లక్నో: ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్-పొలిటీషియన్ అతీఖ్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్‌లను కాల్చి చంపిన నిందితులను అధికారులు జైలు మార్చారు. సన్నీ సింగ్, అరుణ్ మౌర్యా, లవ్‌లేష్ తొవారిలను ప్రయాగ్‌రాజ్ నైనీ జైలు నుంచి ప్రతాప్‌ఘడ్ జైలుకు మార్చేశారు ఉత్తర ప్రదేశ్ పోలీసులు. నైనీ జైలులో వాళ్లపై దాడి జరగవచ్చేనే నిఘా వర్గాల సమాచారం మేరకు ముగ్గురు హంతకులను జైలు మార్చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఫేమస్ కావాలనే తాము అహ్మద్ గ్యాంగ్‌ను ఏరివేసే పనిలో దిగామని, ఈ క్రమంలోనే అతీఖ్, అతని సోదరుడిని కాల్చిచంపామని ఈ ముగ్గురు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించారు. మరోవైపు కోర్టు వీళ్లకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.
ఇక అతీఖ్,అష్రాఫ్‌ల హత్య ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన జ్యూడీషియల్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. మరోవైపు యూపీ పోలీస్ శాఖ కూడా రెండు సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.
యూపీ పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి అతీఖ్, అష్రాఫ్‌లను వైద్యపరీక్షల కోసం తరలిస్తుండగా జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ఆ ముగ్గురు.. తుపాకులతో కాల్చి చంపిన తర్వాత జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ పోలీసులకు లొంగిపోయారు. వాళ్ల నుంచి ఫేక్ ఐడీకార్డులు , కెమెరా, మైక్‌లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముగ్గురిలో లవ్‌లేష్‌కు తూటా కాలి నుంచి దూసుకుపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
అంతకు ముందు.. బుధవారం ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉమేష్‌పాల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అతీఖ్ తనయుడు అసద్ అహ్మద్‌ను, అతన్ని అనుచరుడ్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment