న్యాయమే బోనులో నిలబడితే! | Who is standing in the cage! | Sakshi
Sakshi News home page

న్యాయమే బోనులో నిలబడితే!

Published Sat, May 10 2014 11:38 PM | Last Updated on Wed, Apr 3 2019 6:20 PM

న్యాయమే బోనులో నిలబడితే! - Sakshi

న్యాయమే బోనులో నిలబడితే!

సాక్ష్యాలలో ఒక సాక్షికి మరొక సాక్షికి కొంత తేడా ఉంటుంది. సాక్ష్యం చెప్పడంలో సాక్షికి సాక్షికి తేడా వస్తుంది. అలా వస్తాయని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. అంతమాత్రాన కేసు కొట్టివేయటానికి వీల్లేదు.
 
ఆగస్టు 6, 1991న చుండూరు (గుంటూరు జిల్లా) దళితవాడపై నాలుగు వం దల మందికిపైగా రెడ్లు, తెలగలు మారణాయుధాలతో దాడిచేసి, ఎనిమిది మందిని చంపివేశారు. ఇద్దరిని ముక్కలుగా నరికి గోనెసంచుల్లో కుక్కి తుంగ భద్ర మురుగుకాల్వలోకి తోసివేశారు. ఇంకొందరిని గాయపరిచారు.

ఇప్పుడు 2014 ఏప్రిల్ 22వ తేదీన హైకోర్టు, చుండూరు కేసులో యావ జ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఇరవై మందిని, ఇతర శిక్షలు అనుభవించిన మరో 36 మందిపై మొత్తం శిక్షలు రద్దు చేస్తూ తీర్చునిచ్చింది. తీర్పు పూర్తి పాఠం వెలువరించకుండానే యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నవారిని ఆగమేఘాల మీద విడుదల చేయించింది. వారిని విడిచిపెట్టిన అయిదో రోజున తీర్పు పూర్తిపాఠం ప్రకటించింది. అక్కడితో ఆగకుండా హైకోర్టు ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని, ఒకరి పట్ల మరొకరు గౌరవభావం పెంపొందించుకోవాలని సలహా ఇచ్చింది. పులులకు, మేకలకు ఒకే ఉద్బోధ చేసిన ఘనత హైకోర్టుదే.

ఇది ‘పెద్ద మనుషుల తీర్పు’

ఆ మారణకాండపై 1991లో దేశమంతా వెల్లువెత్తిన ఆగ్రహావేశాలను మించి ఈ తీర్పుపై నిరసనలు పెల్లుబికాయి. ప్రాథమిక న్యాయ సూత్రాలకు, సుప్రీంకోర్టు పదేపదే చెబుతున్న తీర్పులకు పూర్తి భిన్నంగా వచ్చిన ఈ తీర్పు సత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది గ్రామాలతో అగ్రకుల పెత్తందార్లు ఇచ్చిన ‘పెద్దమనుషుల తీర్పు’లా ఉన్నది. ముందు నుంచీ ఈ కేసులో అగ్రకుల భూస్వామ్య అహంకారం కనిపిస్తున్నది. పోలీసుపాత్ర కూడా ఆది నుంచీ అగ్రకులాలకు వత్తాసు పలికే తీరులోనే ఉంది. హత్యలు జరిగిన రోజు చుండూరులో పోలీసు బలగం ఉన్నది. అంతకుముందు నుంచే చెదురుమదురు సంఘటనలు జరుగుతుంటే క్యాంపు పెట్టారు. సంఘటన రోజు ఉదయం పోలీసులు మాలపల్లెపై దాడిచేశారు. అంతకుముందు జరిగిన కేసులో మాలమాదిగలను అరెస్టు చెయ్యడానికి వచ్చారు. వారిని చూసి మాలమాదిగలు పారిపోయారు. దీనితో పోలీసులు తిరిగి ఊరిలోకి వచ్చారు. అప్పటికే రెడ్లు మారణాయుధాలతో పోలీస్‌స్టేషన్ ముందు జమగూడారు. నిజానికి మాలమాదిగలను తరుముతుంటూ పోలీసులు, వెనకాల రెడ్లు వెళ్లారు. వారిని పోలీసులు ఏమీ అనలేదు. దీనితో రెడ్లు మరీ రెచ్చిపోగా, వారికి తెలగలు తోడయ్యారు. రెండో రోజున, మూడో రోజున కాల్వలో ఎనిమిది శవాలు తేలాయి.

అంతా పోలీసుల కళ్ల ముందే

ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగింది. తమ కళ్లముందు జరిగిన ఘోరానికి ఎవరో రిపోర్టు చేయనవసరం లేదు. శవాలను భార్యలు, అన్నదమ్ములు, ఇతర బంధువులు గుర్తించగలిగారు. వారిని చంపటం చూసినవారు పంచనామా జరుగుతున్నప్పుడు సాక్ష్యం చెప్పారు. డాక్టర్లు గాయాలను గుర్తించారు. ఏ పోలీ సుల కళ్ల ముందు ఈ మారణకాండ జరిగిందో వారే కేసు దర్యాప్తు చేశా రు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి ఆలపాటి ధర్మారావు ఆ ఊరువాడే. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి తప్పనిసరై 219 మం దిపై చార్జిషీటు వేయటం జరిగింది. 134 మంది సాక్షులను పెట్టారు. అప్పటికే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం చుండూరులో ప్రత్యేక కోర్టు పెట్టారు. అది ఇష్టం లేని రెడ్లు ఏదో ఒక వంకపై విచారణ జరగటానికి వీల్లేదని పిటిషన్లు పెట్టడం, వాటిని కోర్టు కొట్టి వేస్తే హైకోర్టుకు అపీలుకు వెళ్లటం, హైకోర్టు తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లటం, అక్కడా పప్పులు ఉడకకపోతే మళ్లీ విచారణ ప్రారంభం కావడం జరుగుతుండేది. దాదాపు పది సంవత్సరాలు కేసు నడవకుండా చేశారు. తప్పనిసరైనాక విచారణ మొదల యింది. కేసు 219 ముద్దాయిలపై నడిచి 134 సాక్షుల జాబితా ఉన్నది. వారిలో 33 మంది ముద్దాయిలు మధ్యలో చనిపోయారు. మొత్తం 70 మంది సాక్షులను విచారించారు. సాక్ష్యాలు లేవని కొందరిని విడిచిపెట్టారు. ఒక్క సాక్షే చెప్పాడు కాబట్టి, ఆ సాక్ష్యాన్ని సమర్థించే వారు లేరని ఇంకొందరిని విడిచిపెట్టారు. మిగిలిన వారిపై తగిన ఆధారాలున్నాయని, ఒక సాక్షికి మరొక సాక్షికి పొంతన కుదిరిందని సెషన్స్ కోర్టు కొందరికి యావజ్జీవ కారాగార శిక్ష, మరికొందరికి రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించింది.

సోదిలోకి రాని సుప్రీం ఆదేశాలు

ఈ తీర్పును ఇప్పుడు హైకోర్టు కొట్టి వేసింది. సాక్ష్యాలు నమ్మదగినవిగా ఉన్నాయని ఒక కోర్టు అభిప్రాయపడితే, వాటిని కొట్టిపారేయటానికి హైకోర్టు బలమైన ఆధారాలు చూపాలి. సాక్ష్యాలలో ఒక సాక్షికి మరొక సాక్షికి కొంత తేడా ఉంటుంది. సాక్ష్యం చెప్పడంలో సాక్షికి సాక్షికి తేడా వస్తుంది. అలా వస్తాయని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. అంతమాత్రాన కేసు కొట్టివే యటానికి వీల్లేదు. ఈ కేసును కొట్టివేయటానికి హైకోర్టు  కొన్ని ప్రధానమైన కారణాలు చూపింది. అందులో ఒకటి- ఒక సాక్షి ‘నేను ఈదుకుంటూ కాలవ దాటాను’ అని చెప్పాడు. అతనే నాకు ఈత రాదని చెప్పాడు. ఈతరాని వాడు కాలవ ఎలా దాటగలిగాడు? అని హైకోర్టు అనుమానం. వేటగాళ్ల మాదిరిగా ఆయుధాలు ధరించి తరుముకు వస్తున్న వారిబారి నుంచి రక్షించుకోవడానికి కాలవ దాటేశాడు. అది హైకోర్టుకు అర్థంకాలేదు. ఎనిమిది హత్యలు జరిగితే ఒక్కడు కూడా పోలీసు రిపోర్టు ఇవ్వలేదు. కాబట్టి వారి సాక్ష్యాలను నమ్మలేమంటుంది. రెండు రోజుల వరకూ ఆ వార్త ఎవరికీ చెప్పకుండా ఎలా ఉంటారు? అని ప్రశ్నిస్తుంది. తమ బంధువులను తమ కళ్లముందు నరికి చంపితే, దాని మీద  రిపోర్టు ఇవ్వలేదన్న కారణంతో వాళ్ల సాక్ష్యాలు నమ్మరా? ఒక అవిటి ముద్దాయి దాడిలో పాల్గొని, మాలమాదిగలను పట్టుకొని, ఒకరి శరీరం నుంచి సిరంజితో రక్తం తీశాడని చాలామంది సాక్షులు చెపితే, అవిటి వ్యక్తి ఎలా చేస్తాడని నమ్మలేదు.

చట్ట విరుద్ధం, అనైతికం

సాక్ష్యాన్ని నమ్మటానికి కొన్ని కొలబద్దలుంటాయి. వాటి ప్రాతిపదికగానే  సెషన్స్ కోర్టు కొన్ని సాక్ష్యాలను తిరస్కరించింది, కొన్నింటిని స్వీకరించింది. హైకోర్టుకు అవేం కనబడలేదు. ఏ కోర్టు పరిగణనలోకి తీసుకొని చిన్నచిన్న తేడాల ఆధారంగా కేసు కొట్టేసింది. ఇంకా ఘోరం ఏమంటే ప్రాసిక్యూషన్ తరపున ఉటంకించిన సుప్రీంకోర్టు తీర్పులలో ఏ ఒక్కటీ పరిగణనలోకి తీసుకోలేదు. ఇది చట్ట విరుద్ధం. అనైతికం.

మొదటి నుంచి ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చెయ్యా లనే ఆత్రంతో కోర్టు ఉన్నది. ప్రతిసారీ ఎంతకాలం వాళ్లు జైల్లో మగ్గాలి అని ప్రశ్నించింది. ఆ తీరును చూసిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కోర్టుపై మాకు నమ్మకం లేదని ప్రకటించారు. మా మీద కోర్టు ధిక్కారం కేసు పెడ తానని కోర్టు భయపెట్టింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ కొన్ని అప్పీళ్లు వేసి, వాటిని కూడా కలిపి వినండి అవి కోరితే, అవన్నీ ఎప్పుడు పూర్తి కావాలి? ముందు వీరిని విడిచి పెట్టేద్దాం అన్న ధోరణితో సాగింది.  కోర్టుకు తనకు నచ్చిన తీర్పు ఇచ్చే అధికారం ఉన్నది. అయితే సరైన న్యాయసూత్రాల ప్రాతి పదిక ఉండాలి. అది హైకోర్టు తీర్పులో లేదు. సుప్రీంకోర్టు తీర్పులు పరిగణ నలోకి తీసుకుంటే ముద్దాయిలందరికీ శిక్ష ఖాయం అవుతుంది. అది హైకో ర్టుకు ఇష్టం లేదు. అందుకని వాటిని దాటవేసింది. కేవలం కుల అహంకా రంతో మాలమాదిగలను చంపేస్తే, చంపిన వారికి సెషన్స్ కోర్టు శిక్ష విధించిం ది. దానిని హైకోర్టు కొట్టివేసింది. మరి న్యాయవ్యవస్థపై మాలమాదిగలు నమ్మకం కోల్పోరా?

దెబ్బ, చావుదెబ్బ

ఈ కేసులో మరొక ఘోరం జరిగింది. మాలమాదిగలను తరిమేటప్పుడు, పొడిచేటప్పుడు, నరికేటప్పుడు కులం పేరుతో దూషించారు.  అందుకని ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు దాఖలయింది. ప్రతిసాక్షి ప్రత్యేక కోర్టులో ఇదే చెప్పారు. ఈ సాక్ష్యాన్ని కోర్టు అంగీకరించింది. కానీ శిక్ష మాత్రం ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వెయ్యలేదు. సెషన్స్ కోర్టు ఒక దెబ్బ కొడితే, హైకోర్టు చావు దెబ్బకొట్టింది. అగ్రకులాలు ముద్దాయిలుగా ఉంటే చట్టాలు, కోర్టులు ముఖం తిప్పుకుంటాయి. లేదా కళ్లు చెవులు మూసుకుంటాయి.

 (వ్యాసకర్త హైకోర్టు సీనియర్ న్యాయవాది, ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్)   బొజ్జా తారకం
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement