రాంచీ: భారత పర్యటనకు వచ్చిన దగ్గరినుంచి చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. తాజాగా తొలి టి20లో ఫించ్‌కు ఆ దెబ్బ పడింది. అతని బంతిని ఆడలేక ఫించ్ బౌల్డ్ కావడం... ఆ తర్వాత ఆసీస్ కుప్పకూలడం చకచకా జరిగిపోయాయి. కుల్దీప్ బౌలింగ్‌ను తాను అర్థం చేసుకోలేకపోయానని ఫించ్ అన్నాడు. ‘నిజానికి పిచ్ పరిస్థితిని బట్టి ఆ సమయంలో కుల్దీప్ బౌలింగ్‌లో స్వీప్ చేయడమే అన్నింటికంటే ఉత్తమం అని నేను భావించాను. అందుకే పదే పదే ఆ షాట్‌కు ప్రయత్నించాను. అయితే నేను అవుటైన బంతి మాత్రం అసలు అర్థం కాలేదు. సరిగ్గా చెప్పాలంటే ఆ బంతిని ఆడే సమయంలో నా బుర్ర పని చేయలేదు. ముుందు స్వీప్ అనుకొని మళ్లీ షాట్ మార్చుకునే ప్రయత్నంలో బౌల్డ్ అయ్యాను’ అని ఫించ్ విశ్లేషించాడు.
నిబంధనలు తెలీదు!
ఐసీసీ కొత్తగా అమల్లోకి తెచ్చిన నిబంధనలపై తమకు పూర్తిగా అవగాహన రాలేదని ఫించ్‌తో పాటు భారత ఆటగాడు శిఖర్ ధావన్ కూడా అంగీకరించాడు. ‘సిరీస్ మధ్యలో రూల్స్ మారడం ఇబ్బందిగా అనిపించింది. టి20ల్లో డీఆర్‌ఎస్ ఉంటుందనే విషయం ఐదు ఓవర్ల వరకు నాకు తెలీదు. పైగా 10 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో కూడా ముగ్గురు బౌలర్లు రెండేసి ఓవర్లు వేయవచ్చనే విషయం కూడా తెలీదు. భారత్ ఛేదనలో కూల్టర్‌నీల్ ఒక్కడే రెండు ఓవర్లు వేశాడు’ అని ఫించ్ వ్యాఖ్యానించాడు. తనకూ కొత్త నిబంధనల గురించి తెలీదు కాబట్టి ఆస్ట్రేలియా పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని...అయితే తెలిసినా, తెలియకపోయినా వాటిని పాటించాల్సిందేనని శిఖర్ ధావన్ అన్నాడు. గతంలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సాధించిన ఘనతలను గుర్తు చేసే విధంగా భారత ప్రదర్శన కొనసాగుతుండటం పట్ల అతను సంతోషం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment