జడ్జీ్జలు చేసే వ్యాఖ్యలు మర్యాదపూర్వకంగా, చట్టాలకు లోబడి ఉండాలి: సీజేఐ
న్యూఢిల్లీ: కర్ణాటక హైకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తి జస్టిస్ వేదవ్యాసాచార్ శ్రీశానందాపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై నివేదిక ఇవ్వాలని కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఆదేశించింది. ‘‘న్యాయమూర్తులు నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. హద్దు మీరడం తగదు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది’’ అని హితవు పలికింది. దీన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. 25న విచారణ చేపడతామని వెల్లడించింది.
అసలేం జరిగింది?
బెంగళూరులో ఓ ఇంటి యజమాని, కిరాయిదారుకు వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. బెంగళూరులోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాన్ని జస్టిస్ శ్రీశానందా పాకిస్తాన్‌తో పోల్చారు. అంతేగాక, ‘‘ప్రత్యర్థి వర్గంతో మీకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లున్నాయి. వారి లోదుస్తుల రంగు కూడా మీకు తెలిసే ఉంటుంది’’ అని మహిళా న్యాయవాదిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. కోర్టుల్లో న్యాయమూర్తుల వ్యాఖ్యలపై మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం కనిపిస్తోందని సీజేఐ పేర్కొన్నారు. ‘‘కోర్టుల కార్యకలాపాలను గమనించడంలో సోషల్ మీడియా చురుగ్గా ఉంది. కనుక న్యాయమూర్తుల వ్యాఖ్యలు చట్టాలకు లోబడి మర్యాదపూర్వకంగా ఉండాలి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment