
వడోదర: అవకాశాలను అందిపుచ్చుకుంటూ, ఎన్నో సవాళ్లను పరిష్కరిస్తున్న నేటి యువత సామర్థ్యం చూసి తనకు ఆశ్చర్యం కలుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ఓటమిని అభివృద్ధికి బాటగా మలుచుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు.
జీవితమంటే మారథాన్(సుదీర్ఘ 42 కిలోమీటర్ల పరుగు పందెం) వంటిదే తప్ప 100 మీటర్ల స్ప్రింట్(స్వల్ప దూరం పరుగు పందెం) కాదని ఆయన పేర్కొన్నారు. బరోడా లోని మహారాజా శాయాజీరావ్ యూనివర్సిటీ 72వ వార్షిక స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ఆదివారం జస్టిస్ డీవై చంద్రచూడ్ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ ఏడాది యూనివర్సిటీ ప్రదానం చేసిన మొత్తం 346 బంగారు పతకాల్లో అత్యధికంగా 336 పతకాలు మహిళలు అందుకోవడాన్ని మన దేశం మారుతోందనడానికి నిజమైన గుర్తుగా ఆయన అభివరి్ణంచారు.
‘చరిత్రలో ఇది ఒక ప్రత్యేకమైన సమయం. మునుపెన్నడూ లేనంతగా టెక్నాలజీ నేడు ప్రజలను అనుసంధానం చేస్తోంది. అదే సమయంలో వారిలో భయాలు, ఆందోళనలకు సైతం కారణమవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వృత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇవి సంప్రదాయ వృత్తులతో సంబంధం లేనివి. వీటిల్లో ఎవరికి వారు తమ ప్రయాణం సాగిస్తున్నారు. ఈ సమయంలో పట్టభద్రులుగా బయటికి వస్తున్న మీ అందరికీ ఇది ఉత్తేజకర సమ యం. అదే సమయంలో అనిశి్చతిని, గందరగోళాన్నీ సృష్టిస్తాయి’అని హెచ్చరించారు.