విఫలంపై విచారణ
గద్వాల :
గద్వాల డివిజన్ పరిధిలో 184 గ్రామాలకు తాగునీటిని అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన *110 కోట్ల భారీ తాగునీటి పథకం పైపులైన్ల లీకేజీలతో ప్రారంభం కాకుండా నిలిచిపోయింది. దీనిపై వాస్తవాలు తేల్చేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా లీకేజీకి కారణాలు, డిజైన్ రూపకల్పన, ఫైబర్ పైపుల అనుమతి, నీటి ఒత్తిడిని అంచనా వేయకుండా అనుమతించడం వంటి అంశాలపై విచారణ జరుగుతున్నట్లు తెలుస్తుంది.
బాధ్యులు ఎవరనేది తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. 2006లో ఈ తాగునీటి పథకానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మొదటి దశలో దీని నిర్వహణకు హడ్కోద్వారా *30 కోట్లు కేటాయించారు. తదనంతరం మిగతా పనులను పూర్తి చేసేందుకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అనుమతితో మిగతా నిధులను కేటాయించారు. 2012 ఆగస్టు నాటికి జూరాల భారీ తాగునీటి పథకం, ఫిల్టర్‌బెడ్స్, పంపింగ్ స్టేషన్, కొండగట్టుపై గ్రావిటీ వాటర్ ట్యాంకు నిర్మాణాలు పూర్తి చేశారు. సెప్టెంబర్‌లో పథకాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించిన సమయంలో ఫిల్టర్‌బెడ్స్ నుంచి కొండగట్టుపై ఉన్న వాటర్‌ట్యాంకు వరకు నీటిని సరఫరా చేసే 4.5 కిలోమీటర్ల ప్రధాన పైప్‌లైన్‌కు లీకేజీలు ఏర్పడ్డాయి.
దీంతో అప్పటి సీఎం కార్యక్రమంలో పథకాన్ని ప్రారంభోత్సవ జాబితా నుంచి తొలగించారు. దాదాపు 60 చోట్లకు పైగా లీకేజీలు కావడంతో విసిగిపోయిన ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు 4.5 కిలోమీటర్ల ఫైబర్ పైపుల స్థానంలో డీఐ పైపులను వేయాల్సిందిగా అనుమతించారు. ఏడాది క్రితం డీఐ పైపులను కొండగట్టు వరకు వేసి ట్రయల్ నిర్వహించి సక్సెస్ అయ్యారు. కొండగట్టుపై ఉన్న రిజర్వాయర్ (వాటర్ ట్యాంకు) నుంచి గ్రావిటీ ఫ్లో ద్వారా డివిజన్ పరిధిలోని 184 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయడంలో భాగంగా మొదటి దశలో 31 గ్రామాలకు ట్రయల్న్ ్రప్రారంభించారు.
ట్రయల్న్‌ల్రోనే పైప్‌లైన్‌లో లీకేజీలు ఏర్పడటంతో ఒక్క గ్రామానికి సైతం నీళ్లివ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఒకచోట మరమ్మతు చేసి ట్రయల్న్ ్రచేస్తే మరోచోట లీకేజీలు ఏర్పడుతూ వచ్చాయి. దీంతో మొత్తం పథకంలో ఫైబర్ పైపుల స్థానంలో డీఐ పైపులను వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకాన్ని చేపట్టడంతో నడిగడ్డలో చేపట్టే వాటర్‌గ్రిడ్ పరిధిలోని జూరాల భారీ తాగునీటి పథకాన్ని చేర్చారు. దీంతో గతంలో భారీ తాగునీటి పథకంలో జరిగిన పొరపాట్లు, పైపులైన్ల లీకేజీలపై విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో తేలిన అంశాలపై చర్యలు ఉంటాయని ఆర్‌డబ్ల్యూఎస్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు.