
న్యూఢిల్లీ: న్యాయ విద్య కోర్సులను మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఇంగ్లిష్ మాట్లాడని విద్యార్థులను సైతం న్యాయవిద్యలో భాగస్వాములను చేయాలన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నేషనల్ లా యూనివర్సిటీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
సాంకేతికత మనకు సుదూరప్రాంత విద్యార్థులకు సైతం చేరువయ్యే సామర్థ్యాన్ని అందించింది. న్యాయ విద్య ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ, ఆంగ్లం మాట్లాడే పట్టణ ప్రాంత పిల్లలకు మాత్రమే ప్రస్తుతం ఇది అనుకూలంగా ఉంది’అని అన్నారు. ‘ఇటీవల అయిదు లా యూనివర్సిటీల్లో ఓ సర్వే చేపట్టాం. విభిన్న భాషా నేపథ్యాల నుంచి వచ్చే విద్యార్థులు కేవలం ఇంగ్లిష్‌లో మాట్లాడ లేకపోవడమే కారణంతో ఈ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నట్లు సర్వేలో తేలింది’అని సీజేఐ వెల్లడించారు.
భాషా పరమైన అవరోధాలను అధిగమించేందుకు భాషిణి సాఫ్ట్‌వేర్ అందుబాటులో ఉందన్నారు. ఇందులో సుప్రీంకోర్టు 1950–2024 మధ్య వెలువరించిన 36 వేల పైచిలుకు తీర్పులను తర్జుమా చేసి ఇందులో పొందుపరిచి ఉన్నాయన్నారు. జిల్లా స్థాయి కోర్టుల్లో ఇంగ్లిష్ మాట్లాడలేని న్యాయవాదులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. న్యాయవిద్యను హిందీలో బోధిస్తే ఉత్తమ విద్యార్థులు తయారవుతారని వర్సిటీ యంత్రాంగానికి ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment