ఇక జైళ్లు సగం నోరు తెరుచుకుంటాయి! | The prisons half open mouth! | Sakshi
Sakshi News home page

ఇక జైళ్లు సగం నోరు తెరుచుకుంటాయి!

Published Sat, Oct 11 2014 11:47 PM | Last Updated on Wed, Apr 3 2019 6:20 PM

ఇక జైళ్లు సగం నోరు తెరుచుకుంటాయి! - Sakshi

ఇక జైళ్లు సగం నోరు తెరుచుకుంటాయి!

విచారణ పూర్తయి శిక్ష అంటూ పడితే, ఎంత శిక్ష పడుతుందో, దానిలో సగ కాలం విచారణ లేకుండా జైళ్లలో గడిపి ఉంటే, వారిని వెంటనే విడుదల చేయవలసిందిగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.  వాస్తవానికి ఈ రకమైన తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వనవసరం లేదు.
 
విచారణకు నోచుకోకుండా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న అభాగ్యులకు ఎట్టకేలకు విముక్తి లభించింది! ఏదో అభియోగం మీద అరెస్టు చేసి, అతను నేరం చేశాడా లేదా అని విచారణ చేయకుండా జైల్లో పెట్టేసి, ఇక వారి సం గతి మరచిపోతారు. అరెస్టు ఎందుకు చేశారో అత నికి తెలియదు. తనపై ఉన్న అభియోగం ఏమిటో తెలియదు! తనపై నేరారోపణ ఎవరు చేశారో తెలి యదు! విచారణ ఎప్పుడు మొదలవుతుందో తెలి యదు! తనపై మోసిన అభియోగానికి విచారణ అంటూ జరిపితే ఎంత శిక్ష పడుతుందో తెలియదు! అటువంటి వారికి 5, అక్టోబర్ 2014 నాడు సుప్రీం కోర్టు గొప్ప ఊరట కల్పించింది. వీరి విచారణ  ఒక వేళ  పూర్తయి, శిక్ష అంటూ పడితే, ఎంత శిక్ష పడుతుందో, దానిలో సగ కాలం  విచారణ లేకుండా జైళ్లలో గడిపి ఉంటే, వెంటనే విడుదల చేయవలసిందిగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ దానికి సంబంధించిన అంశాలపై అవసరమైన ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ రకమైన తీర్పు సుప్రీం కోర్టు ఇవ్వనవసరం లేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) సెక్షన్ 436ఏలోనే ఇటువంటి ఉత్తర్వులు ఇవ్వాలని ఆజ్ఞ ఉన్నది. అయితే దానిని పట్టించుకొనే వారెవరు? డబ్బున్న వాళ్లకు, అధికారం ఉన్న వాళ్లకు ఈ బాధలు ఉండవు! ముందే అన్నీ చక్కబెట్టుకుంటారు!

ఇటువంటి సౌకర్యం 2005లో సీఆర్‌పీసీకి సవరణ ద్వారా తీసుకువచ్చారు. ఇది 2006 నుంచి అమలులోకి వచ్చినా, దీని ప్రయోజనం జైళ్లలో ఉన్న వారికి అందటం లేదు. చట్టం ఉన్నది, ప్రయోజనం ప్రజలకు అందాలి. ఇది వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. కాని చట్ట ప్రయోజనం అందక కొన్ని వేల మంది అభాగ్యులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారు. ఎనిమిదేళ్ల క్రితం నుంచి అంద వలసిన ప్రయోజనం అందటం లేదని గ్రహించి, వెంటనే అటువంటి ప్రయోజనానికి అర్హత కలిగిన వాళ్లను ఇప్పుడు సుప్రీంకోర్టు వెంటనే విడుదల చేయమన్నది. ప్రస్తుత అంచనాల ప్రకారం దేశం లోని జైళ్లలో సుమారు 3.18 లక్షల మంది ఉన్నారు. వీరిలో 2.54 లక్షల మంది విచారణ జరగవలసి ఉన్నవారు. ఇందులో వాళ్లపై వచ్చిన అభియోగానికి పడే శిక్షకంటే ఎక్కువ కాలమే వాళ్లు ఏ విచారణా లేకుండా జైళ్లలో ఉన్నారు. ఇది ఎంత అన్యాయం? ఈ విషయం ప్రభుత్వాలకు గాని, జైళ్ల అధికారులకు గాని తెలియనిది కాదు. అయితే వారు పట్టించుకోవటం లేదు. ఎందుకంటే జైళ్లలో ఈ రకంగా మగ్గిపోతున్న వారు పేదవారు కాబట్టి! ఇంతకుముదు ఒక ప్రయత్నం బీహార్ జైళ్ల విషయంలో సుప్రీంకోర్టు చేసింది. అనవసరంగా ఎక్కువ కాలం జైళ్లలో మగ్గిపోతున్న వారిని విడుదల చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతే మళ్లీ అటువంటి వారి సంగతి ఎవరూ పట్టించుకోవటం లేదు. చట్టం వచ్చి ఎనిమిదేళ్లయినా ఇప్పుడూ పట్టించుకోవటం లేదు. సుప్రీంకోర్టు ఇప్పటికైనా చట్ట ప్రయోజ నాన్ని ప్రజలకు అందించవలసిందిగా ఆదేశాలు ఇచ్చింది.

ఉత్తర్వులు ఇచ్చి సుప్రీంకోర్టు ఊరుకోలేదు. న్యాయాధి కారులను, అంటే మేజిస్ట్రేట్లను వారానికి ఒకసారి జైలును సందర్శించి, ఈ విధంగా జైళ్లలో ఎంత మంది అనవసరంగా ఉంటున్నారో లెక్కలు తీసి, వారికి పైన చెప్పిన ప్రయోజనం అందవలసి ఉంటే, వారిని వెంటనే విడుదల చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చెయ్యాలని ఆదేశించింది. ఈ విధంగా మొత్తం రెండు నెలలు ప్రతి వారానికి ఒకసారి మేజిస్ట్రేట్లు జైలుకు వెళ్లి విడుదలకు అర్హులైన వారిని మొత్తంగా విడుదల చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియలో న్యాయవాదుల ప్రమేయం ఏదీ ఉండకూడదు. దీనికి సహకరించాలని జైలు అధి కార్లను కూడా ఆదేశించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసి ఒక నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సమర్పించాలి. అంటే సుప్రీంకోర్టు కేవలం ఉత్తర్వులు జారీ చేసి కూర్చోలేదు. ఇచ్చిన  ఉత్తరువుల అమ లును కూడా పర్యవేక్షిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం రెండు నెలలలో పూర్తయినట్టు తనకు నివేదిక కూడా అందజేయాలని ఆదేశించింది. ఎందుకంటే చట్టం ఉన్నప్పటికీ ఎనిమిది ఏళ్లుగా దాని ప్రయోజనం జైళ్లలో ఉన్న వారికి అందటం లేదు. ఎవరూ పట్టించుకోవటం లేదు. ఏళ్ల తరబడి ముద్దాయిలను  పదిహేను రోజులకొకసారి జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్లటం, మళ్లీ వెనక్కి తీసుకురావటంతోటే అయిపోతున్నది. అందుకని చట్ట ప్రయోజనం ప్రజలకు అందుతున్నదా లేదా అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షించే పని పెట్టుకున్నది. అధికార్లు తమ విధి నిర్వహణలో విఫలమవుతున్నారు కాబట్టి సుప్రీం కోర్టు నేరుగా ఆ బాధ్యతను కూడా స్వీకరించింది. అందుకు అవసరమైన ఉత్తర్వులను సంబంధిత మేజిస్ట్రేట్లకు, జైలు అధికార్లకు, తన తీర్పు ద్వారా జారీచేసింది. ఈ ఉత్తర్వులు పేద ప్రజలకు ఎంతో గొప్ప మేలు చేశాయి. చెయ్యని నేరానికి జైలుకు వెళ్లేది వారే! విచారణ లేకుండా జైళ్లలో మగ్గిపోయేది వారే! ఒక అంచనా ప్రకారం నూటికి అరవై మందికి పైగా ఈ ప్రయోజనం అందుతుంది. అయితే మరణశిక్ష పడే కేసుల్లో ఉన్న వారికి ఈ ప్రయోజనం అందదు!

ఈ ఒక్కటీ చాలదు! జైళ్ల వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళనం కావా లి. నేర విభాగానికి సంబంధించిన ప్రక్రియలో కూడా మార్పు రావాలి. జైళ్ల పరిస్థితులలో కూడా మార్పు తేవాలి. నేరాలు, శిక్షలు, జైళ్లకు సంబంధించిన సీఆర్‌పీసీని 1860లో బ్రిటిష్ ప్రభుత్వం  తీసుకువచ్చింది. భారతదేశ ప్రజలపై అజమాయిషీ చేయటానికి, వారిని అదుపులో ఉంచడానికి శిక్షలు వేసి, జైళ్లలో పెట్టి వీరిని భయభ్రాంతులను చేయటానికి తీసుకువచ్చిన చట్టం ఇది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్ని చిన్న చిన్న సవ రణలు తీసుకువచ్చారు గాని, సమగ్రమైన మార్పులు తేలేదు. ఇప్పుడు తీసుకువచ్చిన ప్రక్రియ పాతదే! అయితే అమలుకు నోచుకోలేదు. సుప్రీంకోర్టు పుణ్యమా అని ఈ ప్రక్రియ ద్వారా లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుంది. స్వతంత్ర భారతదేశంలో దాదాపు 250 ఏళ్ల క్రితం చేసిన చట్టాలను ఈ నాటికీ పట్టుకు వేలాడటం సిగ్గుచేటు. జైళ్ల విధానం, నిర్వహ ణలో చాలా దేశాలలో చెప్పుకోదగ్గ మార్పులు వస్తున్నాయి. మార్పు అంటే భయపడేది మన దేశమే! ఈ సందర్భాన్ని తీసు కొని కనీసం జైళ్ల వ్యవస్థను ప్రజాస్వామ్యీకరించడానికి  ముం దుకు రావాలి!
 
 బొజ్జా తారకం
 సీనియర్ న్యాయవాది
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement