కులదీప్
కష్టాల్లో ఉన్నవాళ్లకు దేవుడు గుర్తొస్తాడు. కష్టాలపాలు చేసినవాళ్లకూ దేవుడు గుర్తొస్తాడు! దేవుడు అందరివాడు. అందుకే వాళ్లూ, వీళ్లూ.. ఇద్దరూ కూడా ‘దేవుడిదే భారం’ అన్నట్లు ఆకాశంలోకి చూస్తారు. ఆకాశంలోని దేవుడే కాదు, భూమ్మీద తన నిర్దోషిత్వాన్ని నమ్మగలిగిన వారు, కష్టాన్నుంచి తమను గట్టెక్కించగలరు అనుకున్నవాళ్లు కూడా ఆపత్కాలంలో దేవుడిలానే కనిపిస్తారు! శనివారం సీబీఐ కోర్టుకు తీసుకెళుతున్నప్పుడు యు.పి.ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెన్‌గార్ ‘భగవాన్ పర్ భరోసా హై’ అన్నారు. ‘జుడీషియరీపై కూడా నమ్మకం ఉంది’ అన్నారు. జర్నలిస్టుల మీద కూడా భారం వేశాడు! ఉద్యోగం కోసం వెళ్లిన ఒక యువతిపై అత్యాచారం చేసిన కేసు, ఆ యువతి తండ్రిని జైల్లో పెట్టించి, పోలీసుల చిత్రహింసల్ని భరించలేక ఆయన మరణించడానికి కారణమైన కేసు.. ఈ రెండు కేసు ల్లోనూ నిందితుడు కులదీప్. ఆయనపై ఇంకా అనేక ఆరోపణలు ఉన్నాయి. చట్టాల్ని గౌరవించడనీ, జర్నలిస్టుల్ని కొట్టిస్తాడని, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తాడనీ కులదీప్‌కి పేరు.
ఆ పనులు చేస్తున్నప్పుడు ఆయనకు దేవుడు గుర్తొచ్చి ఉంటాడా అన్నది సందేహమే. తప్పులు చేస్తున్నప్పుడు దేవుడు గుర్తుకు రావాలీ అంటే, చేస్తున్నది తప్పు అని మనసుకు అనిపించాలి. అలా ఏమీ కులదీప్‌కి అనిపించలేదని అర్థమౌతోంది. లేదా.. దేవుడిలాంటి ప్రభుత్వమే అండగా ఉన్నప్పుడు పైన ఎక్కడో ఉన్న దేవుడి అవసరం ఏమిటని ఆయన అనుకుని ఉండాలి. ఇప్పుడైతే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. స్త్రీలందరూ తనకు సొంత మాతృమూర్తులు అంటున్నాడు. దేవుడు, మాతృమూర్తులూ ఎప్పుడూ మదిలో ఉండాలి. అప్పుడు కన్నీళ్లు పెట్టుకునే అవసరమే రాదు.
Comments
Please login to add a commentAdd a comment