‘విద్యుత్‌’ కమిషన్‌ చైర్మన్‌ను మార్చండి | Supreme Court directive to Telangana State Govt | Sakshi
Sakshi News home page

‘విద్యుత్‌’ కమిషన్‌ చైర్మన్‌ను మార్చండి

Published Wed, Jul 17 2024 4:33 AM | Last Updated on Wed, Jul 17 2024 4:33 AM

Supreme Court directive to Telangana State Govt

రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం 

మీడియా సమావేశంలో కమిషన్‌ చైర్మన్‌ వ్యాఖ్యలు చేయడంపై అసహనం 

ఆయన కేసు మెరిట్స్‌ జోలికి ఎలా వెళ్తారని సీజేఐ చంద్రచూడ్‌ ప్రశ్న

విచారణ పూర్తికాకుండా అలా చేస్తే ఓ వ్యక్తి ఇమేజ్‌ దెబ్బతింటుందని వ్యాఖ్య 

కమిషన్‌లో మరో న్యాయమూర్తిని నియమించేందుకు అవకాశం ఇస్తున్నామని స్పష్టీకరణ 

కమిషన్‌ చైర్మన్‌ మార్పు కోసం సోమవారం పేర్లు ఇస్తామన్న రాష్ట్ర సర్కారు 

ఊహాజనిత కథనాలు వస్తుండటంతోనే మీడియా సమావేశం పెట్టానన్న జస్టిస్‌ నరసింహారెడ్డి 

కమిషన్‌ చైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సుప్రీంకోర్టుకు లేఖ

మీడియా సమావేశంలో కేసు మెరిట్‌పై కమిషన్‌ చైర్మన్‌ వ్యాఖ్యలు చేయకుండా ఉంటే ఫర్వాలేదు. కానీ కేసు మెరిట్స్‌లోకి వెళ్లారు. విచారణ కమిషన్‌ నివేదిక ఓ వ్యక్తి ఇమేజ్‌ను దెబ్బతీసే అవకాశం ఉంది. అందుకే అభిప్రాయాలు తెలపాలంటూ ముందుగా నోటీసులు ఇస్తారు. నోటీసుల జారీ వరకే చైర్మన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి ఉంటే ఓకే. కానీ జరిగినది వేరు..’’ 
– సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌

సాక్షి, న్యూఢిల్లీ:  రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్‌ ఒప్పందాలపై నియమించిన కమిషన్‌ చైర్మన్‌ను మార్చాలని కాంగ్రెస్‌ సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణకు సంబంధించిన అంశాలపై కమిషన్‌ చైర్మన్‌ బహిరంగంగా మీడియాతో ఎలా వ్యాఖ్యలు చేస్తారని అసహనం వ్యక్తం చేసింది. చైర్మన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అభిప్రాయపడింది. దీంతో కమిషన్‌ చైర్మన్‌ను మారుస్తామని, వచ్చే సోమవారంలోపు కొత్త చైర్మన్‌ పేరు వెల్లడిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీం ధర్మాసనానికి విన్నవించారు. 

మరోవైపు ‘విద్యుత్‌’పై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిషన్‌ను రద్దు చేయాలంటూ తాము పిటిషన్‌ దాఖలు చేశామని.. కానీ చైర్మన్‌ మార్చాలంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వడం సరికాదని బీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. మరోవైపు ‘విద్యుత్‌’ కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి తాను స్వయంగా బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్టు సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. 

రాజకీయ కక్ష సాధింపు కోసమే: కేసీఆర్‌ తరఫు న్యాయవాది 
‘విద్యుత్‌’ అంశాలపై విచారణ కోసం కాంగ్రెస్‌ సర్కారు నియమించిన కమిషన్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం దీనిపై చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ పార్డీ వాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తొలుత కేసీఆర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. కమిషన్‌పై హైకోర్టులో కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను తొలిరోజే కనీసం వాదనలు కూడా వినకుండా ఎలా కొట్టివేసిందని ప్రశ్నించారు. ఇందులో రాజకీయ కక్ష సాధింపు స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. 

ఈ సమయంలో చీఫ్‌ జస్టిస్‌ స్పందిస్తూ.. ‘అది ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్న విచారణ మాత్రమేనని, దానికి న్యాయపరమైన అధికారం లేదు కదా’ అని పేర్కొన్నారు. దీనికి ముకుల్‌ రోహత్గి సమాధానమిస్తూ.. ‘రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో తీవ్ర విద్యుత్‌ కొరత ఏర్పడింది. దాంతో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర కమిషన్‌తో తెలంగాణ రాష్ట్ర కమిషన్‌కు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం జరిగింది. బీఆర్‌ఎస్‌ హయాంలో తక్కువ ధరకే విద్యుత్‌ కొనుగోళ్లు చేసినట్టు నిరూపిస్తాం. అయినా విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలోని కమిషన్‌ దోషిగా నిర్ధారించినప్పటికీ అది పరిగణనలోకి రాదు’’ అని పేర్కొన్నారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ స్పందిస్తూ.. కమిషన్‌ విషయంలో పలు అభ్యంతరాలు ఉన్నాయని సింఘ్వితో పేర్కొన్నారు. 

ప్రభుత్వం పొరపాటుగా జ్యుడీషియల్‌ పదం వాడింది 
ప్రభుత్వం తరఫు న్యాయవాది సింఘ్వి వివరణ ఇస్తూ.. ‘‘కమిషన్‌ నియామక డాక్యుమెంటులో.. విశ్రాంత న్యాయమూర్తి నియామకం నేపథ్యంలో జ్యుడీషియల్‌ అనే పదం పొరపాటుగా వాడారు. కానీ కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ చట్టం పరిధిలోకి వస్తుంది’’ అని తెలిపారు. దీనిపై కేసీఆర్‌ తరఫు న్యాయవాది రోహత్గీ స్పందిస్తూ.. ‘‘పవర్‌ పర్చేజీ అంశాన్ని ఇప్పటికే ట్రిబ్యునళ్లు పరిశీలిస్తున్నాయి. అక్కడ పెండింగ్‌లో ఉన్న అంశాలపై కమిషన్‌ ఎలా నియమిస్తారు. ట్రిబ్యునళ్ల కన్నా ఓ విశ్రాంత న్యాయమూర్తికి ఎక్కువ అధికారాలు ఎలా ఉంటాయి?’’ అని ప్రశ్నించారు. 

ప్రభుత్వానికి ఓ అవకాశం ఇస్తున్నాం.. 
ఈ సమయంలో చీఫ్‌ జస్టిస్‌ కల్పించుకుంటూ.. ‘‘కమిషన్‌ చైర్మన్‌ మీడియా సమావేశంలో కేసు మెరిట్స్‌పై అభిప్రాయాలు వెల్లడించినట్టు ఉంది కదా?’’ అని ప్రభుత్వం తరఫు న్యాయవాదులను ప్రశ్నించారు. దీంతో సింఘ్వి స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వం మార్చి 14న కమిషన్‌ను నియమించింది. తమ విచారణ సందర్భంగా ఏం జరిగిందనేది తెలుపుతూ.. పలువురితోపాటు మాజీ సీఎం కేసీఆర్‌కు కమిషన్‌ ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేసింది. అయితే మాజీ సీఎం వాటిని సవాల్‌ చేయకుండా, ఎన్నికల్లో బిజీగా ఉన్నానంటూ జూన్‌ చివరి వరకూ సమయం అడిగారు’’ అని వివరించారు. 

అయితే కమిషన్‌ చైర్మన్‌ తన అభిప్రాయాలను మీడియాకు వెల్లడించడంపై చీఫ్‌ జస్టిస్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘మాజీ సీఎం ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే.. కమిషన్‌ చైర్మన్‌ మీడియా సమావేశం నిర్వహించడం, కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం సబబు కాదు కదా. కేసు మెరిట్స్‌పై వ్యాఖ్యలు చేయకుంటే మేం జోక్యం చేసుకునే వాళ్లమే కాదు. కానీ అలా చేశారు. ఇది ఓ వ్యక్తి రెప్యుటేషన్‌పై ప్రభావం చూపుతుంది కదా. మేం ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాం. కమిషన్‌లో న్యాయమూర్తిని (చైర్మన్‌గా) భర్తీ చేయడానికి అవకాశం ఇస్తున్నాం. న్యాయం జరిగేలా చూడాలి. ఇది విచారణ కమిషన్‌’’ అని చీఫ్‌ జస్టిస్‌ స్పష్టం చేశారు. భోజన విరామం అనంతరం తర్వాత కొత్త చైర్మన్‌ పేరు తెలపాలని సూచించారు. 

బాధ్యతల నుంచి తప్పుకొంటూ జస్టిస్‌ నరసింహారెడ్డి లేఖ 
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన సూచనల విషయం తెలిసిన జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి.. ‘విద్యుత్‌’ కమిషన్‌ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్టుగా కోర్టుకు లేఖ రాశారు. భోజన విరామం అనంతరం సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకర్‌నారాయణ్‌ ఈ విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కమిషన్‌ నూతన న్యాయమూర్తిగా ఎవరిని నియమిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించగా.. సోమవారం నాటికి కోర్టుకు చెబుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాది సింఘ్వి తెలిపారు. దీనితో పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నట్టు సీజేఐ ప్రకటించారు. 

జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి లేఖ సారాంశమిదీ.. 
‘‘మీడియా సమావేశంలో నా అభిప్రాయాలు వెల్లడించడంపై కోర్టులో పరిశీలనలు జరుగుతున్నాయని సమాచారం ఉంది. బీఆర్‌కేఆర్‌ భవన్‌లోని ఏడో అంతస్తులో నా కార్యాలయం పనిచేస్తోంది. అదే భవనంలోని ఎనిమిదో అంతస్తులో జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కార్యాలయం పనిచేస్తోంది. రోజు విడిచి రోజు ఆ కమిషన్‌ మీడియా బ్రీఫింగ్‌ జరుగుతోంది. ఆ సమయంలో విలేకరులు నా కార్యాలయంలో ఏం జరుగుతుందోనని ఆరా తీసేవారు. 

కమిషన్‌కు సంబంధించి ఊహాజనిత వార్తలు ఇచ్చేవారు. అందువల్ల అప్పటివరకు జరిగిన పురోగతి మీడియాకు తెలపాలనే ఉద్దేశంతో సమావేశం నిర్వహించాను. ఒక న్యాయమూర్తి లేదా విశ్రాంత న్యాయమూర్తి పక్షపాతంగా వ్యవహరించబోరని స్పష్టంగా చెప్పొచ్చు. ఆరోపణల నేపథ్యంలో న్యాయవ్యవస్థ ప్రతిష్టను నిలబెట్టడానికి కమిషన్‌ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా..’’ అని జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement