The trial
-
సడన్‌గా ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
యుగ్ రామ్, వంశీ కోటు, స్పందన పల్లి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇంటరాగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ 'ది ట్రయల్'. ఈ చిత్రానికి రామ్ గన్నీ దర్శకత్వం వహించారు. ఎస్ఎస్ ఫిల్మ్స్, కామన్ మేన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై స్మృతి సాగి, శ్రీనివాస్ కె. నాయుడు నిర్మించారు. లేడీ ఓరియంటెడ్ కథతో ఈ మూవీని రూపొందించారు. గతేడాది నవంబర్ 24వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే సడన్‌గా ఓటీటీలో దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్కు అవుతోంది. థియేటర్లలో మిస్సయినవారు.. ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవారు ఓ లుక్ వేసేయొచ్చు. కాగా.. ఈ చిత్రంలో ఉదయ్ పులిమె, సాక్షి ఉత్తాడ, జశ్వంత్ పెరుమాళ్ల, వజీర్ ఇషాన్ కూడా కీలకపాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు శరవణ వాసుదేవన్ సంగీతం అందించారు. ది ట్రయల్ కథేంటంటే.. 'కథ రీత్యా సబ్ఇన్స్పెక్టర్ రూప, ఆమె భర్త అజయ్ ఓ అపార్ట్మెంట్ టెర్రస్‌పై తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంటారు. అజయ్ కాలుజారి ఆ బిల్డింగ్‌పై నుంచి పడి చనిపోతాడు. తన భర్తను రూపనే చంపిదనే అనుమానం తెరపైకి వస్తుంది. అయితే తన భర్తది ఆత్మహత్య అని రూప చెబుతుంది. అసలు.. అజయ్‌ది హత్యా? ఆత్మహత్యా? అనేది ఈ సినిమా ప్రధాన కథాంశంగా తెరకెక్కించారు. -
అందుకే రాజీనామా చేశా!
‘‘ఇప్పటిదాకా మనకు మొత్తం సినిమాని ఇంటరాగేషన్ మీద తీయలేదు. ‘ది ట్రయల్’ సినిమా కథ ఇంటరాగేషన్ రూమ్ నుంచి మొదలై అదే గదిలో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రాన్ని టాలీవుడ్ ఫస్ట్ ఇంటరాగేటివ్ ఫిల్మ్ అంటున్నాం’’ అన్నారు దర్శకుడు రామ్ గన్ని. స్పందనా పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ది ట్రయల్’. స్మృతీ సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. సుదర్శన్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. దర్శకుడు రామ్ గన్ని మాట్లాడుతూ– ‘‘2012 నుంచి 2022 వరకు డిప్యూటీ జైలర్‌గా చేశాను. సినిమాలపై ఫ్యాషన్‌తో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇండస్ట్రీకి వచ్చాను. దర్శకునిగా ‘ది ట్రయల్’ నా తొలి చిత్రం. డిప్యూటీ జైలర్‌గా నా పదేళ్ల కెరీర్లో ఎన్నో నేర ఘటనల గురించి, ఆ నేరాలు చేసిన ఖైదీల కథలను విన్నాను. వాటి స్ఫూర్తితో ఫిక్షనల్‌గా రాసుకున్న కథ ‘ది ట్రయల్’’ అన్నారు. -
హత్యా? ఆత్మహత్యా?
స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధానపాత్రల్లో నటించిన ఇంటరాగేటివ్ ఫిల్మ్ ‘ది ట్రయల్’. రామ్ గన్ని దర్శకత్వంలో స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను హీరో శ్రీ విష్ణు విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘ది ట్రయల్’ ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉంది. రామ్ ఈ సినిమా కథను బాగా డీల్ చేశారనిపిస్తోంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘కథ రీత్యా సబ్ఇన్స్పెక్టర్ రూప, ఆమె భర్త అజయ్ ఓ అపార్ట్మెంట్ టెర్రస్‌పై తొలి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంటారు. అజయ్ కాలుజారి ఆ బిల్డింగ్‌పై నుంచి పడి చనిపోతాడు. తన భర్తను రూపే చంపిదనే అనుమానం తెరపైకి వస్తుంది. అయితే తన భర్తది ఆత్మహత్య అని రూప చెబుతుంది. అసలు.. అజయ్‌ది హత్యా? ఆత్మహత్యా? అనేది ఈ సినిమా ప్రధాన కథాంశం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
సరికొత్త ట్రయల్
స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ది ట్రయల్’. స్మృతీ సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ‘‘ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని కంప్లీట్ ఇంటరాగేటివ్ కథతో, సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ సినిమా కథనం ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్, సహనిర్మాత: సుదర్శన్ రెడ్డి. -
నేరెళ్ల ఘటనపై స్పందించిన హైకోర్టు
జస్టిస్ చంద్రకుమార్ లేఖ పిల్‌గా పరిగణన సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా, నేరెళ్ల, జిల్లెల, రామచం ద్రాపురం గ్రామాల దళితులను పోలీసులు చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ రాసిన లేఖపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఆ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించింది. దీనిపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. పోలీసులు ఉద్దేశపూర్వ కంగానే నేరెళ్ల తదితర గ్రామాలకు చెందిన 8 మంది దళితులను హింసించి, వారి హక్కులను హరించారని ఆయన లేఖలో పేర్కొన్నారు. కరీంనగర్ జైలులో ఉన్న బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసేలా సంబంధిత కోర్టును ఆదేశించాలని హైకోర్టును అభ్యర్థించారు. -
ఇంకెంత దూరం?
విచారణ చేపట్టి చేతులు దులుపుకున్న అధికారులు రెండు వారాలుగా ఉన్నతాధికారులకు అందని నివేదిక దీంతో మరింత రెచ్చిపోతున్న క్రషర్లు, తారు ప్లాంట్ల యాజమాన్యాలు భయం గుప్పిట్లో గ్రామాల ప్రజలు మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తాం : ఎంపీటీసీ కొమ్ముల భాస్కర్ హన్మకొండ: అ«ధికారుల చర్యలు సైతం రాజకీయ నాయకుల మాటల్లాగే మారిపోయాయా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామపంచాయతీ తీర్మానాలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్న వారి హామీలు బుట్టదాఖలు కావడం ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈ మేరకు క్రషర్లు, తారు ప్లాంట్ల నిర్వాహకుల కారణంగా తమకు నష్టం జరుగుతుండగా.. అధికారులు చేపట్టిన విచారణ తోనైనా న్యాయం జరుగుతుందని ఆశ పడిన శాయంపేట మండలంలోని మాందారిపేట, మాందారిపేట, గోవిందాపూర్, ప్రగతిసింగారం, పత్తిపాక, పెద్దకోడెపాక తదితర గ్రామాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. రెండు వారాల క్రితం అధికారులు చేపట్టిన విచారణ నివేదిక కలెక్టర్‌కు ఇప్పటికీ అందకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీ పేలుళ్లు.. తీవ్రమైన కాలుష్యం వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలోని మాందారిపేట గ్రామం సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్లలో భారీ పేలుళ్లు, తారు ప్లాంట్ల నుంచి తీవ్ర కాలుష్యం విడుదలవుతోందని మాందారిపేట, గోవిందాపూర్, ప్రగతిసింగారం, పత్తిపాక, పెద్దకోడెపాక గ్రామాల ప్రజలు కొన్ని నెలలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిలెటిన్ స్టిక్స్ ద్వారా రాతిగుట్టలను పేల్చేందుకు ఉన్న అనుమతులు అతిక్రమించి మరింత తీవ్రతతో పేలుళ్లు చేస్తుండడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. సాధారణంగా కంప్రెషర్ వాడేందుకే అనేక రకాల అనుమతులు అనేక షరతులతో ఇస్తారు. అయితే క్రషర్ల నిర్వాహకులు మరింత ముందుకు వెళ్లి బోరు రిగ్గుల్లాంటి భారీ యంత్రాలతో డ్రిల్లింగ్ చేసి భారీ తీవ్రతతో పేలుళ్లు చేపడుతుండడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. పేలుళ్ల తీవ్రత కారణంగా ఆయా గ్రామాల్లో ఇళ్లు బీటలు వారుతుండగా, మండల కేంద్రం శాయంపేట సైతం దుమ్ము, ధూళి బారిన పడుతోంది. ఈ క్రమంలో ఆయా గ్రామాల ప్రజలు అనేక ఆందోళనలు చేయడంతో పాటు జిల్లా కలెక్టరు, స్పీకర్‌కు సైతం ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ పత్రికలో వరుస కథనాలు రావడంతో ఈనెల 2వ తేదీన ఆర్డీఓ, మైనింగ్, కాలుష్య నియంత్రణ మండలి జిల్లా అధికారులు, తహసీల్దార్ విచారణ చేపట్టారు. గ్రామాల ప్రజలు, పాఠశాలల విద్యార్థులతో పాటు మాట్లాడి ప్రమాదకర స్థాయిలో కాలుష్యం వెలువడుతోందని తెలుసుకున్నారు. అదేవిధంగా బీటలు వారిన ఇళ్లను సైతం పరిశీలించి, గ్రామపంచాయతీ తీర్మానాలను సైతం ధిక్కరించారని తేల్చారు. ఇంకా ప్లాంట్ల అనుమతి పత్రాలను కూడా పరిశీలించారు. ఈ క్రమంలో క్రషర్లు, డాంబర్ ప్లాంట్ల నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. రెండు వారాలు గడిచినా.. అధికారులు విచారణ నిర్వహించి రెండు వారాలు దాటినప్పటికీ ఏమాత్రం ఫలితం లేదు. దీంతో క్రషర్లలో పేలుళ్లు మరింత తీవ్రమయ్యాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పలుకుబడితో క్రషర్లు, డాంబర్ ప్లాంట్ల వారు మరింతగా ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారని వాపోతున్నారు. దీంతో తమ పరిస్థితి దారుణంగా తయారైందని గగ్గోలు పెడుతున్నారు. రాజకీయ అండతోనే ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. -
డీఎస్పీ గణపతి ఆత్మహత్యపై న్యాయ విచారణ
డీఎస్పీ గణపతి ఆత్మహత్యపై శాసనసభలో సీఎం సిద్ధరామయ్య ప్రకటన జార్జ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అవసరం లేదని స్పష్టీకరణ సీబీఐ విచారణకే పట్టుబట్టిన ప్రతిపక్షాలు ఉభయసభల్లో నిరవధిక దీక్షకు బీజేపీ, జేడీఎస్‌ల నిర్ణయం బెంగళూరు: డీఎస్పీ గణపతి ఆత్మహత్య ఘటనపై జ్యడీషియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య శాసనసభలో ప్రకటించారు. అయితే ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్‌లు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించడంతో పాటు జార్జ్‌ను మంత్రి మండలి నుంచి తప్పించడంతో పాటు ఇద్దరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేంతవరకూ ఉభయసభల్లో నిరవధిక దీక్షకు దిగుతామని బీజేపీ, జేడీఎస్ నేతలు హెచ్చరించారు. వివరాలు.... డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశానికి సంబంధించి సీఎం సిద్ధరామయ్య శాసనసభలో ప్రభుత్వం తరఫున బుధవారం మాట్లాడారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. సీఐడీ విచారణపై ప్రభుత్వానికి విశ్వాసం ఉన్నప్పటికీ ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆరు నెలల్లో ఈ కమిషన్ తన విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుందని చెప్పారు. కాగా, విపక్షాలు మాత్రం న్యాయ విచారణ నిర్ణయాన్ని అంగీకరించబోమని, ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందేనని పట్టుబట్టాయి. సీఎం సిద్ధరామయ్య ప్రకటనను విపక్ష నేత జగదీష్ శెట్టర్ తప్పుపడుతూ....‘జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిన కేసులేవీ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. బీడీఏ ఆర్కావతి లే అవుట్లో అవకతవకలకు సంబంధించిన విచారణ కోసం ఏర్పాటు చేసిన కెంపణ్ణ కమిషన్ విచారణను ఇప్పటికీ పూర్తి చేయలేక పోయింది. అందువల్ల ఈ కేసును సీబీఐకి అప్పగించి తీరాల్సిందే. అప్పటి దాకాా మా పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు’ అని జగదీష్ శెట్టర్ హెచ్చరించారు. ఇదే సందర్భంలో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి ధర్నాకు దిగారు. దీంతో స్పీకర్ సభా కార్యకలాపాలను ఐదు గంటలకు వాయిదా వేశారు. అనంతరం బీజేపీ, జేడీఎస్ నేతలు జగదీష్ శెట్టర్, హెచ్.డి.కుమారస్వామిలు మీడియాతో మాట్లాడారు. ‘డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసును పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేసులోని నిజానిజాలు వెలుగు చూడకుండా ఉండేందుకు గాను ముందు సీఐడీ విచారణ అన్నారు. ఇప్పుడిక జ్యుడీషియల్ విచారణ అంటున్నారు. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించే వరకు మా పోరాటాన్ని ఆపబోము. ఉభయసభల్లో నిరవధిక దీక్ష చేపట్టనున్నాం’ అని ప్రకటించారు. అనంతరం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే శాసనసభలో బీజేపీ, జేడీఎస్ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ శాసనసభ కార్యకలాపాలను గురువారానికి వాయిదా వేశారు. జార్జ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అవసరం లేదు.... అంతకుముందు బుధవారం ఉదయం శాసనసభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశంపై సీఎం సిద్దరామయ్య సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. గణపతి ఆత్మహత్య అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జార్జ్, ఇద్దరు పోలీసు ఉన్నత స్థాయి అధికారులను సైతం సీఎం సిద్దరామయ్య వెనకేసుకొచ్చారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్య అనంతరం జరిగిన ఘటనలను ఒక్కొక్కటిగా సీఎం సిద్ధరామయ్య సభ ముందు ఉంచారు. ‘మంగళూరు డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశంలో మంత్రి జార్జ్‌తో పాటు ఇద్దరు పోలీసు అధికారులకు ఎలాంటి సంబంధం లేదు. గణపతిని మంత్రి జార్జ్, పోలీసు అధికారులు ఇబ్బందులకు గురి చేసినట్లు గానీ, అతనిపై పగ తీర్చుకునేలా ప్రవర్తించినట్లు కానీ ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. డీఎస్పీ గణపతి ఆత్మహత్యకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూను ‘డయింగ్ డిక్లరేషన్’ కాబోదు. అందువల్ల మంత్రి కె.జె.జార్జ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదు. జార్జ్‌పై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు’ అని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లుగా సీబీఐ విచారణ అవసరం లేదని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ‘మన అధికారులపై మాకు నమ్మకం ఉంది. వారిలో ఆత్మస్థైర్యాన్ని కుంగదీసేలా మేము ఏ చర్యలు తీసుకోబోము. సీబీఐ అంటే మాకేదో భయం అని, అందుకే సీబీఐ విచారణకు అంగీకరించడం లేదని విమర్శిస్తున్నారు. అయితే సీబీఐ అంటే మాకెలాంటి భయం లేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారి డి.కె.రవి ఆత్మహత్య ఘటనతో సహా మొత్తం 8 కేసులను సీబీఐకి అప్పగించాం. ఇదే సందర్భంలో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అక్రమ గణుల కేటాయింపుతో సహా ఏ ఒక్క కేసును సీబీఐకి అప్పగించలేదు’ అంటూ మండిపడ్డారు. -
కన్నీటి సంద్రమైన గూడెంకొత్తవీధి
గొంతుకోసి వ్యాపారిని చంపిన మావోయిస్టులు పెదపాడు నుంచి తిరిగి వస్తుండగా ఘటన బైక్‌ను తగులబెట్టిన దళసభ్యులు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడంటూ గాలికొండ ఏరియా కమిటీ పేరిట లేఖ వ్యాపార కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు మావోయిస్టుల ఘాతుకంతో గూడెం కొత్తవీధి కన్నీటి సంద్రమైంది. వందలాది మంది గుండూరావు(సత్యనారాయణ)ను చివరిసారిగా చూసేందుకు వచ్చారు. ఏ తప్పూ చేయని తన భర్తను దళసభ్యులు అన్యాయంగా చంపేశారంటూ భార్య చంద్రకళ ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా మన్యంలో కాఫీ గింజల కొనుగోలుతోపాటు అపరాల వ్యాపారం చేస్తున్న గుండూరావుకు మొదట్లో మావోయిస్టులతో సంబంధాలు ఉండేవి. దీనిపై గూడెం పోలీసులు అతనిని గతంలో అరెస్టు చేశారు. ఇప్పుడు అదే మావోయిస్టులు అతడిని చంపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గూడెంకొత్తవీధి/చింతపల్లి: రోజూ మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో వ్యాపారం కోసం తిరిగే గుండురావుకు వారి నుంచే ప్రమాదం పొంచి ఉందని ఏనాడూ భావించలేదు. దళసభ్యులతో వివాదాలు ఉన్నా.. వాటిని పరిష్కరించుకుంటూ వస్తున్న అతనిని ఇన్ఫార్మర్ అంటూ గొంతుకోసి చంపేశారు. గూడెంకొత్తవీధికి చెందిన అపరాల వ్యాపారి గుండురావు, తమ్ముడు వెంకటరమణను వెంటబెట్టుకుని ఆదివారం సాయంత్రం మండలంలోని కుంకుమపూడి, పెదపాడు వెళ్లారు. గతంలో ఆయా గ్రామాల రైతులకు పెంకులు సరఫరా చేశారు. వారి నుంచి నుంచి డబ్బులు వసూలు చేసుకుని అన్నదమ్ములిద్దరూ తిరిగి వస్తుండగా మార్గమధ్యలో కుంకుమపూడి సమీపంలో ఇద్దరు దళసభ్యులు వారిని అటకాయించారు. తమ్ముడు వెంకటరమణను తీవ్రంగా కొట్టారు. నీవు గ్రామానికి వెళ్లాలని, మీ అన్నయ్యతో మాట్లాడి పంపిస్తామని చెప్పారు. దీంతో వెంకటరమణ కుంకుపూడి వచ్చేశాడు. అనంతరం గుండురావు కాళ్లు,చేతులు కట్టేసి గొంతు కోసి చంపారు. ద్విచక్ర వాహనాన్ని కాల్చేశారు. అతని ఫ్యాంటు జేబులో గాలికొండ ఏరియా కమిటీ పేరిట ఓ లేఖ ఉంచారు. పోలీసు ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాడని, అందుకే చంపేశామని అందులో పేర్కొన్నారు. అన్నయ్య సమాచారం ఎంతకు రాకపోవడంతో ఆదివారం రాత్రి తమ్ముడు వెంకటరమణ గ్రామస్తులతో కలిసి వెదికాడు. చివరకు చనిపోయిన అన్నయ్యను చూసి బోరున విలపించాడు. గ్రామస్తులు మృతదేహాన్ని ఆదివారం రాత్రి గూడెంకొత్తవీధికి తీసుకొచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సోమవారం సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి చింతపల్లి తరలించారు. బెదిరింపులకు భయపడలేదు... మావోయిస్టుల నుంచి ఒకసారి బెదిరింపులు వస్తే మైదానానికి వెళ్లిపోయేవారు ఎందరో ఉన్నారు. పలుమార్లు మావోయిస్టులు గుండురావును భయపెట్టినా ఆయన ఏనాడూ మన్యాన్ని వీడలేదు. పోలీసులు అనేకసార్లు హెచ్చరించారు కూడా. అయినా వెళ్లలేదు. 2015 భోగిపండుగనాడు గుండురావు తమ్ముడు వెంకటరమణను మావోయిస్టులు తీసుకుపోయారు. వ్యాపారలావాదేవీల్లో భాగంగా గిరిజనులకు బకాయిలు చెల్లించాలంటూ మూడురోజులు నిర్బంధించారు. ఆ డబ్బులు ఇస్తామని కుటుంబసభ్యులు చెప్పడంతో చివరకు విడుదల చేశారు. తరువాత డబ్బులు ఇచ్చేశారు. ఇలా సర్దుబాటు చేసుకునేవారు. అతనికి భార్య చంద్రకళ, కొడుకులు వినయ్,కృష్ణవర్దన్, కూతరు జోస్న ఉన్నారు. జోస్న, వినయ్‌లు బీటెక్ పూర్తిచేసి ఇంటివద్దే ఉంటున్నారు. కృష్ణవర్దన్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి మరణాన్ని వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యాపార కోణంలో విచారణ వాస్తవానికి మావోయిస్టుల నుంచి గుండురావుకు ఇంత వరకు ఎలాంటి ప్రాణహాని లేదన్నది బంధువుల వాదన. కొన్ని రోజుల కిందట మావోయిస్టులకు ఆయుధాలు తరలిస్తున్న వాహనాన్ని తురబాలగెడ్డవద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు గుండురావు కారణమంటూ కొందరు వ్యాపారులు అప్పట్లో ప్రచారం చేశారు. వ్యాపారంలో కొడుకులు కూడా అతనికి తోడుగా ఉండడం కొందరికి కంటగింపుగా మారినట్టుగా తెలుస్తోంది. ఈమేరకే తప్పుడు ప్రచారంచేశారన్న వార్తలు వస్తున్నాయి. దీంతో గుండురావు మరణాన్ని వ్యాపార కోణంలో దర్యాప్తు చేయాలని ఎస్పీ నుంచి ఆదేశాలు వచ్చాయి. పోలీసులూ అదే కోణంలో విచారణ చేపట్టారు. -
అట్టుడికిన గోవాడ
ఫ్యాక్టరీలో అవినీతిపై మహా ధర్నా.. మానవహారం వైఎస్సార్సీపీ పిలుపునకు అనూహ్య స్పందన.. సీపీఐ, కాంగ్రెస్ మద్దతు ధర్నాను అడ్డుకోబోయిన పాడేరు ఏఎస్సీతోరైతుల వాగ్వాదం విచారణకు అమర్, బూడి, ధర్మశ్రీ డిమాండ్ రిలే నిరశనలు ప్రారంభం చోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో అవినీతిపై వెంటనే విచారణ చేపట్టాలని, రైతులకు బకాయిలు చెల్లించాలని కోరుతూ ఫ్యాక్టరీ గేటు ఎదుట సోమవారం మహాధర్నా చేశారు. రిలేదీక్షలు ప్రారంభించారు. వైఎస్సార్సీపీ పిలుపుమేరకు పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ నాయకులు హాజరుకాగా సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ఫ్యాక్టరీ గేటు ఎదుట మానవహారం చేయడంతో ఇరు వైపులా సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆందోళన సజావుగా సాగుతున్న సమయంలో పాడేరు ఏఎస్పీ బాబూజీ ఆవేశంగా అక్కడకు వచ్చి మానవహారంలో ఉన్న వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఏఎస్పీని చూసి అక్కడే ఉన్న చోడవరం సీఐ కిరణ్‌కుమార్, పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి రైతులను, నాయకులను పక్కకు తోసేసి ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ప్రయత్నించారు. దీనిని రైతులు ప్రతిఘటించారు. పోలీసుల దౌర్జానాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ, సీపీఐ, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు వాహనాలకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. రైతుల బాధలంటే పోలీసులకు అంత చులకనా అంటూ ఏఎస్పీని నిలదీశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, పార్టీ చోడవరం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పోలీసు అధికారులతో మాట్లాడి ఆందోళన యథావిధిగా కొనసాగించారు. దీంతో ఏఎస్పీ అక్కడ నుంచి వెళ్లిపోయారు. త్వరలో కలెక్టరేట్ ముట్టడి: అమర్నాథ్ ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ చంద్రబాబులాగే ఆ పార్టీ నాయకులు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. గోవాడ, అనకాపల్లి చెరకు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలో గోవాడ నుంచి అనకాపల్లి మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి కలెక్టరేట్ ముట్టడి చేస్తామన్నారు. మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ బినామీల పేరుతో పంచదారను అమ్మి రూ. 8కోట్లు అవినీతికి పాల్పడినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. కేసు మాఫీచేసుకోవడానికే ముఖ్యమంత్రి దగ్గరకి స్థానిక ఎమ్మెల్యే వెళ్లారు తప్ప విచారణ వేయమని చెప్పడానికి కాదని విమర్శించారు. కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ గోవాడ అవినీతి అంతా చోడవరం ఎమ్మెల్యే అండతోనే జరిగిందని ఆరోపించారు. టెండర్లు వేయకుండా కేంద్ర మంత్రి సుజనా చౌదరి బందువుకు లక్షకుపైగా క్వింటాళ్ల పంచదారను ఎలా విక్రయిస్తారని ఆయన ప్రశ్నించారు. దీనిపై తక్షణం సీబీఐ లేదా సిటింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి రెడ్డి పల్లి అప్పలరాజు, కాంగ్రెస్ నాయకుడు, సీడీసీ చైర్మన్ దొండా రాంబాబు తదితరులు అవినీతిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో వైఎస్సార్సీపీ, సీపీఐ, కాంగ్రెస్ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ గేటువద్ద సోమవారం చేపట్టిన రిలే నిరహారదీక్షలను అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, కరణం ధర్మశ్రీ ప్రారంభించారు. -
మిస్డ్‌కాల్.. విచారణ మిస్!
కొంతమంది నిందితులతోనే సరి.. బయటకురాని ‘పెద్ద మనుషుల’ పేర్లు విచారణ తీరుపై ఆరోపణలు వరంగల్ : సంచలనం సృష్టించిన ‘మిస్డ్ కాల్’ కేసులో పోలీసు విచారణ ఎంతకీ ముందుకు కదలడం లేదు. అమ్మాయిలను ఎరవేసి సమాజంలోని ఉన్నతస్థాయి వారిని, ప్రభుత్వ అధికారులను మోసం చేసిన విషయంలో వరంగల్ కమిషరేట్ పోలీసులు గతనెల 6న కొందరు నిందితులను అరెస్టు చేశారు. సమాజంలోని పలువురు పెద్దలు ఈ కేసులో ఉన్నట్లు చెప్పారు. మోసం చేసినవారుగా పేర్కొంటూ అరెస్టు చేసిన వారి వివరాలు వెల్లడించారు. మహిళలతో ఫోన్లో మాట్లాడి వారి పిలిచిన చోటికి వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్న వారు ఎవరనే విషయాలు పోలీసులు చెప్పడం లేదు. సాధారణంగా అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్న అందరినీ నిందితులుగా భావించే పోలీసులు మిస్డ్ కాల్ కేసులో మాత్రం మహిళలను, మరికొందరిని అరెస్టు చేసి.. భాగస్వాములు అయిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు. ఈ విషయంలో పోలీసుల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. కేసును నీరుగార్చుతున్న పోలీసులు ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి ఉన్నతస్థాయి వ్యక్తులకు మహిళలతో ఫోన్లో మిస్డ్ కాల్‌తో పరిచయడం పెంచుకుని బ్లాక్ మెయిలింగ్‌కు తెరతీసిన వ్యవహారం గత నెలలో జిల్లాలో సంచలనం సృష్టించింది. పలువురు ఉన్నతస్థాయి అధికారులు, బడా వ్యాపారులు ఈ ముఠా ప్రలోభాలకు గురయ్యారు. వ్యభిచారం ముఠా వలలో చిక్కి ఏకంగా రూ.12 లక్షలు వసూలు చేశారు. ఇదే విషయంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ ముఠాలోని ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. పరారీలో ఇద్దరు వ్యక్తులు చిక్కితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తామని పోలీసులు అప్పుడు చెప్పారు. వీరిని ఎంతకీ అరెస్టు చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. పరారీలో ఉన్న ఇద్దరిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నా, ఈ విషయాన్ని బహిరంగ పర్చడం లేదని తెలుస్తోంది. మరో కీలక నిందితుడిని అరెస్టు చేస్తే వ్యభిచారం ముఠాకు భారీగా డబ్బులు ఇచ్చిన ఉన్నతాధికారులు, వ్యాపారుల వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. వీరి వివరాలు బయటికి రాకుండా ఏదో మతలబు జరిగినందునే పోలీసులు ఈ కేసు విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు నిందితులను పట్టుకోకుండా కేసును నీరుగారుస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద మనుషులనేనా! మిస్డ్ కాల్ కేసులో భాగస్వామ్యం ఉన్న ‘పెద్ద మనుషుల’ను పోలీసులు బాధితులుగా చెబుతున్నారు. ఆర్టీసీ, ఎఫ్‌సీఐ, పాల డైరీలోని ఉన్నత ఉద్యోగులు, ఓ ప్రముఖ కంపెనీ షోరూం యజమాని ‘పెద్ద మనుషులలో’ ఉన్నట్లు కేసు వివరాలు వెల్లడించిన రోజున పోలీసులే స్వయంగా చెప్పారు. పెద్ద మనుషులను వ్యవహరాలను బ్లాక్మెయిల్ ముఠా వీడియో తీసిన టేపులు ప్రస్తుతం పోలీసుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఈ విషయంలో ఉదాసీనంగా ఉండడం అనుమానాలకు తావిస్తోంది. మిస్డ్‌కాల్ ముఠా వ్యవహరం బహిర్గతమైన తర్వాత ఉన్నతస్థాయి వ్యక్తులను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు. ముఠా సభ్యులు తమను బ్లాక్మెయిల్ చేసినట్లు వారు స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో ఎందరో ప్రముఖులు ఉన్నా బ్లాక్‌మెయిలింగ్ ముఠా వీరినే లక్ష్యంగా ఎంచుకోవడానికి కారణాలు ఏమిటనేది పోలీసులకు తెలిసినా.. వీరి పేర్లను వెల్లడించకపోవడానికి కారణాలు ఏమిటనేది తెలియడం లేదు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారు తమ పేర్లను వెల్లడించవద్దని పోలీసులతో ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఒప్పందం విషయంలో ఆలస్యం చేసిన కారణంగానే తన పేరును పోలీసులు బయటి కి వెల్లడించారని ఎఫ్‌సీఐ ఉద్యోగి ఒకరు సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. దీంతో మిగిలిన ‘పెద్దమనుషులు’ పోలీసులను సంప్రదించి మేనేజ్ చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మిగిలిన పోలీసుల పేర్లు బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. -
ఎస్సీ, ఎస్టీ బిల్లుకు లోక్‌సభ ఓకే
ఆ వర్గాల వారిని వేధిస్తే కఠిన శిక్షలు న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై అమానవీయ నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు ఉద్దేశించిన ఎస్సీ/ఎస్టీ సవరణ బిల్లు-2014ను లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. సస్పెండైన 25 మంది కాంగ్రెస్ సభ్యులకు సంఘీభావంగా దాదాపు విపక్షాలన్నీ సభను బహిష్కరించగా మూజువాణి ఓటుతో బిల్లుకు పచ్చజెండా ఊపింది. ఎస్సీ, ఎస్టీలను మానవ, జంతు కళేబరాలను తీసుకెళ్లేలా, చేతులతో పారిశుద్ధ్య పనులు చేసేలా బలవంతం చేయడం తదితర నేరాలకు కఠిన శిక్ష విధించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. 1989 నాటి ఎస్సీ, ఎస్టీ(నేరాల నిరోధం) చట్టాన్ని సవరిస్తూ దీన్ని ప్రతిపాదించారు. ఇందులోని ఇతర ముఖ్యాంశాలు ఈ నేరాల విచారణకు జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు, బాధితులకు పునరావాసం. చెప్పుల దండలు వేయడం, ఎస్సీ, ఎస్టీలను అందరిముందు కులం పేరుతో దూషించడం, వారిపై విద్వేషాన్ని ప్రచారం చేయడం, చనిపోయిన ప్రముఖులను అగౌరవించడం, సామాజికంగా, ఆర్థికంగా బహిష్కరించడం, బహిష్కరిస్తామని బెదిరించ డం నేరాల కింద పరిగణిస్తారు.ఎస్సీ, ఎస్టీలను ఒక అభ్యర్థికి ఓటేసేలా బలవంతం చేయడం, వారి భూములను అక్రమంగా లాక్కోవడం, ఆ వర్గాల మహిళలపై దాడి, లైంగిక దాడి, లైంగికోద్దేశంతో అనుమతిలేకుండా తాకడం, మాట్లాడ్డం, సైగలు చేయడం, వారిని ఆలయాలకు దేవదాసీలుగా మార్చడం, ఎస్సీ, ఎస్టీలను ప్రజా భవనాలు వాడుకోకుండా అడ్డుకోవడం, ఆలయాలు, స్కూళ్లు, ఆస్పత్రులకు రానివ్వకపోవడం కూడా నేరాలే. బాధితులకు, వారిపై ఆధారపడిన వారికి, సాక్షులకు ప్రభుత్వం నుంచి రక్షణ. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి విధినిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఎస్సీ, ఎస్టీయేతర ప్రభుత్వోద్యోగికి ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష. -
మళ్లీ వెలుగులోకి.. ‘వెలుగుబంటి’
హైదరాబాద్: ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ తాజాగా విచారణ జరుపుతోంది. ఏడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన వెలుగుబంటి సూర్యనారాయణకు సంబంధించిన ఈ అవినీతి కేసు మళ్లీ వెలుగులోకి వచ్చింది. వెలుగుబంటి ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్మాణాలు చేపట్టారు. వీటిపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. ఈఎస్ఐ కేంద్రం పరిధిలోకి వస్తోంది కాబట్టి స్వయంగా సీబీఐ కేసును సుమోటోగా స్వీకరించింది. 2007-08లో సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రితో పాటు ఉమ్మడి రాష్ట్రంలో మరికొన్ని డిస్పెన్సరీల్లో సుమారు రూ.150 కోట్ల విలువైన నిర్మాణ పనులు జరిగాయి. ఈ ఆస్పత్రులతో వెలుగుబంటి సూర్యనారాయణకు సంబంధమే లేకపోయినా, తన పలుకుబడితో ఇక్కడ నిర్మాణ పనుల బాధ్యత తీసుకున్నారు. ఈ పనులకు నిధుల చెల్లింపుల్లో భారీగా అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నట్టు రుజువైంది. సీబీఐ కేసును సుమోటోగా స్వీకరించాక కొన్ని రోజులుగా ఈఎస్ఐతో పాటు, అప్పట్లో పనుల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన పలువురు ఇంజనీర్లనూ, తాజాగా పలువురు అధికారులనూ విచారిస్తున్నారు. ఈఎస్ఐ నిర్మాణాల్లో జరిగిన అవినీతికంటే పది రెట్లు ఎక్కువగా మందుల కొనుగోళ్లపై అవినీతి జరిగినట్టు విజిలెన్స్‌తో పాటు సీబీఐకి ఫిర్యాదులొచ్చాయి. కాంట్రాక్టర్లు, డెరైక్టరు కుమ్మక్కై కోట్లాది రూపాయలు దోచుకున్నట్టు ఆరోపణలు రావడంతో దీనిపైనా సీబీఐ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. -
దర్యాప్తులో 150 మంది అధికారులు
బెంగళూరు : ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టైన నలుగురు వ్యక్తుల విచారణ, కేసుల దర్యాప్తులో హోం శాఖలోని వివిధ విభాగాలకు చెందిన మొత్తం 150 మంది అధికారులు పాల్గొంటున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ వెల్లడించారు. సోమవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉగ్రవాద ఆరోపణలపై ఇస్మాయిల్ అఫత్, సద్దామ్ హుస్సేన్, సబూర్, రియాజ్‌ల నుంచి నిబంధనల ప్రకారమే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో కొంతమంది చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని అసహనం వ్యక్తం చేశారు. ఈ నలుగురు నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తులో ఉన్న దృష్ట్యా ఈ దర్యాప్తులో భాగస్వాములైన అధికారుల బదిలీల ప్రస్తావన ఇప్పట్లో ఉండబోదన్నారు. కర్ణాటక ప్రభుత్వ ఫోరెన్సిక్ విభాగంలో ఇంజనీర్ల కొరతను పరిష్కరించేందుకు గాను త్వరలోనే నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు చెప్పారు. బెంగళూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవాలకు ఎలాంటి అవాంతరం తలెత్తకుండా రాష్ట్ర హోం శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని వెల్లడించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందజేయాలని కె.జె.జార్జ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
విఫలంపై విచారణ
గద్వాల : గద్వాల డివిజన్ పరిధిలో 184 గ్రామాలకు తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన *110 కోట్ల భారీ తాగునీటి పథకం పైపులైన్ల లీకేజీలతో ప్రారంభం కాకుండా నిలిచిపోయింది. దీనిపై వాస్తవాలు తేల్చేందుకు ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా లీకేజీకి కారణాలు, డిజైన్ రూపకల్పన, ఫైబర్ పైపుల అనుమతి, నీటి ఒత్తిడిని అంచనా వేయకుండా అనుమతించడం వంటి అంశాలపై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తుంది. బాధ్యులు ఎవరనేది తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. 2006లో ఈ తాగునీటి పథకానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మొదటి దశలో దీని నిర్వహణకు హడ్కోద్వారా *30 కోట్లు కేటాయించారు. తదనంతరం మిగతా పనులను పూర్తి చేసేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అనుమతితో మిగతా నిధులను కేటాయించారు. 2012 ఆగస్టు నాటికి జూరాల భారీ తాగునీటి పథకం, ఫిల్టర్‌బెడ్స్, పంపింగ్ స్టేషన్, కొండగట్టుపై గ్రావిటీ వాటర్ ట్యాంకు నిర్మాణాలు పూర్తి చేశారు. సెప్టెంబర్‌లో పథకాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించిన సమయంలో ఫిల్టర్‌బెడ్స్ నుంచి కొండగట్టుపై ఉన్న వాటర్‌ట్యాంకు వరకు నీటిని సరఫరా చేసే 4.5 కిలోమీటర్ల ప్రధాన పైప్‌లైన్‌కు లీకేజీలు ఏర్పడ్డాయి. దీంతో అప్పటి సీఎం కార్యక్రమంలో పథకాన్ని ప్రారంభోత్సవ జాబితా నుంచి తొలగించారు. దాదాపు 60 చోట్లకు పైగా లీకేజీలు కావడంతో విసిగిపోయిన ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు 4.5 కిలోమీటర్ల ఫైబర్ పైపుల స్థానంలో డీఐ పైపులను వేయాల్సిందిగా అనుమతించారు. ఏడాది క్రితం డీఐ పైపులను కొండగట్టు వరకు వేసి ట్రయల్ నిర్వహించి సక్సెస్ అయ్యారు. కొండగట్టుపై ఉన్న రిజర్వాయర్ (వాటర్ ట్యాంకు) నుంచి గ్రావిటీ ఫ్లో ద్వారా డివిజన్ పరిధిలోని 184 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయడంలో భాగంగా మొదటి దశలో 31 గ్రామాలకు ట్రయల్న్ ్రప్రారంభించారు. ట్రయల్న్ల్రోనే పైప్‌లైన్‌లో లీకేజీలు ఏర్పడటంతో ఒక్క గ్రామానికి సైతం నీళ్లివ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఒకచోట మరమ్మతు చేసి ట్రయల్న్ ్రచేస్తే మరోచోట లీకేజీలు ఏర్పడుతూ వచ్చాయి. దీంతో మొత్తం పథకంలో ఫైబర్ పైపుల స్థానంలో డీఐ పైపులను వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకాన్ని చేపట్టడంతో నడిగడ్డలో చేపట్టే వాటర్‌గ్రిడ్ పరిధిలోని జూరాల భారీ తాగునీటి పథకాన్ని చేర్చారు. దీంతో గతంలో భారీ తాగునీటి పథకంలో జరిగిన పొరపాట్లు, పైపులైన్ల లీకేజీలపై విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో తేలిన అంశాలపై చర్యలు ఉంటాయని ఆర్‌డబ్ల్యూఎస్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. -
ఇక జైళ్లు సగం నోరు తెరుచుకుంటాయి!
విచారణ పూర్తయి శిక్ష అంటూ పడితే, ఎంత శిక్ష పడుతుందో, దానిలో సగ కాలం విచారణ లేకుండా జైళ్లలో గడిపి ఉంటే, వారిని వెంటనే విడుదల చేయవలసిందిగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వాస్తవానికి ఈ రకమైన తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వనవసరం లేదు. విచారణకు నోచుకోకుండా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న అభాగ్యులకు ఎట్టకేలకు విముక్తి లభించింది! ఏదో అభియోగం మీద అరెస్టు చేసి, అతను నేరం చేశాడా లేదా అని విచారణ చేయకుండా జైల్లో పెట్టేసి, ఇక వారి సం గతి మరచిపోతారు. అరెస్టు ఎందుకు చేశారో అత నికి తెలియదు. తనపై ఉన్న అభియోగం ఏమిటో తెలియదు! తనపై నేరారోపణ ఎవరు చేశారో తెలి యదు! విచారణ ఎప్పుడు మొదలవుతుందో తెలి యదు! తనపై మోసిన అభియోగానికి విచారణ అంటూ జరిపితే ఎంత శిక్ష పడుతుందో తెలియదు! అటువంటి వారికి 5, అక్టోబర్ 2014 నాడు సుప్రీం కోర్టు గొప్ప ఊరట కల్పించింది. వీరి విచారణ ఒక వేళ పూర్తయి, శిక్ష అంటూ పడితే, ఎంత శిక్ష పడుతుందో, దానిలో సగ కాలం విచారణ లేకుండా జైళ్లలో గడిపి ఉంటే, వెంటనే విడుదల చేయవలసిందిగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ దానికి సంబంధించిన అంశాలపై అవసరమైన ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ రకమైన తీర్పు సుప్రీం కోర్టు ఇవ్వనవసరం లేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 436ఏలోనే ఇటువంటి ఉత్తర్వులు ఇవ్వాలని ఆజ్ఞ ఉన్నది. అయితే దానిని పట్టించుకొనే వారెవరు? డబ్బున్న వాళ్లకు, అధికారం ఉన్న వాళ్లకు ఈ బాధలు ఉండవు! ముందే అన్నీ చక్కబెట్టుకుంటారు! ఇటువంటి సౌకర్యం 2005లో సీఆర్పీసీకి సవరణ ద్వారా తీసుకువచ్చారు. ఇది 2006 నుంచి అమలులోకి వచ్చినా, దీని ప్రయోజనం జైళ్లలో ఉన్న వారికి అందటం లేదు. చట్టం ఉన్నది, ప్రయోజనం ప్రజలకు అందాలి. ఇది వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. కాని చట్ట ప్రయోజనం అందక కొన్ని వేల మంది అభాగ్యులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారు. ఎనిమిదేళ్ల క్రితం నుంచి అంద వలసిన ప్రయోజనం అందటం లేదని గ్రహించి, వెంటనే అటువంటి ప్రయోజనానికి అర్హత కలిగిన వాళ్లను ఇప్పుడు సుప్రీంకోర్టు వెంటనే విడుదల చేయమన్నది. ప్రస్తుత అంచనాల ప్రకారం దేశం లోని జైళ్లలో సుమారు 3.18 లక్షల మంది ఉన్నారు. వీరిలో 2.54 లక్షల మంది విచారణ జరగవలసి ఉన్నవారు. ఇందులో వాళ్లపై వచ్చిన అభియోగానికి పడే శిక్షకంటే ఎక్కువ కాలమే వాళ్లు ఏ విచారణా లేకుండా జైళ్లలో ఉన్నారు. ఇది ఎంత అన్యాయం? ఈ విషయం ప్రభుత్వాలకు గాని, జైళ్ల అధికారులకు గాని తెలియనిది కాదు. అయితే వారు పట్టించుకోవటం లేదు. ఎందుకంటే జైళ్లలో ఈ రకంగా మగ్గిపోతున్న వారు పేదవారు కాబట్టి! ఇంతకుముదు ఒక ప్రయత్నం బీహార్ జైళ్ల విషయంలో సుప్రీంకోర్టు చేసింది. అనవసరంగా ఎక్కువ కాలం జైళ్లలో మగ్గిపోతున్న వారిని విడుదల చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతే మళ్లీ అటువంటి వారి సంగతి ఎవరూ పట్టించుకోవటం లేదు. చట్టం వచ్చి ఎనిమిదేళ్లయినా ఇప్పుడూ పట్టించుకోవటం లేదు. సుప్రీంకోర్టు ఇప్పటికైనా చట్ట ప్రయోజ నాన్ని ప్రజలకు అందించవలసిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఉత్తర్వులు ఇచ్చి సుప్రీంకోర్టు ఊరుకోలేదు. న్యాయాధి కారులను, అంటే మేజిస్ట్రేట్లను వారానికి ఒకసారి జైలును సందర్శించి, ఈ విధంగా జైళ్లలో ఎంత మంది అనవసరంగా ఉంటున్నారో లెక్కలు తీసి, వారికి పైన చెప్పిన ప్రయోజనం అందవలసి ఉంటే, వారిని వెంటనే విడుదల చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చెయ్యాలని ఆదేశించింది. ఈ విధంగా మొత్తం రెండు నెలలు ప్రతి వారానికి ఒకసారి మేజిస్ట్రేట్లు జైలుకు వెళ్లి విడుదలకు అర్హులైన వారిని మొత్తంగా విడుదల చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియలో న్యాయవాదుల ప్రమేయం ఏదీ ఉండకూడదు. దీనికి సహకరించాలని జైలు అధి కార్లను కూడా ఆదేశించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసి ఒక నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సమర్పించాలి. అంటే సుప్రీంకోర్టు కేవలం ఉత్తర్వులు జారీ చేసి కూర్చోలేదు. ఇచ్చిన ఉత్తరువుల అమ లును కూడా పర్యవేక్షిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం రెండు నెలలలో పూర్తయినట్టు తనకు నివేదిక కూడా అందజేయాలని ఆదేశించింది. ఎందుకంటే చట్టం ఉన్నప్పటికీ ఎనిమిది ఏళ్లుగా దాని ప్రయోజనం జైళ్లలో ఉన్న వారికి అందటం లేదు. ఎవరూ పట్టించుకోవటం లేదు. ఏళ్ల తరబడి ముద్దాయిలను పదిహేను రోజులకొకసారి జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్లటం, మళ్లీ వెనక్కి తీసుకురావటంతోటే అయిపోతున్నది. అందుకని చట్ట ప్రయోజనం ప్రజలకు అందుతున్నదా లేదా అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షించే పని పెట్టుకున్నది. అధికార్లు తమ విధి నిర్వహణలో విఫలమవుతున్నారు కాబట్టి సుప్రీం కోర్టు నేరుగా ఆ బాధ్యతను కూడా స్వీకరించింది. అందుకు అవసరమైన ఉత్తర్వులను సంబంధిత మేజిస్ట్రేట్లకు, జైలు అధికార్లకు, తన తీర్పు ద్వారా జారీచేసింది. ఈ ఉత్తర్వులు పేద ప్రజలకు ఎంతో గొప్ప మేలు చేశాయి. చెయ్యని నేరానికి జైలుకు వెళ్లేది వారే! విచారణ లేకుండా జైళ్లలో మగ్గిపోయేది వారే! ఒక అంచనా ప్రకారం నూటికి అరవై మందికి పైగా ఈ ప్రయోజనం అందుతుంది. అయితే మరణశిక్ష పడే కేసుల్లో ఉన్న వారికి ఈ ప్రయోజనం అందదు! ఈ ఒక్కటీ చాలదు! జైళ్ల వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళనం కావా లి. నేర విభాగానికి సంబంధించిన ప్రక్రియలో కూడా మార్పు రావాలి. జైళ్ల పరిస్థితులలో కూడా మార్పు తేవాలి. నేరాలు, శిక్షలు, జైళ్లకు సంబంధించిన సీఆర్పీసీని 1860లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చింది. భారతదేశ ప్రజలపై అజమాయిషీ చేయటానికి, వారిని అదుపులో ఉంచడానికి శిక్షలు వేసి, జైళ్లలో పెట్టి వీరిని భయభ్రాంతులను చేయటానికి తీసుకువచ్చిన చట్టం ఇది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్ని చిన్న చిన్న సవ రణలు తీసుకువచ్చారు గాని, సమగ్రమైన మార్పులు తేలేదు. ఇప్పుడు తీసుకువచ్చిన ప్రక్రియ పాతదే! అయితే అమలుకు నోచుకోలేదు. సుప్రీంకోర్టు పుణ్యమా అని ఈ ప్రక్రియ ద్వారా లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుంది. స్వతంత్ర భారతదేశంలో దాదాపు 250 ఏళ్ల క్రితం చేసిన చట్టాలను ఈ నాటికీ పట్టుకు వేలాడటం సిగ్గుచేటు. జైళ్ల విధానం, నిర్వహ ణలో చాలా దేశాలలో చెప్పుకోదగ్గ మార్పులు వస్తున్నాయి. మార్పు అంటే భయపడేది మన దేశమే! ఈ సందర్భాన్ని తీసు కొని కనీసం జైళ్ల వ్యవస్థను ప్రజాస్వామ్యీకరించడానికి ముం దుకు రావాలి! బొజ్జా తారకం సీనియర్ న్యాయవాది -
గురుప్రసాద్ ఇంట్లో పోలీసుల తనిఖీ
హైదరాబాద్: కన్నబిడ్డలను చంపి ఆత్మహత్య చేసుకున్న ప్రొఫెసర్ గురుప్రసాద్ కేసు విచారణలో భాగంగా బుధవారం అల్వాల్‌లోని ఆయన నివాసాన్ని, మేడ్చల్‌లోని ఓపెన్ ప్లాట్‌ను పోలీసులు తనిఖీ చేశారు. గురుప్రసాద్ ఇంట్లో నుంచి డైరీ స్వాధీనం చేసుకున్నారు. మొదట చిన్నారుల జాడ తెలియకపోవడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు వారు హత్యకు గురికావడంతో హత్య కేసుగా సెక్షన్ మార్పు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, చిన్నారులను పూడ్చి పెట్టడానికి గొయ్యి తవ్విన కూలీల గురించి వాకబు చేస్తునానరు. గురుప్రసాద్ ఫోన్ కాల్స్ డేటాను కూడా పూర్తి స్థాయిలో విశ్లేషిస్తున్నారు. -
సుదీర్ఘ రిమాండ్ ఖైదీలెవరూ లేరు
‘సుప్రీం తీర్పు’ నేపథ్యంలో లెక్క తేల్చిన జైళ్ల శాఖ హైదరాబాద్: సుదీర్ఘకాలంగా విచారణను ఎదుర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా విడుదల చేయాల్సిన రిమాండ్ ఖైదీలు (విచారణ ఖైదీలు) ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరు కూడా లేరని అధికారులు తేల్చారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా సుప్రీంకోర్టుకు నివేదించినట్లు జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ టి.కృష్ణరాజు మంగళవారం ‘సాక్షి’కి తెలిపారు. ఏపీలో ఉన్న 116 కారాగారాల్లో ప్రస్తుతం 8,234 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో 5,667 మంది విచారణ ఖైదీలు. వీరు నేరం రుజువైతే పడే శిక్ష కాలంలో ఇప్పటికి పావు వంతు కాలం కూడా జైల్లో లేరని అధికారుల పరిశీలనలో స్పష్టమైంది. రాష్ట్రంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ క్రియాశీలకంగా వ్యవహరించడమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. నిరుపేదలైన ఖైదీల న్యాయ సహాయానికి అయ్యే ఫీజును లీగల్ సర్వీసెస్ అథారిటీ చెల్లించి న్యాయవాదిని ఏర్పాటు చేస్తుంది. బెయిల్‌కు పూచీకత్తు మొత్తాన్ని కూడా చెల్లిస్తుంది. నిందితులు షూరిటీలను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. ఈ కారణంగానే రాష్ట్రంలో సుప్రీంకోర్టు సూచించిన తరహా రిమాండ్ ఖైదీలు లేరని అధికారులు తెలిపారు. ఇదే విషయాన్ని సుప్రీం కోర్టుకు విన్నవించినట్లు చెప్పారు. -
డీఎంహెచ్‌వోపై ఆర్డీ విచారణ
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : జిల్లా వైద్యారోగ్యశాఖాధికారిణి (డీఎంహెచ్‌వో) డాక్టర్ ఆర్.రామతులశమ్మ అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణాధికారిగా నియమితులైన వైద్యారోగ్యశాఖ రీజినల్ డెరైక్టర్ (ఆర్డీ) డాక్టర్ షాలినీదేవి గురువారం విచారణ చేపట్టారు. డీఎంహెచ్‌వో రామతులశమ్మ అనేక అక్రమాలకు పాల్పడినట్లు జిల్లాకు చెందిన దళిత సంఘ నాయకుడు బ్రహ్మయ్య ఇటీవల గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పాత తేదీ వేసి 46 మంది స్టాఫ్ నర్సులను కాంట్రాక్టు పద్ధతిపై నియమించారని, రెగ్యులర్ వైద్యులను నియమించినప్పటికీ 26 మంది కాంట్రాక్టు వైద్యులను రెన్యువల్ చేశారని, మందుల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారని గవర్నర్‌కు ఇచ్చిన ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. వాటిపై విచారణ చేపట్టాలని ఆ శాఖ రాష్ట్రస్థాయి అధికారులను గవర్నర్ ఆదేశించారు. ఆ మేరకు విచారణాధికారిగా నియమితులైన ఆర్డీ షాలినీదేవి గురువారం ఒంగోలు చేరుకుని స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలోని ఐడీఎస్పీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ముందుగా ఫిర్యాదుదారుడు బ్రహ్మయ్య, అనంతరం డీఎంహెచ్‌వో రామతులశమ్మ, కార్యాలయ పర్యవేక్షణాధికారి, ఇతర సిబ్బందిని విడివిడిగా విచారించి రాతపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీ మాట్లాడుతూ స్టాఫ్ నర్సుల నియామకాలకు సంబంధించి అభ్యర్థుల ఇళ్లకు వెళ్లిమరీ డీఎంహెచ్‌వో రామతులశమ్మ డబ్బు వసూలు చేశారని వచ్చిన ఆరోపణలపై ప్రధానంగా విచారించినట్లు తెలిపారు. విచారణ స్టేట్మెంట్లతో పాటు సంబంధిత ఫైళ్లను కూడా గుంటూరు తీసుకెళ్లి పూర్తిగా పరిశీలిస్తానని, అనంతరం నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందజేస్తానని ఆమె పేర్కొన్నారు. 9 రోజుల్లో పదవీ విరమణ చేయనున్న రామతులశమ్మ... ప్రస్తుతం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంహెచ్‌వో ఆర్.రామతులశమ్మ మరో 9 రోజుల్లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో అన్నీ తానై ఆమె వ్యవహరిస్తుండటం, ఆమె కారు డ్రైవర్ కూడా డీఎంహెచ్‌వోకు సంబంధించిన ప్రతిపనికీ డబ్బు వసూలు చేస్తుండటంపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీనిపై కార్యాలయ అధికారులు, సిబ్బంది కలిసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేం దుకు ఇటీవల సిద్ధమయ్యారు. యూనియన్ నాయకులు సర్దిచెప్పడంతో ఆగిపోయారు. చివరకు స్టాఫ్ నర్సుల నియామకాల్లో అక్రమాల కారణంగా మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరగడంతో విషయం విచారణ వరకూ వచ్చింది. అయితే, డీఎంహెచ్‌వో రామతులశమ్మ మాత్రం తాను ఎలాంటి అవినీతి అక్రమాలకూ పాల్పడలేదని, విచారణలో ఆ విషయం స్పష్టమవుతుందని అంటున్నారు.