రెండోదీ మనవైపే
►సాహా, జడేజా అర్ధ సెంచరీలు
►అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
►భారత్ తొలి ఇన్నింగ్స్ 622/9 డిక్లేర్డ్
►శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 50/2
లంక గడ్డపై టీమిండియా మళ్లీ 600 పరుగులు చేసింది. రెండో టెస్టులోనూ బ్యాట్స్‌మెన్ గర్జించారు. టెయిలెండర్ల అసాధారణ పోరాటపటిమతో వరుసగా ఈ మ్యాచ్‌లోనూ ఆలౌట్ కాకుండా భారీ స్కోరు బాదేసింది. తద్వారా టెస్టును, సిరీస్‌ను సొంతం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంది.
కొలంబో: లంకతో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత బ్యాట్స్‌మెన్ సమష్టిగా కదం తొక్కారు. దీంతో మరోసారి 600 పరుగులు అవలీలగా సాధ్యమయ్యాయి. అశ్విన్ (92 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్), వృద్ధిమాన్ సాహా (134 బంతుల్లో 67; 4 ఫోర్లు, 1 సిక్స్), జడేజా (85 బంతుల్లో 70 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీలు సాధించారు. ఓవర్‌నైట్ స్కోరు 344/3తో రెండో రోజు శుక్రవారం ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 158 ఓవర్లలో 622/9 భారీస్కోరు వద్ద డిక్లేర్ చేసింది. లంక బౌలర్లలో హెరాత్‌కు 4, పుష్పకుమారకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. అశ్విన్ (2/38) ఓపెనర్లను అవుట్ చేశాడు. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్‌లో ప్రస్తుతం శ్రీలంక, భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకంటే 572 పరుగులు వెనుకబడి ఉంది. మరోవైపు ఆతిథ్య జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ జట్టు ప్రధాన పేసర్ నువాన్ ప్రదీప్ తొడ కండరాల గాయంతో మిగతా సిరీస్‌కు దూరమయ్యాడు.
సెషన్–1 పుజారా, రహానే తొందరగానే...
ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్, సెంచరీ హీరోలు పుజారా (232 బంతుల్లో 133; 11 ఫోర్లు, 1 సిక్స్), రహానే (222 బంతుల్లో 132; 14 ఫోర్లు) తమ క్రితం రోజు స్కోరుకు పెద్దగా పరుగులేమీ జత చేయలేదు. ఆట మొదలైన రెండో ఓవర్లోనే కరుణరత్నే బౌలింగ్‌లో పుజారా వికెట్ల ముందు దొరికిపోయాడు. ‘డీఆర్‌ఎస్’తో బౌలర్ ఈ ఫలితాన్ని రాబట్టాడు. దీంతో నాలుగో వికెట్‌కు 217 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత అశ్విన్‌తో కలిసిన రహానే జట్టు స్కోరును 400 పరుగులు దాటించాడు. ఐదో వికెట్‌కు 63 పరుగులు జోడించాక పుష్పకుమార బౌలింగ్‌లో రహానే స్టంపౌట్ కావడంతో భారత్ 442/5 స్కోరు వద్ద లంచ్‌కు కెళ్లింది.
ఓవర్లు: 30, పరుగులు: 98, వికెట్లు: 2
సెషన్–2 టెయిలెండర్ల జోరు
అప్పటికే కీపర్ సాహాతో కలిసి కుదురుగా ఆడుతున్న అశ్విన్ 91 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం కాసేపటికే హెరాత్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డయ్యాడు. టెస్టుల్లో అతనికిది 11వ అర్ధశతకం. తర్వాత సాహాకు హార్దిక్ పాండ్యా జతయ్యాడు. అయితే వేగంగా ఆడే క్రమంలో పాండ్యా (20 బంతుల్లో 20; 3 ఫోర్లు) వికెట్‌ను సమర్పించుకున్నాడు. దీంతో 496 స్కోరు వద్ద భారత్ ఏడో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత సాహా... జడేజా అండతో 113 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. పుష్పకుమార, పెరీరా బౌలింగ్‌లో జడేజా 2 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు 550 పరుగులకు చేరింది. మరో వికెట్ పడకుండా రెండో సెషన్‌ను ముగించారు.
ఓవర్లు: 30, పరుగులు: 111, వికెట్లు: 2
సెషన్–3 వడివడిగా 600 వైపు...
విరామంలో కెప్టెన్ కోహ్లి నుంచి డిక్లేర్ సంకేతం అందుకున్న సాహా, రవీంద్ర జడేజా వేగం పెంచారు. ఈ ప్రయత్నంలో హెరాత్ బౌలింగ్‌లో సాహా స్టంపౌట్‌గా నిష్క్రమించాడు. 70 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్న జడేజాకు, షమీ (19; 2 సిక్సర్లు) జతయ్యాడు. ఇద్దరు ధాటిగా ఆడారు. హెరాత్ ఓవర్లో షమీ వరుసగా రెండు భారీ సిక్స్‌లు బాదాడు. అతని మరుసటి ఓవర్లో జడేజా మరో సిక్సర్ కొట్టాడు. దీంతో కేవలం 8 ఓవర్లలోనే భారత్ 69 పరుగులు చేసింది. చివరకు 622/9 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి లంకకు బ్యాటింగ్ అవకాశమిచ్చింది. ఇక్కడే కోహ్లి వ్యూహం ఫలించింది. కెప్టెన్ తనమీద ఉంచిన నమ్మకాన్ని అశ్విన్ వమ్ము చేయలేదు. లంక ఓపెనర్లు తరంగ (0), కరుణరత్నే (45 బంతుల్లో 25; 2 ఫోర్లు)లను పెవిలియన్ చేర్చి... జట్టును కష్టాల్లో పడేశాడు. ఆట నిలిచే సమయానికి కుశాల్ మెండిస్ (16 బ్యాటింగ్), చండిమాల్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ఓవర్లు: 8, పరుగులు: 69, వికెట్లు: 2 (భారత్), ఓవర్లు: 20, పరుగులు: 50, వికెట్లు: 2 (శ్రీలంక)
⇒1 శ్రీలంకలో వరుస టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్‌లో 600 పైచిలుకు పరుగులు చేసిన తొలి జట్టు టీమిండియా.
⇒ 4 టెస్టుల్లో 200 వికెట్లు, 2000 పరుగులు చేసిన నాలుగో భారత ఆటగాడు అశ్విన్.
⇒ 4 అంతర్జాతీయ క్రికెట్లో వేగవంతంగా ఈ ఘనత (200 + 2000) సాధించిన నాలుగో ఆటగాడిగా అశ్విన్ (51 టెస్టులు) రికార్డులకెక్కాడు. బోథమ్ (ఇంగ్లండ్, 42 టెస్టులు), కపిల్ (50 టెస్టులు), ఇమ్రాన్ (పాక్, 50 టెస్టులు) ముందు వరుసలో ఉన్నారు.