Atiq Ahmed
-
గ్యాంగ్‌స్ట్‌ర్ అతిక్ అహ్మద్ ఆస్తి యూపీ ప్రభుత్వానికి బదిలీ
లక్నో: గ్యాంగ్‌స్ట్‌ర్, పొలిటికల్ లీడర్ అతిక్ అహ్మద్ గతేడాది హత్యకు గురయ్యారు. తాజాగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అతిక్ సంబంధించి ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న రూ. 50 కోట్ల విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకుంది. ప్రయాగ్‌రాజ్ కోర్టు అతిక్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించినట్లు ప్రయాగ్‌రాజ్ జిల్లా ప్రభుత్వ న్యాయవాది( క్రిమినల్) గులాబ్ చంద్రఅగ్రహారి తెలిపారు.2.377 హెక్టార్ల భూమిని అతిక్ నేరకార్యకలాపాల ద్వారా సంపాధించినట్లు తెలిపారు. అయితే ఈ భూమి హుబాలాల్ అనే వ్యక్తి పేరు మీద ఉందని చెప్పారు. ఈ భూమిని పోలీసులు 2023 నవంబర్‌లో సీజ్ చేశారు. గ్యాంగ్‌స్టర్ చట్టంలోని సెక్షన్ 14(1)కింద పోలీసులు ఈ భూమిని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఈ భూమికి సంబంధించి యజమాని ఎవరనేదానిపై ఎటువంటి ఆధారాలు లేవని తెలిపారు. దీంతో పోలీసు కమిషనర్ కోర్టు ఈ కేసు ప్రయాగ్‌రాజ్ కోర్టుకు బదిలీ చేసింది. దీంతో బుధవారం జడ్జి వినోద్ చౌరాసియా పోలీసు కమిషనర్ కోర్టు తీర్పును సమర్థిస్తూ.. అతిక్ ఆస్తులను ఉత్తరపదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోలని ఆదేశించారు.అతిక్, అతని సోదరుడు అష్రాఫ్ సుమారు వందకుపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అదీకాక ఉమేష్ పాల్ హత్యకేసుతో ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ అతిక్, అతని సోదరుడు అష్రాఫ్ హత్యకు గురయ్యారు. జర్నలిస్టులుగా నటిస్తూ దుండగులు అత్యంత సమీపంగా జరిపిన కాల్పుల్లో మృతిచెందారు. -
ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ అరెస్టు..
లక్నో: ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ విజయ్ మిశ్రాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. బీఎస్పీ శాసన సభ్యుడు రాజు పాల్ హత్య కేసులో ఉమేశ్ ప్రధాన సాక్షిగా ఉన్నాడు. అయితే.. ఉమేశ్‌ను అతీక్ అహ్మద్ కుమారుడు మరికొందరితో కలిసి హత్య చేశారు. ఈ వ్యవహారంలో ఉమేశ్ పాల్ లొకేషన్‌ను లాయర్ విజయ్ షేర్ చేసినట్లు గుర్తించారు. శనివారం రాత్రి లక్నోలోని తాజ్ హోటల్ బయట అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉమేశ్ హత్య సంబంధిత వీడియోలు ఉత్తరప్రదేశ్‌లో గతంలో వైరల్ అయ్యాయి. దుండగులు ఉమేశ్ ఇంటి వద్దే దాడి చేసి హత్య చేశారు. ఈ హత్యపై అప్పట్లో యూపీ అసెంబ్లీలో దుమారం రేగింది. ఉత్తరప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్‌పై దేశవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనల అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో మాఫియాను అంతం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. తదనంతర కాలంలో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతని కుమారుడు ఎన్కౌంటర్లో హత్యకు గురయ్యారు. ఉమేశ్ హత్య కేసులో అతీక్ భార్య పర్వీన్ కూడా నిందితురాలుగా ఉన్నారు. 2019లో తాను జైలులో ఉన్నప్పుడే హత్యకు కుట్ర పన్నినట్లు అతీక్ గతంలో వాంగ్మూలాన్ని ఇచ్చాడు. జైలులో ఉన్నప్పుడే పర్వీన్ సందర్శించి ఫోన్‌ను ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఆ ఫోన్‌తోనే ఉమేశ్ హత్యకు కుట్ర జరిగిందని వెల్లడించాడు. ప్రస్తుతం పర్వీన్ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇదీ చదవండి: కేరళలో అమానుషం.. ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసి హత్య.. -
మాఫియా స్థలాల్లో పేదవారికి ఇళ్ళు.. దటీజ్ యోగి..
లక్నో: ఇటీవల హత్య చేయబడ్డ యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కబ్జా చేసిన స్థలాన్ని హస్తగతం చేసుకుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద 76 ఫ్లాట్లను నిర్మించి పేదలకు అందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. యూపీ గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కబ్జా చేసిన స్థానాలను తిరిగి గవర్నమెంట్ పరం చేసిన యూపీ ముఖ్యమంత్రి ఆ స్థలాల్లో పేదలకు ఇళ్ళు కట్టిస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద మొత్తం 76 ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేశారు. ఈ సందర్బంగా ఉప ముఖ్యమంత్రి కేశవ్ మౌర్యతో కలిసి సందర్శించిన యోగి నిర్మాణాన్ని పరిశీలించి ఆ ఫ్లాట్ల తాళాలను లాటరీ పద్దతిలో ఎంపిక చేసిన లబ్దిదారులకు అందజేశారు. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 41 చదరపు మీటర్లు ఉన్న ఈ ఫ్లాట్ల కోసం 6000 మంది దరఖాస్తు చేసుకోగా అర్హులైన 1590 మందిని మాత్రమే లాటరీకి ఎంపిక చేశారు. ఈ సందర్బంగా యోగి మాట్లాడుతూ... 2017కు ముందు భూబకాసురులు ఇష్టానుసారంగా భూములను కబ్జా చేస్తుంటే నిర్భాగ్యులైన పేదవారు అలా చూస్తుండడం తప్ప ఏమీ చేయలేకపోయేవారని అన్నారు. అలాంటి ల్యాండ్ మాఫియాను అణచి అదే స్థలాలలో పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వడం కంటే గొప్ప విజయం మరొకటి లేదని అన్నారు. మొత్తానికి దోపిడీదారులు, అక్రమార్కుల ఆటలు కట్టించి దగాపడ్డ వారికి న్యాయం చేస్తూ యూపీ సీఎం యోగి అభినవ రాబిన్ హుడ్ అనిపించుకుంటున్నారు. #Prayagraj | Uttar Pradesh CM #YogiAdityanath interacts with children at the site of the flats that will be handed over to the poor shortly. The flats have been built on land confiscated from slain gangster-turned-politician #AtiqAhmed, in Prayagraj (via ANI) pic.twitter.com/1ZOeSrh3Ho — Hindustan Times (@htTweets) June 30, 2023 -
ఇది యోగి మార్క్.. గ్యాంగ్‌స్టర్ భూమిలో పేదల కోసం ఇళ్లు
ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ గత ఏప్రిల్‌లో హత్యకు గురైన విషయం విదితమే. కాగా ప్రభుత్వం అతని నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఈ ఇళ్లను లాటరీ ద్వారా అర్హులకు కేటాయించారు. ప్రయాగ్‌రాజ్: గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నేతగా ఎదిగిన అతీక్ అహ్మద్ నుంచి స్వాధీనం చేసుకున్న భూమిలో పేదల కోసం నిర్మించిన 76 ఫ్లాట్ల కేటాయింపునకు సంబంధించి లాటరీ తీశారు. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగింది. ఈ లాటరీలో ఎన్నికైనవారికి ఫ్లాట్లను అప్పగించనున్నారు. ప్రయాగ్‌రాజ్ డెవలప్మెంట్ ఆథారిటీ(పీడీఏ) ఉపాధ్యక్షుడు అరవింద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ అలహాబాద్ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన హాలులో పేదలకు ఫ్లాట్లను కేటాయించేందుకు లాటరీ తీశామన్నారు. మొత్తం దరఖాస్తు చేసుకున్న 6,030 మందిలో నుంచి 1590 మందిని లాటరీలో పాల్గొనేందుకు అర్హులుగా గుర్తించామన్నారు. లబ్ధిదారులకు 41 స్క్వేర్ మీటర్లలో నిర్మితమైన ఫ్లాట్ రూ. 3 లక్షల 50 వేలకు అందజేయనున్నామన్నారు. 2021లో శంకుస్థాపన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రెండు గదులు కలిగిన ఈ ఫ్లాట్‌లో ఒక వంటగది, టాయిలెట్ ఉంటుందన్నారు. ఈ ఫ్లాట్ ఖరీదు రూ. 6 లక్షల రూపాయలని తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌లోని లూకర్‌గంజ్ పరిధిలోని అతీక్ నుంచి స్వాధీనం చేసుకున్న 1731 స్క్యేర్ మీటర్ల భూమిలో సరసమైన గృహ నిర్మాణ ప్రాజెక్టుకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021 డిసెంబరు 26న శంకుస్థాపన చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై)కింద ఈ ప్రాజెక్టు చేపట్టింది. చదవండి: మహారాష్ట్ర రాజకీయంలో కలకలం UP: Flats built on land confiscated from slain gangster Atiq Ahmed allotted to poor in Prayagraj Read @ANI Story | https://t.co/VwutaCV8NN#Prayagraj #atiqahmad #UttarPradesh pic.twitter.com/y0fCo4mhGn — ANI Digital (@ani_digital) June 9, 2023 ముఖ్యమంత్రి యోగి చేతుల మీదుగా.. ఈ ప్రాంతంలో రెండు బ్లాకులుగా మొత్తం 76 ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం పూర్తయ్యాక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అర్హులైన పేదలకు ఈ ఇళ్లను అప్పగించనున్నారు. అతీక్ అహ్మద్ 2005లో జరిగిన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజూపాల్ హత్య, ఈ కేసులో ప్రత్యక్ష్య సాక్షి ఉమేష్ పాల్ హత్య కేసులలో ప్రధాన నిందితుడు. కాగా అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను ఈ ఏడాది ఏప్రిల్ 15న రాత్రి విలేకరుల రూపంలో వచ్చిన ఆగంతకులు తుపాకీతో కాల్చి చంపారు. అతీక్ అహ్మద్‌ను పోలీసులు వైద్య పరీక్షల కోసం తీసుకెళుతుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: విదేశాల్లోని భారతీయులకు ఓటుహక్కు! -
అతీక్, అతని సోదరుడిపై ఉన్న 152 కేసులు క్లోస్!
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు ఖాలిద్ అజీమ్(అశ్రఫ్) ఏప్రిల్ 15న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇద్దరూ మరణించడంతో వీరిపై ఉన్న 152 పెండింగ్ కేసులను క్లోస్ చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు నిర్ణయించారు. ఈ ఇద్దరి డెత్ రిపోర్టును కోర్టుకు సమర్పించి కేసులన్నీ మూసివేయనున్నారు. 152 కేసుల్లో అతీక్పైనే 102 కేసులున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో ఈకేసులు నమోదయ్యాయి. అయితే వీటిలో ఒక్క కేసులో మినహా అతీక్ ఎందులోనూ దోషిగా తేలలేదు. బెదిరింపులు, ప్రలోభాలతో శిక్ష పడకుండా చూసుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా అతీక్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇతనితో పాటు అనుచరులపైనా యూపీలోని యోగి సర్కార్ ఉక్కుపాదం మోపింది. రౌడీ షీటర్లను ఎన్కౌంటర్లలో కాల్చిపడేసింది. వాళ్ల ఇళ్లను కూడా కూల్చివేసింది. అతీక్‌పై 1979లోనే తొలిసారి హత్య కేసు నమోదైంది. అప్పుడు అతని వయసు 15 ఏళ్లే కావడం గమనార్హం. అలాగే అతని సోదరుడు అశ్రఫ్పై 1992లో తొలి కేసు నమోదైంది. వీరిద్దరిపై చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్‌పాల్ హత్యకు సంబంధించిన కేసు నమోదైంది. కాగా.. అతీక్, అతని సోదరుడిపై ఉన్న కేసులు క్లోస్ చేస్తున్నప్పటికీ వీటిలో ఇతర నిందితులపై అభియోగాలు అలాగే ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. న్యాయపరంగా చర్యలు ఉంటాయని తెలిపారు. చదవండి: బ్రిడ్జిపైనుంచి పడిపోయిన బస్సు.. 14 మంది దుర్మరణం.. 20 మందికి గాయాలు -
కారు ఓవర్టేక్ చేశామని అతీక్ నా తమ్ముడ్ని చంపేశాడు.. 27 ఏళ్ల తర్వాత..
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదురుడు అశ్రఫ్ ఏప్రిల్ 15న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే అతీక్ మాఫియా డాన్‌గా ఉన్నప్పుడు చేసిన అరాచాకాలను కొందరు బాధితులు ఇప్పుడు వెల్లడిస్తున్నారు. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ తమకు వెన్నులో వణుకుపుడుతోందని భయాందోళన వ్యక్తం చేశారు. అతీక్ సోదరుడు అశ్రఫ్ ప్రయాణిస్తున్న కారును ఓవర్టేక్ చేసినంందుకు తన తమ్ముడ్ని అతీక్ దారుణంగా హత్య చేశాడని విజయ్ కుమార్ అనే వ్యక్తి వెల్లడించాడు. చిన్న చిన్న తప్పులకు కూడా అతీక్ కోర్టులో ఇలాంటి దారుణమైన శిక్షలు ఉండేవని ఆనాటి రోజులను గుర్తు చేసుకుని బోరున విలపించాడు. (చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఫేక్..! ఆప్ నేతకు క్షమాపణలు చెప్పిన ఈడీ..) 'మీ జీవితంలో జరిగే కొన్ని ఘటనలు జీవితాంతం మిమ్నల్ని వెంటాడుతుంటాయి. ఆరోజు ఏం జరిగిందో నాకు ఇంకా గుర్తుంది. అంత్యక్రియల్లో పాల్గొని నేను నా తమ్ముడు కారులో ఇంటికి వెళ్తున్నాం. ఈ క్రమంలో మా ముందు ఉన్న కారును ఓవర్టేక్ చేశాం. అయితే అందులో అతీక్ సోదరుడు అశ్రఫ్ ఉన్నాడని మాకు తెలియదు. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత అతీక్ మమ్మల్ని ఇంటికి పిలిపించాడు. నా గురించి తెలియదా? మీరు తప్పు చేశారు? అని అన్నాడు. నా తమ్ముడ్ని ప్రాణాలతో విడిచిపెట్టమని నేను ఎంత బతిమిలాడినా కనికరించకుండా నిర్దాక్షిణ్యంగా చంపాడు.' అని విజయ్ వివరించాడు. 1996లో ఈ ఘటన జరిగింది. అప్పుడు అతీక్ గ్యాంగ్‌స్టర్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్నాడు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో అతను చెప్పిందే వేదం. అతడ్ని ఎవరూ ఎదిరించే సహాయం కూడా చేసేవారు కాదు. దీంతో అతీక్ అరాచాకాలకు హద్దే లేకుండా పోయింది. 27 ఏళ్లుగా ఈ ఘటనపై నోరువిప్పని విజయ్ కుటుంబం.. ఇప్పుడు అతీక్ హతమవ్వడంతో తమ గోడు వెల్లబోసుకుని కన్నీటిపర్యంతమైంది. చదవండి: పోలీసుల నీచ బుద్ధి.. యువతిపై ఇద్దరు కానిస్టేబుళ్ల అత్యాచారం -
ఊరేగింపుగా ఎందుకు తీసుకెళ్లారు ?
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్ కస్టడీలో ఉండగా పోలీసుల కళ్లెదుటే హత్యకు గురైన ఘటనపై సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా పోలీసులు, యూపీ సర్కారుకు పలు ప్రశ్నలు సంధించింది. ‘ అతీక్‌ను ఆస్పత్రికి తీసుకొస్తారని నిందితులకు ముందే ఎలా తెలుసు ? మేం కూడా టీవీలో చూశాం. ఆస్పత్రి గేటు నుంచి వారిని లోపలికి అంబులెన్స్‌లో ఎందుకు తీసుకెళ్లలేదు. మీడియా సమక్షంలో వారిని ఎందుకు ఊరేగింపుగా నడిపిస్తూ తీసుకెళ్లారు?. అతీక్ పోలీసు కస్టడీలో ఉండగా మీడియా చూస్తుండగా షూటర్లు హత్యకు ఎలా తెగించగలిగారు?’ అని యూపీ సర్కార్ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీని జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ప్రశ్నించింది. దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విద్వేష ప్రసంగాలపై కేసులు నమోదుచేయండి న్యూఢిల్లీ: దేశంలో మత సామరస్యానికి తీవ్ర భంగం వాటిల్లేలా విద్వేష ప్రసంగాలు చేసే వారిపై సుమోటో కేసులు నమోదుచేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. లేదంటే కోర్టు ధిక్కార చర్య తప్పదని డీజీపీలను హెచ్చరించింది. -
అతీక్ అహ్మద్ కార్యాలయంలో కత్తి, రక్తపు మరకలు..ఎవరిని హత్య చేశారు?
లక్నో: ఇటీవల దారుణ హత్యకు గురైన గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్‌కు చెందిన కార్యాలయంలో కత్తి, రక్తపు మరకలు కన్పించడం చర్చనీయాంశమైంది. ఈ ఆఫీస్‌ను అధికారులు పాక్షికంగా కూల్చారు. అయితే కార్యాలయం లోపల రక్తపు మరకలు, ఓ తెల్లటి వస్త్రం కన్పించడం చూసి షాకయ్యారు. అక్కడే ఓ కత్తి కూడా లభించింది. దీంతో ఈ రక్తపు మరకలు ఎవరివై ఉంటాయని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ టీంను రప్పించారు. వారు నమూనాలు సేకరించి పరిశీలిస్తున్నారు. అతీక్ అహ్మద్‌కు చెందిన ఈ ఆఫీస్ ప్రయాగ్‌రాజ్‌లోని ఖుల్దాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కర్బాల ప్రాంతంలో ఉంది. ఈ కార్యాలయం ఆవరణలోనే 10 అక్రమ ఆయుధాలతో పాటు రూ.74.62 లక్షల నగదను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ప్రయాగ్‌రాజ్‌లోని ఓ హోటల్లో.. డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.సుశీల్ కుమార్ సింగ్ మృతదేహాన్నిగుర్తించడం కలకలం రేపింది. పోలీసులు వెంటనే హోటల్‌కు చేరుకుని అతను ఆత్మహత్య చేసుకున్నాడా? లేక హత్య చేసుకున్నాడా అనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. కాగా.. అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ ఇటీవలే దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు, మీడియా ముందే ముగ్గరు యువకులు వీరిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చిచంపడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చదవండి: యూపీలో దారుణం.. హోటల్ గదిలో విగతజీవిగా వైద్యాధికారి -
ఈ హత్యల వెనుక ప్రశ్నలు ఎన్నో!
అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్‌ల హత్య కేసులో విచారణ ముందుకు సాగితే కనుక... ఆ విచారణ వార్తలను రానున్న కొద్ది వారాల్లో మీడియాలో చదువుతున్నప్పుడు, లేదా చూస్తున్నప్పుడు కొన్ని ప్రశ్నల్ని మీ మదిలో మెదలనివ్వండి. జరిగింది ఏమిటన్న దానికి మనం దగ్గరవుతున్నామా లేక తప్పుదారి పడుతున్నామా అనే విషయాన్ని ఆ ప్రశ్నలు మీకు తెలియజేస్తాయి. సమాధానాలతో ప్రమేయం లేకుండా ప్రశ్నల కుండే ప్రాధాన్యం ప్రశ్నలకు ఎప్పుడూ ఉంటుంది. ఏం జరిగిందన్న విషయమై వాస్తవాన్ని రాబట్టేందుకు అదనంగా... ఎందుకు, ఎలా జరిగిందన్నది తెలుసుకునేందుకు మాత్రమే ముఖ్యం అయిన ప్రశ్నలు కాకపోవచ్చవి. రెండవ ముఖ్యమైన కారణం కూడా ఉంటుంది. జస్టిస్ లోకూర్ అన్నట్లు... ‘‘మునుపు ఎన్కౌంటర్ మరణాలు ఉంటుండగా... పోలీసు కస్టడీలో జరిగిన అతీక్, అష్రాఫ్‌ల హత్యలు బహుశా మొదటిసారి బయటి వ్యక్తులు చేసినవి.’’ అందుకే అనేక ప్రశ్నలు మనల్ని చుట్టుముడతాయి. బహుశా ఇది సందేహాస్పదమైన ప్రామాణికత గల కథోపాఖ్యానం వంటిది కావచ్చు. తాత్వికు రాలు గెర్ట్రూడ్ స్టెయిన్స్ మరణశయ్యపై ఉండి నప్పుడు... ‘‘సమాధానాలు ఏమిటి?’’ అని (ఆమె భర్త) ఆమెను అడిగారట. అప్పుడు ఆమె తీవ్ర ప్రయత్నంతో తనను తాను కూడదీసుకుని, ‘‘మొదట ప్రశ్నలేమిటో అడగండి!’’ అన్నారట! ఆమె ప్రశ్న స్పష్టమైనది, సరళమైనది. మీరు అడ గడమే తప్పుగా ప్రశ్నలు అడిగితే మీరు ఎన్నటికీ నిజం ఏమిటన్న దానిని పొందలేరు. పోలీసు కస్టడీలో అత్యంత భయానకంగా, నిర్దాక్షిణ్యంగా, వ్యవస్థకే తలవంపుగా జరిగిన అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్‌ల హత్య కేసు విచారణలో కూడా ఇదే రకమైన ప్రశ్నల ఆలోచనా విధానం ప్రధానంగా ఉండాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రఖ్యాతి గాంచి, పదవీ విరమణ పొందిన వారిలో ఒకరైన జస్టిస్ మదన్ లోకూర్‌తో నేను జరిపిన సంభా షణలో ఆయన లేవనెత్తిన అనేక చిక్కుముడి ప్రశ్నలను ఇప్పుడు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. చాలా విషయాల్లో జరిగిన తప్పులను ఎత్తిచూపిన ప్రశ్నలవి. అందుకే అవి సత్యానికి తోవ చూపే జాడలు. అతీక్, అష్రాఫ్‌ల హత్య కేసు విచా రణ, విచారణ ఫలితాల వెల్లడింపు వార్తలను రానున్న కొద్ది వారాల్లో మీరు చదివేటప్పుడు ఈ ప్రశ్నలను మదిలో ఉంచుకోండి. జరిగింది ఏమి టన్న దానికి మనం దగ్గరవుతున్నామా లేక తప్పు దారి పడుతున్నామా అనే విషయాన్ని ఆ ప్రశ్నలు మీకు తెలియజేస్తాయి. మొదటి ప్రశ్న. రాత్రి గం.10.30 సమయంలో అతీక్, అష్రాఫ్ సోదరులను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి? ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’ చెబుతున్న దానిని బట్టి అతీక్, అష్రాఫ్‌లను ఉంచిన నైనీ జైలు తలుపులను విధిగా సాయంత్రం 6 గంటలకు మూసివేస్తారు. వైద్య చికిత్స అందించ వలసిన అత్యవసర పరిస్థితి లేనప్పుడు జైలు వేళల్ని ఉల్లంఘించి మరీ ఎందుకు వారిద్దరినీ బయటికి తీసుకువచ్చారు? వారి పోలీసు కస్టడీ ముగియడా నికి మర్నాడు ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉన్నప్పుడు, వారిని ఆదివారం ఉదయం వైద్య పరీక్షలకు తీసుకెళ్లి ఉండవచ్చు కదా! అంతవరకు ఎందుకు ఆగలేదు? రెండవది. వాళ్ళిద్దర్ని తీసుకెళుతున్న పోలీస్ జీపు ఆసుపత్రి ప్రాంగణంలోకి ప్రవేశించకుండా ఆసుపత్రి బయట ఉన్న మైదానంలోనే ఎందుకు ఆగిపోయింది? ఆసుపత్రి లోపల పార్కింగ్‌కి చోటు ఉన్నప్పుడు వాళ్లను బయటే దింపి, లోపలికి నడి పించుకుని వెళ్లవలసిన అవసరం ఏముంది? నిజానికి అలా చేయడం అనవసరంగా ప్రమాదా నికి తావు కల్పించడమే! మూడవది. ఆ ఇద్దర్నీ చుట్టుముట్టి ప్రశ్నలు అడిగేందుకు మీడియాను ఎందుకు అనుమతించారు? అయినా రాత్రి 10.30కి వారిని వైద్య పరీ క్షలకు తీసుకెళుతున్నట్లు మీడియాకు ఎలా తెలిసింది? ఏ ఆసుపత్రికి తీసుకెళుతున్నారో వాళ్లెలా తెలుసుకోగలిగారు? ఎవరైనా సమాచారం అందించారా? అయితే ఆ అందించిన వారెవరు? నాల్గవది. రాత్రి పూట అతీక్, అష్రాఫ్‌లను వైద్య పరీలకు తీసుకెళుతున్నట్లు హంతకులకు ఎలా తెలుసు? ఏ ఆసుపత్రికి తీసుకెళుతున్నారో వాళ్లెలా కనిపెట్టగలిగారు? హంతకులు న్యూస్ కెమెరా మన్ల వేషంలో వచ్చారంటే మీడియా అక్కడికి వస్తుందని ముందే వారికి ఎలా తెలిసింది? ఎవరైనా ఉప్పందించారా? అందిస్తే ఎవరు? ఐదవది, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ చెబుతున్న ప్రకారం 22 సెకన్ల పాటు కాల్పులు కొనసాగాయి. ఆ వ్యవధిలో 14 రౌండ్ల కాల్పులు జరిగాయి. హత్యకు పాల్పడిన ముగ్గురూ వృత్తి ప్రావీణ్యం గలవారిలా కనిపించారని కూడా ఆ పత్రిక రాసింది. అంటే హంతకులు తుపాకీ కాల్చడంలో శిక్షణ పొందినవారా? 7 లక్షల రూపాయల ఖరీదైన టర్కీ పిస్టల్ వారిలో ఒకరి చేతికి ఎలా వచ్చింది? ఈ ప్రశ్న మరింత ముఖ్యమైనది... టర్కీ పిస్టల్స్‌ని ఇండియా నిషేధించడం కనుక నిజమైతే! ఆరవది. ఎస్కార్ట్ పోలీసులు ఆయుధాలు కలిగి ఉన్నారా? కలిగి ఉంటే, వాళ్లెందుకు తిరిగి కాల్పులు జరపలేదు? ఆయుధాలు లేకుంటే ఎందుకు లేవు? అతీక్‌ను చంపేస్తామనే బెదిరింపు కాల్స్ వస్తున్నాయనీ, అతడికి సాయుధ భద్రత అవసరం అనీ వారికి నిర్ధారణగా తెలిసి కూడా ఎందుకు భద్రతను కల్పించలేదు? భద్రతను అందించకపోవడం నేరపూరితమైన బాధ్యతారాహి త్యంతో సమానం కదా? ఏడవ ప్రశ్న. హంతకులను పోలీసులు ఎందు కని పోలీస్ కస్టడీకి ఇవ్వమని అడగలేదు? బదు లుగా జ్యుడీషియల్ రిమాండ్‌కు ఎందుకు సమ్మతించారు? హంతకులను ప్రశ్నించి, తదుపరి విచారణ జరపవలసిన అవసరం లేదా? అవసరం లేదను కుంటే, పోలీసులకు ముందే అంతా తెలుసు కనుక... తెలుసుకోడానికి కస్టడీకి తీసుకోవలసిన అవసరం ఏముంది అనే సంకేతం రావడం లేదా? అదే నిజమైతే వారికి ప్రతిదీ ఎలా తెలుసు(ఎందుకు తెలుస్తోంది అని కూడా) అనే ప్రశ్న వస్తుంది. ఏం జరిగిందన్న విషయమై వాస్తవాన్ని రాబట్టేందుకు అదనంగా... ఎందుకు, ఎలా జరిగిందన్నవి తెలుసుకునేందుకు మాత్రమే ఇవి ముఖ్య మైన ప్రశ్నలు కావు. రెండవ ముఖ్యమైన కారణం కూడా ఉంది. జస్టిస్ లోకూర్ అన్నట్లు... ‘‘మునుపు ఎన్కౌంటర్ మరణాలు ఉంటుండగా... పోలీసు కస్టడీలో గత శనివారం రాత్రి (ఏప్రిల్ 15) అతీక్, అష్రాఫ్లపై జరిగినవి బహుశా మొదటిసారి బయటి వ్యక్తులు చేసిన హత్యలు.’’ ఇలా జరగడమే భయానకం, కలవరపాటు, సిగ్గు చేటు. ఇలా మళ్లీ జరగకుండా చూసుకోవాలి.లేదంటే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం అని చాటుకునే మన ప్రగల్భాలు– ‘ప్రజాస్వామ్యా నికి తల్లి వంటిది’ అనే తక్కువ సమర్థనీయమైన మాటనైతే పక్కన పెట్టేయండి – నకిలీలా, బోలుగా ధ్వనిస్తాయి. అందుకే జస్టిస్ లోకూర్ ప్రశ్నలు ముఖ్యమైనవి. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అతీక్ అహ్మద్ లాయర్‌కు మరో షాక్! ఫొటోలు షేర్ చేశాడని క్రిమినల్ కేసు
లక్నో: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ ఖాన్ సౌతల్ హనీఫ్పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఉమేష్ పాల్ ఫొటోలను ఇతను అతీక్ కుమారుడు అసద్‌కు పంపినట్లు తెలిపారు. ఆ మరునాడే ఉమేశ్ దారుణ హత్యకు గురయ్యాడు. అసద్ మరికొందరితో కలిసి ఉమేష్‌ను ఇంటిబయటే కాల్చి చంపాడు. ఉమేశ్‌పాల్ హత్యకు సంబంధించి క్రిమినల్ కాన్స్పిరసీ అభియోగాలతో హానీఫ్‌పై సెక్షన్ 120-బీ కింద ధుమన్‌గంజ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డీసీపీ దీపక్ భూకార్ వెల్లడించారు. ఉమేశ్ కిడ్నాప్ కేసుకు సంబంధించి హానీఫ్కు ఇప్పటికే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. ప్రస్తుతం నైని కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ఫొటోల వ్యవహారానికి సంబంధించి ఇతడ్ని రిమాండ్ కోసం పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో ఉమేశ్ పాల్ కీలక సాక్షిగా ఉన్నాడు. ఇతడ్ని గతంలోనే ఓసారి కిడ్నాప్ చేసింది అతీక్ అహ్మద్ గ్యాంగ్. ఈ కేసులోనే హనీఫ్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 24న ఉమేశ్ పాల్‌ను అతని ఇంటి ఎదుటే అతీక్ కుమారుడు అసద్, మరికొందరు తుపాకీతో కాల్పులు జరిపి హతమార్చారు. అనంతరం పరారయ్యారు. అయితే ఏప్రిల్ 13న అసద్‌ను ఎన్కౌంటర్లో హతమార్చారు యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఆ తర్వాత రెండు రోజులకే అతని తండ్రి అతీక్ అహ్మద్ కూడా దారుణ హత్యకు గురయ్యాడు. ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి పరీక్షల కోసం తీసుకెళ్లిన అతనిపై పోలీసులు, మీడియా ఎదుటే ముగ్గురు యువకులు తుపాకులతో కాల్పులు జరిపి హతమార్చిన ఘటన సంచలనం రేపింది. చదవండి: వాళ్లు కన్పిస్తే కాల్చి పడేయాలి.. గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ను పొగుడుతున్నవారిపై కేంద్రమంత్రి ఫైర్.. -
వాళ్లు కన్పిస్తే కాల్చి పడేయాలి.. కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు..
పట్నా: ఇటీవల హత్యకు గురైన ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ను పొగుడుతున్న వాళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి అశ్విని చౌబె. అలాంటి వాళ్లు కన్పించిన వెంటనే కాల్చి పడేయాలని వ్యాఖ్యానించారు. బిహార్‌లో కూడా యోగి మోడల్ ప్రభుత్వం అవసరం ఉందన్నారు. పట్నాలో శుక్రవారం ప్రార్థనల అనంతరం కొందరు అతీక్ అహ్మద్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన అశ్విని చౌబె వాళ్లపై ఫైర్ అయ్యారు. బిహార్‌లో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, తక్షణమే వాళ్లను కాల్చిపడేయాలన్నారు. మోదీ, యోగికి వ్యతిరేకంగా వాళ్లు నినాదాలు చేసిన తీరు బాధాకరమన్నారు. క్రిమినల్స్, మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న యోగి మార్క్ పాలన బిహార్‌లోనూ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. బిహార్‌లో ప్రస్తుతం కుటంబ, కుల రాజకీయాలు చేసే వారే అధికారంలో ఉన్నారని కేంద్రమంత్రి మండిపడ్డారు. సీఎం నితీశ్ కుమార్ బీజేపీ నేతలను టార్గెట్ చేస్తున్నారని, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వాళ్లకు తగిన రీతిలో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. కాగా.. గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అశ్రఫ్‌ను ముగ్గురు యువకులు పోలీసులు, మీడియా ముందే కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముగ్గురు నిందితులు వెంటనే పోలీసులకు లొంగిపోయారు. ఫేమస్ అయ్యేందుకే తాము ఈ హత్యలు చేసినట్లు విచారణలో అంగీకరించారు. చదవండి: 35 రోజులుగా వేట.. అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు! -
అతీక్ హత్య కేసులో ఐదుగురు పోలీసుల సస్పెన్షన్
ప్రయాగ్‌రాజ్: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ పోలీసు వలయం మధ్యే హత్యకు గురవడాన్ని యూపీ పోలీస్ విభాగం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై దర్యాప్తు చేస్తున్న సిట్ సిఫార్సు మేరకు ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్టు ఉన్నతాధికారి ఒకరు బుధవారం చెప్పారు. సస్పెన్షన్ వేటు పడిన వారిలో షాగంజ్ పోలీస్‌స్టేషన్ ఇన్చార్జ్ అశ్వనీకుమార్ సింగ్, ఒక సబ్ఇన్స్పెక్టర్, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గత శనివారం ప్రయాగ్‌రాజ్‌లో రాత్రివేళ మెడికల్ చెకప్ కోసం అతీక్, అతని సోదరుడు ఆష్రాఫ్‌లను పోలీసులు వైద్యకళాశాలకు తీసుకెళ్తుండగా మీడియా సమక్షంలోనే ముగ్గురు నేరగాళ్లు పాయింట్‌బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపి హత్యచేయడం తెల్సిందే. -
తండ్రి పోలీసు, భర్త కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్.. అతీక్ భార్య పర్వీన్ ఎక్కడున్నారు?
లక్నో: పోలీసు కస్టడీలో ఉండగా దుండగుల చేతిలో హత్యకు గురైన గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ భార్య షాయిస్తా పర్వీన్(51)కోసం ఉత్తర ప్రదేశ్‌లో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఆమె ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. ఇప్పటికే పర్వీన్‌ను పట్టిస్తే రూ.50 వేల రివార్డు ఇస్తామని యూపీ పోలీస్ శాఖ ప్రకటించింది. అయితే అతిక్, అష్రఫ్ అంత్యక్రియల సమయంలో పర్వీన్ లొంగిపోతారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆమె హాజరుకాలేదు. అతిక్ హత్య నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో పోలీసులు ఆమె కోసం జల్లెడపడుతున్నారు. కాగా కేవలం రెండు రోజుల వ్యవధిలోనే షైస్తా తన కొడుకు అసద్, భర్త అతిక్ ఇద్దరిని కోల్పోయింది. అసద్ పోలీసు ఎన్కౌంటర్లో మరణించిన రెండు రోజుల తర్వాత, అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌ను ప్రయాగ్‌రాజ్‌లో మీడియా ముసుగులో వచ్చిన ముగ్గురు వక్తులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ నేరానికి పాల్పడ్డ లవ్లేష్ తివారి(22), అరుణ్ మౌర్య(18), మోహిత్ అలియాస్ సన్నీ(23)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యలపై దర్యాప్తునకు యూపీ సీఎం యోగి ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిటీని, సిట్‌ను నియమించారు. భర్తను హత్య చేశారని తెలియగానే షాయిస్తా పర్వీన్ వెక్కివెక్కి ఏడ్చారని, అనంతరం ఆమె కళ్లు తిరిగి పడిపోయారని సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. చదవండి: గ్యాంగ్‌స్టర్ అతిక్ హత్య.. తొలిసారి స్పందించిన యూపీ సీఎం ఎవరీ షాయిస్తా పర్వీన్? షాయిస్తా తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయ్యారు. 1996లో అతిక్‌ని పెళ్లి చేసుకునే ముందు షాయిస్తా ప్రపంచం కూడా పూర్తిగా భిన్నంగా ఉండేది. ఇంటర్ పూర్తి చేసిన ఆమెకు అంతకుముందు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలతో సంబంధం లేదు. అయితే 2009 నుంచి షాయిస్తా పేరు మీద ప్రయాగ్‌రాజ్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు చీటింగ్ కేసులు కాగా ఒకటి హత్య కేసు. మొదటి మూడు కల్నల్‌గంజ్ పోలీస్ స్టేషన్లో నమోదవ్వగా నాలుగోది ఉమేష్ పాల్ హత్య కేసు. ఫిబ్రవరి 24న హత్యకు గురైన ఉమేష్ కేసులో ప్రధాన నిందితుల్లో షాయిస్తా ఒకరు. ఈమెతోపాటు భర్త అతిక్ అహ్మద్, ఇద్దరు కుమారులు, సోదరుడు అష్రఫ్ కూడా ఈ కేసులో నిందితుగా ఉన్నారు. 2021లో షైస్టా AIMIMలో చేరారు. అనంతరం 2023 జనవరిలో బీఎస్పీలో చేరారు. ఈ సమయంలో తన భర్త అతిక్ ఎస్పీ అగ్రనేతతో స్నేహం కారణంగా క్రమశిక్షణ నేర్చుకోలేకపోయాడని తెలిపింది. అతిక్ ఎప్పుడూ బీఎస్పీని ఇష్టపడేవాడని.. ఆ పార్టీ అగ్రనేతలకు కూడా సహాయం చేశాడని చెప్పుకొచ్చారు. అయితే తరువాత జరిగిన మేయర్ ఎన్నికలో శాయస్తాను పోటీ చేయకూడదని మాయావతి నిర్ణయించుకున్నారు. ఉమేష్ పాల్ హత్యకు ప్రణాళిక రచించడం, దాన్ని అమలు చేయడంతో షాయిస్తా కీలకంగా వ్యహరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదిలా ఉండగా అతీక్ నేరసామ్రాజ్యాన్ని నడపడంలో పర్వీన్ కీలకంగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. అతీఖ్ అహ్మద్ జైలులో ఉండగా మాఫియా సభ్యులతో అక్రమ వ్యవహారాలన్నీ ఆమెనే చక్కబెట్టారని తేలింది. సీఎం యోగికి షైస్తా లేఖ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు పర్వీన్ రాసిన లేఖ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్, అష్రఫ్‌లను తప్పుగా ఇరికిస్తున్నారని లేఖలో ఆమె పేర్కొంది. ఉమేష్ పాల్ హత్యకు మంత్రి నంద్ గోపాల్ గుప్తా కీలక సూత్రధారి అని ఆరోపించారు. అయితే పర్వీన్ ఫిబ్రవరి 27న లేఖ రాయగా.. అతిక్ మరణానంతరం వెలుగులోకి వచ్చింది. సీఎం ఆదిత్యనాథ్ జోక్యం చేసుకోకపోతే నా భర్త, బావమరిది, కొడుకులను చంపేస్తామని లేఖలో రాసింది. చదవండి: క్రిమినల్ కథా చిత్రమ్.. అతీక్ అహ్మద్‌కు వ్యవస్థ మొత్తం దాసోహమైందా? -
చావును ముందే ఊహించిన అతీక్ అహ్మద్? రెండు వారాల క్రితమే రహస్య లేఖ!
ప్రయాగ్‌రాజ్/న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ తన చావును ముందే ఊహించినట్లున్నాడు. అందుకే రెండు వారాల ముందే ఓ లేఖ రాసి సీల్డ్ కవర్లో భద్రంగా దాచిపెట్టాడు. తాను చనిపోతే దాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి(సీజేఐ), యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అందజేయాలని కోరాడు. ఈ విషయాన్ని అతీక్ న్యాయవాది విజయ్ మిశ్రా మంగళవారం వెల్లడించారు. ‘‘అందులో ఏముందో నాకు తెలియదు. అతీక్ కోరిక మేరకు సీల్డ్ కవర్లో సీజేఐకి, సీఎంకు పంపుతా’’ అని చెప్పారు. హత్యపై సుప్రీంకోర్టులో 24న విచారణ అతీక్ సోదరుల హత్యోదంతంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ‘‘దీన్ని అత్యవసరంగా విచారణకు స్వీకరించండి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సాగేలా చూడండి. 2017 నుంచి యూపీలో జరిగిన 183 పోలీస్ ఎన్కౌంటర్లపై ఎంక్వైరీకి ఆదేశించండి’’ అని న్యాయవాది విశాల్ తివారీ మంగళవారం సుప్రీంకోర్టును కోరారు. దీనిపై ఏప్రిల్ 24న విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. యోగి పాలనలో ఆరేళ్లలో ఎన్కౌంటర్లలో 183 మంది నేరగాళ్లు హతమయ్యారని యూపీ స్పెషల్ డీజీపీ (శాంతిభద్రతలు) ప్రకటించడం తెల్సిందే. మరోవైపు, ప్రయాగ్‌రాజ్‌లో అతీక్ లాయర్నని చెప్పుకుంటున్న దయాశంకర్ మిశ్రా నివాసం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు బాంబు విసిరారు. ఎవరికీ హాని జరగలేదు. ఇక ఏ మాఫియా బెదిరించలేదు: యోగి లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇకపై ఎలాంటి మాఫియా కూడా బెదిరింపులకు పాల్పడబోదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అతీక్ సోదరుల హత్య నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంగళవారం లక్నో, హర్దోయీ జిల్లాల్లో టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుపై కేంద్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా యోగి మాట్లాడారు. ‘‘గతంలో రాష్ట్రాన్ని మాఫియా, నేరగాళ్లు కష్టాలపాలు జేశారు. ఇప్పుడు వాళ్లే కష్టాలు పడుతున్నారు’’ అన్నారు. ‘సమాజ్‌వాదీ పార్టీ హయాంలో 2012–2017 మధ్య రాష్ట్రంలో 700 అల్లర్ల ఘటనలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు బీఎస్పీ హయాంలో 364కు పైగా జరిగాయి. మా ప్రభుత్వం వచ్చాక 2017 నుంచి ఒక్క అల్లర్ల ఘటన లేదు. కర్ఫ్యూ లేదు. పరిశ్రమలు, వ్యాపారాలకు అనువైన వాతావరణం నెలకొంది. పెట్టుబడిదారుల భద్రత మా బాధ్యత’’ అని చెప్పారు. -
గ్యాంగ్‌స్టర్ అతిక్ హత్య.. తొలిసారి స్పందించిన యూపీ సీఎం
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్యోదంతంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలిసారి స్పందించారు. ఈ సందర్భంగా గ్యాంగ్ స్టర్స్, క్రిమినల్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ఓ బహిరంగ సమావేశంలో పాల్గొన్న యోగి మాట్లాడుతూ.. ఇకపై యూపీలో గ్యాంగ్స్టర్లు ఏ ఒక్కరిని బెదిరించలేరని పేర్కొన్నారు. సాధారణ ప్రజానీకం నుంచి వ్యాపారవేత్తల వరకు ఎవరికీ క్రిమినల్, మాఫియా భయం ఉండబోదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని వ్యాఖ్యానించారు. 2017కు ముందు ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని యోగి ఆదిత్యానాథ్ విమర్శించారు. అల్లర్లకు రాష్ట్రం అపఖ్యాతి పాలయ్యిందని దుయ్యబట్టారు. గతంలో రాష్ట్ర గుర్తింపు కోసం పాకులాడే పరిస్థితి ఉండేదని మండిపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, నేరస్థులు, మాఫియా వెన్నులో వణుకు పుడుతోందని తెలిపారు. అయితే 2017 నుంచి 2023 వరకు రాష్ట్రంలో ఒక్క మతపరమైన హింస కూడా చోటుచేసుకోలేదని తెలిపారు. ఈ ఆరేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదని అన్నారు. తమ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడానికి శాయశక్తులా కృషి చేస్తోన్నామని చెప్పారు. కాగా యూపీలో రాజకీయ నేతగా ఎదిగిన గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ హత్య జరిగిన మూడు రోజుల అనంతరం యోగీ ఈ వ్యాఖ్యలు చేశారు. #WATCH | Now mafia cannot threaten anyone in Uttar Pradesh, says CM Adityanath days after Mafia brothers Atiq-Ashraf were killed amid police presence & Atiq's son Asad was killed in a police encounter pic.twitter.com/hjfeBVF6qt — ANI (@ANI) April 18, 2023 ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను కోర్టు విచారణ కోసం సబర్మతి జైలు నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చిన సమయంలో శనివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు పాయింట్-బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో లవ్లేష్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. జర్నలిస్టులుగా చెప్పుకొని, ప్రెస్ కార్డులను మెడలో ధరించి అతిక్ సోదరుల సమీపానికి వచ్చి కాల్పులకు తెగబడ్డారు. ఇదిలా ఉండగా ఇటీవలే అతిక్ అహ్మద్ కుమారుడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. రహస్య లేఖ అతిక్ అహ్మద్ రాసినట్టు చెబుతున్న ఓ 'రహస్య లేఖ'ను అతని న్యాయవాది సోమవారం బయటపెట్టారు. అతిక్ అహ్మద్ హత్యకు సరిగ్గా రెండు వారాల ముందు భారత సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. తనను ఎవరైనా హత్య చేస్తే ఈ లేఖను సుప్రీంకోర్టుకు అందజేయాలని అతిక్ కోరినట్టు న్యాయవాది వెల్లడించారు. అందుకే దాన్ని అపెక్స్ కోర్టుకు సమర్పిస్తున్నట్టు తెలిపారు. -
అతీక్ బ్రదర్స్ హత్య: అష్రాఫ్ చివరి మాట గుడ్డూ గురించే.. ఎవరీ గుడ్డూ ముస్లిం?
న్యూఢిల్లీ: గుడ్డూ ముస్లిం.. ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఎవరీ గుడ్డూ అంటూ అంతా ఆరా తీస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ శనివారం రాత్రి ముగ్గురు యువకుల కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ మరణించడం తెలిసిందే. కాల్పులకు క్షణాల ముందు అష్రాఫ్ నోట వచ్చిన చివరి మాట గుడ్డూ గురించే. మెయిన్ బాత్ యే హై కీ గుడ్డూ ముస్లిం... (నేను చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం గుడ్డూ ముస్లిం...) అని అంటూనే సోదరులిద్దరూ కాల్పులకు బలయ్యారు. గుడ్డూ అతీక్ అహ్మద్ ముఖ్య అనుచరుడు. తుపాకుల బదులు బాంబులు వాడటం ఇతని స్టైల్. బాంబులు విసిరి ప్రత్యర్థులను అంతం చేయడంలో దిట్ట. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లో పట్టపగలే ఉమేశ్ పాల్ హత్య జరిగింది. ఆ సమయంలో గుడ్డూ బైక్ వెనుక కూర్చొని నాటు బాంబులు విసురుతున్న దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. అతీక్ మరణానంతరం అతడి నేరసామ్రాజ్యం గుడ్డూ చేతికి వెళ్తుందని ప్రచారం సాగుతోంది. దాంతో యూపీ పోలీసుల నజర్ ఇప్పుడు అతనిపైనే ఉంది. ఉమేశ్ హత్య కేసులో 10 మంది నిందితుల్లో గుడ్డూ పేరూ ఉంది. ఆ పది మందిలో ఇప్పటిదాకా ఆరుగురు హతం కాగా గుడ్డూతో సహా మిగతా వారంతా పరారీలో ఉన్నారు. గుడ్డూ ప్రస్తుతం కర్ణాటకలో తలదాచుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నమ్మినబంటు గుడ్డూ ముస్లిం ప్రయాగ్‌రాజ్‌లో పుట్టాడు. చిన్న వయసులోనే నేర సామ్రాజ్యంతో పరిచయం ఏర్పడింది. లక్నోకు మకాం మార్చి పలు నేరాల్లో పాలుపంచుకున్నాడు. బడా వ్యక్తులతో సన్నిహితంగా మెలిగాడు. ఓ టీచర్ హత్య కేసులో 1997లో అరెస్టయ్యాడు. బలమైన సాక్ష్యాల్లేక విడుదలయ్యాడు. బిహార్‌కు వెళ్లి నేరాలు కొనసాగించాడు. 2001లో మళ్లీ అరెస్టవగా అతీక్ బెయిల్‌పై బయటకు తీసుకొచ్చాడు. కొన్నేళ్ల క్రితం గుడ్డూ అనారోగ్యం పాలై పరిస్థితి విషమించగా అతీక్ రూ.8 లక్షలు ఖర్చు చేసి గుడ్డూను బతికించాడు. అందుకు కృతజ్ఞతగా ఉమేశ్‌పై గుడ్డూ బాంబులు విసిరి హత్య చేశాడు. అతీక్‌కు నమ్మినబంటుగా పేరుతెచ్చుకున్నాడు. అతీక్ కోసం పాకిస్తాన్ నుంచి పంజాబ్ మీదుగా ఆయుధాలను భారత్‌కు అక్రమంగా రవాణా చేసేవాడని పోలీసులు వెల్లడించారు. అన్నీ అనుమానాలే ప్రయాగ్‌రాజ్/లక్నో/న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్లు అతీక్, అష్రాఫ్ హత్య విషయంలో పోలీసుల తీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అంతటి కరడుగట్టిన నేరగాళ్లను రాత్రిపూట ఎందుకు ఆసుపత్రికి తీసుకొచ్చారు? పైగా వారున్న వాహనాన్ని గేటు బయటే ఆపి నడిపించుకుంటూ ఎందుకు వచ్చారు? మీడియా కంటపడకుండా ఆసుపత్రి లోపలి దాకా వాహనంలో ఎందుకు తీసుకురాలేదు? పైగా ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్టు విచారణలో సోదరులిద్దరూ ఒప్పుకున్నారు. నిబంధనల ప్రకారం ఇలాంటి కేసుల్లో నిందితుల్ని మీడియాతో సహా ఎవరి కంటా పడనివ్వకూడదు. దాన్నీ తుంగలో తొక్కారు. హంతకులు ముగ్గురూ విలేకరుల ముసుగులో వచ్చి కాల్పులు జరపడం తెలిసిందే. మీడియా ప్రతినిధులను తనిఖీ చేయకుండానే గ్యాంగ్స్టర్ల దగ్గరికి అనుమతించడం వెనక కుట్ర ఉండొచ్చంటున్నారు. వారు 20 తూటాల దాకా కాల్చినా నిందితుల వెన్నంటే ఉన్న పోలీసుల్లో మాత్రం ఎవరికీ ఏమీ కాకపోవడం నమ్మశక్యంగా లేదంటున్నారు. నిందితులను సోమవారం ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలించారు. విచారణకు సిట్ అతీక్ శరీరంలో 9 తూటాలున్నట్టు పోస్టుమార్టంలో వెల్లడైంది. 8 తూటాలు ఛాతీ, వీపు నుంచి దూసుకెళ్లగా మరోటి తలలో కనిపించింది. అష్రాఫ్ తలపై ఒకటి, వీపుపై నాలుగు తూటా గాయాలను గుర్తించారు. ఈ హత్యోదంతంపై దర్యాప్తుకు సతీశ్ చంద్ర, సత్యేంద్ర ప్రసాద్, ఓం ప్రకాశ్ సభ్యులుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. దీనిపై విచారణకు యూపీ ప్రభుత్వం ఇప్పటికే జ్యుడీషియల్ కమిషన్ వేయడం తెలిసిందే. -
తూటాలతో తక్షణ న్యాయం?
కంటికి కన్ను... పంటికి పన్ను లాంటి డైలాగులు, వెంటాడి వేటాడడాలు తెరపై చూస్తాం. నిజ జీవితంలో పదులకొద్దీ సాయుధ పోలీసుల కళ్ళెదుట, టీవీ కెమెరాల ముంగిట అలా జరగడం ఒళ్ళు జల దరించే అనుభవం. రాజకీయాల్లోకొచ్చిన నేరసామ్రాజ్యనేత అతీక్ అహ్మద్, ఆయన తమ్ముడు ఖాలిద్ అజీమ్ అలియాస్ అష్రాఫ్‌లు యూపీలో పోలీస్ కస్టడీలో ఉండగా, మీడియా ముసుగులో వచ్చి ముగ్గురు కుర్రాళ్ళు చంపిన తీరు అలాంటిదే. హత్యలు, అపహరణలకు పాల్పడి నూటికిపైగా కేసులున్న నేరగాడిగా పేరుమోసిన అతీక్ జీవితంలో హింసను నమ్మి, చివరకు హింసలోనే చనిపోవడం కవితాత్మక న్యాయంగా కనిపించవచ్చు. కానీ కరడుగట్టిన నేరస్థుణ్ణి సైతం చట్టబద్ధంగా విచారించి కోర్ట్‌లో కఠినశిక్ష విధించాలి. తక్షణశిక్షలతో సత్వరన్యాయం జరపాలనిచూస్తే అన్యాయమే. ‘మాఫియా కో మిట్టీ మే మిలా దూంగా’ (మాఫియాను మట్టిలో కలిపేస్తాను) అని అసెంబ్లీ సాక్షిగా గర్జించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నెలలోనే కనీసం 3 ఎన్కౌంటర్లకు మౌనసాక్షి. విషాదం ఏమిటంటే, ఈ సర్కారీ ప్రేరేపిత హింసను పౌర సమాజం సైతం అభ్యంతర పెట్టకుండా, ఆమోదిస్తూ ఉండడం. పరారీలో ఉన్న అతీక్ కుమారుడు ‘ఆత్మరక్షణకు పోలీసుల ఎదురుకాల్పుల్లో’ గురువారం ఝాన్సీలో చనిపోతే, శనివారం రాత్రి ప్రయాగరాజ్‌లో పోలీసుల ఎదుటే కాల్పుల్లో అతీక్ ప్రాణాలు విడిచాడు. రాజకీయ ప్రత్యర్థి ఉమేశ్‌పాల్ హత్యలో తండ్రీ కొడుకులిద్దరూ నింది తులు. అతీక్ హత్యపై రిటైర్డ్ జడ్జీ సారథ్యంలో కమిషన్ వేశారు యోగి. తీరా మంత్రులే ఈ మర ణాలు ‘కర్మ ఫలిత’మనీ, ‘దేవుడి న్యాయ’మనీ వ్యాఖ్యానిస్తుంటే ఇక విచారణలో ఏం తేలుతుంది! అతీక్‌ను ఎవరో చంపారనీ, వ్యవస్థ ప్రమేయం లేదనీ నమ్మలేం. చట్టప్రకారం ఏప్రిల్ 13న కస్టడీకి కోర్టు అప్పగించిన వెంటనే వైద్యపరీక్షలు జరపాల్సిన పోలీసులు 15వ తేదీ రాత్రి దాకా ఎందుకు ఆలస్యం చేశారు? సాధారణ పరీక్షలకు అసాధారణంగా ఆ రాత్రివేళను ఎందుకు ఎంచు కున్నారు? సంకెళ్ళు వేయరాదని కోర్టు తీర్పులున్నా సరే ఎందుకు వేశారు? కాలిస్తే ఒకరికొకరు దూరం జరిగే వీలైనా లేకుండా హతులిద్దరికీ కలిపి ఒకే పొడవాటి సంకెల ఎందుకేశారు? ప్రాణహాని ఉన్న నేరస్థులని తెలిసినా బందోబస్తులో ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఆ సమయానికి వారు అక్కడికలా నడుచుకుంటూ వస్తారని కాల్పులు జరిపిన కుర్రాళ్ళకెలా తెలిసింది? ఘోర నేర చరిత్రలేమీ లేని వారి చేతికి ఆధునిక విదేశీ తుపాకీలెలా వచ్చాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు. వెరసి, యూపీలో శాంతిభద్రతలకు టీవీ ప్రత్యక్షప్రసారాలకు చిక్కిన ఈ హత్యలే ప్రతీక. కస్టడీలోని వారికైనా కనీస భద్రత కల్పించలేని పోలీసు వ్యవస్థ ఘనతకు ఉదాహరణ. ఇంతకీ నకిలీ ఎన్కౌంటర్లు, సర్కారీ ప్రేరేపిత హత్యల ద్వారా యూపీ సర్కార్ ఏ సంకేతాలు పంపాలని చూస్తోంది? పట్టుమని 17 ఏళ్ళకే కేసులకెక్కి, 60 ఏళ్ళ వయసులో ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్న అతీక్ ఇన్నేళ్ళుగా రాజకీయపార్టీల్లో కొనసాగుతూ, ఇష్టారాజ్యంగా దంధా కొనసాగించడం 1990ల నుంచి మన రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థల పుణ్యమే. జైలుకెళ్ళినా చక్రం తిప్పిన అతీక్‌ను 2019లో గుజరాత్లో జైలుకు మార్చారు. ఇటీవలే యూపీకి పట్టుకొచ్చారు. తాజా ఘటనతో ఈ డాన్ కథ ముగిసింది. కానీ, చేసిన నేరాలూఘోరాలూ ఎన్నయినా, ఎంత పెద్దవైనా కావచ్చు. విచారణ లేకుండా తక్షణన్యాయమే పరిష్కారమనే ప్రభుత్వాల ధోరణి రాజ్యాంగ విహిత న్యాయసూత్రాలకే విరుద్ధం. సమదృష్టితో సాగాల్సిన వ్యవస్థలపై విశ్వాసానికి విఘాతం. యూపీలో యథేచ్ఛగా సాగుతున్న ఎన్కౌంటర్లపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం నాలుగేళ్ళ క్రితమే 2019 జనవరిలో ఆందోళన వ్యక్తం చేసింది. 2017 మార్చిలో యోగి సర్కార్ ఏర్పాటైనప్పటి నుంచి అలాంటి 15 కేసుల పూర్తి సమాచారాన్ని అప్పట్లోనే భారత ప్రభుత్వానికి పంపింది. ఆ కేసుల్లో బాధితులందరూ నిరుపేద మైనారిటీలే. తాజా డేటా ప్రకారం గత ఆరేళ్ళ యోగి పాలనలో 10,900కు పైగా పోలీస్ ఎన్కౌంటర్లు జరిగాయి. నిందితులు 183 మంది పోలీసు తూటాలకు ప్రాణాలు కోల్పోయారు. నిజానికి, నకిలీ ఎన్కౌంటర్లపై ఆందోళనతో జాతీయ మానవ హక్కుల సంఘం ఎప్పుడో మార్గదర్శకాలిచ్చింది. కానీ గద్దె మీది పెద్దలు తలుచు కున్నప్పుడల్లా అవి గాలికి పోతున్నాయి. వెరసి నేర న్యాయవ్యవస్థ కుప్పకూలి, పోలీస్, న్యాయ వ్యవస్థల్లో సంస్కరణలు అవసరమని గుర్తు చేస్తున్నాయి. ఇక, గత నవంబర్‌లో అమృత్‌సర్‌లో ఓ హిందూ రాజకీయ నేత ఇలాగే మీడియా ముందు కాల్పులకు గురై చనిపోయినప్పుడు సోకాల్డ్ మేధావులు ఇంత రచ్చ చేయలేదేమిటన్నది ఓ వాదన. జరిగిన దారుణాన్ని బట్టి కాక, మతాన్ని బట్టి గగ్గోలు పెడుతున్నారనీ వారి ఆరోపణ. చిత్రంగా మారణకాండలో సైతం మతం చొచ్చుకొచ్చిన రోజులివి. అతీక్ కుమారుడు ఎన్కౌంటరైనప్పుడు అధికార పార్టీ యువజన విభాగం టపాసులు కాల్చి, సంబరాలు చేసుకుంది. అది ఆందోళన రేపే ధోరణి. అది మరవక ముందే ప్రాణహాని ఉందంటూ అతీక్ సుప్రీం కోర్ట్‌లో భయపడినట్టే జరిగింది. అంతకన్నా భయపడాల్సిందేమిటంటే – హతులు ముస్లిమ్లైనప్పుడల్లా హంతకులు జైశ్రీరామ్ నినాదాలు చేయడం. ప్రజలను వర్గాలుగా చీల్చే ఈ ప్రయత్నాలు, దేవుడి పేరు అడ్డంపెట్టి దారుణా లకు ఒడిగట్టే తీరు సమాజానికి క్యాన్సర్ కన్నా ప్రమాదకరం. ఏ వర్గం ఇలాంటి దుశ్చర్యలకు దిగినా గర్హనీయమే. ‘డబుల్ ఇంజన్’, ‘బుల్డోజర్’ లాంటి మాటలతో మళ్ళీ కేంద్రంలో గద్దెనెక్కదలచిన పార్టీలూ, కాబోయే ప్రధానిగా ప్రచారమవుతున్న యూపీ నేతలూ అది గమనించాలి. -
అతీఖ్ హంతకుల జైలు మార్పు
లక్నో: ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్-పొలిటీషియన్ అతీఖ్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్‌లను కాల్చి చంపిన నిందితులను అధికారులు జైలు మార్చారు. సన్నీ సింగ్, అరుణ్ మౌర్యా, లవ్లేష్ తొవారిలను ప్రయాగ్‌రాజ్ నైనీ జైలు నుంచి ప్రతాప్‌ఘడ్ జైలుకు మార్చేశారు ఉత్తర ప్రదేశ్ పోలీసులు. నైనీ జైలులో వాళ్లపై దాడి జరగవచ్చేనే నిఘా వర్గాల సమాచారం మేరకు ముగ్గురు హంతకులను జైలు మార్చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫేమస్ కావాలనే తాము అహ్మద్ గ్యాంగ్‌ను ఏరివేసే పనిలో దిగామని, ఈ క్రమంలోనే అతీఖ్, అతని సోదరుడిని కాల్చిచంపామని ఈ ముగ్గురు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించారు. మరోవైపు కోర్టు వీళ్లకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఇక అతీఖ్,అష్రాఫ్‌ల హత్య ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన జ్యూడీషియల్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. మరోవైపు యూపీ పోలీస్ శాఖ కూడా రెండు సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. యూపీ పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి అతీఖ్, అష్రాఫ్‌లను వైద్యపరీక్షల కోసం తరలిస్తుండగా జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ఆ ముగ్గురు.. తుపాకులతో కాల్చి చంపిన తర్వాత జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ పోలీసులకు లొంగిపోయారు. వాళ్ల నుంచి ఫేక్ ఐడీకార్డులు , కెమెరా, మైక్‌లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముగ్గురిలో లవ్లేష్కు తూటా కాలి నుంచి దూసుకుపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అంతకు ముందు.. బుధవారం ఝాన్సీలో జరిగిన ఎన్కౌంటర్లో ఉమేష్‌పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అతీఖ్ తనయుడు అసద్ అహ్మద్‌ను, అతన్ని అనుచరుడ్ని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. -
కుమారుడి సమాధి పక్కనే అతీక్ ఖననం.. పటిష్ఠ భద్రతతో అంతిమయాత్ర
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదురుడు అష్రఫ్‌ల అంత్యక్రియలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఆయన స్వస్థలం ప్రయాగ్‌రాజ్‌లోని కసారి మసారి శ్మశాన వాటికలో ఇద్దరిని ఖననం చేశారు. పటిష్ఠ బందోబస్తు నడుమ, అతికొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలో అతీక్ అంతిమయాత్ర సాగింది. ఈ సమయంలో ప్రయాగ్‌రాజ్‌లోని ప్రతి వీధిలో పోలీసు, ఆర్‌ఎఎప్, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే ఇదే శ్మశాన వాటికలో అతీక్ కుమారుడు అసద్‌ను కూడా ఖననం చేశారు. ఆ సమాధి పక్కనే తండ్రిని ఖననం చేశారు. అతీక్ తల్లిదండ్రులను సమాధులు కూడా ఇదే శ్మశానవాటికలో ఉన్నాయి. Uttar Pradesh | Bodies of mafia-turned-politician Atiq Ahmed and his brother Ashraf Ahmed brought to Kasari Masari burial ground in Prayagraj where they will be buried. They were shot dead yesterday, in Prayagraj, by three shooters while they were surrounded by bevy of police… pic.twitter.com/kqtaWfy9ir — ANI UP/Uttarakhand (@ANINewsUP) April 16, 2023 శనివారం రాత్రి వైద్య పరీక్షల కోసం ప్రయాగ్‌రాజ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లిన అతీక్, అతని సోదరుడు అష్రఫ్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. మీడియా, పోలీసుల ఎదుటే ముగ్గురు యువకులు వీరిపై తుపాకులతో దాడి చేసి పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపారు. అనంతరం ముగ్గురు నిందితులు పోలీసులకు లొంగిపోయారు. ఈ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాగా.. పేరు ప్రఖ్యాతుల కోసమే తాము అతీక్, అతని సోదరుడ్ని అందరిముందే హత్య చేశామని నిందితులు పోలీసుల విచారణలో చెప్పారు. వీరు ఏం పని చేయకుండా బలాదూర్‌గా తిరుగుతూ డ్రగ్స్‌కు బానిసయల్యారని కుటుంబసభ్యులు తెలిపారు. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
అతిక్ సోదరుల దారుణ హత్య.. మాయవతి రియాక్షన్ ఇదే..
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయనేత, గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. వారిద్దరినీ ముగ్గురు యువకులు.. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపారు. దీంతో, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈఘటనపై తాజాగా బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందించారు. కాగా, మాయావతి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. గుజరాత్ జైలు నుండి తీసుకువచ్చిన అతీక్ అహ్మద్, బరేలీ జైలు నుండి తీసుకువచ్చిన అతని సోదరుడు అష్రఫ్‌ను ప్రయాగ్‌రాజ్‌లో దారుణంగా కాల్చి చంపారు. పోలీసుల కస్టడీలో ఉన్న వారికి చంపడం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ ఆందోళనకరమైన ఘటనను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో ‘రూల్ ఆఫ్ లా బై లా’ కాకుండా ఎన్కౌంటర్ ప్రదేశ్‌గా మార్చడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పోలీసుల సమక్షంలో ఇలా హత్యలు జరిగితే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. మరోవైపు.. ఈ ఘటనలో లవ్లేశ్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, వీరిని విచారించగా.. ఫేమస్ కావాలనే అతీక్ అహ్మద్‌ను షూట్ చేసినట్లు వీరు పోలీసులకు తెలిపారు. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం పిస్టళ్లలో వెళ్లి కాల్చి చంపినట్లు పేర్కొన్నారు. కాల్పుల అనంతరం ముగ్గురు యువకులు ఘటనా స్థలంలో జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. -
అతీక్ అహ్మద్ హత్య ఘటనపై ఒవైసీ రియాక్షన్ ఇదే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అతీక్ అహ్మద్, అతని సోరుడు అష్రఫ్ హత్యలపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ఘటనపై సుప్రీకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తులో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక్క అధికారి కూడా ఉండొద్దన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'హత్య సమయంలో అక్కడున్న పోలీసులు అధికారులను విధుల నుంచి తొలగించాలి. పోలీస్ కస్టడీలోనే అతీక్ అతని సోదరుడు దారుణ హత్యకు గురయ్యారు. నిందితులకు ఆ ఆయుధాలు ఎలా వచ్చాయి? హత్య అనంతరం వారు జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. చంపిన తర్వాత మతపరమైన నినాదాలు ఎందుకు చేస్తున్నారు?. టెర్రరిస్టులు అని కాకపోతే వాళ్లను ఏమని పిలవాలి? దేశభక్తులు అనాలా? ఈ ఘటన అనంతరం సంబరాలు చేసుకుంటున్నవారు రాబందులు. ఈ హత్యలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం పాత్ర ఉంది. ఈ ఘటన యూపీలో శాంతి భద్రతలపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇలా పబ్లిక్‌గా హత్యలు జరిగితే ప్రజలకు రాజ్యాంగం, శాంతి భద్రతలపై విశ్వాసం ఉంటుందా? యూపీలో బీజేపీ పరిపాలన చట్ట ప్రకారం జరగడం లేదు, తుపాకీ రాజ్యమేలుతోంది.' అని ఒవైసీ ఫైర్ అయ్యారు. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
Atiq Ahmed Murder: నా కుమారుడు డ్రగ్ అడిక్ట్.. ఏం పని చేయడు..
లక్నో: గ్యాంగ్‌స్టర్, మాజీ ఎమ్మెల్యే అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ శనివారం రాత్రి ప్రయాగ్‌రాజ్‌లో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు, మీడియా ఎదుటే.. లవ్లేశ్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్యగా అనే ముగ్గురు యువకులు వీరిని కాల్చి చంపారు. అనంతరం ఘటనా స్థలంలోనే పోలీసులకు లొంగిపోయారు. అయితే నిందితుల్లో ఒకడైన లవ్లేశ్ తివారీ తండ్రి యజ్ఞ తివారీ తన కుమారుడి గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ హత్య ఘటనను టీవీలో చూశామని, అసలు తమ కుటుంబానికి ఏ విషయమూ తెలియదని పేర్కొన్నారు. లవ్లీష్ ఏ పనీ చేయకుండా బలదూర్‌గా తిరుగుతాడని, డ్రగ్స్‌కు బానిసయ్యాడని వెల్లడించారు. ఓ అమ్మాయిని కొట్టి జైలుకు కూడా వెళ్లొచ్చాడని, అతనిపై పోలీసు కేసు నమోదైందని చెప్పారు. 'ఈ ఘటనలో మాకు ఎలాంటి సంబంధం లేదు. అతడు మాకు ఏమీ చెప్పడు. చాలా కాలంగా ఇంట్లో ఉండటం లేదు. ఐదారు రోజుల క్రితం ఓసారి ఇంటికి వచ్చి వెళ్లాడు. కొన్ని సంవత్సారాలుగా అతనితో మేం మాట్లాడటం లేదు. ఓ కేసులో అతడు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. లవ్లేశ్ ఏ పనీ చేయడు డ్రగ్స్‌కు బాగా బానిసయ్యాడు. మాకు మొత్తం నలుగురు పిల్లలు.' అని యజ్ఞ తివారీ వివరించారు. అతీక్ హత్య కేసులో మరో నిందితుడు సన్నీ సింగ్ సోదురుడు పింటు సింగ్ కూడా మీడియాతో మాట్లాడాడు. సన్నీ కూడా ఏ పనీ చేయకుండా రోడ్లపై తిరుగుతాడని వెల్లడించారు. అతను తమ నుంచి వేరుగా నివసిస్తున్నాడని, అసలు క్రిమినల్ ఎలా అయ్యాడో తమకు తెలియదని పేర్కొన్నాడు. ఈ ఘటన గురించి తమకు ఐడియా లేదని తెలిపాడు. చదవండి: ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు.. -
ఫేమస్ కావాలనే అతీక్‌ను కాల్చి చంపాం.. విచారణలో షాకింగ్ నిజాలు..
లక్నో: యూపీ గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను మీడియా, పోలీసుల సాక్షిగా ముగ్గురు యువకులు శనివారం రాత్రి పాయింట్ బ్లాంక్‌లో కాల్చిచంపిన విషయం తెలిసిందే. వీరిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బాందాకు చెందిన లవ్లేశ్ తివారీ(22), హమీర్‌పూర్‌కు చెందిన మోహిత్ అలియాస్ సన్నీ(23), కాస్గంజ్కు చెందిన అరుణ్ మౌర్య(18)గా గుర్తించారు. ఈ ముగ్గురిని అరెస్టు చేసి విచారించగా.. ఫేమస్ కావాలనే అతీక్ అహ్మద్‌ను షూట్ చేసినట్లు వీరు పోలీసులకు తెలిపారు. అందుకే పక్కా ప్లాన్ ప్రకారం పిస్టళ్లలో వెళ్లి కాల్చి చంపినట్లు పేర్కొన్నారు. కాల్పుల అనంతరం ముగ్గురు యువకులు ఘటనా స్థలంలో జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. అతీక్‌పై 100కు పైగా క్రిమినల్ కేసులున్నాయి. 2005 నాటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకు ప్రధాన సాక్షి ఉమేశ్‌పాల్‌ను హత్య చేసిన కేసులో విచారణ నిమిత్తం అతీక్ సోదరులను పోలీసులు ఇటీవలే అహ్మదాబాద్ సెంట్రల్ జైలు నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి నిందితులు గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్ హత్య కేసులో ముగ్గురు నిందితులను 14 రోజులపాటు జ్యుడీíÙయల్ కస్టడీకి తరలిస్తూ ప్రయాగ్‌రాజ్ కోర్టు ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అతీక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్ హత్య ఘటనపై దర్యాప్తు కోసం ప్రభుత్వం కమిషన్ ముగ్గురు సభ్యులతో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. చట్ట ప్రకారమే శిక్షించాలి: కాంగ్రెస్ నేరగాళ్లకు కఠిన శిక్షలు విధించాలని, కానీ, అది చట్టప్రకారమే జరగాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. దేశంలో అమల్లో ఉన్న చట్టాలకు లోబడే శిక్షలు ఉండాలని పేర్కొంది. రాజకీయ లబ్ధి కోసం చట్టాన్ని అతిక్రమించడం ప్రజాస్వామ్యానికి ముప్పేనని తేలి్చచెప్పింది. అతీక్ అహ్మద్, అష్రాఫ్ హత్యల నేపథ్యంలో కాంగ్రెస్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. నేరస్థులకు శిక్షలు విధించడానికి న్యాయస్థానాలు ఉన్నాయని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గుర్తుచేశారు. మన్మోహన్ ప్రభుత్వాన్ని కాపాడినవారిలో అతీక్ అమెరికాతో అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ 2008లో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించాయి. లోక్‌సభలో యూపీఏ సర్కారు సంఖ్యాబలం 228కి పడిపోయింది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో గట్టెక్కాలంటే మరో 44 మంది ఎంపీల మద్దతు అవసరం. ప్రభుత్వాన్ని కాపాడడానికి సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, జేడీ(యూ) తదితర పారీ్టలు ముందుకొచ్చాయి. గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ అప్పట్లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ. కానీ, జైలులో ఉన్నాడు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి మొత్తం ఆరుగురు ఎంపీలను జైళ్ల నుంచి తాత్కాలికంగా బయటకు తీసుకొచ్చారు. వారిలో అతీక్ అహ్మద్ కూడా ఉన్నాడు. వైద్య పరీక్షల నిమిత్తం శనివారం రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో పోలీసులు అతీక్ సోదరులను ఎంఎల్ఎన్ వైద్య కళాశాలకు తరలించారు. చేతులకు బేడీలతో ఉన్న సోదరులిద్దరూ అక్కడికి చేరుకున్న మీడియాతో మాట్లాడుతూ ముందుకు నడుస్తుండగా.. రెప్పపాటులో నాటకీయ పరిణామాలు జరిగిపోయాయి. మీడియా ముసుగులో వారితో పాటు నడుస్తున్న ముగ్గురు యువకులు ఉన్నట్టుండి పిస్టళ్లు తీశారు. నేరుగా వారిపైకి కాల్పులకు దిగారు. ఒకడు ముందు అతీక్ తలపై కాల్చాడు. విస్మయంతో చూస్తున్న అఫ్రష్ తలపైకి మరో తూటా దూసుకెళ్లింది. దాంతో సోదరులిద్దరూ మీడియాతో మాట్లాడుతున్న వాళ్లు మాట్లాడుతున్నట్టుగానే కుప్పకూలిపోయారు. వారితో పాటున్న పోలీసులు కాల్పులు జరుగుతుంటే తలోవైపు చెదిరిపోయారు. ఆ వెంటనే హంతకులు ముగ్గురూ కుప్పకూలిన అతీక్ సోదరుల దగ్గరికి వెళ్లి వారిపై తూటాల వర్షం కురిపించారు. అంతలో తేరుకున్న పోలీసులు వారివైపు దూసుకొచ్చారు. హంతకుల్లో ఇద్దరు చేతులు పైకెత్తి వారికి లొంగిపోయారు. మూడో వ్యక్తి కొద్ది దూరం పరిగెత్తినా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: పోలీసు వలయం మధ్య, మీడియా సాక్షిగా... అతీక్ సోదరుల హత్య -
పోలీసు వలయం మధ్య, మీడియా సాక్షిగా... అతీక్ సోదరుల హత్య
ప్రయాగ్‌రాజ్: చుట్టూ వలయంగా పోలీసులు. ఎదురుగా మీడియా. విలేకరుల ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఇంతమందీ చూస్తుండగానే ముగ్గరు యువకులు శరవేగంగా దూసుకొచ్చారు. పిస్టళ్లు తీసి నేరుగా తలలకు గురి పెట్టి పాయింట్ బ్లాంక్‌లో కాల్పులకు దిగారు. అంతే...! పేరుమోసిన గ్యాంగ్‌స్టర్, మాజీ రాజకీయ నాయకుడు అతీక్ అహ్మద్ (60), ఆయన సోదరుడు అష్రఫ్ అక్కడికక్కడే నేలకొరిగారు. ఇద్దరి శరీరాలూ తూటాలతో తూట్లు పడ్డాయి. తాము పుట్టి పెరిగిన, నేర సామ్రాజ్యానికి కేంద్రంగా మలచుకున్న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోనే వారి కథ అలా ముగిసిపోయింది. అతీక్ మూడో కుమారుడు అసద్‌ను గురువారమే యూపీ పోలీసులు ఝాన్సీలో ఎన్కౌంటర్ చేయడం తెలిసిందే. అతని అంత్యక్రియలు శనివారం ఉదయమే ప్రయాగ్‌రాజ్‌లో ముగిశాయి. వాటిలో పాల్గొనాలన్న అతీక్ కోరిక తీరకపోగా రాత్రికల్లా సోదరునితో సహా తానూ కడతేరిపోయాడు. మీడియా, పోలీసుల సాక్షిగా జరిగిన ఈ జంట హత్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. యూపీలో సీఎం యోగి సారథ్యంలో సాగుతున్న ఎన్కౌంటర్ల పరంపరకు ఇది కొనసాగింపంటూ విపక్షాలు దుయ్యబడుతున్నాయి... మీడియాతో మాట్లాడుతుండగానే... పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ అయిన అతీక్‌పై 100కు పైగా క్రిమినల్ కేసులున్నాయి. 2005 నాటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యకు ప్రధాన సాక్షి ఉమేశ్‌పాల్‌ను హత్య చేసిన కేసులో విచారణ నిమిత్తం అతీక్ సోదరులను పోలీసులు ఇటీవలే అహ్మదాబాద్ సెంట్రల్ జైలు నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అసద్ అంత్యక్రియలు జరిగిన ప్రదేశానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధూమన్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో వారిని శనివారం రోజంతా విచారించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో పోలీసులు ఎంఎల్ఎన్ వైద్య కళాశాలకు తరలించారు. చేతులకు బేడీలతో ఉన్న సోదరులిద్దరూ అక్కడికి చేరుకున్న మీడియాతో మాట్లాడుతూ ముందుకు నడుస్తున్నారు. కుమారుని అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు కదా అని ప్రశ్నించగా, ‘పోలీసులు తీసుకెళ్లలేదు. ఏం చేస్తాం?’ అని అతీక్ బదులిచ్చారు. ‘అల్లా తానిచ్చిన దాన్ని వెనక్కు తీసుకున్నాడు’ అని అష్రఫ్ అన్నారు. ‘అసలు విషయం ఏమిటంటే గుడ్డు ముస్లిం (అతీక్ అనుచరుని పేరు)...’ అంటూ ఏదో చెబుతుండగానే రెప్పపాటులో నాటకీయ పరిణామాలు జరిగిపోయాయి. మీడియా ముసుగులో వారితో పాటు నడుస్తున్న ముగ్గురు యువకులు ఉన్నట్టుండి పిస్టళ్లు తీశారు. నేరుగా వారిపైకి కాల్పులకు దిగారు. ఒకడు ముందు అతీక్ తలపై కాల్చాడు. విస్మయంతో చూస్తున్న అఫ్రష్ తలపైకి మరో తూటా దూసుకెళ్లింది. దాంతో సోదరులిద్దరూ మీడియాతో మాట్లాడుతున్న వాళ్లు మాట్లాడుతున్నట్టుగానే కుప్పకూలిపోయారు. వారితో పాటున్న పోలీసులు కాల్పులు జరుగుతుంటే తలోవైపు చెదిరిపోయారు. ఆ వెంటనే హంతకులు ముగ్గురూ కుప్పకూలిన అతీక్ సోదరుల దగ్గరికి వెళ్లి వారిపై తూటాల వర్షం కురిపించారు. అంతలో తేరుకున్న పోలీసులు వారివైపు దూసుకొచ్చారు. హంతకుల్లో ఇద్దరు చేతులు పైకెత్తి వారికి లొంగిపోయారు. మూడో వ్యక్తి కొద్ది దూరం పరిగెత్తినా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యాకాండతో మెడికల్ కాలేజీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ మొత్తం ఉదంతం మీడియా కెమెరాల్లో లైవ్‌గా రికార్డయింది. హంతకులను లవ్లేశ్ తివారీ, సన్నీ, అరుణ్ మౌర్యగా గుర్తించారు. వారిని విచారించాకే ఏ విషయమూ తెలుస్తుందని పోలీసులు తెలిపారు. వారు వాడిన మూడు బైకులను, ఘటనా స్థలి నుంచి రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో మాన్సింగ్ అనే కానిస్టేబుల్, ఏఎన్ఐ విలేకరి స్వల్పంగా గాయపడ్డట్టు చెప్పారు. అతీక్ సోదరుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాల్పుల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నతస్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. ముందుజాగ్రత్తగా ప్రయాగ్‌రాజ్‌లో 144 సెక్షన్ విధించారు. ఈ ఘటనకు సంబంధించి 17 మంది పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. దీనిపై యూపీ ప్రభుత్వం త్రిసభ్య జ్యుడీషియల్ కమిషన్ వేసింది. (చదవండి: కరోనాతో చనిపోయాడని అధికారులు చెప్తే.. బతికొచ్చి బిత్తరపోయేలా చేశాడు!) నలుగురు కొడుకులూ పోలీసుల అదుపులోనే మారిన పరిస్థితుల నేపథ్యంలో తనకు, సోదరునికి, కుమారులకు ప్రాణ హాని తప్పదని అతీక్ కొద్ది రోజులుగా భయపడుతూనే ఉన్నారు. కనీసం తన కుటుంబంలోని ఆడవాళ్లకు, పిల్లలకు హాని తలపెట్టొద్దని ఇటీవలే పోలీసులకు విజ్ఞప్తి కూడా చేశారు. అతీక్ పెద్ద కుమారుడు ఉమర్ లఖ్‌నవూ జైల్లో, రెండో కొడుకు అలీ ప్రయాగ్‌రాజ్‌లోనే నైనీ జైల్లో, నాలుగో కొడుకు ఆజం, ఐదో కొడుకు అబాన్ జువనైల్ హోమ్‌లో ఉన్నారు. నేరప్రదేశ్: అఖిలేశ్ అతీక్ సోదరుల హత్యను సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ‘‘యూపీలో నేరాలు తారస్థాయికి చేరాయి. ఉత్తరప్రదేశ్ నేరప్రదేశ్గా మారింది’’ అంటూ అఖిలేశ్ మండిపడ్డారు. అతీక్ సమాజ్‌వాదీ నుంచే ఎంపీగా నెగ్గారు. ముగిసిన అసద్ అంత్యక్రియలు అతీక్ అహ్మద్ మూడో కుమారుడు అసద్ అంత్యక్రియలు శనివారం ఉదయం ప్రయాగ్‌రాజ్‌లో పటిష్ట పోలీసు భద్రత నడుమ ముగిశాయి. అందులో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని శుక్రవారమే అతీక్ మేజిస్ట్రేట్‌ను అనుమతి కోరగా శుక్రవారం సెలవు కారణంగా విజ్ఞాపన ఇంకా మేజిస్ట్రేట్ దగ్గరే పెండింగ్‌లో ఉండిపోయింది. ఈ వినతిని శనివారం చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ విచారించాల్సి ఉండగా ఆలోపే అసద్ అంత్యక్రియలు ముగిశాయి. దీంతో అంత్యక్రియలకు అతీక్ వెళ్లడం వీలుకాలేదని అతని లాయర్ వెల్లడించారు. పటిష్ట భద్రత ఉన్నా బంధువుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిగాయని అసద్ మేనమామ ఉస్మాన్ చెప్పారు. (చదవండి: యూపీలో వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది...) -
అసద్ అంత్యక్రియలు .. తండ్రి అతిఖ్ అహ్మద్‌కు అనుమతి నిరాకరణ
లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతిఖ్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ అంత్యక్రియుల ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరిగాయి. ఉమేష్ పాల్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఏళ్ల అసద్‌ను యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఝాన్సీలో గురువారం ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. అసద్‌తో పాటు అతని అనుచరుడ్ని కూడా ఈ ఎన్కౌంటర్లో హతమార్చారు. అనంతరం అసద్ భౌతికకాయాన్ని పోలీసులే ఝాన్సీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తరలించారు. అంత్యక్రియల్లో అతికొద్ది మంది బంధువులే పాల్గొన్నారు. కాగా.. తన కొడుకు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని అతిఖ్ అహ్మద్ ప్రయాగ్‌రాజ్ కోర్టును కోరగా అతనికి నిరాశే ఎదురైంది. న్యాయస్థానం అందుకు నిరాకరించింది. దీంతో కుమారుడిని కడసారి చూసుకోలేకపోయానని అతడు మనోవేధనకు గురైనట్లు తెలుస్తోంది. ఉమేష్ పాల్ హత్య అనంతరం అసద్ 50 రోజులు పరారీరో ఉన్నాడు. అయితే తన తండ్రిని పోలీసులు అహ్మదాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ తరలిస్తున్నారని తెలిసి అతడ్ని తప్పించేందుకు ప్లాన్ చేసి దొరికాడు. ఈ క్రమంలో ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. చదవండి: తండ్రిని తప్పించేందుకు పోలీసుల కాన్వాయ్‌పై దాడికి కుట్ర.. అసద్ ఎన్‌కౌంటర్‌కు ముందు ఇంత జరిగిందా?