‘సుప్రీం తీర్పు’ నేపథ్యంలో లెక్క తేల్చిన జైళ్ల శాఖ
హైదరాబాద్: సుదీర్ఘకాలంగా విచారణను ఎదుర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా విడుదల చేయాల్సిన రిమాండ్ ఖైదీలు (విచారణ ఖైదీలు) ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరు కూడా లేరని అధికారులు తేల్చారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టుకు నివేదించినట్లు జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ టి.కృష్ణరాజు మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. ఏపీలో ఉన్న 116 కారాగారాల్లో ప్రస్తుతం 8,234 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో 5,667 మంది విచారణ ఖైదీలు. వీరు నేరం రుజువైతే పడే శిక్ష కాలంలో ఇప్పటికి పావు వంతు కాలం కూడా జైల్లో లేరని అధికారుల పరిశీలనలో స్పష్టమైంది.
రాష్ట్రంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ క్రియాశీలకంగా వ్యవహరించడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. నిరుపేదలైన ఖైదీల న్యాయ సహాయానికి అయ్యే ఫీజును లీగల్ సర్వీసెస్ అథారిటీ చెల్లించి న్యాయవాదిని ఏర్పాటు చేస్తుంది. బెయిల్‌కు పూచీకత్తు మొత్తాన్ని కూడా చెల్లిస్తుంది. నిందితులు షూరిటీలను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఈ కారణంగానే రాష్ట్రంలో సుప్రీంకోర్టు సూచించిన తరహా రిమాండ్ ఖైదీలు లేరని అధికారులు తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టుకు విన్నవించినట్లు చెప్పారు.
సుదీర్ఘ రిమాండ్ ఖైదీలెవరూ లేరు
Published Wed, Sep 10 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM
Advertisement
Advertisement