Dalit murder case
-
‘ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించాలి’
సాక్షి, ముంబై : అహ్మద్‌నగర్ జిల్లాలో ఇటీవల జరిగిన దళిత హత్యకాండ కేసుపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరపాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగి 19 రోజులు గడిచిపోయినప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. తూర్పు అంధేరీలోని సాకినాకా ప్రాంతంలో కష్టకారి యువ సంఘటన (కెవైఎస్), తెలంగాణ విద్యావంతుల వేదిక మహారాష్ర్ట సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ‘జాదవ్ కుటుంబ హత్యాకాండ ఘటన’పై ఓ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నిందితుల ఆస్తులను జప్తు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవైఎస్ అధ్యక్షుడు బి.మురళి, మూల్ నివాసిమాల, కళాకారులు డి.ప్రకాష్, టి.లచ్చన్న గౌడ్, బద్రి పూర్ణచందర్, చాంద్ అహ్మద్, తె.వి.వి. కన్వీనర్లు జి.గంగాధర్ గంగపుత్ర, ఎ.శ్రీనివాస్ రజక్ పాల్గొన్నారు. -
చుండూరు కేసులో సుప్రీంకోర్టు స్టే
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చుండూరు కేసులో హైకోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసులో నిందితులకు ఉన్నత న్యాయస్థానం బుధవారం నోటీసులు జారీ చేసింది. గుంటూరు జిల్లా చుండూరులో 1991 ఆగస్టు 6న జరిగిన దళితులను అగ్రవర్ణాలకు చెందిన కొందరు ఊచకోత తోసిన విషయం తెల్సిందే. దీనిపై చుండూరు కేసులో యావ జ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఇరవై మందిని, ఇతర శిక్షలు అనుభవించిన మరో 36 మందిపై మొత్తం శిక్షలు రద్దు చేస్తూ 2014 ఏప్రిల్ 22వ తేదీన హైకోర్టు తీర్చునిచ్చింది. కాగా ఆ తీర్పును పలువురు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో హత్య కేసు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం, మృతుల బంధువులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణను జరిపిన సుప్రీంకోర్టు ...దిగువ కోర్టు ఇచ్చిన విచారణపై స్టే విధించటంతో పాటు నిందితులకు నోటీసులు ఇచ్చింది. కాగా దళితుల ఊచకోత ఘటనపై సుదీర్ఘ విచారణ తరువాత ప్రత్యేక న్యాయమూర్తి అనీస్ 2007, ఆగస్టు 1న తీర్పు వెలువరించారు. నిందితులకు ఉరిశిక్ష విధించే అరుదైన కేసు కాదని పేర్కొంటూ మొత్తం 179 నిందితుల్లో 123 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. 21 మందికి యావజ్జీవం, 35 మందికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పులోని కొన్ని అంశాలపై సందేహాలు లేవనెత్తుతూ బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. శిక్ష పడినవారు తమ శిక్షను రద్దు చేయాలంటూ పిటిషన్ వేశారు. మరోవైపు నిర్దోషులుగా విడుదలైన వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేసింది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
‘చుండూరు’ కేసుపై నేడు ఆందోళన
హైదరాబాద్: చుండూరు దళితుల హత్య కేసుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సీపీఐ, సీపీఎంలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో వామపక్షాలు, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఉభయ రాష్ట్రాల్లోనూ ఆందోళన నిర్వహించనున్నాయి. ఈ కేసులో నిందితులందరినీ విడుదల చేస్తూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ఆయా పార్టీల నేతలు తీవ్రంగా నిరసించారు. హంతకులను శిక్షించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారమై న్యాయపోరాటం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, ప్రదర్శనలను నిర్వహించాలని తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏం జరిగింది..?: గుంటూరు జిల్లా చుండూరులో 1991 ఆగస్టు ఆరున దళితులపై అగ్రకులాలకు చెందిన కొందరు నిందితులు మూకుమ్మడిగా దాడి చేసి 8 మంది దళితులను చంపేశారు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణకు చుండూరులోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఈ కోర్టు 219 మంది ముద్దాయిలను విచారించి 21మందికి యావజ్జీవ కారాగార శిక్ష, మరో 35 మందికి ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై నిందితులు రాష్ట్ర హైకోర్టుకు వెళ్లగా న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, జస్టిస్ జైస్వాల్ విచారించి సరైన సాక్ష్యాధారాలు లేవంటూ నిందితుందరినీ నిర్దోషులుగా పేర్కొంటూ విడుదల చేయాలని ఆదేశించారు. ఈ తీర్పుపై దళిత సంఘాలు, వామపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. ఈ తీర్పు న్యాయ సూత్రాలకు అనుగుణంగా లేదని విమర్శించాయి. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించాయి. నిందితులను ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం విచారించాలని, ఈ కేసులో నిందితులకు శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులు, పోలీసులపై కూడా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. నేరస్తులు శిక్ష నుంచి తప్పించుకునేలా న్యాయవ్యవస్థలో ప్రస్తుతమున్న లోపాలను సవరించాలని ఆయా ప్రజాసంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.