మాఫియా డాన్, గ్యాంగ్ లీడర్, హిస్టరీ షీటర్, రౌడీ షీటర్, మాఫియా–బాహుబలి, దబాంగ్, పొలిటి కల్ లీడర్.. ఇవన్నీ ఒకే వ్యక్తికి పర్యాయపదాలు. ఆ ఒక్కడే అతీక్ అహ్మద్. ఉత్తరప్రదేశ్‌లో అసద్ అహ్మద్ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో అతడి తండ్రి అతీక్ అహ్మద్ పేరు మళ్లీ ప్రముఖంగా చర్చల్లోకి వచ్చింది. నిరుపేద టాంగావాలా కుమారుడైన అతీక్ అహ్మద్ రౌడీయిజంలో, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగాడు. రూ.వందల కోట్ల విలువైన ఆర్థిక సామ్రాజ్యం నిర్మించుకున్నాడు.
దివంగత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ జన్మించిన అలహాబాద్(ప్రయాగ్‌రాజ్)ను అతీక్ అహ్మద్ సొంత జాగీరుగా మార్చేసుకొని, సమాంతర పాలన సాగించాడంటే అతడి హవా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వందకుపైగా కేసులు నమోదైనప్పటికీ.. ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసు మినహా ఏ కేసులోనూ అతీక్‌కు శిక్ష పడలేదు. వ్యవస్థ మొత్తం అతడికి దాసోహమైందని, నిస్సిగ్గుగా ఊడిగం చేసిందని ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. నేరాల నుంచి వ్యాపారాలు, వ్యాపారాల నుంచి రాజకీయాలు.. ఇలా సాగింది అతీక్ ప్రస్థానం. నేరాలను, అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి, శిక్షల నుంచి తప్పించుకోవడానికి రాజకీయాలను రక్షణ కవచంగా వాడుకున్నాడు.
18 ఏళ్ల వయసులో తొలి ఎఫ్‌ఐఆర్
► అతీక్ అహ్మద్ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జన్మించాడు. టాంగా నడిపే అతడి తండ్రి హజీ ఫిరోజ్ నేరస్వభావం ఉన్నవాడే. అతీక్ బాల్యంలో కటిక పేదరికం అనుభవించాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కసితో నేరమార్గం ఎంచుకున్నాడు. స్నేహితులతో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. కిడ్నాప్‌లు, బెదిరింపులు, బలవంతపు వసూళ్లతో చెలరేగిపోయాడు. 1983లో 18 ఏళ్ల వయసున్నప్పుడు అతీక్‌పై మొదటి ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. అతడిని అదుపులోకి తీసుకొనేందుకు పోలీసులు విసిరిన వల నుంచి చాలాసార్లు తప్పించుకున్నాడు.
అతీక్‌పై నమోదైన కేసులను విచారించాలంటే న్యాయమూర్తులు వెనుకంజ వేసేవారు. అలహాబాద్ హైకోర్టుకు చెందిన 10 మంది జడ్జీ్జలు తమంతట తామే ఈ కేసుల విచారణ నుంచి తప్పుకున్నారు. అతీక్ చంపేస్తాడన్న భయమే ఇందుకు కారణం. యూపీలో యోగి ఆదిత్యనాథ్ పాలన మొదలయ్యాక కూడా ప్రత్యర్థులను కిడ్నాప్ చేసి, తానున్న జైలుకు రప్పించి, తీవ్రంగా హింసించాడు. అతడిని ఉత్తరప్రదేశ్ జైళ్లలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోని జైళ్లలో ఉంచాలని నాలుగేళ్ల క్రితం సుప్రీంకోర్టు ఆదేశించింది.
కుటుంబం.. నేరమయం
► ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడైన అతీక్ కుమారుడు అసద్ అహ్మద్ ఎన్‌కౌంటర్‌లో హతం కావడం దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారింది. కరడుగట్టిన నేరగాడైన అతీక్ అహ్మద్ కుటుంబ సభ్యులు సైతం నేరాలబాట పట్టినవారే కావడం గమనార్హం. కొందరు ఇప్పటికే వేర్వేరు కేసుల్లో జైలుపాలయ్యారు. అతడి భార్య మాత్రం పరారీలో ఉన్నారు.
ఎమ్మెల్యేగా, ఎంపీగా..
► నేర సామ్రాజ్యాధినేతగా ఎదిగిన అతీక్ అహ్మద్ కన్ను 1980వ దశకంలో రాజకీయాలపై పడింది. 1989లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అలహాబాద్ వెస్ట్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. మతం కార్డు వాడుకున్నాడు. తన ప్రత్యర్థి చాంద్‌బాబాను హత్య చేశాడు. సులువుగా విజయం సాధించాడు. తొలిసారి ఎమ్మెల్యే హోదా సంపాదించాడు. ఆ తర్వాత అదే స్థానం నుంచి 1991, 1993లోనూ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందాడు. 1996లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌తో, 2002 ఆప్నా దళ్ టికెట్‌తో గెలిచాడు. 2002లో ఆప్నా దళ్ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడయ్యాడు. హెలికాప్టర్లలో తిరుగుతూ రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు చేశాడు. 2004లో మళ్లీ సమాజ్‌వాదీ పార్టీలో చేరాడు. ఆ పార్టీ తరపున ఫూల్పూర్ ఎంపీగా ఘన విజయం సాధించాడు.
పార్లమెంట్‌లో అడుగుపెట్టాడు. మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలుపొందాడు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత కూడా నేరాలు ఆపలేదు. మరింత రాటుదేలాడు. బినామీల పేరిట కాంట్రాక్టులు దక్కించుకున్నాడు. ఇతర కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు వసూలు చేసేవాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. అడ్డొచ్చిన వారిని అంతం చేశాడు. భారీగా ఆస్తులు కూడబెట్టాడు. దేశవ్యాప్తంగా పదికిపైగా రాష్ట్రాలకు అతీక్ నేరసామ్రాజ్యం విస్తరించింది. అచ్ఛంగా సినిమాల్లో చూపించే డాన్ల తరహాలోనే అతడి వ్యవహార శైలి, ప్రవర్తన ఉండేవి. తరచుగా గుర్రంపై వీధుల్లో తిరిగేవాడు. కొన్నిసార్లు ఖరీదైన కార్ల కాన్వాయ్ వెంటరాగా పాదయాత్ర చేస్తుండేవాడు.
రాజుపాల్ హత్య కేసు
► 2005 జనవరి 25న ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఎమ్మెల్యే రాజుపాల్ హత్యతో అతీక్ పతనం ప్రారంభమైంది. ఈ తర్వాత జరిగిన పలు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేశాడు. కానీ, ఓటమే ఎదురయ్యింది. 2004లో ఎంపీగా గెలిచాక తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఉప ఎన్నికల్లో తన సోదరుడు అజీమ్‌కు సమాజ్‌వాదీ పార్టీ టికెట్ ఇప్పించుకున్నాడు. ఈ స్థానంలో నేరచరిత్ర ఉన్న రాజుపాల్‌కు బీఎస్పీ టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో అజీమ్ ఓడిపోయాడు. రాజుపాల్ ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత రాజుపాల్ హత్య జరిగింది. ఈ కేసులో అతీక్, అజీమ్ నిందితులు. రాజుపాల్ హత్యతో మళ్లీ ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై అజీమ్ గెలిచాడు. అతీక్ 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయాడు.
అసద్ అహ్మద్
► ఉమేశ్‌పాల్ మర్డర్ కేసులో అసద్ అహ్మద్ నిందితుడు. చాలా రోజులు పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు.
► అతడిపై రూ.5 లక్షల రివార్డు ఉంది.
► గురువారం ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు జరిపిన కాల్పుల్లో మరో నిందితుడు గులామ్‌తోపాటు మరణించాడు.
► అతీక్ అహ్మద్ మరో ఇద్దరు కుమారులైన అజాన్, అబాన్ మైనర్లు. వారు ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోని చైల్డ్ ప్రొటెక్షన్ హోంలో ఉన్నారు.
అతీక్ అహ్మద్
► గత 43 ఏళ్లుగా పోలీసు రికార్డుల్లో కొనసాగుతున్నాడు. ఇప్పటికే 100కుపైగా కేసులు నమోదయ్యాయి.
► ఉమేశ్‌పాల్ అపహరణ కేసులో అతీక్ అహ్మద్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
► ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతీ జైలులో ఉన్నాడు.
► అతీక్ అహ్మద్ 1996లో షాయిస్తా పర్వీన్‌ను వివాహం చేసుకున్నాడు.
► వారికి ఐదుగురు కుమారులు.. అలీ అహ్మద్, ఉమర్ అహ్మద్, అసద్ అహ్మద్, అజాన్ అహ్మద్, అబాన్ అహ్మద్ ఉన్నారు.
► పాకిస్తాన్ ఉగ్రవాదులతో, అక్కడి నిఘా సంస్థ ఐఎస్‌ఐతో అతీక్ అహ్మద్‌కు సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు గతంలో వెల్లువెత్తాయి.
అష్రాఫ్ అలియాస్ అజీమ్ అహ్మద్
► అతీక్ అహ్మద్ సోదరుడే అష్రాఫ్/అజీమ్ అహ్మద్.
► ఇతడిపై మొత్తం 52 కేసులు ఉన్నాయి. ఒకసారి సమాజ్‌వాదీ పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలుపొందాడు.
► 2006 నాటి ఉమేశ్‌పాల్ కిడ్నాప్ కేసులో ఇతడిని ప్రయాగ్‌రాజ్ కోర్టు దోషిగా తేల్చింది.
► యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
షాయిస్తా పర్వీన్
► ఉమేశ్ పాల్ హత్య వ్యవహారంలో అతీక్ అహ్మద్, ఆష్రాఫ్ అహ్మద్‌తోపాటు షాయిస్తా పర్వీన్‌పై కేసు నమోదయ్యింది.
► పరారీలో ఉన్న పర్వీన్‌పై ఉత్తరప్రదేశ్ పోలీసులు రివార్డు ప్రకటించారు.
► ఆమె ఆచూకీ ఇంకా దొరక్కపోవడంతో రివార్డు మొత్తాన్ని రూ.25,000 నుంచి రూ.50,000కు పెంచారు.
అలీ అహ్మద్
► బలవంతంగా డబ్బు వసూళ్లకు పాల్పడిన కేసులో 2021లో అలీ అహ్మద్‌ను పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపించారు.
► ఉమేశ్‌పాల్ హత్య కేసులోనూ అతడి పేరు తెరపైకి వచ్చింది.
► అలీ అహ్మద్ బెయిల్ పిటిషన్‌ను ఈ ఏడాది మార్చి 3న అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పుడు లక్నో జైలులో ఉన్నాడు.
► అలీ అహ్మద్ లాంటి నేరగాళ్లు బయట ఉంటే కేవలం సాక్షులకే కాదు, సమాజానికి సైతం ముప్పేనని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
ఉమర్ అహ్మద్
► లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మోహిత్ జైస్వాల్ కిడ్నాప్, దాడి కేసులో అతీక్ అహ్మద్‌తోపాటు ఉమర్ అహ్మద్‌పై 2018 ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది.
► అదే కేసులో ఉమర్ అహ్మద్ ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లోని నైనీ సెంట్రల్ జైలులో ఉన్నాడు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment