కర్ణాటక న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు సుమోటో కేసు | SC rebukes Knataka High Court judge over Pak comment on locality | Sakshi
Sakshi News home page

కర్ణాటక న్యాయమూర్తిపై సుప్రీంకోర్టు సుమోటో కేసు

Published Fri, Sep 20 2024 1:01 PM | Last Updated on Fri, Sep 20 2024 1:13 PM

SC rebukes Knataka High Court judge over Pak comment on locality

న్యూఢిల్లీ, సాక్షి: వివాదాస్పద వ్యాఖ్యల వీడియోతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి వేదవ్యాసాచార్‌ శీర్షానందపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాల్సిందిగా కర్ణాటక హైకోర్టును ఆదేశించింది.

సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇందిరా జైసింగ్‌, సంజయ్‌ ఘోష్‌లు.. జస్టిస్‌ వేదవ్యాసాచార్‌ శీర్షానంద వ్యాఖ్యలతో కూడిన ‘ఎక్స్‌’ పోస్టును ప్రస్తావిస్తూ తగిన చర్యలను తీసుకోవాల్సిందిగా సీజేఐను అభ్యర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌తో కూడిన ఐదుగురు సభ్యుల బెంచ్‌ ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించింది.

ఈ సందర్భంగా సీజే మాట్లాడుతూ ‘‘ఇలాంటి అంశాలపై కొన్ని సాధారణ మార్గదర్శకాలను జారీ చేస్తూనే హైకోర్టు నుంచి నివేదిక తెప్పించండి’’ అని అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణిని ఆదేశించారు. కర్ణాటక హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ నుంచి పరిపాలన పరమైన అనుమతులు పొందిన తరువాత రిజిస్ట్రార్‌ జనరల్‌ తమకు నివేదిక అందించాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై వచ్చే మంగళవారం మళ్లీ విచారణ చేస్తామని తెలిపారు.

‘‘సోషల్‌ మీడియా విస్తృత వాడకంలో ఉన్న ఈ కాలంలో అందరూ మనల్ని (న్యాయమూర్తులు) చాలా నిశితంగా పరిశీలిస్తూంటారు. ఆ విషయాన్ని మనం గుర్తెరిగి వ్యవహరించాలి’’ అని కూడా సీజేఐ వ్యాఖ్యానించారు.

ఇంతకీ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వేదవ్యాసాచార్‌ శీర్షానంద ఏం మాట్లాడారంటే.. 

కొన్ని రోజుల క్రితం రెండు వీడియోలో ఎక్స్‌లో పోస్ట్‌ అయ్యాయి. అందులో జస్టిస్‌ వేదవ్యాసాచార్‌ శీర్షానంద మాట్లాడుతూ బెంగళూరులోని ఒక ప్రాంతాన్ని ‘పాకిస్థాన్‌’తో పోల్చారు. అక్కడ ఒక్కో ఆటోలో పది మంది ప్రయాణిస్తున్నా పోలీసులు పట్టించుకోరని ఆయన వ్యాఖ్యానించినట్లు వీడియోలో ఉంది. ఇది వాస్తవమని.. ఎంతటి పెద్ద అధికారి అయినా అక్కడ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోరని కూడా జడ్జి కన్నడలో తెలిపారు. ఇక రెండో వీడియోలో ఓ మహిళ న్యాయవాదిని ఉద్దేశించి ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement