పోలీసు వలయం మధ్య, మీడియా సాక్షిగా... అతీక్‌ సోదరుల హత్య | Gangster Atiq Ahmed, brother Ashraf killed in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

పోలీసు వలయం మధ్య, మీడియా సాక్షిగా... అతీక్‌ సోదరుల హత్య

Published Sun, Apr 16 2023 2:25 AM | Last Updated on Sun, Apr 16 2023 10:14 AM

Gangster Atiq Ahmed, brother Ashraf killed in Uttar Pradesh - Sakshi

హత్యకు క్షణాల ముందు చేతికి బేడీలతో పోలీసు వలయంలో అతీక్‌ సోదరులు

ప్రయాగ్‌రాజ్‌: చుట్టూ వలయంగా పోలీసులు. ఎదురుగా మీడియా. విలేకరుల ప్రశ్నలు కొనసాగుతున్నాయి. ఇంతమందీ చూస్తుండగానే ముగ్గరు యువకులు శరవేగంగా దూసుకొచ్చారు. పిస్టళ్లు తీసి నేరుగా తలలకు గురి పెట్టి పాయింట్‌ బ్లాంక్‌లో కాల్పులకు దిగారు. అంతే...! పేరుమోసిన గ్యాంగ్‌స్టర్, మాజీ రాజకీయ నాయకుడు అతీక్‌ అహ్మద్‌ (60), ఆయన సోదరుడు అష్రఫ్‌ అక్కడికక్కడే నేలకొరిగారు. ఇద్దరి శరీరాలూ తూటాలతో తూట్లు పడ్డాయి.

తాము పుట్టి పెరిగిన, నేర సామ్రాజ్యానికి కేంద్రంగా మలచుకున్న ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోనే వారి కథ అలా ముగిసిపోయింది. అతీక్‌ మూడో కుమారుడు అసద్‌ను గురువారమే యూపీ పోలీసులు ఝాన్సీలో ఎన్‌కౌంటర్‌ చేయడం తెలిసిందే. అతని అంత్యక్రియలు శనివారం ఉదయమే ప్రయాగ్‌రాజ్‌లో ముగిశాయి. వాటిలో పాల్గొనాలన్న అతీక్‌ కోరిక తీరకపోగా రాత్రికల్లా సోదరునితో సహా తానూ కడతేరిపోయాడు. మీడియా, పోలీసుల సాక్షిగా జరిగిన ఈ జంట హత్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. యూపీలో సీఎం యోగి సారథ్యంలో సాగుతున్న ఎన్‌కౌంటర్ల పరంపరకు ఇది కొనసాగింపంటూ విపక్షాలు దుయ్యబడుతున్నాయి...

మీడియాతో మాట్లాడుతుండగానే...
పేరుమోసిన గ్యాంగ్‌స్టర్‌ అయిన అతీక్‌పై 100కు పైగా క్రిమినల్‌ కేసులున్నాయి. 2005 నాటి బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్‌ హత్యకు ప్రధాన సాక్షి ఉమేశ్‌పాల్‌ను హత్య చేసిన కేసులో విచారణ నిమిత్తం అతీక్‌ సోదరులను పోలీసులు ఇటీవలే అహ్మదాబాద్‌ సెంట్రల్‌ జైలు నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అసద్‌ అంత్యక్రియలు జరిగిన ప్రదేశానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధూమన్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్లో వారిని శనివారం రోజంతా విచారించారు.

అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో పోలీసులు ఎంఎల్‌ఎన్‌ వైద్య కళాశాలకు తరలించారు. చేతులకు బేడీలతో ఉన్న సోదరులిద్దరూ అక్కడికి చేరుకున్న మీడియాతో మాట్లాడుతూ ముందుకు నడుస్తున్నారు. కుమారుని అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు కదా అని ప్రశ్నించగా, ‘పోలీసులు తీసుకెళ్లలేదు. ఏం చేస్తాం?’ అని అతీక్‌ బదులిచ్చారు. ‘అల్లా తానిచ్చిన దాన్ని వెనక్కు తీసుకున్నాడు’ అని అష్రఫ్‌ అన్నారు.

‘అసలు విషయం ఏమిటంటే గుడ్డు ముస్లిం (అతీక్‌ అనుచరుని పేరు)...’ అంటూ ఏదో చెబుతుండగానే రెప్పపాటులో నాటకీయ పరిణామాలు జరిగిపోయాయి. మీడియా ముసుగులో వారితో పాటు నడుస్తున్న ముగ్గురు యువకులు ఉన్నట్టుండి పిస్టళ్లు తీశారు. నేరుగా వారిపైకి కాల్పులకు దిగారు. ఒకడు ముందు అతీక్‌ తలపై కాల్చాడు. విస్మయంతో చూస్తున్న అఫ్రష్‌ తలపైకి మరో తూటా దూసుకెళ్లింది.

దాంతో సోదరులిద్దరూ మీడియాతో మాట్లాడుతున్న వాళ్లు మాట్లాడుతున్నట్టుగానే కుప్పకూలిపోయారు. వారితో పాటున్న పోలీసులు కాల్పులు జరుగుతుంటే తలోవైపు చెదిరిపోయారు. ఆ వెంటనే హంతకులు ముగ్గురూ కుప్పకూలిన అతీక్‌ సోదరుల దగ్గరికి వెళ్లి వారిపై తూటాల వర్షం కురిపించారు. అంతలో తేరుకున్న పోలీసులు వారివైపు దూసుకొచ్చారు. హంతకుల్లో ఇద్దరు చేతులు పైకెత్తి వారికి లొంగిపోయారు. మూడో వ్యక్తి కొద్ది దూరం పరిగెత్తినా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యాకాండతో మెడికల్‌ కాలేజీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ మొత్తం ఉదంతం మీడియా కెమెరాల్లో లైవ్‌గా రికార్డయింది.

హంతకులను లవ్లేశ్‌ తివారీ, సన్నీ, అరుణ్‌ మౌర్యగా గుర్తించారు. వారిని విచారించాకే ఏ విషయమూ తెలుస్తుందని పోలీసులు తెలిపారు. వారు వాడిన మూడు బైకులను, ఘటనా స్థలి నుంచి రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో మాన్‌సింగ్‌ అనే కానిస్టేబుల్, ఏఎన్‌ఐ విలేకరి స్వల్పంగా గాయపడ్డట్టు చెప్పారు. అతీక్‌ సోదరుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాల్పుల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నతస్థాయి సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. ముందుజాగ్రత్తగా ప్రయాగ్‌రాజ్‌లో 144 సెక్షన్‌ విధించారు. ఈ ఘటనకు సంబంధించి 17 మంది పోలీసులపై సస్పెన్షన్‌ వేటు పడింది. దీనిపై యూపీ ప్రభుత్వం త్రిసభ్య జ్యుడీషియల్‌ కమిషన్‌ వేసింది.
(చదవండి: కరోనాతో చనిపోయాడని అధికారులు చెప్తే.. బతికొచ్చి బిత్తరపోయేలా చేశాడు!)


నలుగురు కొడుకులూ పోలీసుల అదుపులోనే
మారిన పరిస్థితుల నేపథ్యంలో తనకు, సోదరునికి, కుమారులకు ప్రాణ హాని తప్పదని అతీక్‌ కొద్ది రోజులుగా భయపడుతూనే ఉన్నారు. కనీసం తన కుటుంబంలోని ఆడవాళ్లకు, పిల్లలకు హాని తలపెట్టొద్దని ఇటీవలే పోలీసులకు విజ్ఞప్తి కూడా చేశారు. అతీక్‌ పెద్ద కుమారుడు ఉమర్‌ లఖ్‌నవూ జైల్లో, రెండో కొడుకు అలీ ప్రయాగ్‌రాజ్‌లోనే నైనీ జైల్లో, నాలుగో కొడుకు ఆజం, ఐదో కొడుకు అబాన్‌ జువనైల్‌ హోమ్‌లో ఉన్నారు.

నేరప్రదేశ్‌: అఖిలేశ్‌
అతీక్‌ సోదరుల హత్యను సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్, మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ‘‘యూపీలో నేరాలు తారస్థాయికి చేరాయి. ఉత్తరప్రదేశ్‌ నేరప్రదేశ్‌గా మారింది’’ అంటూ అఖిలేశ్‌ మండిపడ్డారు. అతీక్‌ సమాజ్‌వాదీ నుంచే ఎంపీగా నెగ్గారు.

ముగిసిన అసద్‌ అంత్యక్రియలు
అతీక్‌ అహ్మద్‌ మూడో కుమారుడు అసద్‌ అంత్యక్రియలు శనివారం ఉదయం ప్రయాగ్‌రాజ్‌లో పటిష్ట పోలీసు భద్రత నడుమ ముగిశాయి. అందులో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని శుక్రవారమే అతీక్‌ మేజిస్ట్రేట్‌ను అనుమతి కోరగా శుక్రవారం సెలవు కారణంగా విజ్ఞాపన ఇంకా మేజిస్ట్రేట్‌ దగ్గరే పెండింగ్‌లో ఉండిపోయింది. ఈ వినతిని శనివారం చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ విచారించాల్సి ఉండగా ఆలోపే అసద్‌ అంత్యక్రియలు ముగిశాయి. దీంతో అంత్యక్రియలకు అతీక్‌ వెళ్లడం వీలుకాలేదని అతని లాయర్‌ వెల్లడించారు. పటిష్ట భద్రత ఉన్నా బంధువుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిగాయని అసద్‌ మేనమామ ఉస్మాన్‌ చెప్పారు.
(చదవండి: యూపీలో వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది...)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement