గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ హత్యోదంతంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలిసారి స్పందించారు. ఈ సందర్భంగా గ్యాంగ్ స్టర్స్, క్రిమినల్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ఓ బహిరంగ సమావేశంలో పాల్గొన్న యోగి మాట్లాడుతూ.. ఇకపై యూపీలో గ్యాంగ్‌స్టర్లు ఏ ఒక్కరిని బెదిరించలేరని పేర్కొన్నారు. సాధారణ ప్రజానీకం నుంచి వ్యాపారవేత్తల వరకు ఎవరికీ క్రిమినల్, మాఫియా భయం ఉండబోదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని వ్యాఖ్యానించారు.
2017కు ముందు ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని యోగి ఆదిత్యానాథ్ విమర్శించారు. అల్లర్లకు రాష్ట్రం అపఖ్యాతి పాలయ్యిందని దుయ్యబట్టారు. గతంలో రాష్ట్ర గుర్తింపు కోసం పాకులాడే పరిస్థితి ఉండేదని మండిపడ్డారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని, నేరస్థులు, మాఫియా వెన్నులో వణుకు పుడుతోందని తెలిపారు.
అయితే 2017 నుంచి 2023 వరకు రాష్ట్రంలో ఒక్క మతపరమైన హింస కూడా చోటుచేసుకోలేదని తెలిపారు. ఈ ఆరేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదని అన్నారు. తమ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడానికి శాయశక్తులా కృషి చేస్తోన్నామని చెప్పారు. కాగా యూపీలో రాజకీయ నేతగా ఎదిగిన గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ హత్య జరిగిన మూడు రోజుల అనంతరం యోగీ ఈ వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Now mafia cannot threaten anyone in Uttar Pradesh, says CM Adityanath days after Mafia brothers Atiq-Ashraf were killed amid police presence & Atiq's son Asad was killed in a police encounter pic.twitter.com/hjfeBVF6qt
— ANI (@ANI) April 18, 2023
ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను కోర్టు విచారణ కోసం సబర్మతి జైలు నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చిన సమయంలో శనివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో లవ్‌లేష్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్యను పోలీసులు అరెస్ట్ చేశారు. జర్నలిస్టులుగా చెప్పుకొని, ప్రెస్ కార్డులను మెడలో ధరించి అతిక్ సోదరుల సమీపానికి వచ్చి కాల్పులకు తెగబడ్డారు. ఇదిలా ఉండగా ఇటీవలే అతిక్ అహ్మద్ కుమారుడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
రహస్య లేఖ
అతిక్ అహ్మద్ రాసినట్టు చెబుతున్న ఓ 'రహస్య లేఖ'ను అతని న్యాయవాది సోమవారం బయటపెట్టారు. అతిక్ అహ్మద్ హత్యకు సరిగ్గా రెండు వారాల ముందు భారత సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. తనను ఎవరైనా హత్య చేస్తే ఈ లేఖను సుప్రీంకోర్టుకు అందజేయాలని అతిక్ కోరినట్టు న్యాయవాది వెల్లడించారు. అందుకే దాన్ని అపెక్స్ కోర్టుకు సమర్పిస్తున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment