Kuldeep
-
‘సర్వోన్నత’ న్యాయం!
వ్యవస్థలు నిర్మాణం కావటానికి సమయం పట్టినట్టే అవి భ్రష్టుపట్టడానికి కూడా ఎంతో కొంత వ్యవధి పడుతుంది. అప్రమత్తంగా వుండి సకాలంలో దాన్ని గమనించుకుంటే వాటిని రక్షించు కోవటం సులభమవుతుంది. గత నెల 30న జరిగిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీసుకున్న అసాధారణ నిర్ణయం ఆ కారణం రీత్యా హర్షించదగింది. ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆప్ అభ్యర్థి కులదీప్ కుమార్‌ను మేయర్‌గా ప్రకటిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పు వక్రమార్గాల్లో విజయం సాధించటానికి అలవాటుపడిన రాజకీయ నేతలకూ, వారికి దాసోహమయ్యే అధికారులకూ చెంపపెట్టు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన అనిల్ మాసీ కనీసం సీసీ కెమెరాలున్నాయన్న వెరపు కూడా లేకుండా ఆప్ అభ్యర్థికి పడిన ఎనిమిది బ్యాలెట్ పత్రాలపై స్వహస్తాలతో గీతలు పెట్టి అవి చెల్లని ఓట్లుగా లెక్కేసి బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. ఆయన వ్యవహారశైలి పూర్తిగా చట్టవిరుద్ధమని ధర్మాసనం తేల్చిచెప్పటంతోపాటు అఫిడవిట్లో సైతం ఆ అధికారి బొంకటం నేరంగా పరిగణించి ఆయనపై సీఆర్పీసీ సెక్షన్ 340 కింద విచారణ జరపాలని నిర్ణయించటం మంచి పరిణామం. నిజానికి ఏ ఇతర నగరాలతో పోల్చినా చండీగఢ్ మేయర్ పదవి ఏమంత ప్రాధాన్యత వున్నది కాదు. కేంద్ర పాలిత ప్రాంతంగా వున్న ఆ నగరానికి మేయర్ అయినవారు కార్పొరేషన్ సమావేశాలు నిర్వహించటం, ఎజెండాను రూపొందించటం మాత్రమే చేయగలరు. పైగా ఆ పదవీకాలం ఏడాది మాత్రమే. త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బీజేపీ నాయకత్వం ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్ వరకూ ఎవరి దారి వారిదే అని ప్రకటించిన ఆప్... అందరినీ ఆశ్చర్యపరుస్తూ మేయర్ ఎన్నికలో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ 13 వార్డుల్లో విజయం సాధించగా, కాంగ్రెస్ ఏడింటిని గెలుచుకుంది. బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. చండీగఢ్ లోక్‌సభ ఎంపీగా గెలిచిన బీజేపీ నేత కిరణ్ ఖేర్, ఒకే ఒక్క సభ్యుడున్న శిరోమణి అకాలీదళ్ కౌన్సిలర్‌ను కూడా కలుపుకొంటే బీజేపీ బలం 16. కనుక 36 మంది సభ్యులున్న కార్పొరేషన్లో 20 మంది సభ్యులున్న ఆప్–కాంగ్రెస్ కూటమి గెలుపు ఖాయం. కానీ ఏం చేసైనా నెగ్గి తీరాలనుకున్న బీజేపీ వ్యూహానికి అనిల్ మాసీ వంతపాడారు. ఆది నుంచీ మేయర్ ఎన్నికను ఆయన ప్రహసన ప్రాయంగా మార్చారు. షెడ్యూల్ ప్రకారం వాస్తవానికి గత నెల 18న మేయర్ ఎన్నిక జరగాలి. కానీ ఆప్, కాంగ్రెస్ కౌన్సిలర్లు సమావేశం కోసం వెళ్లాక మాసీ అస్వస్థులయ్యారంటూ దాన్ని కాస్తా వాయిదా వేశారు. కేంద్రపాలిత పాలనావ్యవస్థ ఈ ఎన్నికను ఫిబ్రవరి 6న జరపాలని నిర్ణయించింది. దీన్ని సవాలు చేస్తూ ఆప్ అభ్యర్థి కులదీప్ కుమార్ పంజాబ్ హరియాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయటంతో న్యాయస్థానం దీన్ని జనవరి 30న జరపాలని ఆదేశించింది. ఈ క్రమం అంతా పరిశీలిస్తే, 30న జరిగిన తతంగం గమనిస్తే నాయకులు, అధికారులు ఎంత నిస్సిగ్గుగా కుమ్మక్కయ్యారో అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. ఈనెల 5న ఈ కేసు విచారణకొచ్చినప్పుడు మాసీ వ్యవహరించిన తీరును జస్టిస్ చంద్రచూడ్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఇది ప్రజాస్వామ్యాన్ని వంచించటం, హత్య చేయటం తప్ప మరేమీ కాద’ని ఆయన అన్నారు. నిజానికి ప్రజలకు బాధ్యత వహించాల్సిన స్థానంలో, వారి విశ్వాసాన్ని పొందాల్సిన స్థానంలో వున్న రాజకీయ పార్టీలకు ఈ స్పృహ వుండాలి. రేపన్న రోజు అధికారంలోకొచ్చే మరో పార్టీ కూడా ఇదే తీరులో గెలుపును తస్కరించే ప్రమాదం వున్నదని గుర్తించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల దృష్టిలో ఈ ఎన్నికల తతంగం మొత్తం గుప్పెడుమంది బల వంతులు చేసే వంచనాత్మక విన్యాసమన్న అభిప్రాయం స్థిరపడితే తమ మనుగడే ప్రశ్నార్థక మవుతుందన్న ఎరుక వుండాలి. కానీ సమస్యాత్మకంగా వున్న బడి పిల్లలకు ఉపాధ్యాయులు చీవాట్లు పెట్టే రీతిలో సర్వోన్నత న్యాయస్థానం కలగజేసుకుని చెప్పవలసిరావటం అధికారుల, నేతల పరువు ప్రతిష్ఠలకే తలవంపు. దాన్ని కనీసం గుర్తించలేని స్థితిలోనే మన నాయకగణం వున్నదని ఆదివారంనాటి పరిణామాలు చెబుతున్నాయి. మేయర్ ఎన్నికను సుప్రీంకోర్టు రద్దు చేసి, మళ్లీ ఎన్నికకు ఆదేశి స్తుందన్న అంచనాతో బీజేపీ నాయకులు ఫిరాయింపులకు తెరలేపి, ముగ్గురు ఆప్ సభ్యులను బుట్టలో వేసుకున్నారు. దాంతో ఆప్–కాంగ్రెస్ కూటమి బలం 17కి పడిపోగా, బీజేపీ బలం 19కి పెరిగింది. ఒకపక్క చండీగఢ్ మేయర్ ఎన్నిక వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో వుండి, దేశమంతా దానిపై దృష్టిపెట్టిన తరుణంలో ఈ తరహా జుగుప్సాకర చేష్టలకు పాల్పడటం భావ్యంకాదన్న ఇంగితజ్ఞానం లోపించటం నిజంగా బాధాకరం. మేయర్‌గా పార్టీ అభ్యర్థి నెగ్గటంపైనే తమ భవిష్యత్తంతా ఆధారపడి వుందనుకోవటం దివాలాకోరుతనం. మాసీ మాయోపాయంవల్ల మేయర్ అయిన మనోజ్ సోంకార్ రాజీనామా చేశారు గనుక తిరిగి ఎన్నికకు ఆదేశించాలన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనను తోసిపుచ్చి 142వ అధికరణ కింద సంక్రమించిన అధికారాన్ని వినియోగించి ఆప్ అభ్యర్థిని విజేతగా నిర్ణయించటాన్ని చూసైనా అటు నాయకులూ, ఇటు అధికార గణమూ కళ్లు తెరవాలి. అక్రమాలతో, అన్యాయాలతో గెలవాలని చూడటం ప్రజాస్వామ్యానికి తీవ్ర అపచారం చేయటమేనని అందరూ గుర్తించాలి. అసాధారణమైన ఈ తీర్పు మన వ్యవస్థలకు భయభక్తులు నేర్పాలి. -
‘ఆప్’ అభ్యర్థే చండీగఢ్ మేయర్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి అత్యున్నత న్యాయస్థానంలో ఘన విజయం లభించింది. కొన్ని వారాలుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. ఈ ఎన్నికల్లో ఆప్–కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కులదీప్ కుమార్‌ను విజేతగా సుప్రీంకోర్టు నిర్ధారించింది. బీజేపీ అభ్యర్థి మనోజ్ సోంకర్ మేయర్‌గా ఎన్నికైనట్లు గతంలో రిటర్నింగ్ ఆఫీసర్ అనిల్ మాసి విడుదల చేసిన ఫలితాలను న్యాయస్థానం తిరస్కరించింది. రిటర్నింగ్ అధికారి ‘క్రాస్’ గుర్తు రాసి, చెల్లనివిగా ప్రకటించిన 8 ఓట్లు కులదీప్ కుమార్‌కు పడినట్లు గుర్తించింది. చండీగఢ్ మేయర్‌గా ఆప్–కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ కుమార్ ఎన్నికైనట్లు తేల్చిచెబుతూ సంచలన తీర్పు వెలువరించింది. ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టీకల్ 142 కింద తమకు సంక్రమించిన ప్రత్యేక అధికారాలను సుప్రీంకోర్టు ఉపయోగించుకుంది. ఎన్నిక ప్రక్రియను తారుమారు చేశారు మేయర్ ఎన్నిక ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ‘ఆప్’ నేత, మేయర్ అభ్యర్థి కులదీప్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. చెల్లనివిగా రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించిన 8 బ్యాలెట్ పేపర్లను స్వయంగా పరిశీలించింది. అవి ఎక్కడ పాడైపోయాయి? ఎందుకు చెల్లుబాటు కావో చెప్పాలని అనిల్ మాసిని ప్రశ్నించింది. ఆ 8 ఓట్లు కులదీప్ కుమార్‌కు పడినట్లు తేల్చింది. పిటిషనర్‌కు అనుకూలంగా పడిన ఓట్లను రిటర్నింగ్ అధికారి ఉద్దేశపూర్వకంగానే చెల్లనివిగా గుర్తించినట్లు ఆక్షేపించింది. ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొంది. మేయర్ ఎన్నిక విషయంలో రిటర్నింగ్ ఆఫీసర్ వైఖరి సక్రమంగా లేదని వెల్లడించింది. మేయర్ ఎన్నిక ప్రక్రియను ఆయన చట్టవిరుద్ధంగా తారుమారు చేశారని, అంతేకాకుండా కోర్టులో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని, ఇందుకు ఆయన బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. అనిల్ మాసిపై సీఆర్పీఎస్ సెక్షన్ 340 కింద ధర్మాసనం విచారణ ప్రారంభించింది. అసలేం జరిగింది? చండీగఢ్ మేయర్ ఎన్నికను జనవరి 30న నిర్వహించారు. కార్పొరేషన్లో మొత్తం 36 ఓట్లు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉండడంతో రిటర్నింగ్ అధికారి అనిల్ మాషీ 8 ఓట్లపై రహస్యంగా ‘క్రాస్’ గుర్తు రాసి, చెల్లనివిగా ప్రకటించారు. ఈ వీడియో బయటకు వచ్చింది. మిగిలిన ఓట్లను లెక్కించగా ఆప్–కాంగ్రెస్ అభ్యర్థి కులదీప్ కుమార్‌కు 12, బీజేపీ అభ్యర్థికి 16 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. దీంతో కులదీప్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడింది: కేజ్రీవాల్ సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆప్ జాతీయ కన్వి నర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు కాపాడిందన్నారు. ఇదో చరిత్రాత్మక తీర్పు అన్నారు. విపక్ష ‘ఇండియా’ కూటమి కలిసికట్టుగా పని చేస్తే బీజేపీని ఓడించడం సులువేనని తాజా పరిణామం స్పష్టం చేస్తున్నట్లు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో పోలయ్యే 90 కోట్లకు పైగా ఓట్లను బీజేపీ ఎలా దొంగిలిస్తుందని ప్రశ్నించారు. నీచ రాజకీయాలను ఎదిరించాలి: ఖర్గే సుప్రీంకోర్టు తీర్పు పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హర్షం వ్యక్తం చేశారు. నిరంకుశ బీజేపీ కబంధ హస్తాల నుంచి ప్రజాస్వామ్యాన్ని న్యాయస్థానం రక్షించిందంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. బీజేపీ నీచ రాజకీయాలను ప్రజలంతా కలిసికట్టుగా ఎదిరించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి బీజేపీ పన్నిన కుట్రలో రిటర్నింగ్ అధికారి అనిల్ మాసి ఒక పావు మాత్రమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు ముఖం నరేంద్ర మోదీ అని ఆరోపించారు. -
ఇన్సూరెన్స్ దేఖోలో చేరిన కుల్దీప్ త్రివేది
హైదరాబాద్: ఇన్సూరెన్స్ దేఖో సంస్థ ఐఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కుల్దీప్ త్రివేది, ఆయన బృందాన్ని నియమించుకుంది. బీమా పంపిణీలో కుల్దీప్ త్రివేదికి 25 ఏళ్ల అనుభవం ఉంది. బీమా పంపిణీ వెంచర్లలో ఆయనకు ఎంతో ట్రాక్ రికార్డ్ కూడా ఉంది. త్రివేది, ఆయన బృందం ఇన్సూరెన్స్ దేఖో పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంతోపాటు కీలకమైన పశ్చిమ భారత్ మార్కెట్లో సేవల విస్తరణపై దృష్టి పెడుతుందని కంపెనీ ప్రకటించింది. ఇన్సూర్టెక్ సంస్థ అయిన ఇన్సూరెన్స్ దేఖో ఇటీవలే 150 మిలియన్ డాలర్లను సమీకరించడం గమనార్హం. ఈ సంస్థ దేశవ్యాప్తంగా తన సేవలను మరింత విస్తరించడంపై దృష్టి సారించింది. -
పురస్కారం: అమ్మా ఎలా ఉన్నారు!
కులదీప్ దంతెవాడియాకు ఆ జ్ఞాపకం ఇంకా తాజాగానే ఉంది. ఆయన బెంగళూరులోని ఒక స్వచ్ఛందసంస్థ నిర్వాహకుడు. ఆరోజు ఒక డోనర్‌తో ఆయన సమావేశం ఏర్పాటయింది. ముందు అనుకున్నదాని ప్రకారం 45 నిమిషాల సమావేశం అది. కానీ ఈ సమావేశం పూర్తికావడానికి రెండు గంటల సమయం పట్టింది. దీనికి కారణం ఆ డోనర్. సంస్థ పని తీరు గురించి ఆమె ఎన్నో విషయాలు అడిగారు. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఆమెలో ఎంతో కనిపించింది. వెళుతున్నప్పుడు... ‘మీరు బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. రాత్రి నిద్ర లేదా?’ అని దంతెవాడియాను అడిగి తెలుసుకున్నారు. ఎంతోమంది తో, ఎన్నో సమావేశాల్లో పాల్గొన్న తనకు ఇలాంటి ఆత్మీయ ప్రశ్న ఎదురు కావడం తొలిసారి! ఆ డోనర్ పేరు రోహిణి నిలేకని. దంతెవాడియా తన స్వచ్ఛంద సంస్థ ద్వారా చేపట్టిన వివిధ రకాల కార్యక్రమాలకు మూడు సంవత్సరాల కాలంలో అయిదుకోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు రోహిణి. ‘రోహిణి నిలేకని ఎవరు?’ అనే ప్రశ్నకు జవాబుగా ఆమె భర్త నందన్ నిలేకని (ఇన్ఫోసిస్ సహ–వ్యవస్థాపకుడు) పేరు వినిపించవచ్చు. అంతకంటే ఎక్కువగా ‘ఆమె మంచి రచయిత్రి’ అనే మాట ఎక్కువగా వినిపించవచ్చు. ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రోహిణి ఒక పత్రికలో రిపోర్టర్‌గా పనిచేశారు. ‘స్టిల్‌బార్న్’ నవల ద్వారా ఆమె సృజనాత్మక ప్రపంచంలోకి వచ్చారు. ఈ నవలను పెంగ్విన్ ప్రచురించింది. ‘అన్ కామన్‌గ్రౌండ్’ పేరుతో పాత్రికేయురాలిగా తన అనుభవాలకు అక్షర రూపం ఇచ్చారు. ‘ఆర్ఘ్యం’ ఫౌండేషన్ ద్వారా సామాజికసేవా రంగంలోకి ప్రవేశించారు. ‘యాదృచ్ఛికంగా ఈ రంగంలోకి వచ్చాను’ అని ఆమె చెబుతున్నప్పటికీ, సామాజిక విషయాలపై ఆమె చూపే ఆసక్తి అపురూపం అనిపిస్తుంది! పట్టణం నుంచి మారుమూల పల్లె వరకు రోహిణి ఎన్నో ప్రయాణాలు చేస్తుంటారు. ఆ ప్రయాణంలో తనకు ఎదురైన అందరి క్షేమసమాచారం కనుక్కుంటారు. ‘ఎలా ఉన్నారు?’ అని పలకరించడానికి చుట్టరికం అక్కరలేదు కదా! ‘ప్రాజెక్ట్‌లపై కాదు ప్రజాసమూహాల సంక్షేమంపై రోహిణి పెట్టుబడి పెడతారు. అదే ఆమె బలం’ అంటుంటారు. అది లాభం ఆశించి పెట్టే పెట్టుబడి కాదు. వారి అభివృద్ధిని ఆశించి చేసే పెట్టుబడి. ఎప్పటికప్పుడూ క్షేత్రస్థాయిలో కొత్త కొత్త రంగాలను ఎంచుకోవడం ఆమె విధానం. ఈ సంవత్సరం కొత్తగా మెంటల్ హెల్త్, సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్...మొదలైన రంగాలను ఎంపిక చేసుకున్నారు. ‘పోయేటప్పుడు ఏం పట్టుకెళతాం!’ అనేది తత్వం. ‘బతికి ఉన్నప్పుడు ఏం చేశాం?’ అనేది వాస్తవం. ‘యాదృచ్ఛికంగానే సంపన్నురాలయ్యాను’ అంటున్న రోహిణి తన సంపాదనను సామాజిక సంక్షేమంపై అధికం గా కేటాయిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే రోహిణి నిలేకని తాజాగా ఫోర్బ్స్ ఇండియా లీడర్షిప్ అవార్డ్–2022 విజేత(గ్రాస్రూట్స్ ఫిలాంత్రపిస్ట్ విన్నర్) అయ్యారు. -
'ఆ హీరో ఫిజిక్ ది బెస్ట్..రష్మికను బలవంతంగా గెంటేస్తా'
‘‘ప్రేక్షకులకు, అభిమానులకు వాళ్లు బిగ్ స్టార్స్. నేను థియేటర్లో సినిమా చూసినప్పుడూ నాకు వాళ్లు బిగ్ స్టార్సే. కానీ నా జిమ్‌కి వస్తే స్టూడెంట్స్’’ అంటున్నారు కుల్దీప్ సేథీ. చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ, కార్తికేయ, రష్మికా మందన్నా, రాశీ ఖన్నా... ఇలా పలువురు స్టార్స్‌కు ఫిట్నెస్ గురు ఆయన. స్టార్ స్టూడెంట్స్‌తో తన టీచింగ్ అనుభవాలను కుల్దీప్ ఇలా పంచుకున్నారు. ♦ 2004లో రామ్‌చరణ్ పరిచయమయ్యారు. అప్పుడు ఆయనకు ట్రైనింగ్ మొదలుపెట్టాను. ‘చిరుత’ సమయంలో బ్యాంకాక్‌కు వెళ్లి ట్రైన్ చేశాను. ‘మగధీర’ అప్పుడు రాజమౌళి సార్ ఓ స్కెచ్ ఇచ్చారు. పాత్ర ప్రకారం షోల్డర్స్ ఉండాలి, చెస్ట్ ఎక్కువ ఉండకూడదు వంటి జాగ్రత్తలతో చరణ్ ఫిజిక్‌ని తీర్చిదిద్దాను. అలా చరణ్‌కి నేను నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవిని కూడా ట్రైన్ చేసే లక్ దక్కింది. ♦ చిరంజీవి డూప్స్ లేకుండా యాక్షన్ సీన్స్ చేస్తుంటారు. అందువల్ల ఫిజికల్‌గా తరచూ ఇబ్బందులు పడుతుంటారు. అయితే కెమెరా ముందైనా, జిమ్లోనైనా ఆ కష్టం ఆయనలో కనిపించేది కాదు. ఇప్పటికీ చాలామంది యూత్ ఆయనలా వర్కవుట్స్ చేయలేరు. ♦ స్టార్స్ అందరూ నాకిష్టమే. అయితే విజయ్ దేవరకొండతో మరింత కనెక్ట్ అయ్యాను. విజయ్‌కి ‘లైగర్’కి ట్రైన్ చేస్తున్నాను. విజయ్ ఎన్ని వర్కవుట్స్ ఇచ్చినా నిశ్శబ్దంగా చేసేస్తాడు. అయితే అతను పూర్ ఈటర్. తినమని నేనే ఫోర్స్ చేస్తుంటా. ఎంత పెద్ద స్టార్ అయినా మన నుంచి స్పెషల్ ట్రీట్మెంట్ కోరుకోడు. ♦ కార్తికేయ ఫిజిక్ ది బెస్ట్. అతన్ని నేను ట్రైన్ చేస్తున్నాను కానీ.. తనను చూసి నేను ఇన్స్పైర్ అవుతుంటాను. ♦ చాలా త్వరగా తాను చేసే వర్కవుట్స్ బోర్ కొట్టేస్తాయి రాఖీ ఖన్నాకి. ఎప్పటికప్పడు మారుస్తూ ఉండాలి. ఇక రష్మిక అయితే చాలు.. చాలు... అంటున్నా ఇంకా వర్కవుట్స్ చేస్తానంటుంది. బలవంతంగా గెట్ అవుట్ అంటూ జిమ్ నుంచి పంపేస్తా (నవ్వుతూ). చదవండి : హీరోయిన్ త్రిషను అరెస్ట్ చేయాలి..హిందూ సంఘాల ఫిర్యాదు చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించిన హీరో సుదీప్ -
బ్లాక్‌బస్టర్ గ్యారంటీ
ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రణం రుధిరం రౌద్రం). డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలు చేస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. చరణ్ పుట్టినరోజుకి ఓ టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్రబందం. ఈ టీజర్లో రామ్ చరణ్ యుద్ధ విద్యలు నేర్చుకుని యుద్ధానికి తయారవుతున్నట్టు కనిపించారు. ఈ సినిమాలో బాక్సింగ్‌కి సంబంధించి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. ఈ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయని అంటున్నారు యాక్షన్ కొరియోగ్రాఫర్ కుల్దీప్. ‘‘రాజమౌళితో సినిమా చేయడం సంతోషంగా, గర్వంగా ఉంది. ఇందులో బాక్సింగ్ కి సంబంధించిన పలు సన్నివేశాలు ఉన్నాయి. ఆ ఫైట్స్ ని నేనే డిజైన్ చేసాను. స్క్రీన్ మీద సూపర్ గా ఉంటాయి. ‘బాహుబలి’లా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది’’ అని పేర్కొన్నారు కుల్దీప్. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. రాజమౌళి, కుల్దీప్ రామ్ చరణ్, కుల్దీప్ -
మరికొన్ని గంటల్లో...
ఏమూలనో వాన అడ్డుగా నిలుస్తుందనే అనుమానాలున్నా... సిడ్నీ టెస్టులో కోహ్లి సేన గెలుపునకు వచ్చిన ఢోకా ఏమీ లేదనిపిస్తోంది. తొలి రెండు రోజులు బ్యాట్‌తో, మూడో రోజు బంతితో ఆధిపత్యం చాటిన భారత్... క్రమంగా విజయానికి చేరువవుతోంది. వరుణుడు ఆదుకుంటే తప్ప... ఏం చేసినా, ఓటమి తప్పించుకోలేని పరిస్థితిని ఆస్ట్రేలియాకు కల్పించింది. వాతావరణం, పిచ్ అనుకూలిస్తే... టీమిండియా ఆదివారమే మ్యాచ్‌ను ముగించినా ఆశ్చర్యం లేదు. లేదంటే సోమవారం...! తద్వారా, డిసెంబర్ 6న మొదలైన నాలుగు టెస్టుల సిరీస్ సమరానికి అద్వితీయమైన 3–1 గణాంకంతో ఘనంగా వీడ్కోలు పలకనుంది. సిడ్నీ: భారీ స్కోరు సాధించి బ్యాట్స్‌మెన్ ఆత్మవిశ్వాసం ఇవ్వగా... బౌలర్లు తమవంతుగా బాధ్యత నెరవేర్చుతుండటంతో సిడ్నీ టెస్టుపై టీమిండియా పట్టు మరింత బిగించింది. ఇక్కడ జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి ఆతిథ్య ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఓపెనర్ మార్కస్ హారిస్ (120 బంతుల్లో 79; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన లబ్‌షేన్ (95 బంతుల్లో 38; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హ్యాండ్స్కోంబ్ (91 బంతుల్లో 28 బ్యాటింగ్; 3 పోర్లు); కమిన్స్ (41 బంతుల్లో 25 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. రెండు రోజుల ఆట మిగిలి ఉండగా భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (622/7 డిక్లేర్డ్)కు ఆ జట్టు ఇంకా 386 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ (3/71) మూడు వికెట్లు పడగొట్టగా, జడేజా (2/62) రెండు తీశాడు. షమీ (1/54)కి ఒక వికెట్ దక్కింది. శనివారం వర్షం కారణంగా 16 ఓవర్లపైగా ఆట రద్దయింది. దీంతో ఆదివారం అరగంట ముందుగా మ్యాచ్ ప్రారంభం కానుంది. శుభారంభం దక్కినా... ఓవర్‌నైట్ స్కోరు 24/0తో శనివారం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు హారిస్, ఖాజా (71 బంతుల్లో 27; 3 ఫోర్లు) నిలకడగా ఆడటంతో శుభారంభం దక్కింది. ఇద్దరిలో హారిస్ మరింత స్వేచ్ఛగా ఆడాడు. పిచ్ నుంచి పేసర్లకు సహకారం లభించకపోవడంతో కోహ్లి... బుమ్రాను ఆపి శనివారం ఐదో ఓవర్లోనే జడేజాను బౌలింగ్‌కు దించాడు. అయినప్పటికీ ఆసీస్ జోడీ పెద్దగా ఇబ్బంది పడలేదు. మరో ఎండ్‌లో కుల్దీప్కు బంతినివ్వడం లాభించింది. అతడి బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌పై పడిన బంతిని ఆడే ప్రయత్నంలో టైమింగ్ తప్పిన ఖాజా... పుజారాకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 72 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆసీస్ అనూహ్యంగా స్పిన్ ఆల్‌రౌండర్ లబ్‌షేన్‌ను వన్‌డౌన్‌లో పంపింది. బుమ్రా 146 కి.మీ. వేగంతో యార్కర్ సంధించి అతడికి స్వాగతం పలికాడు. అటువైపు 67 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్న హారిస్... కుల్దీప్పై విరుచుకుపడి మూడు బౌండరీలు బాదాడు. లబ్‌షేన్ కూడా కుదురుకోవడంతో ఆసీస్ 122/1తో లంచ్‌కు వెళ్లింది. విరామం ముగిసిన వెంటనే కంగారూలకు పెద్ద దెబ్బ తగిలింది. నిలదొక్కుకున్న హారిస్... జడేజా బంతిని లేట్ కట్ చేసే యత్నంలో వికెట్ మీదకు ఆడుకున్నాడు. స్లిప్‌లో రహానే చురుకైన క్యాచ్ ద్వారా షాన్ మార్ (8)నూ జడేజానే వెనక్కు పంపాడు. షమీ ఓవర్లో షార్ట్ మిడ్ వికెట్లో మరోసారి రహానే చక్కటి క్యాచ్ అందుకోవడంతో లబ్‌షేన్ వెనుదిరిగాడు. హ్యాండ్స్కోంబ్, హెడ్ (20) భారత బౌలర్లను 16 ఓవర్లపైగా కాచుకున్నారు. ఈ దశలో టీ విరామానికి ఒక ఓవర్ ముందు, తర్వాతి ఓవర్లో కుల్దీప్ మాయ చేశాడు. తొలుత అతడి ఫ్లయిటెడ్ డెలివరీని ముందుకొచ్చి షాట్ ఆడబోయిన హెడ్... రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. బ్రేక్ తర్వాత ఆసీస్ కెప్టెన్ పైన్ (5)నూ కుల్దీప్ బోల్తా కొట్టించాడు. ఫుల్ టాస్‌గా వచ్చిన బంతిని డ్రైవ్ చేయబోయి పైన్ ఔటయ్యాడు. దట్టమైన మేఘాలతో టీ బ్రేక్‌కు ముందు నుంచి దోబూచులాడిన వాన మూడో సెషన్లో ప్రతాపం చూపింది. దీంతో చివరి సెషన్లో 15.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఈ వ్యవధిలో హ్యాండ్స్కోంబ్, కమిన్స్ మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. జడేజా బౌలింగ్‌లో హ్యాండ్స్కోంబ్ ఎల్బీడబ్ల్యూపై టీమిండియా రివ్యూ కోరగా నాటౌట్‌గా తేలింది. ఆ వెంటనే వర్షం ప్రారంభమవడంతో ఆట ఆగిపోయింది. మన గెలుపా?లేక ‘డ్రా’నా? ఓవైపు సిడ్నీలో ఆదివారం కూడా వర్షం పడే సూచనలున్నాయి. మరోవైపు పిచ్ బౌలింగ్‌కు అంతంత మాత్రంగానే సహకరిస్తోంది. మన బౌలర్ల కృషిని తక్కువ చేయడం అని కాకుండా... శనివారం ఆసీస్ బ్యాట్స్‌మెన్ పేలవ షాట్ల కారణంగానే ఎక్కువ శాతం వికెట్లు కోల్పోయింది. దీంతో టెస్టు ఫలితం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల ఆట మిగిలి ఉన్నా ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేస్తుందన్న ఆశలేదు. కనీసం ఫాలోఆన్ తప్పించుకోవాలన్నా చేతిలో ఉన్న నాలుగు వికెట్లతో 187 పరుగులు చేయాలి. ఇదీ అసాధ్యమే. ఈ నేపథ్యంలో ప్రత్యర్థిని ఆదివారం మొదటి గంటలోనే ఆలౌట్ చేస్తే టీమిండియా విజయావకాశాలు మరింత మెరుగవుతాయి. ఇప్పటికైతే సోమవారం వర్షం ముప్పు లేదని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే... రెండు రోజుల పాటు నిలవడం ఆసీస్ బ్యాట్స్ మెన్‌కు కష్ట సాధ్యమే. అప్పుడు 3–1తో సిరీస్ కోహ్లి సేన వశం అవుతుంది. ఒకవేళ భారీ వర్షంతో ఎక్కువశాతం ఆట తుడిచిపెట్టుకుపోతే ఫలితం 2–1గా మారుతుంది. ఆస్ట్రేలియాలో బౌలింగ్ కోసమని నేనేమీ మార్పులు చేసుకోలేదు. మెరుగైన టెస్టు బౌలర్‌గా ఎదిగేందుకు నాకు సమయం కావాలి. నెట్స్‌లో కంటే మ్యాచ్‌లు ఆడటం ద్వారానే ఇది సాధ్యం. ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే బ్యాట్స్‌మెన్‌పై ఒక అంచనాకు వచ్చి అంతగా ఎదుగుతాం. ఒక లెగ్ స్పిన్నర్ మైండ్ సెట్ పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి టెస్టులకు మారాలంటే కనీసం 10 రోజులు పడుతుంది. – కుల్దీప్, భారత స్పిన్నర్ దూకుడుగా ఆడి స్పిన్నర్లపై పైచేయి సాధించడం ఎప్పుడైనా ఒక సవాలే. మా బ్యాట్స్‌మెన్ మంచి ప్రారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో మేమింకా పోరాడుతున్నాం. టెస్టుల్లో నంబర్‌వన్ జట్టుపై ఆడటం అనుకున్నంత సులువేం కాదు. భారత్‌లా భారీ స్కోర్లు సాధించాలంటే మేం కొన్ని అంశాల్లో మెరుగవ్వాల్సి ఉంది. –మార్కస్ హారిస్, ఆసీస్ ఓపెనర్ -
ఆపత్కాలం
కష్టాల్లో ఉన్నవాళ్లకు దేవుడు గుర్తొస్తాడు. కష్టాలపాలు చేసినవాళ్లకూ దేవుడు గుర్తొస్తాడు! దేవుడు అందరివాడు. అందుకే వాళ్లూ, వీళ్లూ.. ఇద్దరూ కూడా ‘దేవుడిదే భారం’ అన్నట్లు ఆకాశంలోకి చూస్తారు. ఆకాశంలోని దేవుడే కాదు, భూమ్మీద తన నిర్దోషిత్వాన్ని నమ్మగలిగిన వారు, కష్టాన్నుంచి తమను గట్టెక్కించగలరు అనుకున్నవాళ్లు కూడా ఆపత్కాలంలో దేవుడిలానే కనిపిస్తారు! శనివారం సీబీఐ కోర్టుకు తీసుకెళుతున్నప్పుడు యు.పి.ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెన్గార్ ‘భగవాన్ పర్ భరోసా హై’ అన్నారు. ‘జుడీషియరీపై కూడా నమ్మకం ఉంది’ అన్నారు. జర్నలిస్టుల మీద కూడా భారం వేశాడు! ఉద్యోగం కోసం వెళ్లిన ఒక యువతిపై అత్యాచారం చేసిన కేసు, ఆ యువతి తండ్రిని జైల్లో పెట్టించి, పోలీసుల చిత్రహింసల్ని భరించలేక ఆయన మరణించడానికి కారణమైన కేసు.. ఈ రెండు కేసు ల్లోనూ నిందితుడు కులదీప్. ఆయనపై ఇంకా అనేక ఆరోపణలు ఉన్నాయి. చట్టాల్ని గౌరవించడనీ, జర్నలిస్టుల్ని కొట్టిస్తాడని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తాడనీ కులదీప్‌కి పేరు. ఆ పనులు చేస్తున్నప్పుడు ఆయనకు దేవుడు గుర్తొచ్చి ఉంటాడా అన్నది సందేహమే. తప్పులు చేస్తున్నప్పుడు దేవుడు గుర్తుకు రావాలీ అంటే, చేస్తున్నది తప్పు అని మనసుకు అనిపించాలి. అలా ఏమీ కులదీప్‌కి అనిపించలేదని అర్థమౌతోంది. లేదా.. దేవుడిలాంటి ప్రభుత్వమే అండగా ఉన్నప్పుడు పైన ఎక్కడో ఉన్న దేవుడి అవసరం ఏమిటని ఆయన అనుకుని ఉండాలి. ఇప్పుడైతే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. స్త్రీలందరూ తనకు సొంత మాతృమూర్తులు అంటున్నాడు. దేవుడు, మాతృమూర్తులూ ఎప్పుడూ మదిలో ఉండాలి. అప్పుడు కన్నీళ్లు పెట్టుకునే అవసరమే రాదు. -
35 ఏళ్ల వరకు ఇలాగే ఆడాలనుకుంటున్నా
కేప్‌టౌన్: ‘ఈ ఏడాదిలో 30వ పడిలోకి ప్రవేశిస్తున్నా. 34–35 ఏళ్లు వచ్చేవరకు ఇదే తరహాలో ఆడాలని భావిస్తున్నా. అందుకే శారీరక దారుఢ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నా. దానికి అనుగుణంగా నన్ను నేను మలచుకునేందుకే ఇంతగా శ్రమిస్తాను. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. ఆటలో తీవ్రత ఉండాలని కోరుకునే రకం నేను. అది తగ్గితే మైదానంలో ఏం చేయాలో నాకే తోచదు’ అని పేర్కొన్నాడు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి. బుధవారం దక్షిణాఫ్రికాతో మూడో వన్డే ముగిశాక విలేకరుల సమావేశంలో అతడు మాట్లాడాడు. ఈ సందర్భంగా ఇంకేం అన్నాడంటే... మళ్లీమళ్లీ ఇలాంటి రోజులు... నిత్యం జట్టు గురించే ఆలోచిస్తే అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అనుభూతినే నేను పొందుతున్నా. ఒక అథ్లెట్‌గా ఇలాంటి మరుపురాని రోజులను మళ్లీ మళ్లీ కోరుకోవాలి. బ్యాట్స్‌మన్‌గా, భారత ఆటగాడిగా డ్రెస్సింగ్ రూంలో మంచి వాతావరణాన్ని నెలకొల్పుతున్నందుకు అత్యంత సంతోషిస్తున్నా. కొన్నిసార్లు బ్యాటింగ్‌కు అనుకూల పిచ్‌లపై రాణించి ఉండొచ్చు. కానీ అంతర్జాతీయ స్థాయిలో పరుగులు సాధించడం సులువేం కాదు. క్లిష్టమైన పిచ్‌పై, మంచి బౌలింగ్ దాడిని ఎదుర్కొంటూ చేసిన కేప్‌టౌన్ వన్డే శతకం ప్రత్యేకమైనది. 30వ ఓవర్ తర్వాత పిచ్ నెమ్మదించింది. వికెట్లు కూడా కోల్పోయాం. దీంతో ఆటతీరును పదేపదే మార్చుకోవాల్సి వచ్చింది. వ్యక్తిగత స్కోరు 90ల్లోకి చేరాక కండరాలు పట్టేశాయి. అయినా... జట్టు అవసరాల ముందు దానిని లక్ష్య పెట్టలేదు. ఇంకా ఆడగలిగే శక్తి ఉందని భావించా. ఛేదనలో లక్ష్యం తెలిసిపోతుంది కాబట్టి మనమేం చేయాలో అర్థమవుతుంది. మొదట బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఒకరు దూకుడుగా ఆడుతుంటే మరొకరు స్ట్రైక్ రొటేట్ చేయాలి. అవతలివారు అవుటయ్యాక ఆ బాధ్యత మనం తీసుకోవాలి. మూడో వన్డేలో ధావన్ బాగా ఆడుతున్నప్పుడు నేనదే చేశా. పట్టు సడలించేది లేదు... వరుసగా నాలుగు (చివరి టెస్టు సహా) విజయాలు సాధించినా పట్టు జారనివ్వం. ఇందుకోసం చాలా కష్టపడ్డాం. జట్టుగా మేమంతా చాలా గర్వపడుతున్నాం. అయినప్పటికీ మా బాధ్యతను సగం మేర కూడా నిర్వర్తించామని అనుకోవడం లేదు. సిరీస్ కోల్పోయే పరిస్థితుల్లో లేం అనే విషయం టీం విశ్వాసాన్ని పెంచుతుంది. అయినప్పటికీ నాలుగో వన్డేకు మరింత పట్టుదలతో బరిలో దిగుతాం. మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నందున 6–0తో సిరీస్ కైవసం అంటే చాలా దూరం ఆలోచించినట్లు అవుతుంది. వారికి టెస్టు అవకాశాల గురించి.. ఇక్కడి పరిస్థితుల్లో చహల్, కుల్దీప్ రాణిస్తున్న తీరుకు హ్యాట్సాఫ్. పిచ్‌లు కూడా కొద్దిగా సహకరిస్తుండటంతో ప్రత్యర్థిని చుట్టేస్తున్నారు. విదేశాల్లో ఇలాంటి ప్రదర్శన నమ్మశక్యం కానిది. చివరి రెండు వన్డేల్లో జట్ల మధ్య తేడా వారిద్దరే. భారీ షాట్లు కొడతారనే భయం కూడా లేకుండా బ్యాట్స్‌మెన్‌కు వారు ఊరించే బంతులేస్తున్నారు. తమ బౌలింగ్‌తో ప్రతి ఓవర్లో బ్యాట్స్‌మెన్‌కు రెండు, మూడు ప్రశ్నలు మిగులుస్తున్నారు. వారిద్దరిపై జట్టుకు అమిత నమ్మకం ఉంది. ఇక టెస్టుల్లోకి తీసుకోవడం అన్నది ఇప్పుడే చెపాల్సింది కాదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రపంచకప్‌ను విదేశంలో ఆడబోతున్నాం. ఈ నేపథ్యంలో చహల్, కుల్దీప్ అత్యంత కీలకంగా మారతారని అనుకుంటున్నాం. -
మణికట్టు...ఆటకట్టు
పేస్ ఇబ్బంది పెట్టలేదు... బౌన్స్ పెద్దగా కనిపించలేదు... కానీ స్పిన్ మాత్రం సఫారీ బ్యాట్స్‌మెన్‌తో సొంతగడ్డపైనే చిందులు వేయించింది. మణికట్టును వీడిన బంతులు మిసైల్స్‌లా దూసుకొస్తుంటే ఆడుతోంది భారత్‌లోనా లేక తమ దేశంలోనా అని దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లో సంశయం... ఆ సందేహం తీరేలోపే అంతా ముగిసిపోయింది... ఒకరి వెంట మరొకరు... ఒకే స్కోరు వద్ద ముగ్గురు... కలిసికట్టుగా, సమష్టిగా పెవిలియన్ చేరిపోయారు... 42 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు తీసిన మన స్పిన్ మంత్రం మళ్లీ పని చేసింది. ఫలితంగా దక్షిణాఫ్రికా 118 ఆలౌట్...ఆ తర్వాత వరుసగా రెండో మ్యాచ్‌లో భారత్ అలవోక ఛేదన. దాదాపు మూడు వారాల క్రితం ఇక్కడే రెండో టెస్టులో ఇది భారత్ పిచ్‌లాగానే ఉందని అందరూ అన్నారు. దానిని ఉపయోగించు కోలేకపోయిందంటూ పరాజయం తర్వాత వ్యాఖ్యలూ వినిపించాయి. అయితే ఈసారి కూడా వికెట్ సరిగ్గా భారత్‌లోలాగే స్పందించింది. ఇప్పుడు మనోళ్లు దానిని పూర్తిగా వాడుకున్నారు. యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ అద్భుత బౌలింగ్‌తో కోహ్లి సేన అతి సునా యాసంగా రెండో వన్డేను తమ ఖాతాలో వేసుకుంది. లెగ్ స్పిన్నర్ చహల్ కెరీర్లో తొలిసారి ఐదు వికెట్లు పడగొట్టగా... చైనామన్ కుల్దీప్ 3 వికెట్లతో అండగా నిలిచాడు. ఫలితంగా స్వదేశంలో అతి తక్కువ స్కోరుకు ఆలౌటైన చెత్త రికార్డుతో సఫారీలు మ్యాచ్‌ను సమర్పించుకున్నారు. సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఆధిపత్యం కొనసాగింది. ఆదివారం ఇక్కడి సూపర్ స్పోర్ట్ పార్క్‌లో పూర్తి ఏకపక్షంగా సాగిన రెండో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 32.2 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. డుమిని (25), జోండో (25)లదే అత్యధిక స్కోరు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ యజువేంద్ర చహల్ (5/22), కుల్దీప్ యాదవ్ (3/20) ప్రత్యర్థి పని పట్టారు. అనంతరం భారత్ 20.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. ధావన్ (56 బంతుల్లో 51 నాటౌట్; 9 ఫోర్లు), కోహ్లి (50 బంతుల్లో 46 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు అభేద్యంగా 93 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ఈ ఫలితంతో భారత్ ఆరు వన్డేల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలో నిలిచింది. మూడో వన్డే బుధవారం కేప్‌టౌన్‌లో జరుగుతుంది. టపటపా... ఒక దశలో 26 బంతుల వ్యవధిలో 12 పరుగులకే 4 వికెట్లు... కొంత పోరాటం తర్వాత చివర్లో 36 బంతుల వ్యవధిలో 19 పరుగులకే 6 వికెట్లు... దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ రెండు దశల్లో ఈ రకంగా కుప్పకూలింది! ఒక్కరు కూడా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయలేకపోగా, ఆరుగురు ఒక అంకె స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనే అందుకు కారణం. మొదట్లో భువీ, బుమ్రా... ఆ తర్వాత చహల్, కుల్దీప్ సఫారీల పని పట్టడంతో ఆ జట్టు కోలుకోలేకపోయింది. డివిలియర్స్, డు ప్లెసిస్ లేని బ్యాటింగ్ లైనప్ ఈ మ్యాచ్‌లో మరీ పేలవంగా కనిపించింది. ఓపెనర్లు ఆమ్లా (23; 4 ఫోర్లు), డి కాక్ (20; 2 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను అతి జాగ్రత్తగా ప్రారంభించారు. టెస్టు సిరీస్ నుంచి వరుసగా విఫలమవుతున్న డి కాక్‌ను బుమ్రా ఒక ఆటాడుకున్నాడు. అతని తొలి ఓవర్లో మొదటి బంతినే డి కాక్ దాదాపు వికెట్లపైకి ఆడుకున్నాడు. అదృష్టవశాత్తూ బెయిల్స్ పడలేదు. రెండో బంతి బౌన్సర్‌ను అతి కష్టమ్మీద తప్పించుకున్న డి కాక్, మూడో బంతికి వేలికి గాయం చేసుకున్నాడు. మరోవైపు కొన్ని చక్కటి షాట్లు ఆడిన ఆమ్లాను భువీ అవుట్ చేయడంతో సఫారీల పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత డి కాక్‌ను అవుట్ చేసి చహల్ తన జోరు మొదలు పెట్టాడు. కుల్దీప్ వేసిన మరుసటి ఓవర్లోనే కెప్టెన్ మార్క్రమ్ (8), మిల్లర్ (0) అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా కష్టాలు పెరిగాయి. 51 పరుగుల స్కోరు వద్దే ఆ జట్టు మూడు వికెట్లు కోల్పోవడం విశేషం. ఈ దశలో డుమిని, తొలి వన్డే ఆడుతున్న జోండో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. భారత బౌలింగ్‌ను కొద్ది సేపు నిరోధించగలిగిన వీరిద్దరు 12.4 ఓవర్లలో ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. అయితే మళ్లీ చహల్ మాయ మొదలైంది. భారీ షాట్ ఆడబోయిన జోండో మిడ్ వికెట్లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత జట్టు ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు. చహల్ తన వరుస ఓవర్లలో డుమిని, మోర్కెల్ (1)ల పని పట్టగా...మధ్యలో రబడ (1)ను కుల్దీప్ వెనక్కి పంపించాడు. తాహిర్ (0)ను బుమ్రా బౌల్డ్ చేయగా...మోరిస్ (14)ను అవుట్ చేసి చహల్ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలవోకగా... అతి సునాయాస లక్ష్యాన్ని భారత్ ఏమాత్రం తడబాటు లేకుండా చేరుకుంది. అయితే రోహిత్ శర్మ (17 బంతుల్లో 15; 2 ఫోర్లు, ఒక సిక్స్) మాత్రం మరోసారి తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. మూడో బంతికి సిక్సర్ బాది దూకుడుగా ఆటను ప్రారంభించిన రోహిత్... రబడ బౌన్సర్‌ను హుక్ చేయబోయి మోర్కెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత ధావన్, కోహ్లి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తూ చకచకా పరుగులు రాబట్టారు. ఇదే జోరులో ధావన్ 49 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ విరామం తర్వాత తొమ్మిదో బంతిని స్క్వేర్‌లెగ్ దిశగా ఆడి కోహ్లి రెండు పరుగులు తీయడంతో భారత్ విజయం ఖాయమైంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (సి) ధోని (బి) భువనేశ్వర్ 23; డి కాక్ (సి) పాండ్యా (బి) చహల్ 20; మార్క్రమ్ (సి) భువనేశ్వర్ (బి) కుల్దీప్ 8; డుమిని (ఎల్బీ) (బి) చహల్ 25; మిల్లర్ (సి) రహానే (బి) కుల్దీప్ 0; జోండో (సి) పాండ్యా (బి) చహల్ 25; మోరిస్ (సి) భువనేశ్వర్ (బి) చహల్ 14; రబడ (ఎల్బీ) (బి) కుల్దీప్ 1; మోర్కెల్ (ఎల్బీ) (బి) చహల్ 1; తాహిర్ (బి) బుమ్రా 0; షమ్సీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (32.2 ఓవర్లలో ఆలౌట్) 118 వికెట్ల పతనం: 1–39; 2–51; 3–51; 4–51; 5–99; 6–107; 7–110; 8–117; 9–118; 10–118. బౌలింగ్: భువనేశ్వర్ 5–1–19–1; బుమ్రా 5–1–12–1; పాండ్యా 5–0–34–0; చహల్ 8.2–1–22–5; కుల్దీప్ 6–0–20–3; జాదవ్ 3–0–11–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మోర్కెల్ (బి) రబడ 15; ధావన్ (నాటౌట్) 51; కోహ్లి (నాటౌట్) 46; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 119 వికెట్ల పతనం: 1–26. బౌలింగ్: మోర్కెల్ 4–0–30–0; రబడ 5–0–24–1; మోరిస్ 3–0–16–0; తాహిర్ 5.3–0–30–0; షమ్సీ 3–1–18–0. -
‘నా బుర్ర పని చేయలేదు’
రాంచీ: భారత పర్యటనకు వచ్చిన దగ్గరినుంచి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. తాజాగా తొలి టి20లో ఫించ్‌కు ఆ దెబ్బ పడింది. అతని బంతిని ఆడలేక ఫించ్ బౌల్డ్ కావడం... ఆ తర్వాత ఆసీస్ కుప్పకూలడం చకచకా జరిగిపోయాయి. కుల్దీప్ బౌలింగ్‌ను తాను అర్థం చేసుకోలేకపోయానని ఫించ్ అన్నాడు. ‘నిజానికి పిచ్ పరిస్థితిని బట్టి ఆ సమయంలో కుల్దీప్ బౌలింగ్‌లో స్వీప్ చేయడమే అన్నింటికంటే ఉత్తమం అని నేను భావించాను. అందుకే పదే పదే ఆ షాట్‌కు ప్రయత్నించాను. అయితే నేను అవుటైన బంతి మాత్రం అసలు అర్థం కాలేదు. సరిగ్గా చెప్పాలంటే ఆ బంతిని ఆడే సమయంలో నా బుర్ర పని చేయలేదు. ముుందు స్వీప్ అనుకొని మళ్లీ షాట్ మార్చుకునే ప్రయత్నంలో బౌల్డ్ అయ్యాను’ అని ఫించ్ విశ్లేషించాడు. నిబంధనలు తెలీదు! ఐసీసీ కొత్తగా అమల్లోకి తెచ్చిన నిబంధనలపై తమకు పూర్తిగా అవగాహన రాలేదని ఫించ్‌తో పాటు భారత ఆటగాడు శిఖర్ ధావన్ కూడా అంగీకరించాడు. ‘సిరీస్ మధ్యలో రూల్స్ మారడం ఇబ్బందిగా అనిపించింది. టి20ల్లో డీఆర్ఎస్ ఉంటుందనే విషయం ఐదు ఓవర్ల వరకు నాకు తెలీదు. పైగా 10 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో కూడా ముగ్గురు బౌలర్లు రెండేసి ఓవర్లు వేయవచ్చనే విషయం కూడా తెలీదు. భారత్ ఛేదనలో కూల్టర్‌నీల్ ఒక్కడే రెండు ఓవర్లు వేశాడు’ అని ఫించ్ వ్యాఖ్యానించాడు. తనకూ కొత్త నిబంధనల గురించి తెలీదు కాబట్టి ఆస్ట్రేలియా పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని...అయితే తెలిసినా, తెలియకపోయినా వాటిని పాటించాల్సిందేనని శిఖర్ ధావన్ అన్నాడు. గతంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సాధించిన ఘనతలను గుర్తు చేసే విధంగా భారత ప్రదర్శన కొనసాగుతుండటం పట్ల అతను సంతోషం వ్యక్తం చేశాడు. -
అటు బౌలింగ్‌లో... ఇటు బ్యాటింగ్‌లో
►తొలి రోజు భారత్‌దే పూర్తి ఆధిపత్యం ►శ్రీలంక ప్రెసిడెంట్స్ ఎలెవన్ 187 ఆలౌట్ ►కుల్దీప్, జడేజా మాయాజాలం ►భారత్ తొలి ఇన్నింగ్స్ 135/3 కొలంబో: శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్ సన్నాహాలను భారత జట్టు ఘనంగా ఆరంభించింది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/14), రవీంద్ర జడేజా (3/31)లతో పాటు పేసర్ షమీ (2/9) మెరుపు బౌలింగ్ ధాటికి శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ (ఎస్ఎల్బీపీ) జట్టు బెంబేలెత్తింది. శుక్రవారం ప్రారంభమైన ఈ రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో తొలి రోజే శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 55.5 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ గుణతిలక (97 బంతుల్లో 74; 11 ఫోర్లు), తిరిమన్నె (125 బంతుల్లో 59; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ తొలి రోజు ముగిసేసరికి 30 ఓవర్లలో మూడు వికెట్లకు 135 పరుగులు చేసింది. గాయం కారణంగా మూడు నెలల పాటు జట్టుకు దూరంగా ఉన్న ఓపెనర్ లోకేశ్ రాహుల్ (58 బంతుల్లో 54; 7 ఫోర్లు) తన పునరాగమనాన్ని అద్భుతంగా చాటుకున్నాడు. క్రీజులో విరాట్ కోహ్లి (46 బంతుల్లో 34 బ్యాటింగ్; 4 ఫోర్లు), రహానే (38 బంతుల్లో 30 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఉన్నారు. ఫెర్నాండోకు రెండు వికెట్లు దక్కాయి. తొమ్మిది పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఎస్ఎల్బీపీ జట్టును గుణతిలక, తిరిమన్నె జోడి ఆదుకుంది. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జంట రెండో వికెట్‌కు ఏకంగా 130 పరుగులు జోడించింది. అయితే 38వ ఓవర్లో తిరిమన్నె వికెట్‌ను జడేజా తీయడంతో లంక బోర్డు పతనం ప్రారంభమైంది. అటు షమీ, కుల్దీప్ కూడా ఉచ్చు బిగించడంతో ఈ జట్టు కేవలం 48 పరుగులను మాత్రమే జోడించి చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయింది. ముఖ్యంగా ‘చైనామన్’ కుల్దీప్ను ఎదుర్కోవడంలో లంక ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కూడా ప్రారంభంలో త్వరగానే వికెట్లను కోల్పోయింది. ముకుంద్ (0), పుజారా (12)లను ఆరంభంలోనే ఫెర్నాండో పెవిలియన్‌కు పంపాడు. అయితే రాహుల్ మాత్రం తన ఫామ్‌ను చాటుకున్నాడు. చకచకా ఫోర్లు బాదుతూ వేగంగా అర్ధ సెంచరీ చేశాడు. ఇక కోహ్లి, రహానేకు కూడా మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. ఇప్పటికే వీరి మధ్య నాలుగో వికెట్‌కు అజేయంగా 43 పరుగులు వచ్చాయి. తొలి టెస్టుకు కెప్టెన్ చండిమాల్ దూరం భారత్‌తో తొలి టెస్టు ప్రారంభానికి ముందే శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే కెప్టెన్‌గా నియమితుడైన దినేశ్ చండిమాల్ న్యుమోనియా కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో జట్టు సారథిగా రంగన హెరాత్ వ్యవహరించనున్నాడు. తొలి టెస్టు ముగిశాక వైద్యుల సూచనల మేరకు రెండో టెస్టులో చండిమాల్‌ను ఆడించాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకుంటామని టీమ్ మేనేజర్ గురుసిన్హా తెలిపారు.