అటు బౌలింగ్‌లో... ఇటు బ్యాటింగ్‌లో
►తొలి రోజు భారత్‌దే పూర్తి ఆధిపత్యం
►శ్రీలంక ప్రెసిడెంట్స్ ఎలెవన్ 187 ఆలౌట్
►కుల్దీప్, జడేజా మాయాజాలం
►భారత్ తొలి ఇన్నింగ్స్ 135/3
కొలంబో: శ్రీలంకతో జరగబోయే టెస్టు సిరీస్ సన్నాహాలను భారత జట్టు ఘనంగా ఆరంభించింది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/14), రవీంద్ర జడేజా (3/31)లతో పాటు పేసర్ షమీ (2/9) మెరుపు బౌలింగ్ ధాటికి శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ (ఎస్‌ఎల్‌బీపీ) జట్టు బెంబేలెత్తింది. శుక్రవారం ప్రారంభమైన ఈ రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో తొలి రోజే శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 55.5 ఓవర్లలో 187 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ గుణతిలక (97 బంతుల్లో 74; 11 ఫోర్లు), తిరిమన్నె (125 బంతుల్లో 59; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ భారత బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్ తొలి రోజు ముగిసేసరికి 30 ఓవర్లలో మూడు వికెట్లకు 135 పరుగులు చేసింది.
గాయం కారణంగా మూడు నెలల పాటు జట్టుకు దూరంగా ఉన్న ఓపెనర్ లోకేశ్ రాహుల్ (58 బంతుల్లో 54; 7 ఫోర్లు) తన పునరాగమనాన్ని అద్భుతంగా చాటుకున్నాడు. క్రీజులో విరాట్ కోహ్లి (46 బంతుల్లో 34 బ్యాటింగ్; 4 ఫోర్లు), రహానే (38 బంతుల్లో 30 బ్యాటింగ్; 3 ఫోర్లు) ఉన్నారు. ఫెర్నాండోకు రెండు వికెట్లు దక్కాయి.
తొమ్మిది పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఎస్‌ఎల్‌బీపీ జట్టును గుణతిలక, తిరిమన్నె జోడి ఆదుకుంది. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జంట రెండో వికెట్‌కు ఏకంగా 130 పరుగులు జోడించింది. అయితే 38వ ఓవర్‌లో తిరిమన్నె వికెట్‌ను జడేజా తీయడంతో లంక బోర్డు పతనం ప్రారంభమైంది. అటు షమీ, కుల్దీప్ కూడా ఉచ్చు బిగించడంతో ఈ జట్టు కేవలం 48 పరుగులను మాత్రమే జోడించి చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయింది. ముఖ్యంగా ‘చైనామన్’ కుల్దీప్‌ను ఎదుర్కోవడంలో లంక ఆటగాళ్లు ఇబ్బంది పడ్డారు.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కూడా ప్రారంభంలో త్వరగానే వికెట్లను కోల్పోయింది. ముకుంద్ (0), పుజారా (12)లను ఆరంభంలోనే ఫెర్నాండో పెవిలియన్‌కు పంపాడు. అయితే రాహుల్ మాత్రం తన ఫామ్‌ను చాటుకున్నాడు. చకచకా ఫోర్లు బాదుతూ వేగంగా అర్ధ సెంచరీ చేశాడు. ఇక కోహ్లి, రహానేకు కూడా మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. ఇప్పటికే వీరి మధ్య నాలుగో వికెట్‌కు అజేయంగా 43 పరుగులు వచ్చాయి.
తొలి టెస్టుకు కెప్టెన్ చండిమాల్ దూరం
భారత్‌తో తొలి టెస్టు ప్రారంభానికి ముందే శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవలే కెప్టెన్‌గా నియమితుడైన దినేశ్ చండిమాల్ న్యుమోనియా కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో జట్టు సారథిగా రంగన హెరాత్ వ్యవహరించనున్నాడు. తొలి టెస్టు ముగిశాక వైద్యుల సూచనల మేరకు రెండో టెస్టులో చండిమాల్‌ను ఆడించాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకుంటామని టీమ్ మేనేజర్ గురుసిన్హా తెలిపారు.