కన్నీటి సంద్రమైన గూడెంకొత్తవీధి
గొంతుకోసి వ్యాపారిని చంపిన మావోయిస్టులు
పెదపాడు నుంచి తిరిగి వస్తుండగా ఘటన
బైక్‌ను తగులబెట్టిన దళసభ్యులు
ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడంటూ గాలికొండ ఏరియా కమిటీ పేరిట లేఖ
వ్యాపార కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు
మావోయిస్టుల ఘాతుకంతో గూడెం కొత్తవీధి కన్నీటి సంద్రమైంది. వందలాది మంది గుండూరావు(సత్యనారాయణ)ను చివరిసారిగా చూసేందుకు వచ్చారు. ఏ తప్పూ చేయని తన భర్తను దళసభ్యులు అన్యాయంగా చంపేశారంటూ భార్య చంద్రకళ ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా మన్యంలో కాఫీ గింజల కొనుగోలుతోపాటు అపరాల వ్యాపారం చేస్తున్న గుండూరావుకు మొదట్లో మావోయిస్టులతో సంబంధాలు ఉండేవి. దీనిపై గూడెం పోలీసులు అతనిని గతంలో అరెస్టు చేశారు. ఇప్పుడు అదే మావోయిస్టులు అతడిని చంపడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.
గూడెంకొత్తవీధి/చింతపల్లి: రోజూ మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో వ్యాపారం కోసం తిరిగే గుండురావుకు వారి నుంచే ప్రమాదం పొంచి ఉందని ఏనాడూ భావించలేదు. దళసభ్యులతో వివాదాలు ఉన్నా.. వాటిని పరిష్కరించుకుంటూ వస్తున్న అతనిని ఇన్‌ఫార్మర్ అంటూ గొంతుకోసి చంపేశారు. గూడెంకొత్తవీధికి చెందిన అపరాల వ్యాపారి గుండురావు, తమ్ముడు వెంకటరమణను వెంటబెట్టుకుని ఆదివారం సాయంత్రం మండలంలోని కుంకుమపూడి, పెదపాడు వెళ్లారు. గతంలో ఆయా గ్రామాల రైతులకు పెంకులు సరఫరా చేశారు. వారి నుంచి నుంచి డబ్బులు వసూలు చేసుకుని అన్నదమ్ములిద్దరూ తిరిగి వస్తుండగా మార్గమధ్యలో కుంకుమపూడి సమీపంలో ఇద్దరు దళసభ్యులు వారిని అటకాయించారు. తమ్ముడు వెంకటరమణను తీవ్రంగా కొట్టారు. నీవు గ్రామానికి వెళ్లాలని, మీ అన్నయ్యతో మాట్లాడి పంపిస్తామని చెప్పారు. దీంతో వెంకటరమణ కుంకుపూడి వచ్చేశాడు. అనంతరం గుండురావు కాళ్లు,చేతులు కట్టేసి గొంతు కోసి చంపారు. ద్విచక్ర వాహనాన్ని కాల్చేశారు. అతని ఫ్యాంటు జేబులో గాలికొండ ఏరియా కమిటీ పేరిట ఓ లేఖ ఉంచారు. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తున్నాడని, అందుకే చంపేశామని అందులో పేర్కొన్నారు. అన్నయ్య సమాచారం ఎంతకు రాకపోవడంతో ఆదివారం రాత్రి తమ్ముడు వెంకటరమణ గ్రామస్తులతో కలిసి వెదికాడు. చివరకు చనిపోయిన అన్నయ్యను చూసి బోరున విలపించాడు. గ్రామస్తులు మృతదేహాన్ని ఆదివారం రాత్రి గూడెంకొత్తవీధికి తీసుకొచ్చారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సోమవారం సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి చింతపల్లి తరలించారు.
బెదిరింపులకు భయపడలేదు...
మావోయిస్టుల నుంచి ఒకసారి బెదిరింపులు వస్తే మైదానానికి వెళ్లిపోయేవారు ఎందరో ఉన్నారు. పలుమార్లు మావోయిస్టులు గుండురావును భయపెట్టినా ఆయన ఏనాడూ మన్యాన్ని వీడలేదు. పోలీసులు అనేకసార్లు హెచ్చరించారు కూడా. అయినా వెళ్లలేదు. 2015 భోగిపండుగనాడు గుండురావు తమ్ముడు వెంకటరమణను మావోయిస్టులు తీసుకుపోయారు. వ్యాపారలావాదేవీల్లో భాగంగా గిరిజనులకు బకాయిలు చెల్లించాలంటూ మూడురోజులు నిర్బంధించారు. ఆ డబ్బులు ఇస్తామని కుటుంబసభ్యులు చెప్పడంతో చివరకు విడుదల చేశారు. తరువాత డబ్బులు ఇచ్చేశారు. ఇలా సర్దుబాటు చేసుకునేవారు. అతనికి భార్య చంద్రకళ, కొడుకులు వినయ్,కృష్ణవర్దన్, కూతరు జోస్న ఉన్నారు. జోస్న, వినయ్‌లు బీటెక్ పూర్తిచేసి ఇంటివద్దే ఉంటున్నారు. కృష్ణవర్దన్ డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి మరణాన్ని వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు.
వ్యాపార కోణంలో విచారణ
వాస్తవానికి మావోయిస్టుల నుంచి గుండురావుకు ఇంత వరకు ఎలాంటి ప్రాణహాని లేదన్నది బంధువుల వాదన. కొన్ని రోజుల కిందట మావోయిస్టులకు ఆయుధాలు తరలిస్తున్న వాహనాన్ని తురబాలగెడ్డవద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇందుకు గుండురావు కారణమంటూ కొందరు వ్యాపారులు అప్పట్లో ప్రచారం చేశారు. వ్యాపారంలో కొడుకులు కూడా అతనికి తోడుగా ఉండడం కొందరికి కంటగింపుగా మారినట్టుగా తెలుస్తోంది. ఈమేరకే తప్పుడు ప్రచారంచేశారన్న వార్తలు వస్తున్నాయి. దీంతో గుండురావు మరణాన్ని వ్యాపార కోణంలో దర్యాప్తు చేయాలని ఎస్పీ నుంచి ఆదేశాలు వచ్చాయి. పోలీసులూ అదే కోణంలో విచారణ చేపట్టారు.