గడ్చిరోలిలో పేదింటి మహిళను పలకరిస్తూ...రోహిణి నిలేకని
కులదీప్ దంతెవాడియాకు ఆ జ్ఞాపకం ఇంకా తాజాగానే ఉంది. ఆయన బెంగళూరులోని ఒక స్వచ్ఛందసంస్థ నిర్వాహకుడు. ఆరోజు ఒక డోనర్‌తో ఆయన సమావేశం ఏర్పాటయింది. ముందు అనుకున్నదాని ప్రకారం 45 నిమిషాల సమావేశం అది. కానీ ఈ సమావేశం పూర్తికావడానికి రెండు గంటల సమయం పట్టింది. దీనికి కారణం ఆ డోనర్.
సంస్థ పని తీరు గురించి ఆమె ఎన్నో విషయాలు అడిగారు. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఆమెలో ఎంతో కనిపించింది. వెళుతున్నప్పుడు...
‘మీరు బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నారు. రాత్రి నిద్ర లేదా?’ అని దంతెవాడియాను అడిగి తెలుసుకున్నారు. ఎంతోమంది తో, ఎన్నో సమావేశాల్లో పాల్గొన్న తనకు ఇలాంటి ఆత్మీయ ప్రశ్న ఎదురు కావడం తొలిసారి!
ఆ డోనర్ పేరు రోహిణి నిలేకని.
దంతెవాడియా తన స్వచ్ఛంద సంస్థ ద్వారా చేపట్టిన వివిధ రకాల కార్యక్రమాలకు మూడు సంవత్సరాల కాలంలో అయిదుకోట్ల ఆర్థిక సహాయాన్ని అందించారు రోహిణి.
‘రోహిణి నిలేకని ఎవరు?’ అనే ప్రశ్నకు జవాబుగా ఆమె భర్త నందన్ నిలేకని (ఇన్ఫోసిస్ సహ–వ్యవస్థాపకుడు) పేరు వినిపించవచ్చు. అంతకంటే ఎక్కువగా ‘ఆమె మంచి రచయిత్రి’ అనే మాట ఎక్కువగా వినిపించవచ్చు.
ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రోహిణి ఒక పత్రికలో రిపోర్టర్‌గా పనిచేశారు. ‘స్టిల్‌బార్న్’ నవల ద్వారా ఆమె సృజనాత్మక ప్రపంచంలోకి వచ్చారు. ఈ నవలను పెంగ్విన్ ప్రచురించింది. ‘అన్ కామన్‌గ్రౌండ్’ పేరుతో పాత్రికేయురాలిగా తన అనుభవాలకు అక్షర రూపం ఇచ్చారు. ‘ఆర్ఘ్యం’ ఫౌండేషన్ ద్వారా సామాజికసేవా రంగంలోకి ప్రవేశించారు.
‘యాదృచ్ఛికంగా ఈ రంగంలోకి వచ్చాను’ అని ఆమె చెబుతున్నప్పటికీ, సామాజిక విషయాలపై ఆమె చూపే ఆసక్తి అపురూపం అనిపిస్తుంది!
పట్టణం నుంచి మారుమూల పల్లె వరకు రోహిణి ఎన్నో ప్రయాణాలు చేస్తుంటారు. ఆ ప్రయాణంలో తనకు ఎదురైన అందరి క్షేమసమాచారం కనుక్కుంటారు.
‘ఎలా ఉన్నారు?’ అని పలకరించడానికి చుట్టరికం అక్కరలేదు కదా!
‘ప్రాజెక్ట్‌లపై కాదు ప్రజాసమూహాల సంక్షేమంపై రోహిణి పెట్టుబడి పెడతారు. అదే ఆమె బలం’ అంటుంటారు. అది లాభం ఆశించి పెట్టే పెట్టుబడి కాదు. వారి అభివృద్ధిని ఆశించి చేసే పెట్టుబడి. ఎప్పటికప్పుడూ క్షేత్రస్థాయిలో కొత్త కొత్త రంగాలను ఎంచుకోవడం ఆమె విధానం.
ఈ సంవత్సరం కొత్తగా మెంటల్ హెల్త్, సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్...మొదలైన రంగాలను ఎంపిక చేసుకున్నారు.
‘పోయేటప్పుడు ఏం పట్టుకెళతాం!’ అనేది తత్వం.
‘బతికి ఉన్నప్పుడు ఏం చేశాం?’ అనేది వాస్తవం.
‘యాదృచ్ఛికంగానే సంపన్నురాలయ్యాను’ అంటున్న రోహిణి తన సంపాదనను సామాజిక సంక్షేమంపై అధికం గా కేటాయిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే రోహిణి నిలేకని తాజాగా ఫోర్బ్స్ ఇండియా లీడర్‌షిప్ అవార్డ్–2022 విజేత(గ్రాస్‌రూట్స్ ఫిలాంత్రపిస్ట్ విన్నర్) అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment