న్యూఢిల్లీ: గుడ్డూ ముస్లిం.. ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఎవరీ గుడ్డూ అంటూ అంతా ఆరా తీస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ శనివారం రాత్రి ముగ్గురు యువకుల కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ మరణించడం తెలిసిందే. కాల్పులకు క్షణాల ముందు అష్రాఫ్ నోట వచ్చిన చివరి మాట గుడ్డూ గురించే. మెయిన్ బాత్ యే హై కీ గుడ్డూ ముస్లిం... (నేను చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన విషయం గుడ్డూ ముస్లిం...) అని అంటూనే సోదరులిద్దరూ కాల్పులకు బలయ్యారు.
గుడ్డూ అతీక్ అహ్మద్ ముఖ్య అనుచరుడు. తుపాకుల బదులు బాంబులు వాడటం ఇతని స్టైల్. బాంబులు విసిరి ప్రత్యర్థులను అంతం చేయడంలో దిట్ట. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లో పట్టపగలే ఉమేశ్ పాల్ హత్య జరిగింది. ఆ సమయంలో గుడ్డూ బైక్ వెనుక కూర్చొని నాటు బాంబులు విసురుతున్న దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది.
అతీక్ మరణానంతరం అతడి నేరసామ్రాజ్యం గుడ్డూ చేతికి వెళ్తుందని ప్రచారం సాగుతోంది. దాంతో యూపీ పోలీసుల నజర్ ఇప్పుడు అతనిపైనే ఉంది. ఉమేశ్ హత్య కేసులో 10 మంది నిందితుల్లో గుడ్డూ పేరూ ఉంది. ఆ పది మందిలో ఇప్పటిదాకా ఆరుగురు హతం కాగా గుడ్డూతో సహా మిగతా వారంతా పరారీలో ఉన్నారు. గుడ్డూ ప్రస్తుతం కర్ణాటకలో తలదాచుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
నమ్మినబంటు
గుడ్డూ ముస్లిం ప్రయాగ్‌రాజ్‌లో పుట్టాడు. చిన్న వయసులోనే నేర సామ్రాజ్యంతో పరిచయం ఏర్పడింది. లక్నోకు మకాం మార్చి పలు నేరాల్లో పాలుపంచుకున్నాడు. బడా వ్యక్తులతో సన్నిహితంగా మెలిగాడు. ఓ టీచర్ హత్య కేసులో 1997లో అరెస్టయ్యాడు. బలమైన సాక్ష్యాల్లేక విడుదలయ్యాడు.
బిహార్‌కు వెళ్లి నేరాలు కొనసాగించాడు. 2001లో మళ్లీ అరెస్టవగా అతీక్ బెయిల్‌పై బయటకు తీసుకొచ్చాడు. కొన్నేళ్ల క్రితం గుడ్డూ అనారోగ్యం పాలై పరిస్థితి విషమించగా అతీక్ రూ.8 లక్షలు ఖర్చు చేసి గుడ్డూను బతికించాడు. అందుకు కృతజ్ఞతగా ఉమేశ్‌పై గుడ్డూ బాంబులు విసిరి హత్య చేశాడు. అతీక్‌కు నమ్మినబంటుగా పేరుతెచ్చుకున్నాడు. అతీక్ కోసం పాకిస్తాన్ నుంచి పంజాబ్ మీదుగా ఆయుధాలను భారత్‌కు అక్రమంగా రవాణా చేసేవాడని పోలీసులు వెల్లడించారు.
అన్నీ అనుమానాలే
ప్రయాగ్‌రాజ్/లక్నో/న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్లు అతీక్, అష్రాఫ్ హత్య విషయంలో పోలీసుల తీరుపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అంతటి కరడుగట్టిన నేరగాళ్లను రాత్రిపూట ఎందుకు ఆసుపత్రికి తీసుకొచ్చారు? పైగా వారున్న వాహనాన్ని గేటు బయటే ఆపి నడిపించుకుంటూ ఎందుకు వచ్చారు? మీడియా కంటపడకుండా ఆసుపత్రి లోపలి దాకా వాహనంలో ఎందుకు తీసుకురాలేదు? పైగా ఐఎస్‌ఐ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్టు విచారణలో సోదరులిద్దరూ ఒప్పుకున్నారు.
నిబంధనల ప్రకారం ఇలాంటి కేసుల్లో నిందితుల్ని మీడియాతో సహా ఎవరి కంటా పడనివ్వకూడదు. దాన్నీ తుంగలో తొక్కారు. హంతకులు ముగ్గురూ విలేకరుల ముసుగులో వచ్చి కాల్పులు జరపడం తెలిసిందే. మీడియా ప్రతినిధులను తనిఖీ చేయకుండానే గ్యాంగ్‌స్టర్ల దగ్గరికి అనుమతించడం వెనక కుట్ర ఉండొచ్చంటున్నారు. వారు 20 తూటాల దాకా కాల్చినా నిందితుల వెన్నంటే ఉన్న పోలీసుల్లో మాత్రం ఎవరికీ ఏమీ కాకపోవడం నమ్మశక్యంగా లేదంటున్నారు. నిందితులను సోమవారం ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలించారు.
విచారణకు సిట్
అతీక్ శరీరంలో 9 తూటాలున్నట్టు పోస్టుమార్టంలో వెల్లడైంది. 8 తూటాలు ఛాతీ, వీపు నుంచి దూసుకెళ్లగా మరోటి తలలో కనిపించింది. అష్రాఫ్ తలపై ఒకటి, వీపుపై నాలుగు తూటా గాయాలను గుర్తించారు. ఈ హత్యోదంతంపై దర్యాప్తుకు సతీశ్ చంద్ర, సత్యేంద్ర ప్రసాద్, ఓం ప్రకాశ్ సభ్యులుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటైంది. దీనిపై విచారణకు యూపీ ప్రభుత్వం ఇప్పటికే జ్యుడీషియల్ కమిషన్ వేయడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment