![Sakshi Editorial On Chandigarh Mayor Kuldeep Kumar](/styles/webp/s3/article_images/2024/02/22/justice.jpg.webp?itok=0xmNdn7y)
వ్యవస్థలు నిర్మాణం కావటానికి సమయం పట్టినట్టే అవి భ్రష్టుపట్టడానికి కూడా ఎంతో కొంత వ్యవధి పడుతుంది. అప్రమత్తంగా వుండి సకాలంలో దాన్ని గమనించుకుంటే వాటిని రక్షించు కోవటం సులభమవుతుంది. గత నెల 30న జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీసుకున్న అసాధారణ నిర్ణయం ఆ కారణం రీత్యా హర్షించదగింది. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆప్ అభ్యర్థి కులదీప్ కుమార్‌ను మేయర్‌గా ప్రకటిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పు వక్రమార్గాల్లో విజయం సాధించటానికి అలవాటుపడిన రాజకీయ నేతలకూ, వారికి దాసోహమయ్యే అధికారులకూ చెంపపెట్టు.
రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మాసీ కనీసం సీసీ కెమెరాలున్నాయన్న వెరపు కూడా లేకుండా ఆప్ అభ్యర్థికి పడిన ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై స్వహస్తాలతో గీతలు పెట్టి అవి చెల్లని ఓట్లుగా లెక్కేసి బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. ఆయన వ్యవహారశైలి పూర్తిగా చట్టవిరుద్ధమని ధర్మాసనం తేల్చిచెప్పటంతోపాటు అఫిడవిట్‌లో సైతం ఆ అధికారి బొంకటం నేరంగా పరిగణించి ఆయనపై సీఆర్‌పీసీ సెక్షన్ 340 కింద విచారణ జరపాలని నిర్ణయించటం మంచి పరిణామం.
నిజానికి ఏ ఇతర నగరాలతో పోల్చినా చండీగఢ్ మేయర్ పదవి ఏమంత ప్రాధాన్యత వున్నది కాదు. కేంద్ర పాలిత ప్రాంతంగా వున్న ఆ నగరానికి మేయర్ అయినవారు కార్పొరేషన్ సమావేశాలు నిర్వహించటం, ఎజెండాను రూపొందించటం మాత్రమే చేయగలరు. పైగా ఆ పదవీకాలం ఏడాది మాత్రమే. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బీజేపీ నాయకత్వం ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్ వరకూ ఎవరి దారి వారిదే అని ప్రకటించిన ఆప్... అందరినీ ఆశ్చర్యపరుస్తూ మేయర్ ఎన్నికలో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది.
2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ 13 వార్డుల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ ఏడింటిని గెలుచుకుంది. బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. చండీగఢ్ లోక్‌సభ ఎంపీగా గెలిచిన బీజేపీ నేత కిరణ్ ఖేర్, ఒకే ఒక్క సభ్యుడున్న శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్‌ను కూడా కలుపుకొంటే బీజేపీ బలం 16. కనుక 36 మంది సభ్యులున్న కార్పొరేషన్‌లో 20 మంది సభ్యులున్న ఆప్–కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయం. కానీ ఏం చేసైనా నెగ్గి తీరాలనుకున్న బీజేపీ వ్యూహానికి అనిల్ మాసీ వంతపాడారు. ఆది నుంచీ మేయర్ ఎన్నికను ఆయన ప్రహసన ప్రాయంగా మార్చారు.
షెడ్యూల్ ప్రకారం వాస్తవానికి గత నెల 18న మేయర్ ఎన్నిక జరగాలి. కానీ ఆప్, కాంగ్రెస్ కౌన్సిలర్లు సమావేశం కోసం వెళ్లాక మాసీ అస్వస్థులయ్యారంటూ దాన్ని కాస్తా వాయిదా వేశారు. కేంద్రపాలిత పాలనావ్యవస్థ ఈ ఎన్నికను ఫిబ్రవరి 6న జరపాలని నిర్ణయించింది. దీన్ని సవాలు చేస్తూ ఆప్ అభ్యర్థి కులదీప్ కుమార్ పంజాబ్ హరియాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో న్యాయస్థానం దీన్ని జనవరి 30న జరపాలని ఆదేశించింది. ఈ క్రమం అంతా పరిశీలిస్తే, 30న జరిగిన తతంగం గమనిస్తే నాయకులు, అధికారులు ఎంత నిస్సిగ్గుగా కుమ్మక్కయ్యారో అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది.
ఈనెల 5న ఈ కేసు విచారణకొచ్చినప్పుడు మాసీ వ్యవహరించిన తీరును జస్టిస్ చంద్రచూడ్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఇది ప్రజాస్వామ్యాన్ని వంచించటం, హత్య చేయటం తప్ప మరేమీ కాద’ని ఆయన అన్నారు. నిజానికి ప్రజలకు బాధ్యత వహించాల్సిన స్థానంలో, వారి విశ్వాసాన్ని పొందాల్సిన స్థానంలో వున్న రాజకీయ పార్టీలకు ఈ స్పృహ వుండాలి. రేపన్న రోజు అధికారంలోకొచ్చే మరో పార్టీ కూడా ఇదే తీరులో గెలుపును తస్కరించే ప్రమాదం వున్నదని గుర్తించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల దృష్టిలో ఈ ఎన్నికల తతంగం మొత్తం గుప్పెడుమంది బల వంతులు చేసే వంచనాత్మక విన్యాసమన్న అభిప్రాయం స్థిరపడితే తమ మనుగడే ప్రశ్నార్థక మవుతుందన్న ఎరుక వుండాలి.
కానీ సమస్యాత్మకంగా వున్న బడి పిల్లలకు ఉపాధ్యాయులు చీవాట్లు పెట్టే రీతిలో సర్వోన్నత న్యాయస్థానం కలగజేసుకుని చెప్పవలసిరావటం అధికారుల, నేతల పరువు ప్రతిష్ఠలకే తలవంపు. దాన్ని కనీసం గుర్తించలేని స్థితిలోనే మన నాయకగణం వున్నదని ఆదివారంనాటి పరిణామాలు చెబుతున్నాయి. మేయర్ ఎన్నికను సుప్రీంకోర్టు రద్దు చేసి, మళ్లీ ఎన్నికకు ఆదేశి స్తుందన్న అంచనాతో బీజేపీ నాయకులు ఫిరాయింపులకు తెరలేపి, ముగ్గురు ఆప్ సభ్యులను బుట్టలో వేసుకున్నారు. దాంతో ఆప్–కాంగ్రెస్ కూటమి బలం 17కి పడిపోగా, బీజేపీ బలం 19కి పెరిగింది.
ఒకపక్క చండీగఢ్ మేయర్ ఎన్నిక వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో వుండి, దేశమంతా దానిపై దృష్టిపెట్టిన తరుణంలో ఈ తరహా జుగుప్సాకర చేష్టలకు పాల్పడటం భావ్యంకాదన్న ఇంగితజ్ఞానం లోపించటం నిజంగా బాధాకరం. మేయర్‌గా పార్టీ అభ్యర్థి నెగ్గటంపైనే తమ భవిష్యత్తంతా ఆధారపడి వుందనుకోవటం దివాలాకోరుతనం. మాసీ మాయోపాయంవల్ల మేయర్ అయిన మనోజ్ సోంకార్ రాజీనామా చేశారు గనుక తిరిగి ఎన్నికకు ఆదేశించాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనను తోసిపుచ్చి 142వ అధికరణ కింద సంక్రమించిన అధికారాన్ని వినియోగించి ఆప్ అభ్యర్థిని విజేతగా నిర్ణయించటాన్ని చూసైనా అటు నాయకులూ, ఇటు అధికార గణమూ కళ్లు తెరవాలి. అక్రమాలతో, అన్యాయాలతో గెలవాలని చూడటం ప్రజాస్వామ్యానికి తీవ్ర అపచారం చేయటమేనని అందరూ గుర్తించాలి. అసాధారణమైన ఈ తీర్పు మన వ్యవస్థలకు భయభక్తులు నేర్పాలి.
Comments
Please login to add a commentAdd a comment