న్యూఢిల్లీ: ఆమోదముద్ర కోసం తన వద్దకు వచ్చిన బిల్లులకు మూడేళ్లుగా ఇంకా ఏ నిర్ణయమూ వెల్లడించని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆగ్రహం వ్యక్తంచేసింది. డీఎంకే సర్కార్ అసెంబ్లీలో ఆమోదింపజేసిన బిల్లులను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారంటూ తమిళనాడు రాష్ట్ర ప్రభత్వం దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది.
ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారించింది. ‘ పంజాబ్ ప్రభుత్వ కేసులో మేం ఆదేశాలు జారీచేసేదాకా తమిళనాడు గవర్నర్ మేలుకోలేదు. 2020 జనవరి నుంచి తన వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులకు ఆమోదముద్ర వేయలేదు. మూడేళ్లు ఆయన ఏం చేసినట్లు? ఇదే తరహా పంజాబ్ ప్రభుత్వ కేసులో నవంబర్ 10న మేం ఆదేశాలిచ్చాకే అది చూసి ఆర్‌ఎన్ రవి పాత బిల్లులపై నిర్ణయం తీసుకున్నారు. ఇంతటి తీవ్ర నిర్లక్ష్య వైఖరి ప్రమాదకరం’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఐదే ఉన్నాయి
కోర్టు వ్యాఖ్యానాలపై గవర్నర్ తరఫున హాజరైన అటార్నీ జనరల్(ఏజీ) ఆర్. వెంకటరమణి వాదనలు వినిపించారు. ‘ ఈ బిల్లుల్లో ఎన్నో సంక్షిష్టమైన అంశాలున్నాయి. అయినా ఇవి పాత బిల్లులు. ప్రస్తుత గవర్నర్ 2021 నవంబర్ 18న బాధ్యతలు స్వీకరించకముందు నాటివి. బిల్లుల ఆమోదం ఆలస్యాన్ని ఈ గవర్నర్‌కు ఆపాదించొద్దు. ప్రస్తుతం గవర్నర్ వద్ద కేవలం ఐదు బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా 10 బిల్లులను శనివారమే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మళ్లీ ఆమోదించింది’ అని వాదించారు.
కేరళ గవర్నర్, కేంద్రానికి నోటీసులు
పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలపకుండా ఆలస్యం చేస్తున్నారని కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌పై ఆ రాష్ట్ర సర్కార్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. దీనిపై స్పందన తెలపాలని కేరళ గవర్నర్, కేంద్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ‘గవర్నర్ రాష్ట్రానికి అతీతులుగా వ్యవహరిస్తున్నారు. ఆరిఫ్ వద్ద 7–21 నెలలుగా ఎనిమిది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని కేరళ ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వొకేట్ కేకే వేణుగోపాల్ వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment