ధర్మాసనంపై నమ్మకం కోల్పోయారు !
చుండూరు బాధితుల తరఫున హైకోర్టులో స్పెషల్ పీపీ అఫిడవిట్
10న హాజరై స్పష్టత ఇవ్వాలని అటార్నీ జనరల్‌కు ధర్మాసనం ఆదేశం
ఈ ఊచకోత కేసులో ప్రభుత్వ వైఖరి తెలపాలని సీఎస్‌కు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: చుండూరు దళితుల ఊచకోత కేసు మంగళవారం హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారిస్తున్న ధర్మాసనం పట్ల కొందరు బాధితులు నమ్మకం కోల్పోయారంటూ స్పెషల్ పీపీ బొజ్జా తారకం దాఖలు చేసిన అఫిడవిట్ సంచలనం రేపింది. దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం... స్పెషల్ పీపీ బాధితుల తరఫున పనిచేయాలా? లేక ప్రభుత్వ సలహా ఆధారంగా పనిచేయాలా? అని సందేహం వ్యక్తం చేసింది. దీనిపై స్పష్టతనిచ్చి కోర్టుకు సహాయం చేసేందుకు అటార్నీ జనరల్ లేదా ఆయన ద్వారా అధీకృత వ్యక్తిగా నియమితులైన సీనియర్ న్యాయవాది గానీ 10న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
1991, ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరులో చోటుచేసుకున్న 8 మంది దళితుల ఊచకోత ఘటనపై సుదీర్ఘ విచారణ తరువాత ప్రత్యేక న్యాయమూర్తి అనీస్ 2007, ఆగస్టు 1న తీర్పు వెలువరించారు. నిందితులకు ఉరిశిక్ష విధించే అరుదైన కేసు కాదని పేర్కొంటూ మొత్తం 179 నిందితుల్లో 123 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. 21 మందికి యావజ్జీవం, 35 మందికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పులోని కొన్ని అంశాలపై సందేహాలు లేవనెత్తుతూ బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. శిక్ష పడినవారు తమ శిక్షను రద్దు చేయాలంటూ పిటిషన్ వేశారు. మరోవైపు నిర్దోషులుగా విడుదలైన వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేసింది. ఈ కేసుల్లో వాదనలు వినిపించేందుకు న్యాయవాది బొజ్జా తారకం, రఘునాథ్‌లను స్పెషల్ పీపీలుగా ప్రభుత్వం నియమించింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం కొద్ది రోజులుగా విచారణ సాగిస్తోంది.
ఈ క్రమంలో మంగళవారం విచారణ సమయంలో బాధితుల తరఫున బొజ్జా తారకం ధర్మాసనం పట్ల అవిశ్వాసం వ్యక్తం చేశారు. కేసు విచారణ తీరు చూస్తుంటే తమకు న్యాయం జరిగేలా కనిపించట్లేదని బాధితుల్లో కొందరు నమ్మకం కోల్పోయారంటూ అఫిడవిట్‌ను ధర్మాసనం ముందుంచారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాదనల ప్రారంభంలో అభ్యంతరం లేదని చెప్పి... ఇప్పుడిలా అభ్యంతరాలు ఉన్నాయనడం ఎంత వరకు సబబని ప్రశ్నించింది. ‘‘కోర్టుపై నమ్మకం లేనిది మీకా (స్పెషల్ పీపీ)? లేక బాధితులకా?’’ అంటూ తారకాన్ని అడిగింది. బాధితులకంటూ తారకం సమాధానం చెప్పగా... వారి పేర్లు చెప్పాలని ధర్మాసనం కోరింది. పేర్లు తెలుసుకోవాల్సి ఉందని ఆయన చెప్పడంతో... పేర్లు తెలుసుకోకుండానే ప్రమాణపత్రం(అఫిడవిట్)దాఖలు చేశారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం బాధితుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించడానికి వీల్లేదని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి తెలియచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది.