న్యూఢిల్లీ/ముంబై: రాజ్యాంగానికి, చట్టానికి తానో సేవకుడినని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. నిర్దేశించిన స్థానాన్ని అనుసరించాల్సి ఉంటుందని అన్నారు. సీజేఐ సారథ్యంలోని ధర్మాసనం శుక్రవారం కార్యకలాపాలు ప్రారంభించగానే, మాథ్యూస్ జె.నెడుంపర అనే న్యాయవాది ఓ అంశాన్ని ప్రస్తావిస్తూ..సీనియర్ న్యాయవాది హోదా విధానాన్ని రద్దు చేయడంతోపాటు కొలీజియం వ్యవస్థలో సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ..‘మనస్సులో ఉన్న విషయం చెప్పే స్వేచ్ఛ మీకుంది. భారత ప్రధాన న్యాయమూర్తిగా, ఒక జడ్జిగా, నేను చట్టానికి, రాజ్యాంగానికి సేవకుడిని. నాకు నిర్దేశించిన స్థానాన్ని అనుసరించాల్సి ఉంటుంది. అంతేతప్ప, నాకు నచ్చింది కాబట్టి, ఇది నేను చేస్తాను అని చెప్పలేను’అని పేర్కొన్నారు.
లాయర్లకు సీనియర్ హోదా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నెడుంపర మరో ఏడుగురు వేసిన పిటిషన్‌పై అక్టోబర్‌లో విచారణ చేపట్టిన అప్పటి సుప్రీంకోర్టు బెంచ్.. సీనియర్ న్యాయవాది హోదాను ప్రతిభకు గుర్తింపుగా పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. అదేవిధంగా, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్(సీఏటీ) ముంబై ధర్మాసనం కొత్త కార్యాలయాన్ని శుక్రవారం సీజేఐ ప్రారంభించారు. న్యాయమూర్తుల నియామకంపై అంతిమ నియంత్రణ ఎవరిదనే అంశంపై నిత్యం తర్జనభర్జనలు జరుగుతూనే ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. జడ్జీల పోస్టుల ఖాళీలు పెరుగుతుండగా, నియామకాలుపెండింగ్‌లో ఉంటున్నాయని చెప్పారు. కోర్టుల్లో జాప్యాలను నివారించి, సకాలంలో న్యాయం అందించే విషయంలో ట్రిబ్యునళ్లు కీలకంగా మారాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment