మంగళగిరి(గుంటూరు): ల్యాండ్‌ఫూలింగ్ అనేదే మోసపూరితమని, పైగా రైతుల నుంచి భూమిని పోగుచేసి కార్పొరేట్లకు కట్టబెట్టి రాజధాని నిర్మాణం చేయడమేమిటని హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం ధ్వజమెత్తారు. భూ సమీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బొజ్జాతారకం పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు తనను ప్రధానిగా ఊహించుకుంటూ రోజకో దేశం తిరుగుతూ... ఒకరోజు సింగపూర్, మరో రోజు జపాన్, మరో రోజు చైనాను నిర్మిస్తానంటూ అతిపెద్ద వేషదారుడిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు.
అన్నపూర్ణలాంటి భూములను ధ్వంసం చేసేందుకు చంద్రబాబుకు మనస్సు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వ్యవసాయాభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సింది పోయి, పచ్చని పొలాలను ధ్వంసం చేసి ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తాననడం ఎంతవరకు సమంజసమన్నారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు స్థానిక ప్రజలు చేస్తున్న పోరాటం న్యాయబద్దమైందన్నారు. పోలీసుల బల ప్రయోగంతో ప్రభుత్వ పెద్దలు తాత్కాలికంగా విజయం సాధించినా ప్రజాపోరాటమే అంతిమ విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు కూలీసంఘం అధ్యక్షుడు సింహాద్రి ఝాన్సీ, కార్యదర్శి కొప్పుల కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
ల్యాండ్ పూలింగ్ మోసపూరితం: బొజ్జా తారకం
Published Sun, Apr 19 2015 6:48 PM | Last Updated on Wed, Apr 3 2019 6:20 PM
Advertisement