హైదరాబాద్: చుండూరు దళితుల హత్య కేసుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సీపీఐ, సీపీఎంలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో వామపక్షాలు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఉభయ రాష్ట్రాల్లోనూ ఆందోళన నిర్వహించనున్నాయి. ఈ కేసులో నిందితులందరినీ విడుదల చేస్తూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ఆయా పార్టీల నేతలు తీవ్రంగా నిరసించారు. హంతకులను శిక్షించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారమై న్యాయపోరాటం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట ధర్నాలు, ప్రదర్శనలను నిర్వహించాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఏం జరిగింది..?: గుంటూరు జిల్లా చుండూరులో 1991 ఆగస్టు ఆరున దళితులపై అగ్రకులాలకు చెందిన కొందరు నిందితులు మూకుమ్మడిగా దాడి చేసి 8 మంది దళితులను చంపేశారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణకు చుండూరులోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఈ కోర్టు 219 మంది ముద్దాయిలను విచారించి 21మందికి యావజ్జీవ కారాగార శిక్ష, మరో 35 మందికి ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై నిందితులు రాష్ట్ర హైకోర్టుకు వెళ్లగా న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, జస్టిస్ జైస్వాల్ విచారించి సరైన సాక్ష్యాధారాలు లేవంటూ నిందితుందరినీ నిర్దోషులుగా పేర్కొంటూ విడుదల చేయాలని ఆదేశించారు. ఈ తీర్పుపై దళిత సంఘాలు, వామపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి.
ఈ తీర్పు న్యాయ సూత్రాలకు అనుగుణంగా లేదని విమర్శించాయి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించాయి. నిందితులను ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం విచారించాలని, ఈ కేసులో నిందితులకు శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులు, పోలీసులపై కూడా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకునేలా న్యాయవ్యవస్థలో ప్రస్తుతమున్న లోపాలను సవరించాలని ఆయా ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
‘చుండూరు’ కేసుపై నేడు ఆందోళన
Published Mon, Jun 16 2014 2:07 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM
Advertisement
Advertisement