
ఏమూలనో వాన అడ్డుగా నిలుస్తుందనే అనుమానాలున్నా... సిడ్నీ టెస్టులో కోహ్లి సేన గెలుపునకు వచ్చిన ఢోకా ఏమీ లేదనిపిస్తోంది. తొలి రెండు రోజులు బ్యాట్‌తో, మూడో రోజు బంతితో ఆధిపత్యం చాటిన భారత్... క్రమంగా విజయానికి చేరువవుతోంది. వరుణుడు ఆదుకుంటే తప్ప... ఏం చేసినా, ఓటమి తప్పించుకోలేని పరిస్థితిని ఆస్ట్రేలియాకు కల్పించింది. వాతావరణం, పిచ్ అనుకూలిస్తే... టీమిండియా ఆదివారమే మ్యాచ్‌ను ముగించినా ఆశ్చర్యం లేదు. లేదంటే సోమవారం...! తద్వారా, డిసెంబర్ 6న మొదలైన నాలుగు టెస్టుల సిరీస్ సమరానికి అద్వితీయమైన 3–1 గణాంకంతో ఘనంగా వీడ్కోలు పలకనుంది.
సిడ్నీ: భారీ స్కోరు సాధించి బ్యాట్స్‌మెన్ ఆత్మవిశ్వాసం ఇవ్వగా... బౌలర్లు తమవంతుగా బాధ్యత నెరవేర్చుతుండటంతో సిడ్నీ టెస్టుపై టీమిండియా పట్టు మరింత బిగించింది. ఇక్కడ జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి ఆతిథ్య ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఓపెనర్ మార్కస్ హారిస్ (120 బంతుల్లో 79; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన లబ్‌షేన్ (95 బంతుల్లో 38; 7 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హ్యాండ్స్‌కోంబ్ (91 బంతుల్లో 28 బ్యాటింగ్; 3 పోర్లు); కమిన్స్ (41 బంతుల్లో 25 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. రెండు రోజుల ఆట మిగిలి ఉండగా భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (622/7 డిక్లేర్డ్)కు ఆ జట్టు ఇంకా 386 పరుగులు వెనుకబడి ఉంది. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ (3/71) మూడు వికెట్లు పడగొట్టగా, జడేజా (2/62) రెండు తీశాడు. షమీ (1/54)కి ఒక వికెట్ దక్కింది. శనివారం వర్షం కారణంగా 16 ఓవర్లపైగా ఆట రద్దయింది. దీంతో ఆదివారం అరగంట ముందుగా మ్యాచ్ ప్రారంభం కానుంది.
శుభారంభం దక్కినా...
ఓవర్‌నైట్ స్కోరు 24/0తో శనివారం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు హారిస్, ఖాజా (71 బంతుల్లో 27; 3 ఫోర్లు) నిలకడగా ఆడటంతో శుభారంభం దక్కింది. ఇద్దరిలో హారిస్ మరింత స్వేచ్ఛగా ఆడాడు. పిచ్ నుంచి పేసర్లకు సహకారం లభించకపోవడంతో కోహ్లి... బుమ్రాను ఆపి శనివారం ఐదో ఓవర్లోనే జడేజాను బౌలింగ్‌కు దించాడు. అయినప్పటికీ ఆసీస్ జోడీ పెద్దగా ఇబ్బంది పడలేదు. మరో ఎండ్‌లో కుల్దీప్‌కు బంతినివ్వడం లాభించింది. అతడి బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్‌పై పడిన బంతిని ఆడే ప్రయత్నంలో టైమింగ్ తప్పిన ఖాజా... పుజారాకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 72 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆసీస్ అనూహ్యంగా స్పిన్ ఆల్‌రౌండర్ లబ్‌షేన్‌ను వన్‌డౌన్‌లో పంపింది. బుమ్రా 146 కి.మీ. వేగంతో యార్కర్ సంధించి అతడికి స్వాగతం పలికాడు. అటువైపు 67 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్న హారిస్... కుల్దీప్‌పై విరుచుకుపడి మూడు బౌండరీలు బాదాడు. లబ్‌షేన్ కూడా కుదురుకోవడంతో ఆసీస్ 122/1తో లంచ్‌కు వెళ్లింది. విరామం ముగిసిన వెంటనే కంగారూలకు పెద్ద దెబ్బ తగిలింది. నిలదొక్కుకున్న హారిస్... జడేజా బంతిని లేట్ కట్ చేసే యత్నంలో వికెట్ మీదకు ఆడుకున్నాడు.
స్లిప్‌లో రహానే చురుకైన క్యాచ్ ద్వారా షాన్ మార్ (8)నూ జడేజానే వెనక్కు పంపాడు. షమీ ఓవర్లో షార్ట్ మిడ్ వికెట్‌లో మరోసారి రహానే చక్కటి క్యాచ్ అందుకోవడంతో లబ్‌షేన్ వెనుదిరిగాడు. హ్యాండ్స్‌కోంబ్, హెడ్ (20) భారత బౌలర్లను 16 ఓవర్లపైగా కాచుకున్నారు. ఈ దశలో టీ విరామానికి ఒక ఓవర్ ముందు, తర్వాతి ఓవర్లో కుల్దీప్ మాయ చేశాడు. తొలుత అతడి ఫ్లయిటెడ్ డెలివరీని ముందుకొచ్చి షాట్ ఆడబోయిన హెడ్... రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. బ్రేక్ తర్వాత ఆసీస్ కెప్టెన్ పైన్ (5)నూ కుల్దీప్ బోల్తా కొట్టించాడు. ఫుల్ టాస్‌గా వచ్చిన బంతిని డ్రైవ్ చేయబోయి పైన్ ఔటయ్యాడు. దట్టమైన మేఘాలతో టీ బ్రేక్‌కు ముందు నుంచి దోబూచులాడిన వాన మూడో సెషన్‌లో ప్రతాపం చూపింది. దీంతో చివరి సెషన్‌లో 15.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఈ వ్యవధిలో హ్యాండ్స్‌కోంబ్, కమిన్స్ మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. జడేజా బౌలింగ్‌లో హ్యాండ్స్‌కోంబ్ ఎల్బీడబ్ల్యూపై టీమిండియా రివ్యూ కోరగా నాటౌట్‌గా తేలింది. ఆ వెంటనే వర్షం ప్రారంభమవడంతో ఆట ఆగిపోయింది.
మన గెలుపా?లేక ‘డ్రా’నా?
ఓవైపు సిడ్నీలో ఆదివారం కూడా వర్షం పడే సూచనలున్నాయి. మరోవైపు పిచ్ బౌలింగ్‌కు అంతంత మాత్రంగానే సహకరిస్తోంది. మన బౌలర్ల కృషిని తక్కువ చేయడం అని కాకుండా... శనివారం ఆసీస్ బ్యాట్స్‌మెన్ పేలవ షాట్ల కారణంగానే ఎక్కువ శాతం వికెట్లు కోల్పోయింది. దీంతో టెస్టు ఫలితం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. రెండు రోజుల ఆట మిగిలి ఉన్నా ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేస్తుందన్న ఆశలేదు. కనీసం ఫాలోఆన్ తప్పించుకోవాలన్నా చేతిలో ఉన్న నాలుగు వికెట్లతో 187 పరుగులు చేయాలి. ఇదీ అసాధ్యమే. ఈ నేపథ్యంలో ప్రత్యర్థిని ఆదివారం మొదటి గంటలోనే ఆలౌట్ చేస్తే టీమిండియా విజయావకాశాలు మరింత మెరుగవుతాయి. ఇప్పటికైతే సోమవారం వర్షం ముప్పు లేదని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే... రెండు రోజుల పాటు నిలవడం ఆసీస్ బ్యాట్స్ మెన్‌కు కష్ట సాధ్యమే. అప్పుడు 3–1తో సిరీస్ కోహ్లి సేన వశం అవుతుంది. ఒకవేళ భారీ వర్షంతో ఎక్కువశాతం ఆట తుడిచిపెట్టుకుపోతే ఫలితం 2–1గా మారుతుంది.
ఆస్ట్రేలియాలో బౌలింగ్ కోసమని నేనేమీ మార్పులు చేసుకోలేదు. మెరుగైన టెస్టు బౌలర్‌గా ఎదిగేందుకు నాకు సమయం కావాలి. నెట్స్‌లో కంటే మ్యాచ్‌లు ఆడటం ద్వారానే ఇది సాధ్యం. ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే బ్యాట్స్‌మెన్‌పై ఒక అంచనాకు వచ్చి అంతగా ఎదుగుతాం. ఒక లెగ్ స్పిన్నర్ మైండ్ సెట్ పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి టెస్టులకు మారాలంటే కనీసం 10 రోజులు పడుతుంది.
– కుల్దీప్, భారత స్పిన్నర్
దూకుడుగా ఆడి స్పిన్నర్లపై పైచేయి సాధించడం ఎప్పుడైనా ఒక సవాలే. మా బ్యాట్స్‌మెన్ మంచి ప్రారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో మేమింకా పోరాడుతున్నాం. టెస్టుల్లో నంబర్‌వన్ జట్టుపై ఆడటం అనుకున్నంత సులువేం కాదు. భారత్‌లా భారీ స్కోర్లు సాధించాలంటే మేం కొన్ని అంశాల్లో మెరుగవ్వాల్సి ఉంది.
–మార్కస్ హారిస్, ఆసీస్ ఓపెనర్
Comments
Please login to add a commentAdd a comment