కంటికి కన్ను... పంటికి పన్ను లాంటి డైలాగులు, వెంటాడి వేటాడడాలు తెరపై చూస్తాం. నిజ జీవితంలో పదులకొద్దీ సాయుధ పోలీసుల కళ్ళెదుట, టీవీ కెమెరాల ముంగిట అలా జరగడం ఒళ్ళు జల దరించే అనుభవం. రాజకీయాల్లోకొచ్చిన నేరసామ్రాజ్యనేత అతీక్ అహ్మద్, ఆయన తమ్ముడు ఖాలిద్ అజీమ్ అలియాస్ అష్రాఫ్‌లు యూపీలో పోలీస్ కస్టడీలో ఉండగా, మీడియా ముసుగులో వచ్చి ముగ్గురు కుర్రాళ్ళు చంపిన తీరు అలాంటిదే.
హత్యలు, అపహరణలకు పాల్పడి నూటికిపైగా కేసులున్న నేరగాడిగా పేరుమోసిన అతీక్ జీవితంలో హింసను నమ్మి, చివరకు హింసలోనే చనిపోవడం కవితాత్మక న్యాయంగా కనిపించవచ్చు. కానీ కరడుగట్టిన నేరస్థుణ్ణి సైతం చట్టబద్ధంగా విచారించి కోర్ట్‌లో కఠినశిక్ష విధించాలి. తక్షణశిక్షలతో సత్వరన్యాయం జరపాలనిచూస్తే అన్యాయమే.
‘మాఫియా కో మిట్టీ మే మిలా దూంగా’ (మాఫియాను మట్టిలో కలిపేస్తాను) అని అసెంబ్లీ సాక్షిగా గర్జించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ నెలలోనే కనీసం 3 ఎన్‌కౌంటర్లకు మౌనసాక్షి. విషాదం ఏమిటంటే, ఈ సర్కారీ ప్రేరేపిత హింసను పౌర సమాజం సైతం అభ్యంతర పెట్టకుండా, ఆమోదిస్తూ ఉండడం. పరారీలో ఉన్న అతీక్ కుమారుడు ‘ఆత్మరక్షణకు పోలీసుల ఎదురుకాల్పుల్లో’ గురువారం ఝాన్సీలో చనిపోతే, శనివారం రాత్రి ప్రయాగరాజ్‌లో పోలీసుల ఎదుటే కాల్పుల్లో అతీక్ ప్రాణాలు విడిచాడు.
రాజకీయ ప్రత్యర్థి ఉమేశ్‌పాల్ హత్యలో తండ్రీ కొడుకులిద్దరూ నింది తులు. అతీక్ హత్యపై రిటైర్డ్ జడ్జీ సారథ్యంలో కమిషన్ వేశారు యోగి. తీరా మంత్రులే ఈ మర ణాలు ‘కర్మ ఫలిత’మనీ, ‘దేవుడి న్యాయ’మనీ వ్యాఖ్యానిస్తుంటే ఇక విచారణలో ఏం తేలుతుంది!
అతీక్‌ను ఎవరో చంపారనీ, వ్యవస్థ ప్రమేయం లేదనీ నమ్మలేం. చట్టప్రకారం ఏప్రిల్ 13న కస్టడీకి కోర్టు అప్పగించిన వెంటనే వైద్యపరీక్షలు జరపాల్సిన పోలీసులు 15వ తేదీ రాత్రి దాకా ఎందుకు ఆలస్యం చేశారు? సాధారణ పరీక్షలకు అసాధారణంగా ఆ రాత్రివేళను ఎందుకు ఎంచు కున్నారు? సంకెళ్ళు వేయరాదని కోర్టు తీర్పులున్నా సరే ఎందుకు వేశారు? కాలిస్తే ఒకరికొకరు దూరం జరిగే వీలైనా లేకుండా హతులిద్దరికీ కలిపి ఒకే పొడవాటి సంకెల ఎందుకేశారు? ప్రాణహాని ఉన్న నేరస్థులని తెలిసినా బందోబస్తులో ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఆ సమయానికి వారు అక్కడికలా నడుచుకుంటూ వస్తారని కాల్పులు జరిపిన కుర్రాళ్ళకెలా తెలిసింది? ఘోర నేర చరిత్రలేమీ లేని వారి చేతికి ఆధునిక విదేశీ తుపాకీలెలా వచ్చాయి? ఇలా ఎన్నో ప్రశ్నలు. వెరసి, యూపీలో శాంతిభద్రతలకు టీవీ ప్రత్యక్షప్రసారాలకు చిక్కిన ఈ హత్యలే ప్రతీక. కస్టడీలోని వారికైనా కనీస భద్రత కల్పించలేని పోలీసు వ్యవస్థ ఘనతకు ఉదాహరణ.
ఇంతకీ నకిలీ ఎన్‌కౌంటర్లు, సర్కారీ ప్రేరేపిత హత్యల ద్వారా యూపీ సర్కార్ ఏ సంకేతాలు పంపాలని చూస్తోంది? పట్టుమని 17 ఏళ్ళకే కేసులకెక్కి, 60 ఏళ్ళ వయసులో ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్న అతీక్ ఇన్నేళ్ళుగా రాజకీయపార్టీల్లో కొనసాగుతూ, ఇష్టారాజ్యంగా దంధా కొనసాగించడం 1990ల నుంచి మన రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థల పుణ్యమే. జైలుకెళ్ళినా చక్రం తిప్పిన అతీక్‌ను 2019లో గుజరాత్‌లో జైలుకు మార్చారు.
ఇటీవలే యూపీకి పట్టుకొచ్చారు. తాజా ఘటనతో ఈ డాన్ కథ ముగిసింది. కానీ, చేసిన నేరాలూఘోరాలూ ఎన్నయినా, ఎంత పెద్దవైనా కావచ్చు. విచారణ లేకుండా తక్షణన్యాయమే పరిష్కారమనే ప్రభుత్వాల ధోరణి రాజ్యాంగ విహిత న్యాయసూత్రాలకే విరుద్ధం. సమదృష్టితో సాగాల్సిన వ్యవస్థలపై విశ్వాసానికి విఘాతం.
యూపీలో యథేచ్ఛగా సాగుతున్న ఎన్‌కౌంటర్లపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం నాలుగేళ్ళ క్రితమే 2019 జనవరిలో ఆందోళన వ్యక్తం చేసింది. 2017 మార్చిలో యోగి సర్కార్ ఏర్పాటైనప్పటి నుంచి అలాంటి 15 కేసుల పూర్తి సమాచారాన్ని అప్పట్లోనే భారత ప్రభుత్వానికి పంపింది. ఆ కేసుల్లో బాధితులందరూ నిరుపేద మైనారిటీలే.
తాజా డేటా ప్రకారం గత ఆరేళ్ళ యోగి పాలనలో 10,900కు పైగా పోలీస్ ఎన్‌కౌంటర్లు జరిగాయి. నిందితులు 183 మంది పోలీసు తూటాలకు ప్రాణాలు కోల్పోయారు. నిజానికి, నకిలీ ఎన్‌కౌంటర్లపై ఆందోళనతో జాతీయ మానవ హక్కుల సంఘం ఎప్పుడో మార్గదర్శకాలిచ్చింది. కానీ గద్దె మీది పెద్దలు తలుచు కున్నప్పుడల్లా అవి గాలికి పోతున్నాయి. వెరసి నేర న్యాయవ్యవస్థ కుప్పకూలి, పోలీస్, న్యాయ వ్యవస్థల్లో సంస్కరణలు అవసరమని గుర్తు చేస్తున్నాయి.
ఇక, గత నవంబర్‌లో అమృత్‌సర్‌లో ఓ హిందూ రాజకీయ నేత ఇలాగే మీడియా ముందు కాల్పులకు గురై చనిపోయినప్పుడు సోకాల్డ్ మేధావులు ఇంత రచ్చ చేయలేదేమిటన్నది ఓ వాదన. జరిగిన దారుణాన్ని బట్టి కాక, మతాన్ని బట్టి గగ్గోలు పెడుతున్నారనీ వారి ఆరోపణ. చిత్రంగా మారణకాండలో సైతం మతం చొచ్చుకొచ్చిన రోజులివి. అతీక్ కుమారుడు ఎన్‌కౌంటరైనప్పుడు అధికార పార్టీ యువజన విభాగం టపాసులు కాల్చి, సంబరాలు చేసుకుంది. అది ఆందోళన రేపే ధోరణి. అది మరవక ముందే ప్రాణహాని ఉందంటూ అతీక్ సుప్రీం కోర్ట్‌లో భయపడినట్టే జరిగింది.
అంతకన్నా భయపడాల్సిందేమిటంటే – హతులు ముస్లిమ్‌లైనప్పుడల్లా హంతకులు జైశ్రీరామ్ నినాదాలు చేయడం. ప్రజలను వర్గాలుగా చీల్చే ఈ ప్రయత్నాలు, దేవుడి పేరు అడ్డంపెట్టి దారుణా లకు ఒడిగట్టే తీరు సమాజానికి క్యాన్సర్ కన్నా ప్రమాదకరం. ఏ వర్గం ఇలాంటి దుశ్చర్యలకు దిగినా గర్హనీయమే. ‘డబుల్ ఇంజన్’, ‘బుల్‌డోజర్’ లాంటి మాటలతో మళ్ళీ కేంద్రంలో గద్దెనెక్కదలచిన పార్టీలూ, కాబోయే ప్రధానిగా ప్రచారమవుతున్న యూపీ నేతలూ అది గమనించాలి.
తూటాలతో తక్షణ న్యాయం?
Published Tue, Apr 18 2023 2:52 AM | Last Updated on Tue, Apr 18 2023 2:52 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment