నేరెళ్ల ఘటనపై స్పందించిన హైకోర్టు
జస్టిస్ చంద్రకుమార్ లేఖ పిల్‌గా పరిగణన
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా, నేరెళ్ల, జిల్లెల, రామచం ద్రాపురం గ్రామాల దళితులను పోలీసులు చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు జస్టిస్ బెజ్జారం చంద్రకుమార్ రాసిన లేఖపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. ఆ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)గా పరిగణించింది.
దీనిపై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. పోలీసులు ఉద్దేశపూర్వ కంగానే నేరెళ్ల తదితర గ్రామాలకు చెందిన 8 మంది దళితులను హింసించి, వారి హక్కులను హరించారని ఆయన లేఖలో పేర్కొన్నారు. కరీంనగర్ జైలులో ఉన్న బాధితుల వాంగ్మూలాలను నమోదు చేసేలా సంబంధిత కోర్టును ఆదేశించాలని హైకోర్టును అభ్యర్థించారు.