భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి
కేప్‌టౌన్: ‘ఈ ఏడాదిలో 30వ పడిలోకి ప్రవేశిస్తున్నా. 34–35 ఏళ్లు వచ్చేవరకు ఇదే తరహాలో ఆడాలని భావిస్తున్నా. అందుకే శారీరక దారుఢ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నా. దానికి అనుగుణంగా నన్ను నేను మలచుకునేందుకే ఇంతగా శ్రమిస్తాను. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఆ ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. ఆటలో తీవ్రత ఉండాలని కోరుకునే రకం నేను. అది తగ్గితే మైదానంలో ఏం చేయాలో నాకే తోచదు’ అని పేర్కొన్నాడు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి. బుధవారం దక్షిణాఫ్రికాతో మూడో వన్డే ముగిశాక విలేకరుల సమావేశంలో అతడు మాట్లాడాడు. ఈ సందర్భంగా ఇంకేం అన్నాడంటే...
మళ్లీమళ్లీ ఇలాంటి రోజులు...
నిత్యం జట్టు గురించే ఆలోచిస్తే అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అనుభూతినే నేను పొందుతున్నా. ఒక అథ్లెట్‌గా ఇలాంటి మరుపురాని రోజులను మళ్లీ మళ్లీ కోరుకోవాలి. బ్యాట్స్‌మన్‌గా, భారత ఆటగాడిగా డ్రెస్సింగ్ రూంలో మంచి వాతావరణాన్ని నెలకొల్పుతున్నందుకు అత్యంత సంతోషిస్తున్నా. కొన్నిసార్లు బ్యాటింగ్‌కు అనుకూల పిచ్‌లపై రాణించి ఉండొచ్చు. కానీ అంతర్జాతీయ స్థాయిలో పరుగులు సాధించడం సులువేం కాదు. క్లిష్టమైన పిచ్‌పై, మంచి బౌలింగ్ దాడిని ఎదుర్కొంటూ చేసిన కేప్‌టౌన్ వన్డే శతకం ప్రత్యేకమైనది. 30వ ఓవర్ తర్వాత పిచ్ నెమ్మదించింది. వికెట్లు కూడా కోల్పోయాం. దీంతో ఆటతీరును పదేపదే మార్చుకోవాల్సి వచ్చింది. వ్యక్తిగత స్కోరు 90ల్లోకి చేరాక కండరాలు పట్టేశాయి. అయినా... జట్టు అవసరాల ముందు దానిని లక్ష్య పెట్టలేదు. ఇంకా ఆడగలిగే శక్తి ఉందని భావించా. ఛేదనలో లక్ష్యం తెలిసిపోతుంది కాబట్టి మనమేం చేయాలో అర్థమవుతుంది. మొదట బ్యాటింగ్‌కు దిగినప్పుడు ఒకరు దూకుడుగా ఆడుతుంటే మరొకరు స్ట్రైక్ రొటేట్ చేయాలి. అవతలివారు అవుటయ్యాక ఆ బాధ్యత మనం తీసుకోవాలి. మూడో వన్డేలో ధావన్ బాగా ఆడుతున్నప్పుడు నేనదే చేశా.
పట్టు సడలించేది లేదు...
వరుసగా నాలుగు (చివరి టెస్టు సహా) విజయాలు సాధించినా పట్టు జారనివ్వం. ఇందుకోసం చాలా కష్టపడ్డాం. జట్టుగా మేమంతా చాలా గర్వపడుతున్నాం. అయినప్పటికీ మా బాధ్యతను సగం మేర కూడా నిర్వర్తించామని అనుకోవడం లేదు. సిరీస్ కోల్పోయే పరిస్థితుల్లో లేం అనే విషయం టీం విశ్వాసాన్ని పెంచుతుంది. అయినప్పటికీ నాలుగో వన్డేకు మరింత పట్టుదలతో బరిలో దిగుతాం. మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నందున 6–0తో సిరీస్ కైవసం అంటే చాలా దూరం ఆలోచించినట్లు అవుతుంది.
వారికి టెస్టు అవకాశాల గురించి..
ఇక్కడి పరిస్థితుల్లో చహల్, కుల్దీప్ రాణిస్తున్న తీరుకు హ్యాట్సాఫ్. పిచ్‌లు కూడా కొద్దిగా సహకరిస్తుండటంతో ప్రత్యర్థిని చుట్టేస్తున్నారు. విదేశాల్లో ఇలాంటి ప్రదర్శన నమ్మశక్యం కానిది. చివరి రెండు వన్డేల్లో జట్ల మధ్య తేడా వారిద్దరే. భారీ షాట్లు కొడతారనే భయం కూడా లేకుండా బ్యాట్స్‌మెన్‌కు వారు ఊరించే బంతులేస్తున్నారు. తమ బౌలింగ్‌తో ప్రతి ఓవర్‌లో బ్యాట్స్‌మెన్‌కు రెండు, మూడు ప్రశ్నలు మిగులుస్తున్నారు. వారిద్దరిపై జట్టుకు అమిత నమ్మకం ఉంది. ఇక టెస్టుల్లోకి తీసుకోవడం అన్నది ఇప్పుడే చెపాల్సింది కాదు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం. ప్రపంచకప్‌ను విదేశంలో ఆడబోతున్నాం. ఈ నేపథ్యంలో చహల్, కుల్దీప్ అత్యంత కీలకంగా మారతారని అనుకుంటున్నాం.
Comments
Please login to add a commentAdd a comment