లక్నో: గ్యాంగ్‌స్టర్, పొలిటీషియన్ అతిఖ్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్‌ను యూపీ పోలీసులు గురువారం ఉదయం ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన అనంతరం పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. తన తండ్రిని అహ్మదాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు తరలించే సమయంలో పోలీస్ కాన్వాయ్‌పై దాడి చేసి అతడ్ని తప్పించాలని అసద్ ప్లాన్ చేశాడని చెప్పారు. దీని కోసమే అతడు కొద్ది రోజులుగా ఝాన్సీలో మకాం వేసినట్లుపేర్కొన్నారు.
అతిఖ్ గ్యాంగ్ పోలీస్ కాన్వాయ్‌పై దాడి చేసి అతడ్ని తప్పించవచ్చని నిఘా వర్గాలు కచ్చితమైన సమాచారం అందించాయని యూపీ అదనపు డీజీ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. అందుకే అతిఖ్‌ను తీసుకెళ్లే మార్గాన్ని జల్లెడపట్టినట్లు వివరించారు.
తనను ఎన్‌కౌంటర్ చేస్తారేమోనని భయంగా ఉందని అతిఖ్ అహ్మద్ పదే పదే చెప్పడంతో తన తండ్రిని ఎలాగైనా తప్పించాలని అసద్ భావించాడని, అందుకే ఎంతటి చర్యకైనా పాల్పడేందుకు సిద్ధపడ్డాడని అధికారులు చెప్పారు. ఈ దాడికి పథకం పన్నేందుకు కాన్వాయ్ వెళ్లే మార్గంలో అసద్ ఝాన్సీలో రెక్కీ కూడా నిర్వహించాడని పేర్కొన్నారు.
మార్చి చివర్లోనే ఝాన్సీలో అసద్ కదలికలను యూపీ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పసిగట్టినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. వెంటనే ఆ జిల్లాకు వెళ్లి పలువురిని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు చెప్పాయి. గత వారం కూడా అసద్ ఝాన్సీలో ఉన్నట్లు అధికారులు తెలుసుకున్నారు.
ఫిబ్రవరి 24న ఉమేష్ పాల్ హత్య అనంతరం అసద్ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం 50 రోజలకుపైగా గాలించారు. అయితే తండ్రిని కాపాడడం కోసం ప్రయత్నించి అతడు ఊహించని విధంగా పోలీసుల చేతికి చిక్కి ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.
గురువారం ఉదయం అసద్‌తో పాటు అతని అనుచరుడ్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. అతడ్ని కిలోమీటర్ పాటు వెంబడించిన అనంతరం పోలీసులపై కాల్పులకు పాల్పడటంతో షూట్ చేసి చంపారు. కుమారుడు ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడని తెలిసి తండ్రి అతిఖ్ అహ్మద్ కన్నీటిపర్యంతమయ్యాడు. తన వల్లే కొడుకు చనిపోయాడని వాపోయాడు.
చదవండి: ఉత్తర ప్రదేశ్‌లో సంచలన ఎన్‌కౌంటర్: కోర్టుకు అతిఖ్.. అదే టైంలో కొడుకు ఎన్‌కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment