డీఎస్పీ గణపతి ఆత్మహత్యపై న్యాయ విచారణ | nsistence opposition CBI inquiry | Sakshi
Sakshi News home page

డీఎస్పీ గణపతి ఆత్మహత్యపై న్యాయ విచారణ

Published Thu, Jul 14 2016 2:24 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

డీఎస్పీ గణపతి ఆత్మహత్యపై   న్యాయ విచారణ - Sakshi

డీఎస్పీ గణపతి ఆత్మహత్యపై న్యాయ విచారణ

డీఎస్పీ గణపతి ఆత్మహత్యపై   శాసనసభలో సీఎం సిద్ధరామయ్య ప్రకటన
జార్జ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు అవసరం లేదని స్పష్టీకరణ
సీబీఐ విచారణకే పట్టుబట్టిన ప్రతిపక్షాలు
ఉభయసభల్లో నిరవధిక దీక్షకు బీజేపీ, జేడీఎస్‌ల నిర్ణయం

 
బెంగళూరు:  డీఎస్పీ గణపతి ఆత్మహత్య ఘటనపై జ్యడీషియల్ విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం సిద్ధరామయ్య శాసనసభలో ప్రకటించారు. అయితే ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్‌లు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించడంతో పాటు జార్జ్‌ను మంత్రి మండలి నుంచి తప్పించడంతో పాటు ఇద్దరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేంతవరకూ  ఉభయసభల్లో నిరవధిక దీక్షకు దిగుతామని బీజేపీ, జేడీఎస్ నేతలు హెచ్చరించారు. వివరాలు.... డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశానికి సంబంధించి సీఎం సిద్ధరామయ్య శాసనసభలో ప్రభుత్వం తరఫున బుధవారం మాట్లాడారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. సీఐడీ విచారణపై ప్రభుత్వానికి విశ్వాసం ఉన్నప్పటికీ ఘటన తీవ్రతను  దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆరు నెలల్లో ఈ కమిషన్ తన విచారణను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుందని చెప్పారు. కాగా, విపక్షాలు మాత్రం  న్యాయ విచారణ నిర్ణయాన్ని అంగీకరించబోమని, ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందేనని పట్టుబట్టాయి.

సీఎం సిద్ధరామయ్య ప్రకటనను విపక్ష నేత జగదీష్ శెట్టర్ తప్పుపడుతూ....‘జ్యుడీషియల్ విచారణకు ఆదేశించిన కేసులేవీ ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. బీడీఏ ఆర్కావతి లే అవుట్‌లో అవకతవకలకు సంబంధించిన విచారణ కోసం ఏర్పాటు చేసిన కెంపణ్ణ కమిషన్ విచారణను ఇప్పటికీ పూర్తి చేయలేక పోయింది. అందువల్ల ఈ కేసును సీబీఐకి అప్పగించి తీరాల్సిందే. అప్పటి దాకాా మా పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు’ అని జగదీష్ శెట్టర్ హెచ్చరించారు. ఇదే సందర్భంలో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి ధర్నాకు దిగారు. దీంతో స్పీకర్ సభా కార్యకలాపాలను ఐదు గంటలకు వాయిదా వేశారు. అనంతరం బీజేపీ, జేడీఎస్ నేతలు జగదీష్ శెట్టర్, హెచ్.డి.కుమారస్వామిలు మీడియాతో మాట్లాడారు. ‘డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసును పక్కదారి పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేసులోని నిజానిజాలు వెలుగు చూడకుండా ఉండేందుకు గాను ముందు సీఐడీ విచారణ అన్నారు. ఇప్పుడిక జ్యుడీషియల్ విచారణ అంటున్నారు. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించే వరకు మా పోరాటాన్ని ఆపబోము. ఉభయసభల్లో నిరవధిక దీక్ష చేపట్టనున్నాం’ అని ప్రకటించారు. అనంతరం సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే శాసనసభలో బీజేపీ, జేడీఎస్ సభ్యులు నిరసనకు దిగారు. దీంతో స్పీకర్ శాసనసభ కార్యకలాపాలను గురువారానికి వాయిదా వేశారు.  
 
జార్జ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు         అవసరం లేదు....
 అంతకుముందు బుధవారం ఉదయం శాసనసభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశంపై సీఎం సిద్దరామయ్య సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. గణపతి ఆత్మహత్య అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి జార్జ్, ఇద్దరు పోలీసు ఉన్నత స్థాయి అధికారులను సైతం సీఎం సిద్దరామయ్య వెనకేసుకొచ్చారు. డీఎస్పీ గణపతి ఆత్మహత్య అనంతరం జరిగిన ఘటనలను ఒక్కొక్కటిగా సీఎం సిద్ధరామయ్య సభ ముందు ఉంచారు.  ‘మంగళూరు డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశంలో మంత్రి జార్జ్‌తో పాటు ఇద్దరు పోలీసు అధికారులకు ఎలాంటి సంబంధం లేదు. గణపతిని మంత్రి జార్జ్, పోలీసు అధికారులు ఇబ్బందులకు గురి చేసినట్లు గానీ, అతనిపై పగ తీర్చుకునేలా ప్రవర్తించినట్లు కానీ ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు. డీఎస్పీ గణపతి ఆత్మహత్యకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూను ‘డయింగ్ డిక్లరేషన్’ కాబోదు. అందువల్ల మంత్రి కె.జె.జార్జ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం లేదు. జార్జ్‌పై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు’ అని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లుగా సీబీఐ విచారణ అవసరం లేదని సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.


‘మన అధికారులపై మాకు నమ్మకం ఉంది. వారిలో ఆత్మస్థైర్యాన్ని కుంగదీసేలా మేము ఏ చర్యలు తీసుకోబోము. సీబీఐ అంటే మాకేదో భయం అని, అందుకే సీబీఐ విచారణకు అంగీకరించడం లేదని విమర్శిస్తున్నారు. అయితే సీబీఐ అంటే మాకెలాంటి భయం లేదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ అధికారి డి.కె.రవి ఆత్మహత్య ఘటనతో సహా మొత్తం 8 కేసులను సీబీఐకి అప్పగించాం. ఇదే సందర్భంలో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అక్రమ గణుల కేటాయింపుతో సహా ఏ ఒక్క కేసును సీబీఐకి అప్పగించలేదు’ అంటూ మండిపడ్డారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement