్ మిశ్రా మంగళవారం వెల్లడించారు. ‘‘అందులో ఏముందో నాకు తెలియదు. అతీక్ కోరిక మేరకు సీల్డ్ కవర్‌లో సీజేఐకి, సీఎంకు పంపుతా’’ అని చెప్పారు.
హత్యపై సుప్రీంకోర్టులో 24న విచారణ
అతీక్ సోదరుల హత్యోదంతంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ‘‘దీన్ని అత్యవసరంగా విచారణకు స్వీకరించండి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సాగేలా చూడండి. 2017 నుంచి యూపీలో జరిగిన 183 పోలీస్ ఎన్‌కౌంటర్‌లపై ఎంక్వైరీకి ఆదేశించండి’’ అని న్యాయవాది విశాల్ తివారీ మంగళవారం సుప్రీంకోర్టును కోరారు.
దీనిపై ఏప్రిల్ 24న విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. యోగి పాలనలో ఆరేళ్లలో ఎన్‌కౌంటర్లలో 183 మంది నేరగాళ్లు హతమయ్యారని యూపీ స్పెషల్ డీజీపీ (శాంతిభద్రతలు) ప్రకటించడం తెల్సిందే. మరోవైపు, ప్రయాగ్‌రాజ్‌లో అతీక్ లాయర్‌నని చెప్పుకుంటున్న దయాశంకర్ మిశ్రా నివాసం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు బాంబు విసిరారు. ఎవరికీ హాని జరగలేదు.
ఇక ఏ మాఫియా బెదిరించలేదు: యోగి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇకపై ఎలాంటి మాఫియా కూడా బెదిరింపులకు పాల్పడబోదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అతీక్ సోదరుల హత్య నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంగళవారం లక్నో, హర్దోయీ జిల్లాల్లో టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటుపై కేంద్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా యోగి మాట్లాడారు.
‘‘గతంలో రాష్ట్రాన్ని మాఫియా, నేరగాళ్లు కష్టాలపాలు జేశారు. ఇప్పుడు వాళ్లే కష్టాలు పడుతున్నారు’’ అన్నారు. ‘సమాజ్‌వాదీ పార్టీ హయాంలో 2012–2017 మధ్య రాష్ట్రంలో 700 అల్లర్ల ఘటనలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు బీఎస్పీ హయాంలో 364కు పైగా జరిగాయి. మా ప్రభుత్వం వచ్చాక 2017 నుంచి ఒక్క అల్లర్ల ఘటన లేదు. కర్ఫ్యూ లేదు. పరిశ్రమలు, వ్యాపారాలకు అనువైన వాతావరణం నెలకొంది. పెట్టుబడిదారుల భద్రత మా బాధ్యత’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment