న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా సహా దాదాపు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. పొలిటికల్ అజెండాతో కొన్ని ‘ప్రత్యేక బృందాలు’ తమ స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు, న్యాయస్థానాల పరువు, ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
లేఖ రాసిన వారిలో ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా, ఆదిష్ అగర్వాల్, చేతన్ మిట్టల్, పింకీ ఆనంద్, హితేష్ జైన్, ఉజ్వల వార్, ఉదయ్ హోల్లా, స్వరూపమా చతుర్వేది, సహా దేశవ్యాప్తంగా 600 మందికిపైగా న్యాయవాదులు ఉన్నారు. వీరంతా లేఖలో ఒకవర్గం న్యాయమూర్తులను తమ పేర్లు ప్రస్తావించకుండా టార్గెట్ చేస్తూ ఈ ఆరోపణలు చేశారు.
కొందరు లాయర్లు పగటిపూట రాజకీయ నాయకులను సమర్థించి.. రాత్రిపూట మీడియా ద్వారా న్యాయమూర్తులను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా రాజకీయ నేతలకు సంబంధించిన అనేక కేసుల్లో వారు కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. ఇందుకోసం వారు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు.
కోర్టులపై ప్రజల్లో విశ్వాసాన్ని తగ్గించేందుకు న్యాయస్థానాల కీలక తీర్పులపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. కోర్టు నిర్ణయాలు తమకు అనుకూలంగా రాకపోతే వెంటనే బహిరంగ విమర్శలకు దిగుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తూ న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగత, రాజకీయ కారణాలతో కోర్టు ప్రతిష్ఠను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. న్యాయస్థానాల కోసం నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ఈ లేఖను మార్చి 26 రాసినట్లు సమాచారం.
చదవండి: కేజ్రీవాల్‌ను సీఎంగా తొలగించలేం: ఢిల్లీ హైకోర్టు
Comments
Please login to add a commentAdd a comment